అతను చెప్పటం ఆపుచేసేడు. తలవంచుకొని వున్నాడు. మోకాళ్ళమధ్య చేతులు పెట్టుకొని స్థబ్దంగా వున్నాడు. ఒక చెంప మీద నీడ పడ్తూంది.
గదంతా నిశ్శబ్దంగా వుంది. దాన్ని పారద్రోలుతూ డాక్టర్ అన్నాడు. "మీకున్న వ్యాధి నింఫొ ఫోబియో కాదు."
"కాదా" ఆశగా అడిగాడు.
"కాదు, నింఫొ ఫోబియో వున్నవాళ్ళు ఏ ఆడపిల్లతోను, కనీసం పసిపిల్లలతో కూడా మాట్లాడలేరు. 'నా గదిలో ఈ రోజు వూడ్చొద్దు' అని మీరు మీ పనిమనిషితో చెప్పగలరు. అది మీ ధైర్యాన్ని సూచిస్తూంది" మెచ్చుకోలుగా అన్నాడు.
శంభు మనసులోని భారం తొలగినట్టయింది. కుర్చీ వెనక్కివాలి, తేలిగ్గా వూపిరి వదుల్తూ "థాంక్యూ ప్రొఫెసర్" అన్నాడు.
"అయితే మీకున్న సమస్య....అంటే అదే.... మీరింకో వ్యాధితో బాధపడుతున్నారేమోనని నా ఉద్దేశ్యం".
"ఏమిటది" సంశయిస్తూ అడిగాడు శంభు.
"ఇన్ ఫరటైల్ కాంప్లెక్స్ - రిగ్రెస్డు విత్ సెక్సువల్ డిఫ్రైషన్ అండ్ ఈక్ వల్ ఫిక్సేషన్."
"మంచినీళ్ళు" అన్నాడు శంభుమిత్ర.
మొహంలో ఏ భావంలేని కుర్రవాడు నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. అది తాగి "మళ్ళీ చెప్పండి" అన్నాడు.
ప్రొఫెసర్ మళ్ళీ చెప్పాడు.
"తప్పకుండా ఇది నింఫొ ఫోబియో కన్నా ఐదురెట్లు పెద్ద వ్యాధి అయి వుంటుంది."
"కాదు తొమ్మిది WORDS. తొమ్మిది పదాలు కదా! అన్నిరెట్లు పెద్దది."
మిత్ర మొహం వాడిపోయింది. "ఎలా మరి" అన్నాడు.
"ఆ కాంప్లెక్స్ పోవాలంటే ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులు సేకరించండి. పూలూ, గాజులు, కాటుక.... వీటిని మీ రూంలో వుంచుకోండి. అది తగ్గిపోతుంది.
"అంతేనా? అంత సులభమా?" అన్నాడు మిత్ర.
ప్రొఫెసర్ గంభీరంగా "డాక్టర్ ట్రీట్ మెంటుకీ సైకియాట్రిస్టు ట్రీట్ మెంటుకీ తేడా అదే" అన్నాడు.
"థాంక్స్" అన్నాడు మిత్ర.
"మీ హాబీస్ ఏమిటి" టాపిక్ మారుస్తూ అడిగాడు.
"ఆఫీసూ, సితారూ"
"ఖాళీగా వున్నప్పుడు ఏం చేస్తారు?"
"ఆలోచిస్తాను."
"దేని గురించి?"
"వాటికి అర్ధం వుండదు. అసలు ఆ వాక్యాలకు ఒక రూపు వుండదు."
"ఉదాహరణకి."
"కంజాతం అంజాతంలా మంజీరాన్ని భంజిస్తూంది అని నాలో నేనే అనుకుంటాను. దానికో అర్ధంపర్ధం వుండదు."
"రిపీటోమానియా" అన్నాడు ప్రొఫెసర్. "చెప్పండి. మీకు నిద్రలో కలలొస్తాయా?"
"అప్పుడప్పుడు."
"ఎప్పుడెప్పుడు రావు?"
"మందుకొట్టి శుభ్రంగా నిద్రపోయినప్పుడు."
"వచ్చినప్పుడు ఎలాంటి కలలొస్తాయి."
"చాలా విచిత్రమైన కలలు. ఒక అమ్మాయి భరతనాట్యం చేస్తూ వుంటుంది- బెల్ బాటమ్ వేసుకొని."
"ఇంకా" ముందుకు వంగి ఆసక్తికరంగా అడిగాడు.
"పదిమంది అబ్బాయిలా, అమ్మాయిలూ నన్ను విచిత్రంగా చూస్తూ వుంటారు. నేను ఫుల్ సూటులో వుంటాను."
"అది చిత్రమైన కల కాదే."
"వాళ్ళంతా నగ్నంగా వుంటారు."
"స్కిజోఫ్రెనిక్" అన్నాడు డాక్టర్ నశ్యం పీలుస్తూ. "అంటే స్ల్పిట్ పెర్సనాలిటి రెండుగా వుండాలనుకోవటం. బెల్ బాటమ్; భరతనాట్యం. నిశ్చయంగా మీరు స్కిజో ఫ్రెనిక్కే."
శంభుకి తన మీద తనకే జాలేసింది. "పాపం నేను" అనుకున్నాడు.
"మిస్టర్ మిత్రా" ప్రొఫెసర్ వరాహన్ గంభీరంగా అన్నాడు- "మీకు ఊహ తెలుస్తున్న వయసులో ఆడవాళ్ళెవరైనా మీ మీదపడి ఉక్కిరిబిక్కిరి చేసారా? ముద్దు పెట్టుకున్నారా?"
మిత్ర తెల్లమొహం వేసి "లేదు" అన్నాడు.
"ఆలోచించండి. ఆ చర్య మీలో అంతర్గతంగా ఒక విధమైన భయాన్ని కలుగజేసి వుండవచ్చును. అదే ఫోబియా."
అయినా లేదన్నాడు శంభు.
"వెనకనుంచీ మీదపడటంగానీ, బుగ్గలు కొరకటంగానీ, స్త్రీ అంటే భయంపుట్టే చర్య."
"లేదు."
"ఆలోచించకుండా లేదనేస్తావేం?" గద్దించాడు. అప్పటికప్పుడే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయి చూశాడు మిత్ర. "ఆలోచించు" అన్నాడు ప్రొఫెసర్.
బిక్కమొహం వేసుకుని చాలాసేపు ఆలోచించేడు శంభు. లేదంటే చంపేసేటట్టు వున్నాడీ ప్రొఫెసర్. ఎందుకిక్కడికి వచ్చేంరా బాబూ అనుకున్నాడు. వరాహన్ అతన్నే సూటిగా చూస్తున్నాడు. ఏదో జ్ఞాపకం వచ్చి మిత్రా మెదడులో తళుక్కున మెరిసినట్లయింది.
వికసించిన మొహంతో "ముద్దు పెట్టుకోవటమేగా" అన్నాడు.
డాక్టర్ ఆత్రంగా "యస్" అన్నాడు.
"తెలిసీ తెలియని వయసులో-"
"అదే .... అదే.... ఆ వయసులోనే-" ముందుకు వంగి కుతూహలంగా అన్నాడు డాక్టర్ "అడాల్ సెన్స్ లో"
"ఉక్కిరి బిక్కిరి చెయ్యటం...." సాలోచనగా అన్నాడు మిత్ర.
ఇక ఆగలేక ఆత్రంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ కుర్చీలోంచి లేచి "అవును అలాగే! ఎవరన్నా చేశారా?" అని దాదాపు అరిచాడు ప్రొఫెసర్.
"ఆఁ అలాగే ముద్దు పెట్టుకునేది."
"ఎవరు"
"మా అమ్మ"
అయిదు నిమిషాలపాటు ఘోరమైన నిశ్శబ్దం ఆ గదిలో పేరుకుంది. రెండు చేతుల్తోనూ తల పట్టుకుని కూర్చున్నాడు ప్రొఫెసర్.
"మంచినీళ్ళు" అన్నాడు శంభు.
మొహంలో ఏ భావములేని కుర్రవాడు నీళ్ళు తీసుకొచ్చి ఈసారి ప్రొఫెసర్ కిచ్చాడు.
"ఇంక ఈ టాపిక్ వదిలివేద్దాం" జాలిగా చూస్తూ అన్నాడు మిత్ర.
"నో" అన్నాడు ప్రొఫెసర్. "దీని అంతు తేల్చనిదే నేనూరుకోను" అని కుర్రవాడివైపు తిరిగి "నువ్వు తలుపువేసి బైట నిలబడు" అని ఆర్డరిచ్చాడు.
మిత్రకి భయం వేసింది. ప్రాణాలు బిగపట్టుకుని కూర్చొన్నాడు. మొహంలో ఏ భావమూ లేని కుర్రవాడు వెళ్ళిపోయాక-
"మీకెప్పుడన్నా మెలంఖలీ.... అంటే వున్నట్టుండి డిప్రెస్ అయినట్టూ అనిపిస్తూ వుంటుందా?" అని అడిగాడు.
"ఉండదు. కానీ ఒంటరితనం. నాకెవరూలేరన్న భావం కలుగుతూ వుంటుంది."
"మీ వంటవాడు ఇంట్లో లేనప్పుడా?" అని మళ్ళీ "వంటవాడు మగవాడు కదూ" అని తనలో తానే సరిదిద్దుకొంటున్నట్టూ అన్నాడు.
మిత్రకి మొట్టమొదటిసారి ఈ మానసిక వ్యాధుల్ని నయం చేసే డాక్టర్ మానసిక స్థితిమీద అనుమానం కలిగింది.
"మీ సంభాషణలో సాధారణంగా మీకు అద్భుతం, అమోఘం, విపరీతం లాంటి పదాలు వాడతారా?" ఆడియో టెస్టు మొదలు పెట్టేడు.
"వాడను."
"అంత ఘంటాపదంగా ఎలా చెప్పగలరు?"
"నేనెప్పుడూ ఇంగ్లీషులో మాట్లాడతాను కాబట్టి."
దాన్ని ఒప్పుకున్నట్లు డాక్టర్ తల పంకించేడు.
"మీ కిష్టమైన పాటలు మూడు భాషల్లో ఏమిటి?" అడిగాడు - మోడోఫాస్టు టెస్టు.
హిందీలో ముఖేష్ ది "సారంగ తేరీ యాద్ మె", తెలుగులో కృష్ణశాస్త్రి "వేయబోవని తలుపు", ఇంగ్లీషులో "బీటిల్స్ హార్డేస్ నైట్".
"చివరిది గందరగోళంగా వుండదూ"
"మూడ్ ని బట్టి దాన్ని ఇష్టపడతాను."
కొంచెం ఆలోచించి డాక్టర్ అన్నాడు. "ఇప్పుడు మీకు అప్టేవిజుల్ టెస్టు. చెప్పండి. మీరు రోడ్డుమీద వెళుతుంటే తెల్లచీర కట్టుకున్న ఒక అమ్మాయీ, నల్లచీర కట్టుకున్న ఒక అమ్మాయీ కనబడ్డారనుకోండి. ఎవర్ని చూస్తారు?"
శంభు వళ్ళు మండటం మొదలు పెడుతూంది.
"చీరెతో సంబంధంలేదు. ఎవరు అందంగా వుంటే వాళ్ళని" అన్నాడు.
"గుడ్" అన్నాడు డాక్టర్. "మీ స్పెక్ట్రోవిజువల్ కార్డు బాగా పని చేస్తుందన్న మాట. బైదిబై మీ అభిమాన నటి ఎవరు?"
"జయమాలిని" అన్నాడు మరింత వళ్ళు మండి.
"అంటే ధర్మేందర్ తో నటిస్తుంది. ఆమేనా?"
"ఆమె హేమమాలిని."
"ఓహో! మీ ఐక్యూ బాగానే వుంది" మెచ్చుకున్నాడు. జయమాలినికీ ఐక్యూకీ సంబంధం ఏమిటో శంభుకి అర్ధంకాలేదు. ఇక ఇక్కడ వుండి లాభం లేదు. వాచీ చూచుకుని లేవబోతూ వుండగా డాక్టర్ గంభీరంగా మొదలుపెట్టాడు.
"మిస్టర్ మిత్రా! ఇప్పటివరకూ రకరకాల పరీక్షలు జరిపిన పిమ్మట మానసిక స్థితిమీద ఒక థీసిస్ తయారు చెయ్యటానికి అర్ధమైన వ్యక్తిగా మిమ్మల్ని నిర్ణయించాను. వైజాగ్ మెంటల్ హాస్పటల్ కి మీ పేరు సజెస్టు చెయ్యటానికి కూడా నిర్ణయించడం జరిగింది. మీమీద నేనే రిసెర్చి చేస్తాను. ప్రొఫెసర్ వరాహన్, స్కాలర్ ఆఫ్ నట్స్-"
శంభుమిత్ర ఉలిక్కిపడి గుమ్మంవైపు చూశాడు. తలుపులు వేసి వున్నాయి. డాక్టర్ చెప్పుకుపోతూ వున్నాడు.