Previous Page Next Page 
నిశ్శబ్దం-నీకూ-నాకూ మధ్య పేజి 9


    ".....మీలో హేమమాలినికన్నా జయమాలినిని మెచ్చుకునే గుణం కనిపిస్తూంది అంటే మీలో ఎపిఫేన్ మెసలిజం వుందన్న మాట. మీకు చీరెతోనూ బాహ్యాలంకారాల్తోనూ సంబంధం లేదు. అది హెట్రో సెక్స్ వల్ డిప్రవ్రైజేషన్ ని సూచిస్తుంది. ఒక ప్రొఫెసర్ గా మీకు బిహేవియర్ మోడిఫికేషన్ ని సూచిస్తాను. దాన్నే ఇంకోలా చెప్పాలంటే డిజర్వేషన్ ఆఫ్ ఫియర్ అనొచ్చు. ఓ అమ్మాయిని ఎదురుగా వూహించుకోండి. మీ ముందు గాజులూ, పసుపూ పెట్టుకోండి. మాట్లాడండి. మాట్లాడుతూ పొండి. మీ కాంప్లెక్స్ తగ్గిపోతుంది. మీ పారనాయిడ్ మనస్తత్వాన్ని తగ్గించుకోవాలి. దీనికి రెండు ప్రిస్క్రిప్షన్లున్నాయి. ఒకటి శీర్షాసనం వెయ్యటం, రెండు తెలుగు పిక్చర్లు చూడటం. జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు చెయ్యవలసిన పనులవి. మీకు కృష్ణశాస్త్రీ, బీటిల్సూ ఇష్టమన్నారు. అది "ఇన్ డిటిర్మినిజం".... అంటే తెలుగులో మానసిక అనిశ్చయత్వాన్ని సూచిస్తుంది. మీకు సితారు మీద "లేలేలే నా రాజా" వాయించాలనిపిస్తే అదే స్ల్పిట్ పర్సనాలిటీ. నా ఉద్దేశ్యం మీరు వైజాగ్ వెళ్ళేముందు ఒక భూత వైద్యుణ్ణి కూడా సంప్రదిస్తే మంచిదని! మీ యీ పర్యస్త హేతువాదంతో కూడిన అతివాస్తవికతా సంశ్లేషణాత్మక అనుభవ నిరపేక్ష వ్యవస్థాత్మక చైతన్యం పోవాలంటే...." 

    చప్పున మాటలు ఆగేసరికి శంభు తలెత్తి చూశాడు,

    ఎదుటి ప్రొఫెసర్ గుమ్మంవిపు చూడటం చూసి అటు తిరిగాడు. గుమ్మం దగ్గర ఇద్దరు తెల్లబట్టల్లో, టోపీ పెట్టుకుని వున్నారు.

    వాళ్ళని చూడగానే ప్రొఫెసర్ కుర్చీలోంచి బల్లమీదుగా ముందుకు దూకి శంభు కూర్చున్న కుర్చీ కిందుగా దూరి, టేబిల్ వెనక్కి చేరుకున్నాడు. అక్కణ్ణుంచి పిల్లిలా మొహం బైటకి పెట్టి "హ హ హ" అని వెక్కిరించాడు.

    ఇద్దరూ లోపలికి వచ్చి చెరోవైపూ ప్రొఫెసర్ ని పట్టుకుని బయటకి లాగారు. ప్రొఫెసర్ గింజుకోకుండా "పోదామా" అన్నాడు పట్టుబడిన ఖైదీలా.

    అప్పటివరకూ స్థాణువై చూస్తున్న మిత్ర కదిలి "ఏమిటి- ఏమిటిది" అన్నాడు కంగారుగా.

    "వైజాగ్ ఆస్పత్రినుంచి తప్పించుకు వచ్చాడు సార్" అన్నాడు వాళ్ళల్లో ఒకడు.

    జరిగిందంతా సమన్వయించుకుంటే మిత్రకి ఏదో అర్ధమయింది. "నాతో మెంటల్ హాస్పిటల్ మీ అడ్రసన్నారు" అన్నాడు ప్రొఫెసర్ వైపు తిరిగి.

    "అక్కడ పనిచేస్తున్నాను అనలేదుగా" అన్నాడు ప్రొఫెసర్.

    బిక్కమొహం వేసుకుని నిలబడ్డ మిత్రని చూస్తే వాళ్ళలో ఒకడికి జాలేసింది. "మానసిక వ్యాధులమీద రీసెర్చి చేసి చేసి ఎంతకీ డాక్టరేట్ రాక ఈయన ఇలా అయిపోయాడు సర్. అయితే వైజాగ్ నుంచి ఈ ఊరు ఎలా వచ్చేశాడో, ట్రైన్ టిక్కెట్ డబ్బు లెవరిచ్చి తీసుకువచ్చారో మాత్రం మాకు అర్ధం కావటంలేదు" అన్నాడు.

    మిత్ర తేలుకుట్టిన దొంగలా వుండిపోయాడు. ఇద్దరూ ప్రొఫెసర్ ని పట్టుకుని పిచ్చాసుపత్రి వాళ్ళ వాన్ లో ఎక్కించారు.

    మొహంలో ఏ భావమూలేని కుర్రవాడు అలానే నిలబడ్డాడు.

    వాన్ ఎక్కబోతూ ప్రొఫెసర్ మిత్రని చూసి- "నా మాటలు గుర్తుపెట్టుకో, హెట్రో సెక్సువల్ డిప్రవైజేషన్ పోవాలంటే అమ్మాయిని వూహించుకుని మాట్లాడు. టేప్ రికార్డరు పెట్టి ఆ మాటలు నాకు పంపు. అడ్రసు తెలుసుగా, ప్రొఫెసర్ వరాహన్. జేరాఫ్ మెంటల్ హాస్పిటల్, వైజాగ్...."

    మాటల్ని వినటంలేదు శంభు. టేప్ రికార్డరు అనగానే తన ఇల్లు జ్ఞాపకం వచ్చింది.

    ఈ పాటికి ఆ అమ్మాయి వెళ్లిపోయి వుంటుంది. చంద్రం తనకోసం ఎదురుచూస్తూ వుంటాడు. అన్నింటికన్నా ముఖ్యంగా.....

    మాటలు రికార్డయి వుంటాయి.


                               5


    శంభు వచ్చేసరికి చంద్రం సిగరెట్ కాలుస్తూ తీరిగ్గా కూర్చుని వున్నాడు.

    "ఆలస్యం అయిందేం?"

    "చెబితే సిగ్గుచేటు, చెప్పలేను."

    చంద్రం లేచి 'వెళ్ళొస్తాను' అన్నాడు.

    మిత్ర మొహంలో ఏ ఎక్స్ ప్రెషనూ లేకుండా 'మంచిది' అన్నాడు. నిజానికి అతని మనసు టేప్ రికార్డర్ మీదే వుంది. శబ్దం వినిపించడం లేదు. ఆగిపోయి వుంది. టేప్ అంతా అయిపోయి ఆగిపోయిందన్నమాట. ఏం మాట్లాడుకొని వుంటారు వీళ్ళు?

    "అదోలా వున్నావేమిటి?" గుమ్మంవరకూ వెళ్ళి ఆగి అన్నాడు చంద్రం.

    శంభు తడబడి, "ఏం? ఎలా వున్నాను?" అన్నాడు.

    "అదోలా-"

    "బానే వున్నాను."

    "సరే అయితే. వెళ్ళొస్తాను. గుడ్ నైట్."

    ..............

    అతడింత తొందరగా వెళ్ళిపోవటం రిలీఫ్ గా వుంది.

    అతను వెళ్ళగానే తలుపు వేసేడు. క్షణంపాటూ అక్కడే నిలబడి గుండెల్నిండా గాలి పీల్చుకున్నాడు. గదంతా చూసాడు. టేబుల్ లైట్ వైపుకు చుట్టుకున్న వైరూ, టూత్ పేస్టు డబ్బాలోంచి తొంగి చూస్తున్న నల్లటి మీకూ, గాలికి కదుల్తూన్న పేపరూ.

    శంభుమిత్ర పెదవులపైన అప్రయత్నంగా నవ్వు కదిలింది. మరుసటిరోజు ఈ టేపు వినిపిస్తే చంద్రం మొహంలో మారే రంగులు జ్ఞాపకం వచ్చి మరింత నవ్వొచ్చింది. చాలా కొద్దిసేపట్లో తనని ఇన్నాళ్ళూ వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరకబోతూ వుంది.

    టెన్షన్ ని అతి బలవంతంగా నొక్కి పట్టేడు.

    వంగి టేబుల్ క్రింద నున్న పేపరు కట్టను జరిపి రికార్డరుని రెండు చేతుల్తోనూ పట్టుకుని ఎత్తి బల్లమీద పెట్టేడు. టేపు పూర్తిగా రికార్డయి, ఇవతలి టేపుకి చుట్టుకొని వుంది.

    ఫాన్ తగ్గించి, టేపు ఇవతలివైపుకి తిప్పి, కుర్చీలో కూర్చొని ముందుకు వంగి "ప్లే" నొక్కతోనూ వుంటే ఫోన్ మ్రోగింది.

    "గుడ్ ఈవెనింగ్ పప్పా."

    "మిత్రా?"

    "యస్ పప్పా."

    "హౌ ఆర్యూ?"

    "ఫైన్. థాంక్యూ."

    "రేపొద్దున ఎయిర్ పోర్టు కెళ్ళు కరంజియా తెలుసుగా. ఆయనొస్తున్నాడు కూతుర్తో కలిసి. పేరు స్పందన. మన కార్లో వాళ్ళని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళు. రెండ్రోజులుంటారు వాళ్ళు, మిత్రా-"

    "యస్ పప్పా".

    "ఈ రెండ్రోజుల్లో నీవో డెసిషన్ కి వస్తే" ఆగేడు. "స్పందన నీకు నచ్చితే."

    క్షణం నిశ్శబ్దం.

    "గుడ్ నైట్ సన్."

    "గుడ్ నైట్ పప్పా-"

    'స్పందన-' తిరిగొస్తూ అనుకొన్నాడు. మంచి పేరు.

    తన మొదటి ప్రయత్నం ఈ అమ్మాయితోనే సఫలీకృతం కావాలి. మాట్లాడాలి. కలకత్తాలాంటి మెట్రో పాలిటిన్ సిటీలో పెరిగిన అమ్మాయిని ఊపిరి సలపనివ్వకుండా కబుర్లతో ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి. దానికి తన టేపురికార్డరు ఇప్పుడు సాయం చేస్తుంది. తన స్నేహితుడు చంద్రం సాయం చేస్తాడు. థాంక్యూ చంద్రం.

    టేప్ రికార్డర్ పెట్టబోయేడు.

    తలుపు తెరిచిన చప్పుడు. ఉలిక్కిపడి చూసేడు. హరిదా.

    ఇంక వాడు నిద్రపోయేదాకా కుదర్దు. బల్లమీద సామాన్లన్నీ నేలమీద విసిరికొడ్తామన్నంత కసి.

    "మీకో ఉత్తరం" అని తెచ్చిచ్చేడు హరిదా. విప్పిచూస్తే శంకరాభరణం మామయ్యా. పండక్కి రమ్మని మరోసారి గుర్తు చేస్తూ. అంత మారుమూల పల్లెకి వెళ్లడంకన్నా నరకం ఇంకొకటి వుండదు.

    ఉత్తరం పక్కన పడేసేడు.

    భోజనం చేసి, ఏదో నవల చదువుతూ పదింటివరకూ గడిపేడు. పుస్తకంమీద దృష్టి నిలవలేదు. అంతా టేప్ రికార్డర్ మీదే.

    పది కొడ్తూండంగా, పక్కగదిలోకి వెళ్ళి చూసేడు. హరిదా నిద్రపోతున్నాడు. గురక వినిపిస్తోంది.

    తలుపు దగ్గరగా వేసి తన గదిలోకి వచ్చేడు.

    ఎదురుగా టేపురికార్డర్.

    కూర్చున్నాడు.

    మనసునిండా టెన్షన్.

    బటన్ నొక్కేడు, టేపు నెమ్మదిగా తిరుగుతూంది.

    కొంచెంసేపు నిశ్శబ్దం.

    "చలి పెడ్తూంటే ఫాన్ ఏమిటి?...."

    చంద్రం కంఠం స్పష్టంగా రికార్డయింది. శంభు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.

    "వద్దా" అది తన కంఠం.

    టప్. ఫాన్ ఆపుచేసిన చప్పుడు.

    "వెళ్ళొస్తాను."

    దూరంగా "మిత్రా" అని చంద్రం కంఠం.

    "థాంక్స్ బ్రదర్ అండ్ సారీ ఆల్సో" అంటున్నాడు చంద్రం.

    "నో నో-" నిశ్శబ్దం. "బెస్ట్ ఆఫ్ లక్" దూరంగా వెళ్ళిపోతూ తన కంఠం.

    తరువాత మళ్ళీ నిశ్శబ్దం.

    ఒకటి రెండు నిముషాలు.

    నెర్వెస్ నెస్ తో కూడిన టెన్షన్ తో శంభు నుదుటిమీద చెమట పట్టింది. అంతలో మైకు దగ్గరగా వస్తున్నప్పుడు కుర్చీలో నిటారుగా అయ్యాడు.

    "దబ్.... దబ్.... దబ్.... ద్ ద్ బ్బ్"

    శంభు ఊపిరి బిగబట్టాడు.

    చంద్రం మైకు దగ్గరగా నిలబడి పుస్తకాలు సర్దుతున్నాడు. టూత్ పేస్టు డబ్బా దూరంగా జరిగినట్టుంది.

    బ్రూ వూ వూ వూ వూ వూ వూ బ్బ్.

    వీడికీ ఈ అల్మారా దగ్గర ఏం పని?..... అయినా ఆ అమ్మాయి రాదేం.... తను వీధి మలుపు తిరిగేసరికి లోపలికి వస్తూ కనబడింది. అంటే రెండు నిముషాలు ఇంకా అవలేదా?

    ష్ ష్యూ ష్యూ ....ష్ షూ.

    వెధవ విజిలూ వీడూనూ.

 Previous Page Next Page