Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 8

   

           అప్రతిభుడైన వ్యాస్, ఒక క్షణం మాట్లాడలేకపోయాడు. ప్రెసిడెంట్ కొనసాగించేడు.
   
    "సరే, డాక్టర్ల సంగతి అలా వుంచండి- మందులు తయారు చేసే కంపెనీలు ఎన్ని మూతబడ్తాయి? ఆ కార్మికులు అందరూ ఏమౌతారు? కోటికి పైగా వున్న మెడికల్ షాపులు - ఆపరేషన్ పరికరాలు తయారుచేసే కర్మాగారాలు - ఎక్స్ రే యూనిట్లు - మొత్తం అంతా కలిపితే - దాదాపు యాభై కోట్లమంది జనం తమ జీవనాధారాలు కోల్పోతారు. వీరందర్నీ ఏం చెయ్యమంటారు మిస్టర్ వ్యాస్?"
   
    "కానీ ఈ మాత్ర ఆకల్నికూడా చంపేస్తుంది సర్! కేవలం విటమిన్ మాత్రలు చాలు."
   
    "అయితే మరీ కష్టం. రైతులూ, పిండిమరలూ, ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగస్తులూ- వీళ్ళందర్నీ ఏం చెయ్యాలి? చెప్పండి వ్యాస్?"
   
    షాక్ తగిలినట్టూ నిశ్చేష్టుడయ్యాడు వ్యాస్. అతడు అనుకున్నది వేరు. తన పరిశోధన గురించి చెప్పగానే ప్రెసిడెంట్ తనని ఆకాశానికి ఎత్తేస్తాడనుకున్నాడు. నోబుల్ ప్రైజ్ గురించీ, ప్రజలు వెల్లువై పట్టే బ్రహ్మరథాల గురించీ కలలు కన్నాడు. ఈ నిరాసక్తతని అతడు కలలో కూడా వూహించలేదు.
   
    "మరి ఇప్పుడు....ఏం చెయ్యటం?" అని అడిగేడు తనలో తానే మాట్లాడుకుంటున్నట్టూ.
   
    "ఈ వార్తను వెల్లడి చేయటానికి కూడా వీల్లేదు వ్యాస్. అప్పుడు నామీద చాలా వత్తిడులు కూడా వస్తాయి" అన్నాడు ప్రెసిడెంట్ "దీనిగురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఎకనమిక్ రివల్యూషన్ బారినుంచి ప్రపంచాన్ని ముందు రక్షించాలి. నెమ్మది నెమ్మదిగా ఈ మందును ప్రవేశపెట్టాలి. ఒక పద్దతి ప్రకారం మెడికల్ కాలేజీలు మూసేసుకుంటూ రావాలి. ఈ మాత్రల కోసం జనం విప్లవం తీసుకురాకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. మనిషి ఆరోగ్యంకన్నా దేశం సక్రమంగా నడవటం నాకు కావాల్సింది."
   
    పేపర్లు సర్దుకుని వ్యాస్ లేచేడు. ఇక మాట్లాడవలసిందేమీ లేదు. ప్రెసిడెంట్ కూడా లేచి షేక్ హాండ్ ఇస్తూ "కంగ్రాచ్యులేషన్స్ ప్రొఫెసర్! మీ పేరు చరిత్రలో సువర్ణాక్షరాల్తో లిఖింపబడుతుంది. మానవజాతి భూమ్మీద వున్నంత కాలం మిమ్మల్ని మర్చిపోదు" అన్నాడు. "కానీ నాక్కొద్దిగా టైమ్ ఇవ్వండి. మీ మాత్ర ప్రతి ఒక్కరికీ చేరేటందుకు కొంత టైమ్ కావాలి."
   
    "ఎంత టైమ్ కావాలి మిస్టర్ ప్రెసిడెంట్?"
   
    "యాభై సంవత్సరాలు-"
   
                                                                    *    *    *
   
    ఎయిర్ పోర్ట్ నుంచి టాక్సీలో ఇంటికొస్తున్నాడు వ్యాస్. అతడి మనసు కుతకుతలాడిపోతూంది. తనే ఈ మాత్ర తయారుచేసి అందరికీ పంచాలి- అప్పుడుగానీ ఈ అధికారులకి బుద్దిరాదు.
   
    టాక్సీ ఇంటిముందు ఆగింది.
   
    దిగి, బ్రీఫ్ కేస్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఇల్లంతా నిర్మానుష్యంగా వుంది. అతడు కొంచెం ఆశ్చర్యపడుతూ భార్య కోసం వెతికేడు. ఆమె ఎక్కడా కనబడలేదు. బల్లమీద ఆమె పెట్టిన చీటి మాత్రం కనబడింది.

    "ప్రియమైన మీకు-
   
    నేనిలా ఉత్తరం పెట్టి వెళ్ళిపోవటం ఆశ్చర్యంగా కనిపించవచ్చు. కానీ నా తరపునుంచి ఆలోచించండి. మీతో వివాహమైన ఈ ముప్పై సంవత్సరాల్లో నేనేమి అనుభవించాను? మీకెప్పుడూ మీ పరిశోధనలూ, లెక్కలే నన్నో భార్యగా ఎప్పుడూ మీరు గుర్తించనేలేదు. చివరికి మీ పరిశోధనకి కూడా నేనే కావాల్సి వచ్చాను.
   
    అయితే మీకో అనుమానం రావచ్చు - ఇంతకాలం ఎందుకు కలిసివున్నానని?
   
    ఇంకేం చెయ్యగలను ప్రొఫెసర్ వ్యాస్. స్త్రీగా పుట్టినందుకు- ఎవర్నో ఒకర్ని వివాహం చేసుకొని, ఆ భర్తనే దేవుడిగా కొలవాల్సిన దౌర్భాగ్యం మాది. మా రక్షణకోసం మా ఆకలికోసం,  మిమ్మల్ని ప్రేమించాల్సి వస్తూంది. మీరు ఎంత కాదన్నా మీతోనే బ్రతకాల్సి వస్తూంది.
   
    కానీ ఈ రోజు మీరిచ్చిన మాత్రతో ఇక నాలో ఆకలి వుండదు. రోగభయం వుండదు. మరెందుకు మీతో కలిసి వుండటం? వెళ్ళిపోతున్నాను- మీ భార్య."
   
    ప్రొఫెసర్ వ్యాస్ ఆ కాగితాల్ని బల్లమీద పెట్టి కుర్చీలో కూలబడ్డాడు. చాలాసేపు నిశ్శబ్దంగా అలాగే కూర్చొని వుండి పోయేడు.
   
    రాష్ట్రపతి ఎకనమిక్ రివల్యూషన్ గురించే ఆలోచించేడు కానీ సోషల్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించలేదు. ఈ ప్రపంచంలో మనిషికీ, మనిషికీ మధ్య ఆప్యాయతలూ - ప్రేమ, అనురాగం అన్నీ 'ఆకలి' అనే పునాదిమీదే నిర్మించబడ్తాయన్న మహత్తర విషయం అతడికి ఆ క్షణం బోధపడింది.
   
    అతడు నెమ్మదిగా తన పరిశోధన తాలూకు కాగితాలు చెథిలొఇ తీసుకున్నాడు.
   
    ఆ తర్వాత వాటిని అగ్గిపుల్లతో వెలిగించాడు.
   
               
                                                               --* * * *--

 Previous Page Next Page