"క్రిమినల్స్ ని పట్టుకోవడానికి రకరకాల వేషాలు వెయ్యవలసి వుంటుంది."
"మీరు వేషాలు వేస్తారా?"
"ఏం వెయ్యకూడదా?"
"డిటెక్టివ్ లు నవలల్లో మారువేషాలేస్తే చదవటానికీ, నమ్మటానికీ వీలు వుంటుందిగానీ - ఆడవాళ్ళు? ఎంత సి.బి.ఐ. వారైనా - మారువేషం వేస్తే కనిపెట్టరంటారా నేరస్తులు?"
"ఫిజికల్ థెరపీ, వాయిస్ మాడ్యులేషన్ థెరపీలుంటాయి. చాలా సులభంగా మారిపోవచ్చు."
"నాకు నమ్మశక్యం కావటంలేదు."
"దాని గురించి తీరిగ్గా మాట్లాడుకుందాంగానీ ఆ కుడివైపు బిల్డింగ్ లోపలకి తిప్పండి అదే మా ఇల్లు."
కారు మొక్కల మధ్యనుంచి లోపల పోర్టికోలోకి వెళ్ళి ఆగింది.
"రండి, టీ తాగి వెళుదురుగాని."
రెండోసారి అడిగే అవసరం లేకుండానే అతడు దిగాడు. ఆమెలో ఏదో ఆకర్షణ అతడిని పరిమళంలా చుట్టుముడుతోంది. అది ప్రేమా! కాదు... ప్రేమ గుడ్డిది. ఆమె సామీప్యంలో అతడి మనోనేత్రాలు తెరుచుకోవటం ప్రారంభించాయి. లేదా అది గౌరవమా? కాదు. ఆమె అతని కంటే చిన్నది. నాజూకైనది. భక్తా? కాదు..... ఉహూ.... అయి ఉండవచ్చు. అయితే అది నిశ్చయంగా పూవులతో పూజించవలసి వచ్చే భక్తి కాదు. మన్మధుడు కూడా కాస్త సాయం చేయాలి.
వాళ్ళిద్దరూ లోపలికి వెళుతుండగా ఇక వృద్ధుడు లోపలినుంచి వచ్చాడు.
"మా తండ్రిగారు...." పరిచయం చేసింది ఆమె. అతడు నిశ్చేష్టుడై చూశాడు. చక్రాల కుర్చీలో ముందుకు వస్తూ చేయి చాచిన వ్యక్తికి రెండు కాళ్ళు లేవు.
"గ్లాడ్ టు మీట్ యు" ప్రతాపరావు చేయి అందించాడు.
"కూర్చోండి. ఇప్పుడే వస్తాను" అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. కొంచెంసేపు ఆయన అతడితో మాట్లాడాడు. "ఏం చేస్తూ వుంటారు మీరు?" అని ఆయన అడిగిన ప్రశ్న అతడిని ఇబ్బందిలో పడేసింది. ఇంతకుముందు అలా వుండేది కాదు. మాట తప్పించటం కోసం- "యుద్ధంలో పోయాయా మీ కాళ్ళు-" అని అడిగాడు.
"లేదు. వ్యక్తిగతమయిన గొడవల్లో" మిగతా వివరాలు చెప్పటానికి ఇష్టంలేనట్టు "అమ్మాయి వస్తోంది. నేనలా గార్డెన్ కి వెళ్ళొస్తాను" అంటూ కుర్చీ తీసుకుంటూ వెళ్ళిపోయాడాయన. విహారి ఒక్కడే గదిలో మిగిలాడు.
అప్పుడు గమనించాడు ఆ హాల్లో ప్రత్యేకతని.
గదిలో భగవంతుడి ఫోటోలు కానీ, దేవుడి బొమ్మలుగానీ లేవు. ఒకవైపు గోడకి నిలువెత్తు భారతదేశపు పటం వుంది. మధ్యలో జెండా. మరోవైపు భారతమాత ఫోటో..... మిగతా దేశనాయకుల పటాలు.
అతడికి ఏమీ తోచలేదు. వంటమనిషి టీ తీసుకొచ్చి ఇచ్చాడు. అది తాగుతూ బల్లమీద వున్న టేపురికార్డర్ ఆన్ చేశాడు. "...... సారే జహాసే అచ్చా - హిందూస్తా హమారా" పాట వచ్చింది. అది మార్చి ప్రక్కనే వున్న మరో క్యాసెట్ పెట్టాడు. "ఇది నా భారతదేశం... సర్వజనావళికిది శుభ సందేశం......"
"మా ఇంటిలో మీకు మామూలు పాటలు వినపడవు" ఒక మొగగొంతు వినపడటంతో తలతిప్పి చూశాడు. ఒక పొడవాటి వ్యక్తి లోపలి నుంచి వస్తూ అంటున్నాడు ఆ మాటలు. విహారి తనవైపు ప్రశ్నార్ధకంగా చూడడం గమనించి "నా పేరు ప్రశాంత్. మీ స్నేహితురాలు ప్రవల్లికకి కాబోయే భర్తని" చేయి సాచుతూ అన్నాడు.
అది లక్ష వోల్టుల షాకు కాదు. సన్నటి జలదరింపు. విచారాన్ని మోసుకొచ్చే ప్రళయకాల ఝంఝామారుతం కాదు. ఒంటరితనాన్ని పలుకరించి పెంచే పిల్ల గాలి. అతడు అన్యమనస్కకంగానే ప్రశాంత్ తో మాట్లాడాడు.
"తను వస్తుంది కూర్చోండి. నాకు పనుంది వెళ్ళొస్తాను" అంటూ అతడు వెళ్ళిన కొద్దిసేపటికి ప్రవల్లిక రెండు కప్పుల టీతో వచ్చింది. ఈసారి ఆమె నిండు చీరెలో విచ్చిన గులాబిలా వుంది. "ఏమిటి మా బావ మిమ్మల్ని బోర్ కొట్టినట్టున్నాడు-"
"అటువంటిదేమీ లేదు."
"సైన్యంలో పనిచేస్తున్నాడు. శ్రోత దొరికితే చాలు యుద్ధం గురించే మాట్లాడతాడు. మా నాన్నగారికి తనంటే చాలా అభిమానం."
"మరీ మీకు?" చప్పున అడిగి, అలా అడిగినందుకు వెంటనే నాలుక్కర్చుకున్నాడు. ఆమె దాన్ని పట్టించుకున్నట్టు లేదు.
"నాకూ ఇష్టమే! రేపు వేసవిలో మా వివాహం జరగబోతూంది. అదీగాక, ఒకవేళ నాకు వేరే అభిప్రాయం వుందని ఏమాత్రం అనుమానం వచ్చినా రైఫిల్ తో ముందు నన్ను కాల్చేసి తరువాత తను ఆత్మహత్య చేసేసుకుంటాడు" నవ్వింది. ఆ నవ్వులో అల్లరీ, చిలిపితనం చోటుచేసుకున్నాయి. కానీ, ఎందుకో ఆ తరువాత విహారి అంత ఫ్రీగా వుండలేకపోయాడు. ఆమె చాలా ఉత్సాహంగా వేస్తున్న ప్రశ్నలకు అతడు అన్యమనస్కంగా జవాబు చెప్పాడు.
"మీ ఆస్తి వ్యవహారాలన్నీ ఎవరు చూస్తూ వుంటారు?" అడిగింది.
"మా గుమాస్తాలు."
ఆమె విస్మయంగా "వాళ్ళు సరిగ్గా చూస్తారా?" అంది.
"ఏదో చూస్తూ వుంటారు." అని అతడు లేచి, చేతులు జోడించి "వెళ్ళొస్తాను" అన్నాడు.
"అప్పుడేనా" అప్రయత్నంగా అంది. ఆమెవైపు అప్రతిభుడైనట్లు చూశాడు. ఆమె కళ్ళు దించుకుంది. అతడు కారు దగ్గరికి వచ్చి డోర్ తీశాడు.
ఆమె అంది- "మొన్నే చెప్పవలసింది థాంక్స్! మర్చిపోయాను."
"దేనికి?" ఆశ్చర్యంగా అడిగాడు.
"మాకా రోజు చేసిన సాయానికి-"
"ఆ రోజే చెప్పారుగా!"
"పక్కింట్లో దొంగలు పడ్డా చాలామంది పట్టించుకోరు. అటువంటిది మీరు ప్రాణాలకి తెగించి మాకు చాలా సాయం చేశారు. మీ సెన్సాఫ్ రెస్పాన్సిబిలిటీ మనుషులకి, ముఖ్యంగా భారతీయులకి తక్కువ. అందుకే మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్పాలనుకున్నాను. అదృష్టవశాత్తు మళ్ళీ ఈ రోజు కనపడ్డారు. మనుష్యులుగా పుట్టినందుకు ఓ ప్రత్యేకతను సంతరించుకునేవారంటే నాకిష్టం. ఆ లక్ష్యం నెరవేరకపోవచ్చు. కానీ ప్రయత్నం వుండాలిగా. వెళ్ళిరండి విహారిబాబూ... బైబై."
* * *
సాయంత్రం నాలుగున్నర అయింది.
సునాదమాల బస్ స్టాప్ లో నిలబడి వుంది. అరగంటయినా స్కూల్ బస్ రాలేదు. ఆమెలో కంగారు ఎక్కువైంది. ఒకవేళ తనకన్నా ముందే దిగి విష్ణు ఇంటికి వెళ్ళిపోయాడేమో అనుకుని ఇంటికొచ్చింది.
"అదేమిటమ్మా ఒక్కదానివే వచ్చావే?" అంది బామ్మ. సునాద పాలిపోయిన మొహంతో, "విష్ణు రాలేదా?" అని అడిగింది.
"రాలేదే?"
ఆమె గిర్రున వెనుదిరిగిమ్ది. బామ్మ వెనుకనుంచి "ఎందుకే అంత కంగారు?" అంటున్నా వినిపించుకోకుండా బస్ స్టాప్ దగ్గిరకు పరుగెత్తుకు వెళ్ళింది.
అప్పటికే అక్కడ వినీల్ వాళ్ళ అమ్మ వుంది. ఆమెకూడా కంగారు పడుతోంది. సమయం అయిదున్నర కావస్తోంది. మరో పావుగంట చూసి ఇద్దరూ రిక్షాలో స్కూలుకి వెళ్ళారు.
స్కూల్ కాంపౌండ్ లో పోలీసుల్ని చూడగానే సునాదమాల గుండె ఆగినంత పనయింది.
అక్కడ పదిమంది దాకా పోలీసులున్నారు. అప్పటికే పాతికమందిదాకా పేరెంట్స్ చేరుకుని వున్నారు. అంతా గోల గోలగా వుంది. ప్రిన్సిపాల్ చెపుతున్నది ఎవరూ వినిపించుకోవటం లేదు. ఎవరో తండ్రి గట్టిగా అరుస్తున్నాడు. ఏం జరిగిందని ఆతృతగా అడిగింది సునాద. విషయం తెలిసి ఆమె వంట్లో సత్తువంతా ఒక్కసారిగా పోయినట్టు అనిపించింది. పక్కనున్న రెయిలింగ్ పట్టుకుని బలవంతంగా నిలదొక్కుకుంది.
ప్రొద్దున్న పిల్లల్ని తీసుకుని బయల్దేరిన బస్సు స్కూల్ వరకూ రాలేదు.
ఏమైందో తెలీదు.
వినీల్ తల్లి ఏడుస్తోంది. ఇంట్లో పుట్టినరోజు కోసం హాలు మధ్యలో అమర్చిన కేక్ ని, వచ్చిన అతిధుల్ని తల్చుకుని పదేళ్ళ కొడుకు ఏమయ్యాడో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆకలేస్తే ఇంట్లోనే నోరు తెరిచి అడగటానికి సిగ్గుపడేవాడు వాడు. ఆ వయసులోనే రాత్రి తొమ్మిదింటి వరకూ కళ్ళజోడు సర్దుకుంటూ టేబిల్ లైట్ ముందు కూర్చుని చదువుకునేవాడు. ఫస్ట్ మార్కు వచ్చినందుకు టీచరు ఇచ్చిన చాక్లెట్ లని ఇంటికి తీసుకొచ్చి తల్లికి చూపించనిదే తిననివాడు అయిన ఒక్కగానొక్క కొడుకుని తల్చుకుని ఆవిడ ఏడుస్తూంటే ఓదార్చేవారే లేకపోయారు. అక్కడ అందరి పరిస్థితి దాదాపు అలాగే వుంది.
* * *
ముఖ్యమంత్రి టేబిలుమీద ఫోన్ మ్రోగింది. అది ఆయన పెర్సనల్ నెంబరు. పి.య్యే. సెక్రటరీలకు కాకుండా డైరెక్టుగా ఆయనకే వెళుతుంది. చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు ఆ నెంబరు.
ఆయన రిసీవర్ ఎత్తి "హల్లో" అన్నాడు.
"ఈ రోజు ప్రొద్దున్న గాడ్ ఫాదర్ స్కూలు బస్ పిల్లల్ని తీసుకువెళుతుంటే దారి మళ్ళించబడింది. ఆ వార్త మీ వరకూ వచ్చిందా?"
"ఎవరు మీరు?"
"ఆ బస్సును దారి మళ్ళించిన వాళ్ళం-"
ఆయన నొసలు ముడిపడ్డాయి. ఆవేశాన్ని అతికష్టంమీద అణుచుకుంటూ "ఏం కావాలి మీకు?" అని అడిగాడు.
"ప్రస్తుతం ఆ పిల్లలు మా దగ్గిరే ఉన్నారు. అంతమంది పిల్లల్ని ఒకేచోట ఎక్కువకాలం ఉంచటం కష్టం. అంతమందికి తిండికూడా ఖర్చే."
ముఖ్యమంత్రికి అర్ధమైంది. "ఎంత కావాలి మీకు?" పక్కనున్న బటన్ నొక్కుతూ అడిగాడు. పి.య్యే. పరుగెత్తుకు వచ్చాడు. కాగితం మీద "ట్రాప్ దిస్ ఫోన్" అని వ్రాశాడు. పి.య్యే. అదే వేగంతో వెళ్ళిపోయాడు.
"చెప్పండి. ఎంత కావాలి మీకు?"
"మాకు డబ్బు అవసరంలేదు సి.ఎం."
"మరి?"
"రేపు సాయంత్రంలోగా నువ్వు రాజీనామా చెయ్యాలి. లేకపోతే రేపు సాయంత్రం నుంచీ రోజుకొక పిల్లాడ్ని చంపి అసెంబ్లీ ముందు పారేస్తాం."
ఫోన్ కట్ అయింది.
6
ఆ రాత్రి పదింటికి విహారి ఇంటికి రెండువందల గజాల దూరంలో ఉన్న ఆఫీసు ప్రాంగణం హడావుడిగా ఉంది. ఇద్దరు గుమాస్తాలు, మేనేజర్, టైపిస్టు కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ లెడ్జరు పుస్తకాలు, ఫైళ్ళు లోపలికి తీసుకువెళుతున్నారు.
దాదాపు ఆరుగంటల నుంచీ విహారి ఆ కుర్చీలోంచి లేవలేదు. అతడికి ఆ పని కొత్త అయినా పెద్ద అలసటగా లేదు. నాటకాలు రిహార్సల్స్ వేసేటప్పుడు గంటల తరబడి ఒకే పనిమీద కూర్చోవటం అలవాటే. అయితే, ఇప్పుడు అతడు చేస్తున్నది అతని జీవితంలో అంతకుముందు ఎప్పుడూ చేయనిది.
మొదటిసారి తన ఆస్తి వివరాలు పరిశీలించటం..... దాదాపు ఆరు గంటలపాటు మొత్తం చదివాక అతడికి ఒక అవగాహన వచ్చింది. ఆ తరువాత లెక్కలు పరిశీలించటం మొదలుపెట్టాడు. లెడ్జర్లు, డే బుక్కలు, ట్రయల్ బాలెన్సులు బ్యాలెన్స్ షీట్లు - ఒక పద్ధతి ప్రకారం చూసుకుంటూ వచ్చాడు. తెల్లవారుఝాము వరకూ అలా చూస్తూనే వున్నాడు.