Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 8


    నిన్నటినుంచి ఆమె మంచి మూడ్ లో లేదు. నిన్న క్లాసులో లెక్చరర్ తో చీవాట్లు తిన్నది. ఎవరయినా దేవుడు ప్రత్యక్షమై తన బుర్రలో కాస్త తెలివితేటలు పెడితే తప్ప లాభం లేదని ఆమె నమ్మకం. ఎంత చదివినా పాస్ మార్కులు రావటం గగనమైపోతూంది. నిన్న రాత్రి ఆమెకో కల వచ్చింది. దేవుడు కలలో కనపడి, "నీకేం కావాలో కోరుకో" అన్నాడు. "స్వామీ నాకున్న భయాన్ని పోగొట్టు. కాస్త తెలివితేటలు, కాస్త మాటకారితనం ఇవ్వు" అంది. "అలాగే! కానీ దానికి బదులుగా నువ్వు నీ అందాన్ని కాస్త త్యాగం చెయ్యవలసి ఉంటుంది" అన్నాడు దేవుడు. "........ చెప్పు. చేస్తావా?"

    ఆమె సంతోషంగా వప్పుకుంటూ ఉండగా కలలోంచి మెలకువ వచ్చింది. ఆమె ఎంత అమాయకమైందంటే- వెంటనే వెళ్ళి అద్దంలో చూసుకుంది.

    విష్ణు, సునాదమాల బస్ లకోసం నిలబడివుండగా వారికి మూడొందల గజాల దూరంలో పేవ్ మెంట్ రెస్టారెంట్ అద్దాల వెనుక కూర్చుని మాట్లాడుకుంటున్నారు విహారీ, పద్మాకర్ లు.

    "నా కారు నీకు ఒక రోజుపాటు కావాలన్నావ్ బాగానే వుంది. కానీ నీకు తెలుసా? తన పక్కస్థానాన్ని స్నేహితుడికి ఇవ్వగలిగినవాడే నిజమయిన స్నేహితుడు. అంతేకాని, తన సీట్లో కూర్చోబెట్టుకునేవాడు కాదు" నిక్కచ్చిగా అన్నాడు విహారి.

    "కారు అడిగినప్పుడల్లా నువ్విదే డైలాగు చెపుతున్నావ్. నీ మాటల్లో ఎంత నిజముందో అని సుబ్బలక్ష్మి దగ్గిర కూడా ఆ సుభాషితం చెప్పాను. చెంప బ్రద్దలు కొట్టింది."

    విహారి అనుమానంగా, "ఏ సుభాషితం?" అన్నాడు.

    "తన పక్క స్థానాన్ని స్నేహితుడికి ఇవ్వగలిగేదే నిజమయిన స్నేహితురాలు."

    "అందులో చెంప బ్రద్దలు కొట్టవలసినంత దారుణం ఏమీ లేదే?"

    "బహుశా 'స్థ' కీ దీర్ఘం ఇవ్వటం మర్చిపోయి వుంటాను."

    విహారి అర్ధం చేసుకునే లోపులో పద్మాకర్ అతడిని మోచేత్తో పొడిచి "అరె అటు చూడు" అన్నాడు.

    "సునాదమాల".

    "వెళ్ళి మాట్లాడదాం పద గురూ!"

    విహారి పెద్ద ఉత్సాహం చూపించలేదు. "మరీ ముద్దపప్పులా ఉంది బ్రదర్. మొన్న చూశాం కదా!" అన్నాడు.

    "అదేం కాదులే. నీ మనసు మరోవైపు లాగుతున్నట్లు తోస్తున్నది" నాటకీయంగా అన్నాడు పద్మాకర్ ఓరగా చూస్తూ. ఒకే రోజు పరిచయమైన ఇద్దరమ్మాయిలూ రెండు వేర్వేరు కోణాల్లో అతడికి ప్రతిమల్లా కనబడుతున్నారు.

    దూరం నుంచి ఆ అమ్మాయి నిజంగానే లేలేత ఎండలో పోత పోసిన విగ్రహంలా వుంది. విహారి అటే చూస్తూ వుండటం గమనించి, పద్మాకర్, "ప్రతీవాడు తన ప్రియురాలికి కాసిన్ని తెలివితేటలు, చురుకుదనం వుండాలని కోరుకుంటాడు గురూ. కానీ అవి లేకపోవటం డిస్ క్వాలిఫికేషన్ కాదు. ఆ మాటకొస్తే "సిగ్గే సింగారం" అన్నారు పెద్దలు, ఇలాటివాళ్ళే ఒంటరిగా వున్నప్పుడు తెగ మాటకారులై శృంగారంలో రెచ్చిపోతారు."

    విహారి వినలేదు. అతడి ఆలోచనలు ప్రవల్లిక వేపే ఉన్నాయి. సునాదతో పోల్చుకుంటే అంత అందమైనది కాదు. కానీ ఏదో తెలియని ఠీవి హుందాతనం ఆమెలో ఉన్నాయి. అతడి మనసు డోలాయమానమైన స్థితిలో వుంది.

    వాళ్ళిద్దరూ చూస్తూ వుండగానే బస్సు వచ్చింది. సునాదమాల వెళ్ళిపోయింది విష్ణుకి జాగ్రత్తలు చెప్తూ.... సాధారణంగా ఆమె విష్ణుని ఎక్కించే వరకూ వెళ్ళదు. కానీ అదే వీధిలో తెలిసిన ఒకావిడ, తన కొడుకుని కూడా స్కూల్ బస్ కోసం తీసుకురావటంతో కాలేజీకి ఆలస్యమై పోతోందని వెళ్ళిపోయింది.

    "హాయ్ వినీల్" అన్నాడు విష్ణు.

    "హల్లో" అన్నాడు వినీల్. వాడి కళ్ళజోడు మేధావితనాన్ని సూచిస్తోంది. వాళ్ళమ్మ విష్ణుతో "సాయంత్రం మా ఇంటికి రా బాబూ. వినీల్ బర్త్ డే" అంది.

    "తప్పకుండా ఆంటీ" అని వాడివేపు తిరిగి "నిన్న చెప్పాలేదేంరా వినీల్" అన్నాడు. విష్ణు వాళ్ళ క్లాస్ లీడర్. అందరికన్నా రెండంగుళాలు పొడవు ఎక్కువ. వినీల్ వాడికి పూర్తి వ్యతిరేకి. పొట్టి, సిగ్గు, క్లాసులో ఫస్టు.

    "చాక్లెట్లు యిస్తూ ఈ రోజు చెపుదామనుకున్నాను" అన్నాడు సన్నగా. అంతలో స్కూల్ బస్సు వచ్చింది. స్కూల్లో పంచటంకోసం చాక్లెట్ల సంచి పట్టుకుని వినీల్ బస్ ఎక్కాడు. వెనుక విష్ణు ఎక్కి "రైట్" అన్నాడు. ఈ లోపులో విహారి పద్మాకర్ లు టీ డబ్బులిచ్చేసి కారు దగ్గరకు వచ్చారు.

    వినీల్ తల్లి కిటికీ అవతల్నుంచి పార్టీకి రమ్మని విష్ణుకి మరోసారి గుర్తుచేస్తూ వుండగా బస్ కదిలింది. అదే సమయానికి పద్మాకర్, విహారి వున్న కారు బస్ వెనక్కి వచ్చింది. కొంచెం దూరం ప్రయాణం చేశాక బస్ ముందు ఆగడంతో విహారి విసుగ్గా కిటికీలోంచి తల బయటకు పెట్టి చూశాడు.

    ముందు బస్ ను ఎవరో బ్రేక్ ఇన్ స్పెక్టర్ ఆపుచేసి లోపలకు ప్రవేశిస్తున్నాడు. విహారి కారు పక్కకు తీసి, బస్ ను దాటి ముందుకు పోనిచ్చాడు.

    అతడు గానీ, పద్మాకర్ గానీ తల తిప్పి బస్ లోకి చూసి వుంటే ఈ కథ మరోరకంగా మలుపు తిరిగేది.

    బస్ లోకి బ్రేక్ ఇన్ స్పెక్టర్ లా ప్రవేశించినవాడు డ్రైవర్ దగ్గరికి వెళ్ళగా, వాడి అసిస్టెంట్ కండక్టర్ దగ్గర నిలబడ్డాడు. ఇద్దరూ ఎంతో ట్రెయినింగ్ పొందిన ప్రొఫెషనలిస్టుల్లాగా ఒకేసారి డ్రైవర్, కండక్టర్ ల మధ్య దాడి జరిపారు. అరక్షణంలో జరిగిపోయింది. డ్రైవర్ ని పక్కకి తోసేసి ఒకడు డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. పిల్లలు చేసే హాహాకారాలు ఆ బస్ చప్పుళ్ళలో వినపడలేదు. బస్ వేగంగా కదిలి క్షణాల్లో అక్కడనుంచి అదృశ్యమైంది.


                                                         *    *    *


    "ఒరేయ్ దిగరా కారు" సడెన్ గా ఆపుచేసి విహారి అన్నాడు.

    "ఇది అన్యాయం గురూ, పక్క స్థానాన్ని స్నేహితుడికి ఇచ్చే వాడే నిజమైన స్నేహితుడు అన్నావు. ఇప్పుడు అమ్మాయి కనబడగానే కారు దిగమంటున్నావు."

    "స్నేహితురాలు కనపడేవరకే స్నేహితుడికి పక్క స్థానం. ఆ తర్వాత మూడో స్థానం" దూరంగా నడుస్తూ వెళుతున్న ప్రవల్లికను చూస్తూ అన్నాడు విహారి.

    "కరెక్ట్! మూడో స్థానాన్నే ఇవ్వు. అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టు కుందాం."

    "నోర్ముయ్, దిగుతావా లేదా......" అని వాడిని బలవంతంగా దింపేసి, ప్రవల్లిక దగ్గరకు స్లోగా నడుపుకుంటూ వెళ్ళి "హల్లో" అన్నాడు. ఏదో ఆలోచిస్తున్న ఆమె తెప్పరిల్లి "హల్లో... మీరా" అంది.

    "రండి డ్రాప్ చేస్తాను" అప్పుడే కనపడినట్లు అన్నాడు.

    ఆమె వచ్చి కారులో కూర్చుంది- ఇంటికి దారి చెపుతూ.

    "మీ కారేమయింది?"

    "కారు లేకుండా వెళ్ళాల్సిన పని ఒకటి తగిలింది!" అంతకన్నా, వివరాలు చెప్పటం ఇష్టం లేనట్లు ఆమె, ఆర్దోక్తిలో ఆపుచేసింది. అది గ్రహించి అతడు మాట మార్చాడు. "మొన్న ఆగిపోయిన నాటకం మళ్ళీ ఎల్లుండి వుంది. మీరొస్తారా?"

    "ఆఖరి పోరాటం కదూ!"

    "అవును".

    "ఏమిటి థీమ్-"

    "తరతరాల బీదరికాన్ని మరింత క్లిష్టం చేస్తూ, ఒక బూర్జువా భూకామందు చేసే దురాగత చర్యలకు పీడిత ప్రజానీకం చేసే తిరుగుబాటు ఆఖరిపోరాటం..." ఉత్తేజితుడై చెప్పాడు విహారి.

    "దానికి మీరు నిర్దేశకులా? మంత్రిగారి వేషం కూడా వేసినట్లున్నారు?

    "అవును".

    "ఏం చేస్తూ వుంటారు మీరు?"

    విహారి వెంటనే జవాబు చెప్పకుండా ఆగిపోయాడు. చెప్పటానికి ఏమీలేదు.

    "మీ తల్లిదండ్రులు బాగా ఆస్థిపరులనుకుంటాను"

    "నాకు తండ్రి లేడు. తల్లి వుంది. మా తాతగారి తరపు ఆస్థి వచ్చింది- తాతగారంటే మా తల్లిగారి తండ్రిగారు." చెప్పాడేగాని ఆమె దేనిని గమ్యంగా పెట్టుకుని అడుగుతుందో అర్ధమైనట్టు అతడి స్వరంలో అదోలాటి సందిగ్ధత ధ్వనించింది. అతడేమీ తెలివిహీనుడుకాదు అర్ధంచేసుకోలేకపోవటానికి.

    ఆమె తలతిప్పి అతడివేపు చూసింది. ప్రొద్దున్నపూట ఎండ అతడి మొహం మీద అట్నుంచి పడుతూంది. కొనదేలిన ముక్కు ఎంతో అందంగా సిల్ హౌంట్ లో లాగా కనబడుతుంది. అతడు డ్రైవ్ చేస్తూ క్రింది పెదవిని బిగించిన విధానం అదో రకమైన పట్టుదలని సూచిస్తూంది.

    ఆమె అన్నది- "నాకు నాటకాల గురించి తెలీదు. కాని ప్రైజు వచ్చినప్పుడు లేక నాటకం బావున్నప్పుడూ ప్రేక్షకులు కొట్టే చప్పట్లు బాగా స్ఫూర్తినిస్తాయనుకుంటాను."

    "అవును. ఆ చప్పట్లతో మేము పడిన కష్టమంతా పోయినట్టు అనిపిస్తుంది. 'అవిగో, వినరా చప్పట్లు, ఆ చప్పట్లే కదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష్య పరమాన్నాలు' అన్నాడొక రచయిత" ఉత్సాహంగా చెప్పాడు విహారి. అంత అందమైన అమ్మాయి, అంత పెద్ద పొజిషన్ లో వున్న ఆఫీసర్ తను కృషి చేస్తున్న రంగాన్ని మెచ్చుకోవటం అతడికి చాలా ఉత్సాహాన్నిచ్చింది.

    "మా నాన్నగారికి రాష్ట్రపతి పరమ వీర చక్ర మెడల్ తగిలిస్తున్నప్పుడు కూడా ఇలాటి చప్పట్లే..... అన్నట్లు మీరేం చేస్తూ ఉంటారో చెప్పలేదు. సాయంత్రం పూట సరే- ప్రొద్దున్నించీ సాయంత్రం వరకూ?"

    "కొంతకాలం ఒక ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా చేసి మానేశాను. ఉద్యోగానికీ- నాకూ సరిపోదనిపించింది."

    ఆమె నవ్వి- "వాళ్ళిచ్చే జీతం మీ ఒకరోజు ఖర్చుకి సరిపోయివుండదు బహుశా" అంది. అది నిజమే. కానీ, అతడు నవ్వలేదు. 'బూర్జువాల' మీద పోరాటం అని ఎందుకు అన్నానా అనుకోసాగాడు. అతడి మనసులో ఏ మూలో అతనిపట్ల అతడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు ఉండి వుండవచ్చు. ఆమె సంభాషణ అతనిలో లోపలి భావాల్ని భూతద్దంలో చూపిస్తున్నది. అంతర్ మధనం ఎప్పుడు ప్రారంభం అవుతుందో అప్పుడు అది ఎదుగుదలవేపు దారి తీస్తుంది. దానికి పెద్ద సంఘటనలు, కారణాలు అవసరం లేదు. తనని తాను చూసుకోవటానికి ఆమె అద్దంలా కనపడింది. తన ట్రూపులో సగంమందికి పైగా రకరకాల ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. దాదాపు అందరూ లంచాలు పడతారు. వేసేది మాత్రం ఆఖరిపోరాటం టైపు నాటకాలు. ఈ సత్యం అతడికి అర్ధంకాలేదు. అంత తొందరగా జీర్ణంకాదు.

    ఆమెవైపు మరోసారి చూశాడు. గాలికి ఆమె ముంగురులు ఎగురుతున్నాయి. మామూలుగా ఏ సినిమా హాల్లోనో, బజారులోనో కనపడితే అలాటి అమ్మాయి గురించి పెద్దగా పట్టించుకునే వాడు కాదు కానీ, చాలా తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని స్పురించేటట్టు ఆమె మాట్లాడే మాటలు, చివరికి ఆమె కూర్చున్న పొజిషన్ లో వున్న ఠీవి అతడిని అదోరకమైన సంభ్రమంలో పడేసినాయి.

    అతడు ఉన్నట్టుండి మౌనం వహించటం చూసి తనేమన్నా తప్పుగా మాట్లాడిందేమో అని ఆమె అనుకుంది. కారు వేగంగా పోతూంది.

    "మీకు జీతమెంత వస్తుంది?" ఆలోచన్లలోనే అడిగాడు.

    ఆమె నవ్వింది- "ఆడవాళ్ళని జీతం అడక్కూడదనలేదు కాబట్టి చెప్పొచ్చు... కట్స్ పోను రెండు వేలు."

    'అంతేనా' అనబోయి, నోటి చివరివరకూ వచ్చిన మాటని ఆపుకున్నాడు. ఆ మాట బయటకు వచ్చి వుంటే బహుశా జీవితాంతం బాధపడి వుండేవాడేమో...... రెండువేలు!! ప్రాణాలకు తెగించి బుల్లెట్స్ మధ్య ఆమె పరుగెత్తిన వైనం గుర్తొచ్చింది. కేవలం రెండువేల జీతం కోసం! స్టార్ హోటల్లో తన ఫ్రెండ్స్ తో ఒక సాయంత్రానికి అయ్యే ఖర్చు!! బూర్జువాలమీద ఆఖరి పోరాటం నాటకం సక్సెస్ అయితే తాము స్టార్ హోటల్ లో పెట్టే ఒక సాయంత్రం ఖర్చు!!!

    "ఎందుకు అడిగారో నా జీతాన్ని?" నవ్వుతూనే ప్రశ్నించింది.

    "మీరేం చెయ్యవలసి వుంటుంది?"

 Previous Page Next Page