వర్ధనమ్మ తెల్లవారుతూండగా లేచి, కొడుకు ఇంకా అవుట్ హౌస్ లోనే వున్నాడని గంగూలీ చెప్పగానే కంగారుగా అక్కడికి వచ్చింది. పుస్తకాల వెనుక విహారి మొహం కనబడటంలేదు. పక్కనే అయిదారు ఖాళీ టీ కప్పులున్నాయి. ఆమెకు ఆ దృశ్యం అపూర్వంగా తోచింది. మొట్టమొదటిసారి కొడుకుని అలా చూడటం!!!.... ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి.
ఈ లోపులో, ఆఖరి అకౌంటు పుస్తకంనుంచి పెన్సిల్ తో లెక్క వేసుకుని కూడిన విహారి తలపైకెత్తి అంత ప్రొద్దున్నే తల్లిని అక్కడ చూసి ఆశ్చర్యాన్ని అణచుకుంటూ తిరిగి తన మూడ్ లోకి వచ్చి, "గత ఒక సంవత్సరంలోనే గౌరవనీయులైన మన మేనేజరుగారు నాలుగు లక్షల ఇరవై అయిదువేలదాకా తినేశారమ్మా" అన్నాడు.
ఆమె మాట్లాడలేదు.
అతనే అన్నాడు - "ఇది ఈ సంవత్సరంది. మరి గత పది సంవత్సరాలుగా ఈ విధమైన ఆస్థి ఎంత పోయిందో లెక్క తేలాలంటే నాకు మరొక నెల టైమ్ కావాలి. ఆ సంఖ్య తెలుసుకుంటే బహుశా మనిద్దరి గుండెలూ ఆగిపోవచ్చు."
వర్ధనమ్మ నవ్వి, "గుండె ఆగిపోతే ఆగిపోతుందేమోగానీ, అది ఆస్తి పోయినందువల్ల మాత్రం కాదురా! ఇన్నాళ్ళకి కొడుకు ప్రయోజకుడయ్యాడన్న సంతోషంతో" అంది. ఆమె చెప్పింది నిజమే. కొడుకు తెలివితేటలపట్ల ఆమెకే విధమైన అనుమానమూ లేదు. నాటకాల్లో పడి పాడైపోతున్నాడని బాధ అంతే. ఒక్కరోజు ఉన్నట్టుండి ఆ కొడుకు రాత్రంతా మేల్కొని ఒక సంవత్సరం అకౌంట్లన్నీ మొత్తం పరిశీలించాడంటే ఆమెకు అంతకన్నా కావల్సింది ఏముంది?
ప్రతీ వ్యక్తీ ఏదో ఒక వయసులో బాధ్యత గుర్తిస్తాడు. (కొంత మంది జీవితాంతం గుర్తించరు. అది వేరే సంగతి.) అలా గుర్తించిన వ్యక్తి క్రమక్రమంగా దానిలో లీనమవుతాడు. అయితే, విహారి ఇలా వున్నట్టుండి.... పనిలో పడటానికి కారణం ప్రవల్లిక మాట్లాడిన నాలుగయిదు మాటలు. అవి చాలు... దీనికి తర్కంలేదు. ఆమె మాటలు అతడి గుండెను సూటిగా తాకాయి. సాధించాలను కున్నాడు - సాధించాడు.
అతడికి ఈ ఆనందం గొప్ప సంతృప్తినిచ్చింది. చాలా చిత్రంగా.... అతనికి ఏమాత్రం అలసట అనిపించలేదు. ఒక రచయిత తన జీవితపు అతి గొప్ప నవల ఆఖర్లో 'శుభం' వ్రాసేక వేళ్ళు విరుచుకుంటూ నిట్టూరుస్తున్నప్పుడు కలిగే ఆనందానికి ఖరీదు కట్టగలిగే షరాబు ఎవరు? అటువంటి ఆనందం ఆ ప్రత్యూష సమయాన అతడికి కలిగింది. ఆ ఆనందాన్ని అతడు ఆ అమ్మాయితో పంచుకోవాలనుకున్నాడు. ఇందులో కూడా చిత్రం ఏమీలేదు. ఆ అమ్మాయికి త్వరలో వివాహం జరగబోతూ వుందని తెలుసు. కానీ ఆమెకి తనలో ఈ పరిణామం సంగతి చెప్పడానికి వేరే కారణాలు వుండనవసరంలేదు. ప్రతీ మొగవాడూ స్త్రీ దగ్గిర ఏ వయసులోనైనా చిన్నవాడే. చిన్నపిల్లవాడు తరచూ అద్దంలో తన మొహాన్ని చూసుకోవాలని అనుకున్నట్టు ప్రతీ పురుషుడూ తనకు స్ఫూర్తినిచ్చిన స్త్రీ అభినందన పూర్వకమైన చిరునవ్వులో తన విజయాన్ని చూసుకోవాలనుకుంటాడు.
ఆ సాయంత్రం అతడు ప్రవల్లిక ఆఫీసుకు వెళ్ళాడు.
చాలా చిన్నదైన ఆ గది అందంగా వుంది. ఉడెన్ పానెల్స్, రాక్స్, రెండు ఫోన్లు.... ఎవరో మనస్తత్వవేత్త అన్నట్టు, గదినిబట్టి అందులో నివసించే మనిషిని అంచనా వేయొచ్చు.
ప్రవల్లిక అతడిని చూసి సంభ్రమంగా ఆహ్వానించింది. క్రితం రాత్రి జరిగింది అతడు చెపుతూంటే ఆమె కళ్ళు అదో విధమైన కాంతితో మెరిశాయి. అతడు చెప్పినదంతా విని ఆమె "కంగ్రాచ్యులేషన్స్. లక్ష పోయినందుకు కాదు - పోబోయే లక్షలు మిగిలినందుకు" అంది.
"ఇదంతా మీరు మొన్న ఒక్కమాట అనటంవల్ల ప్రవల్లికా" అనబోయాడు కానీ అనలేదు. ఆమె దాన్ని అపార్ధం చేసుకోవచ్చు. తను మరో అభిప్రాయంతో అంటున్నాడని అనుకోవచ్చు. ఎవరో రచయిత అన్నట్లు మనకు ఎంతో గొప్పగా అనిపించిన భావాలు ఇతరులకి ఏమీ అనిపించకపోవచ్చు. 'నా ఒక్క చిన్నమాటవల్ల నీలో యింత మార్పు వచ్చిందా'- అని ఆమె తేలిగ్గా నవ్వుకోవచ్చు.
అతడు లేచి "వెళ్ళొస్తాను" అన్నాడు.
"అప్పుడేనా? కూర్చోండి. కూల్ డ్రింక్ తీసుకుని వెళుదురుగానీ".
"వద్దు. ఎందుకో మీకు ఈ విషయం వెంటనే చెప్పాలనిపించింది. వెళ్ళొస్తాను" అని ఆమె దగ్గిర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
ఆమె అతడు వెళ్ళినవైపే చూస్తూ వుండిపోయింది.
ఎందుకో తెలీదుగానీ పచ్చపచ్చటి ఆకుల మధ్యనుంచి మంచులో తడిసిన గులాబి నెమ్మదిగా విచ్చుకున్నట్టు ఆమె పెదవుల మధ్య సన్నటి చిరునవ్వు కదిలింది.
ఆమె ఆహ్లాదపు మూడ్ ని చెదర్చటానికా అన్నట్టు ఆ గదిలో ఫోన్ మ్రోగింది. "హల్లో" అంది.
"కోడ్ నెంబరు ప్లీజ్..."
ఆమె చెప్పింది. చాలా ముఖ్యమైన, రహస్యమైన విషయాలు చెప్పబోయే ముందు ఈ రకమైన కన్ఫర్మేషన్ లు చేసుకుంటారు.
"ప్రవల్లికా.... నేనూ చీఫ్ ని మాట్లాడుతున్నాను."
"చెప్పండి సర్."
"మనం చాలా ఇబ్బందిలో పడ్డాం. రాబోయే ఇరవై నాలుగ్గంటల్లో డిపార్ట్ మెంట్ ఒక కీలకమైన సమస్యని ఎదుర్కోబోతూంది."
"ఏమిటి సర్?"
అతడు వివరించాడు. వింటూంటే ఆమె చేయి అప్రయత్నంగా రిసీవర్ మీద బిగుసుకుంది. మైగాడ్.... మైగాడ్.... అనుకుంది మనసులో.
సి.బి.ఐ. చీఫ్ చెపుతున్న ప్రతీ వాక్యమూ అతడి చేతికున్న తాయెత్తు తాలూకు మైక్రోఫోన్ లో వింటున్న అనంతానంతస్వామి పెదవులమీద చిరునవ్వు కదలాడుతోంది.
* * *
ముఖ్యమంత్రి రాజీనామా కోసం బస్ హైజాక్!
ప్రమాదం అంచున పసిపిల్లలు.
రకరకాల హెడ్డింగ్ లతో పేపర్లు వచ్చాయి. ఈవెనింగు ఎడిషన్లు అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి. రాష్ట్రంలో ఏ మూల చూసినా ఇదే చర్చ. సంపాదకీయాలు వ్రాయబడ్డాయి.
"అత్యధిక మెజారిటీతో నెగ్గిన ముఖ్యమంత్రి ఈ విధమైన బెదిరింపులకు లొంగటం భావ్యమేనా?"
"టెర్రరిజం Vs ప్రజాస్వామ్యం."
-లాటి టైటిల్స్ పెట్టి సంపాదకీయాలు వ్రాయబడ్డాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇలాంటి బెదిరింపులకు లొంగకూడదని, ఒకసారి దీనికి తలవొగ్గితే ప్రతిసారీ యిది అలవాటు అయిపోతుందనీ ఒక దినపత్రిక మరీ ఘాటుగా విమర్శించింది. ప్రతిపక్షాలు కూడా టెర్రరిస్టుల చర్యని అభిశంసిస్తూ తీర్మానాలు చేశాయి. రాష్ట్రమంతా అట్టుడికిపోయింది.
అధికారపార్టీ కార్యకర్తలు నగరంలో పలుచోట్ల చేరి ముఖ్యమంత్రికి అండదండలు ప్రదర్శిస్తూ ఊరేగింపులు జరిపారు. రాష్ట్రం ఉద్రిక్తతతో నిండింది. ఈ వార్త దూరదర్శన్ లో ప్రసారం కాగానే దేశంలో మిగతా రాష్ట్రాల నాయకులు కూడా తీవ్రమైన చర్చలు జరిపారు. దేశంలోనే కాదు- ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరుగుతున్న కొత్తరకపు ఘాతుకం యిది. ఒక రాష్ట్రపు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇంత సులభంగా మార్చవచ్చుననే ఆలోచన రావటమే గొప్ప. ఆ హార్డ్ కోర్ టెర్రరిస్టుని గూఢచారి దళం ఎలా పట్టుకుంటుందో అని ప్రతివారిలోనూ సందిగ్ధతే. నమ్మకం కూడా లేదు. రేపటికోసం ప్రతివారూ ఎదురుచూడసాగారు- ఆసక్తితో.
పాతికమంది పిల్లల తాలూకు తల్లిదండ్రులకు మాత్రం నిద్రాహారాలు లేవు. పగలు - రాత్రి అన్న భేదం లేకుండా కంట్రోల్ రూమ్ దగ్గిర పడిగాపులు గాస్తున్నారు. ఏ క్షణం ఏ వార్త వస్తుందో అన్న దిగులుతో ఆ మెట్లమీద కూలబడి వున్నారు. మొహాలు పీక్కుపోయాయి. కొంతమంది తల్లులు ఏడుస్తున్నారు. మగవాళ్ళు పైకి బింకంగా వున్నారు. గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది పోలీసుల అసమర్ధతని తిడుతూ వుంటే, మరికొంతమంది ప్రతిపక్షాలని తిడుతూ వున్నారు.
మరుసటిరోజు సాయంత్రం అయిదయింది.
పేరెంట్స్ లో టెన్షన్ ఎక్కువయింది.
సి.బి.ఐ. చీఫ్, డిప్యూటీ, మిగతా ఆఫీసర్లు తెలిఫోన్స్ దగ్గర కూర్చుని వున్నారు. ముఖ్యమంత్రి తాలూకు అన్ని ఫోన్లకి రికార్డ్ కనెక్షన్ ఇవ్వబడ్డాయి. నగరంలో అన్ని పబ్లిక్ ఫోన్ ల దగ్గరా మఫ్టీలో ఆఫీసర్లు వున్నారు. క్షణాలమీద బయలుదేరటానికి వ్యాన్లు, జీపులు, కార్లు సిద్ధంగా వున్నాయి.
అవతలి వారి నుంచి వచ్చే ఫోన్ కోసం ప్రాణాలు బిగపట్టుకొని కూర్చున్నారు అందరూ. టెర్రరిస్టులు ఏం చెపుతారో వినటం కోసం....
నాలుగూ యాభై అయింది.
అయిదయింది.
అయిదు గంటల అయిదు నిమిషాలయింది.
* * *
"మాటిమాటికీ ఫోన్ లు చేయటం, గడువు కొద్దిగా పెంచటం, రాయబారాలు నడపటం -ఇవన్నీ పాత పద్ధతులు. అనుకున్నది అనుకున్నట్టు సాగించండి" చెప్పాడు అనంతానంతస్వామి.
రామ్ లాల్ నసిగాడు. "మనవాళ్ళు రక్తం తాగే కిరాతకులే..... కానీ మరీ పదేళ్ళ పసిపిల్లల్ని కాల్చాలంటే..."
అనంతానంతస్వామి అతడివైపు చిత్రంగా చూశాడు. తర్వాత నవ్వేడు. పసివాడిదయినా, పెద్దవాడిదయినా ప్రాణం ప్రాణమే. ఎవరిని చంపినా ఒకటే పాపం. ఒకర్ని గద్దె దింపుతామని మనం వేరొకరికి వాగ్దానం చేశాం. కోటి రూపాయలకి ఒప్పుకున్నాం. ఇప్పుడు పసిపిల్లలు, జాలి అని సాకులు చెప్తే ఎలా?.... ఎవరున్నారు ఆ పిల్లల దగ్గిర?"
"A-1, A-2, A-4".
"నేనే వస్తానక్కడికి. ఈ లోపులో పని పూర్తిచేయి, వెళ్ళు."
రామ్ లాల్ వెళ్ళాడు.
అతడు నరరూప రాక్షసుడు. దేశంలోకెల్లా భయంకరమైన టెర్రరిస్టు - కానీ అతడికి ఒకటే బలహీనత. చిన్నపిల్లల్ని ఏమీ చెయ్యలేడు. కావాలంటే భార్యను కూడా నరికి పోగులు పెట్టగలడు. వందమందిని కట్టగట్టి కిరసనాయిలు పోసి తగులబెట్టగలడు. కానీ...... అతడికీ ఆ వయసున్న కొడుకులిద్దరున్నారు. వాళ్ళంటే ప్రాణం. అదో సెంటిమెంటు.
అనంతానంతస్వామి వెళ్ళేసరికి పరిస్థితి అలాగే వుంది.
"ఏమిటి.... చంపటానికి చేతులు రావడం లేదా?" నలుగురూ మాట్లాడలేదు.
"ఆనాడు అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత బోధించినట్టు మీకు ఆధునిక జీవిత సారాన్ని బోధించాలని వుంది. 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః- మమకాః పాండవాశ్చైవ కిమకుర్వతసంజయ?' అని వివరించాలని ఉంది. కానీ టైమ్ లేదు. మనం పెట్టిన గడువు దాటిపోయి అయిదు నిముషాలైంది. పిల్లలెక్కడ?"
రామ్ లాల్ గుట్టమీద పాడుపడిన ఇంటిని చూపించాడు. దానికి పైకప్పులేదు. లోపల పాతికమంది దాకా పిల్లలున్నారు. కొందరు ఏడుస్తున్నారు. కొందరు శోషవచ్చి పడిపోయి ఉన్నారు. అక్కడ గది గోడల మధ్యనుంచి రావిమొక్కలు మొలచి వున్నాయి. గచ్చుమీద గడ్డి, పెంట వుంది.
విష్ణు నోట్ పుస్తకాల్లోంచి ఒక్కొక్క కాగితమే చింపి గాలివాటు చూసి విసురుతున్నాడు. వాడి చిన్న మెదడుకి అంతకన్నా పెద్ద ఆలోచన తోచలేదు. పిల్లలు బొద్దుగా వున్నారు. కానీ కొన్ని గంటలనుంచి ఏమీ తినకపోవటంవల్ల ఆ చిన్ని ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయి. ఏడవటానికి కూడా ఓపికలేదు. ఆ చిన్ని ప్రాణాల వయసు ఎంతని? వారికి రక్తపాతాల గురించీ, మనుషుల కిరాతక స్వార్ధం గురించీ, రాజకీయాల గురించీ ఏమీ తెలియదు. ప్రపంచం అంతా మంచితనమే అని నమ్మేవయసు వారిది. గాంధీ, నెహ్రూల గురించి మాత్రమే తెలుసు.