లవర్స్ మస్ట్ లెర్న్
నాటకం జోరుగా సాగుతూంది. ప్రయోక్త హీరోయిన్ ని అడుగుతున్నాడు-
"సుధాకర్ ని మీరు ప్రేమిస్తున్నారా?"
"సిల్లీ..... దీనికి ప్రేమ అనేటంత పెద్ద పదం ఎందుకు? స్నేహం అనండి! ఆ మాటకొస్తే నా బ్యూక్ కారునీ, బొచ్చు కుక్కనీ ఎలా ప్రేమిస్తున్నానో నా సుధానీ లానే ప్రేమిస్తున్నాను-"
నాటకం చూస్తున్న పాణి కుర్చీలో పక్కకి వంగి శాస్త్రితో రహస్యంగా - "గురూ, అసలు ప్రేమ అంటే ఏమిటి?" అన్నాడు.
"నోర్ముయ్యి, వెధవ డౌట్సూ నువ్వూను" అంటూ కసిరి, మళ్ళీ స్టేజివైపు దృష్టి సారించేడు. నాటకం సాగుతూంది.
"అంటే మీ ఉద్దేశ్యంలో స్నేహాన్నీ, ప్రేమనీ విడదీస్తున్న ఒకే ఒక పొర సెక్స్ అంటారు. అంతేగా!"
"మీరు అడిగేది అబ్బాయికీ, అమ్మాయికీ మధ్యవున్న స్నేహం గురించే అయితే మీరు చెప్పేది నిజమే" అంది హీరోయిన్.
"అయితే, స్నేహం ప్లస్ సెక్స్ ఈజ్ ఈక్వల్టు ప్రేమ. ఇంతేనా ప్రేమకి నిర్వచనం?"
పాణి మళ్ళీ పక్కకివంగి స్నేహితుడివైపు తిరిగి, "ప్రేమకి ఈ డెఫినిషన్ బాగుంది కదూ?" అన్నాడు.
"నువ్విలా మధ్య మధ్యలో వెధవ కామెంట్స్ చేసేవంటే చందాలేసుకుని మరీ తన్ని పంపిస్తారు. తిన్నగా కూర్చుని మాట్లాడకుండా చూడు!" విసుక్కున్నాడు శాస్త్రి.
"నే చెప్పేది ఏమిటంటే....." అంటూ పాణి ఏదో చెప్పబోతూ వుంటే వెనకనుంచి ఎవరో "ష్!" అన్నారు. పాణి మరి మాట్లాడలేదు. కానీ, అతని ఆలోచనలు ఆ ప్రశ్న దగ్గిరే ఆగిపోయినాయి. ఆ ఆలోచనలతో నాటకం ఎప్పుడు పూర్తయిందో గమనించలేదు అతను.
"ఒరేయ్, ఇకలే" అంటూ శాస్త్రి పాణిని తట్టిలేపుతూ ఉంటే అతని వైపు సాలోచనగా చూస్తూ "ప్రేమంటే ఏమిటి?" అన్నాడు. శాస్త్రికి చిర్రెత్తింది. "ఏరా.....నీకేమైనా మతిపోయిందా?" అంటూ కుర్చీలోంచి రెక్క పట్టుకుని లేవదీసాడు.
"కాదు గురూ. ఇది నిజంగా మంచి ప్రశ్న నువ్వూ ఆలోచించి చూడు" అంటూ సలహా ఇచ్చేడు పాణి. "ప్రేమంటే ఏమిటి?"
"ఏడిసేవు కావాలంటే ఈ నాటిక రచయితని పరిచయం చేస్తాను పద. అతన్ని అడుగుదువు గానీ నీ ప్రశ్న" అంటూ గ్రీన్ రూమ్ లోకి తీసికెళ్ళేడు.
ఆ గది అంతా హడావుడిగా ఉంది. అద్దాల ముందు కూర్చుని కొందరు మేకప్ తుడిచేసుకుంటున్నారు. కొందరు స్టేజి ప్రోపర్టీ సర్దుతున్నారు. వీటన్నింటికి దూరంగా నిలబడి చీకట్లోకి చూస్తున్న ఒకాయన దగ్గిరకి తీసుకెళ్ళి పాణిని పరిచయం చేశాడు శాస్త్రి.
"ఇదిగో ఇతనే ఈ నాటిక రచయిత".
"హల్లో!"
అంటూ షేక్ హాండ్ ఇచ్చేడు. "నా పేరు పాణి. ఇండో- పాన్ కంపెనీ సెక్రటరీని" అంటూ పరిచయం చ్గేసుకొన్నాడు.
"నీ నాటకం చూశాక మా వాడికో అనుమానం వచ్చిందోయ్, కొంచెం తీరుద్దూ" అనేసి, ఎవరో పిలిస్తే వెళ్ళిపోయేడు శాస్త్రి.
"మీ నాటకం చాలా బాగుంది" అన్నాడు పాణి ఉపోద్ఘాతంగా.
"థాంక్స్" అన్నాడు కవి మొహమాటపడి.
"పోతే ఒక చిన్న అనుమానం....."
"అడగండి."
"ఈ నాటకంలో మీరు ఏం చెప్పదల్చుకొన్నారు?"
కవి బిత్తరపోయాడు. క్షణం సీరియస్ గా శూన్యంలోకి చూశాడు. తరువాత పాణివైపు తిరిగి, "నిజమేనండీ. నాకూ తెలియటం లేదు- ఎంత ఆలోచించినా" అన్నాడు బిక్కమొహం పెట్టి.
ఈసారి తెల్లబోవటం పాణి వంతయింది. "అహఁ! నా ఉద్దేశ్యం అదికాదు. ఈ నాటకం-" అంటూ పేరు గుర్తురాక ఆగిపోయాడు.
"రంగులనీడ" అందించేడు కవి.
"ఆఁ అదే. రంగులనీడ...... సబ్జెక్టు బాగుంది గురూగారూ. కానీ ఇది చూస్తూ ఉంటే నాకో చిన్న అనుమానం వచ్చింది. అసలు ప్రేమంటే ఏమిటి?"
ఒక క్షణం మళ్ళీ శూన్యంలోకి చూచాడు కవి. తరువాత ఒక్కసారి "హు" అని మూలిగాడు. "ప్రేమ" అని గొణిగి, మళ్ళీ "హుఁ" అన్నాడు భారంగా. తరువాత కళ్ళు సగంమూసి మళ్ళీ చీకట్లోకి చూస్తూ "ప్రేమ!" అన్నాడు అంతే! ఆ తరువాత అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు.
పాణికి భయం వేసింది చుట్టూ చూచాడు. ఎవరి పనిమీద వాళ్ళు ఉండటంతో ఎవరూ వీళ్ళను చూడటం లేదు.
"గురూగారూ!" నెమ్మదిగా పిలిచాడు.
కవి మాట్లాడలేదు.
"సమాధానం చెప్పకపోతే పోన్లెండి. మీరిలా మనసు పాడుచేసుకోకండి" అన్నాడు ఓదార్పుగా.
"షేమ్!" అరిచాడు కవి. "గంటసేపు నా నాటకంలో చర్చించిన సబ్జెక్టు గురించి నేను చెప్పలేకపోవటమా?"
"ఇంతసేపూ ఆలోచిస్తూ ఉంటే....." నసిగాడు పాణి.
కవి వేదాంతిలా నవ్వేడు. "ఆలోచన కాదు" అన్నాడు గంభీరంగా.
"మరి?"
"ఇన్స్ పిరేషన్ రావాలి!"
కవి మొహంలో నెమ్మది నెమ్మదిగా మార్పు వచ్చింది. పిడికిలి బిగించి, గుండెనిండా ఊపిరి పీల్చుకున్నాడు - "ప్రేమ! రెండు హృదయాల అస్తిత్వపు స్పందన! భవబంధాలకూ, ద్వేషవిద్వేషాలకూ అతీతమైన అలౌకిక ప్రపంచంలో రెండు విభిన్న దృక్పధాల కలయిక. ప్రేమ రాహిత్యంలో బ్రతుకుతున్న ఈ మనుష్యులకు అర్ధంకాని ఒక రాగరంజిత. రాసానుబంధం రెండు హృదయాల మీద పలికే ఒకే ఒక రాగం. ఈ అనురాగపు ఆర్ణవంలో అమావాస్య చీకట్లు, ఆర్తి అఖాతాలు గుర్తుకురాని ఒక మహిమాన్వితమైన అనుభవం- అర్ధమైందా?"
పాణి బిక్కమొహం పెట్టి, 'అర్ధమైం'దన్నట్టు తల ఊపేడు.
"సిగరెట్టొకటి ఇవ్వండి" అన్నాడు కవి.
పాణి యిచ్చాడు.
కవి దాన్ని జేబులో పెట్టుకుని, "మీకు పెళ్ళయిందా?" అని అడిగేడు.
లేదన్నట్లు తల ఊపేడు.
"ఎవర్నన్నా ప్రేమించాలని వుందా?"
అర్ధంకానట్లు చూసేడు పాణి. కవి మాట మారుస్తూ "మీకు స్కూటరుందా?" అన్నాడు.
"ఉంది" అన్నాడు పాణి అర్ధంకానట్టు మొహం పెట్టి.
"బాంక్ బ్యాలెన్స్?"
లేదన్నాడు పాణి అతనివైపు అనుమానంగా చూస్తూ.
"డబ్బు బాగా ఖర్చు పెడతారన్నమాట" నవ్వుతూ అన్నాడు కవి.
సంభాషణ ఇలా ఎందుకు మార్చేశాడో అర్ధం కాలేదు పాణికి.
అంతలో హీరోయిన్ వచ్చిందక్కడికి. "ఏం కవిగారూ, ఎలా వుంది నా నటన? మీరూహించిన పాత్రకి సరిపోయేనా?" అంది నవ్వుతూ.
"అమ్మమ్మ, ఎంతమాట! మీరు వేసే వేషానికి అడ్డేమిటి?" అంటూ చిన్న మెలో వేసి పాణివైపు తిరిగి, "ఈమె పేరు లత. మా నాటికలో హీరోయిన్" అంటూ పరిచయం చేసేడు.
"నమస్తే" అన్నాడు పాణి.
"ఈయన పాణి ఇండో- పాన్ కంపెనీ సెక్రటరీ" అన్నాడు. విప్పారితమైన కళ్ళతో పాణివైపు చూసి చప్పున కళ్ళు దించుకుని ప్రతి నమస్కారం చేసింది.
"బైదిబై, గురూగురూ మీరొక్కరే వచ్చేరా? మీ మిసెస్ కూడా వచ్చేరా?" అని అడిగేడు.