Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 10


  

    పాణి కొంచెం ఆశ్చర్యపోయి, "నాకింకా పెళ్ళికాలేదు" అన్నాడు.
   
    "అయితే కొంచెం ఉండండి. నన్ను కోఠీలో డ్రాప్ చేద్దురు గాని స్కూటర్లో" అన్నాడు చివరి పదం ఒత్తిపలుకుతూ.
   
    "ఒక అయిదు నిమిషాల్లో వస్తాను. ఈ లోపులో మీరు మాట్లాడుతూ ఉండండి" అంటూ వెళ్ళబోయి, మళ్ళీ వెనక్కి తిరిగి, "మీ ప్రశ్నకి జవాబు తొందర్లోనే అనుభవం ద్వారా రావాలని మై విష్" అనేసి వెళ్ళిపోయేడు.

    "ప్రశ్నేమిటి?" అంది లత. పాణి, లతా ఇద్దరే మిగిలేరు.
   
    "పోనీండి. ఆ విషయం ఇప్పుడెందుకు?" అని తప్పించేడు.
   
    ఒక క్షణం మౌనంగా గడిచింది.
   
    "ఇక్కడంతా గొడవగా వుంది. లా బయటికి వెళదాం రండి. వీళ్ళ మేకప్ తియ్యడం పూర్తయ్యేసరికి పదినిమిషాలు పడుతుంది" అంటూ బయటకు దారి తీసింది. పాణి ఆమెని అనుసరించాడు. ఆడిటోరియం వెనక తలుపునుంచి బయటకు వచ్చారు. అంతా నిర్మానుష్యంగా వుంది. వెన్నెల పిండారబోసినట్టు వుంది.
   
    ఒక నిమిషం ఎవరూ మాట్లాడలేదు. లతే ముందు కదిలించింది. "ఏమిటి, అలా మౌనంగా వుండిపోయేరు?"

    పాణి నవ్వి "ఏం లేదు" అన్నాడు.
   
    "నాకు మౌనంగా ఉండే వాళ్ళంటే ఇష్టం" అంది సాలోచనగా. "నిజానికి నాకీ నాటకాలంటే ఇష్టంలేదు. ఇంత గొడవ భరించలేను కూడా. కానీ ఏం చెయ్యను? మా అమ్మ కోసం. మా తమ్ముడిని చదివించటం కోసం నా మనస్సుని చంపుకున్నాను. ఇలాగే వెన్నెల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోవాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎలా కుదురుతుంది?" అకస్మాత్తుగా ఆమె కంఠంలో విచారం ధ్వనించింది.
   
    పాణి బాధపడుతూ "ఐ యామ్ సారీ! మీ మనసు అనవసరంగా పాడుచేసేను" అన్నాడు.
   
    "లేదు లేదు. ఎందుకో మిమ్మల్ని చూడగానే ఆత్మీయుల్లా మనసులో బాధ అంతా విప్పి చెప్పుకోవాలని అనిపించింది. అందుకే ఎక్కువ పరిచయం లేకపోయినా మీతో నా గొడవంతా చెప్పి మిమ్మల్ని బాధపెట్టేను. ఏమీ అనుకోరుగా" అంది.
   
    "అనుకోను" అన్నాడు పాణి.
   
    "నాకు తెలుసు......మీరు చాలా మంచివాళ్ళు" అంది. "మీరు అదృష్టవంతులు. మీకీ ఫీల్డుతో పరిచయం లేదు. ఇందులో బ్రతకటం చాలా కష్టం. ముఖ్యంగా నాలాటి అమ్మాయి."
   
    "పోనీ, ఎవరన్నా మంచి అబ్బాయిని చూసి పెళ్ళిచేసుకోకూడదూ?"
   
    లతా శుష్కంగా నవ్వి, "హుఁ.....పెళ్ళా? ఎవరు చేసుకుంటారు-అందులో నాలాటి దాన్ని? ప్రేమిస్తున్నానూ అనే సాకుతో....." అంది.
   
    పాణి మరి వినలేదు. ప్రేమ పేరు వినగానే అతనికి తన సందేహం గుర్తుకు వచ్చింది. ప్రేమ! ఎంత అందమైన ఆత్మవంచన! అనుకున్నాడు. అంతలోనే 'ఇదేమిటి? నా మెదడు యింత క్రిమినల్ గా ఆలోచిస్తూంది?' అనుకున్నాడు.
   
    "ఏమిటి, మళ్ళీ ఆలోచనల్లోకి జారుకున్నారు?" అంది లత.
   
    పాణి నవ్వి "ఏం లేదు" అన్నాడు.
   
    "కాదు మీరు చాలా అన్యమనస్కంగా వున్నారు. ఏమిటో నాకు చెప్పరూ?" అంది చనువుగా.
   
    "ఏమీ లేదు. మీ నాటకం చూశాక, అందులోనూ ముఖ్యమ్గా మీ డైలాగులు విన్నాక నాకో అనుమానం వచ్చింది. అసలు ప్రేమంటే ఏమిటి?" అని.
   
    లత అతనివైపు ఆశ్చర్యంగా చూసింది. క్రమంగా ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. "నాకూ తెలియలేదు. తెలుసుకునే అవసరం కూడా రాలేదు ఇప్పటివరకూ! కానీ, ఇప్పుడు మీ ప్రశ్న వింటూంటే....." అంటూ సిగ్గుతో నేలచూపులు చూస్తూ మధ్యలో ఆపుచేసింది.
   
    పాణికి తల గిర్రున తిరిగిపోయింది. తనని తను సంబాళించుకుని "నిజంగానా లతా?" అన్నాడు డ్రమెటిక్ గా.
   
    "నిజం, శేఖర్" అంది అడుగు ముందుకేసి.
   
    "నా పేరు పాణి" అంటూ సరిదిద్డాడు.
   
    "నిజం, పాణి! ఈ లోకంలో ఎవర్నీ నమ్మలేక అసలు ప్రేమ అనే పదాన్నే నా జీవితంలోంచి తుడిచేసుకోవాలని అనుకున్నాను. కానీ....."
   
    "లతా" అంటూ అడుగు ముందుకేసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
   
    "వద్దు శేఖర్" అంటూ విడిపించుకోబోయింది.
   
    "నా పేరు పాణి" అన్నాడు విసుగ్గా.
   
    "వద్దు పాణి! మనది అలౌకికమైన ప్రేమ. రెండు నిమిషాల్లో ఒకర్ని ఒకరం పూర్తిగా అర్ధం చేసుకున్నాం. మన ప్రేమని ఈ తుచ్చమైన కోర్కెలతో బలిచేసుకో వద్దు" అంది ఎమోషనల్ గా!
   
    పాణి కరిగిపోయేడు. "లతా!" గంభీరంగా అన్నాడు. "ఈ అనుభవాన్ని నా స్మృతుల పుటల్లో జాగ్రత్తగా దాహుకుంటాను."
   
    "ఈ అభాగ్యురాలికి ఇంతకన్నా కావలసింది యింకేముంది.....?"అంది లత. అంతలో శాస్త్రి తన గురించి ఎవర్నో అడగటం వినిపించింది. "వెళ్ళొస్తాను లతా" అన్నాడు భారంగా. ఇద్దరూ వెనక్కి తిరిగారు, "రేపు ఆదివారం కదా? రేపు మధ్యాహ్నం మీకేదయినా పని వుందా?" అడిగింది.
   
    "ఉహుఁ లేదు" అన్నాడు పాణి.
   
    "రేపు నవరంగ్ కి మ్యాట్నీ కొస్తారా?"
   
    ఆమె కళ్ళలోకి తన్మయంగా చూసి, "వద్దు లతా!" అన్నాడు పాణి. "మన అలౌకికమైన ప్రేమని మ్యాట్నీల్లోనూ, సెకండ్ షోల్లోనూ ప్రదర్శించుకోవద్దు. భద్రంగా గుండెల్లోనే దాచుకుందాం. పోతే మీ అత్యంత ఆప్తునిగా మీకో సలహా ఇవ్వమంటారా....? పాడవ్వాలనుకుంటే పూర్తిగా పాడవండి. అంతేకానీ, ఈ మానసిక వ్యభిచారం వద్దు."
   
                                                             *    *    *
   
    పాణిని చూడగానే "ఏరా, ఎక్కడికి వెళ్ళేవ్ ఇంతసేపూ...." అంటూ చిరాకుపడ్డాడు. పాణి నవ్వి ఊరుకున్నాడు. వెనకనే వస్తూన్న లతని చూడగానే శాస్త్రి కళ్ళు చిట్లించేడు. అనుమానంగా ఏదో అడగబోయేడు. అతన్ని మాట్లాడనివ్వకుండా "మరి పోదామా, గురూ....?" అన్నాడు పాణి.
   
    "మాట మార్చకోయ్.....కొంచెం జాగ్రత్తగా వుండు."
   
    "అంటే?" అన్నాడు పాణి అర్ధంకానట్టు.
   
    "ఆ అమ్మాయి మనుషుల్ని మామూలుగా పాడుచేస్తే ఫరవాలేదు. కానీ, ఏమీ లేకుండానే పెద్ద పెద్ద మాటలు చెప్పి అనవసరంగా మనసు పాడుచేస్తుంది."
   
    పాణి నవ్వేడు. "ప్రేమించటం అంటే ఏమిటో నాకు తెలియకపోవచ్చు. కానీ, కాగితప్పూలని గుర్తించలేనంత అమాయకుడిని కాను" అన్నాడు.
   
    "నిజమే. కానీ, ఒక మంచి అనుభవాన్ని ఇలా పాడుచేసుకోకు" అని అంటూ వుండగా, కవి వచ్చేశా డక్కడికి.
   
    "మీ పనయిపోయిందా గురూగారూ?" అన్నాడు పాణి.
   
    "లేదు. వెళ్ళిరండి" అన్నాడు కవి.

    పాణీ, శాస్త్రీ బయటకొచ్చేరు. యింటివైపు వెళుతుంటే "ఇప్పుడు ఆ హోటల్ భోజనం ఎందుకులే? మా ఇంట్లోనే భోజనం చేద్దువు గాని" అన్నాడు. పాణి మౌనంగానే అంగీకారం తెలిపేడు. అప్పుడప్పుడు ఇలా స్నేహితులింట్లో భోజనం  చెయ్యటం అతనికి అలవాటే.
   
    ఇద్దరూ శాస్త్రి ఇంటికొచ్చేరు. తలుపు తట్టగానే శాస్త్రి చెల్లెలు వచ్చి తలుపు తీసింది.
   
    ఇంకా నిద్రపోలేదా....?" అంటూ ఆప్యాయంగా చెల్లెల్ని అడిగేడు.
   
    ఆ అమ్మాయి నిద్ర కళ్ళతో నవ్వి "నీ కోసమే చూస్తున్నాను" అంది.
   
    "వీడు కూడా ఇక్కడే భోజనం చేస్తాడు" అన్నాడు శాస్త్రి.
   
    పల్లవి 'అలాగే' నన్నట్టు తలవూపి లోపలికెళ్ళింది. కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నారిద్దరూ.
   
    "నాన్నా, అమ్మా నిద్రపోతున్నారా?" అడిగేడు శాస్త్రి.
   
    "ఆహా! ఇప్పుడు టైమెంతయిందో తెలుసా? పదకొండు" అంది పల్లవి. "వాళ్ళు తొమ్మిదింటికే పడుకున్నారు."
   
    "మరి నేను పెట్టుకుని తినేవాడినిగా - నువ్వు అనవసరంగా మేల్కోవటం దేనికి?" అన్నాడు. పల్లవి మాట్లాడలేదు. అంతలో శాస్త్రి పాణివైపు తిరిగి, "చెప్పటం మరచిపోయాన్రోయ్. ఈ రోజు మన పల్లవికి ఓ సంబంధం వచ్చింది" అన్నాడు.
   
    పాణి చప్పున తలఎత్తి పల్లవివైపు చూసి, "నిజంగా?" అన్నాడు. వడ్డిస్తూన్న కూరగిన్నె చటుక్కున టేబిల్ మీద వదిలేసి సిగ్గుతో బయటికి పరిగెత్తింది.  పాణి బిగ్గరగా నవ్వి "అరె, అప్పుడే అంత సిగ్గెందుకు? రా" అంటూ పిలిచాడు. కానీ, ఆ అమ్మాయి మరి రాలేదు.

 Previous Page Next Page