.... అంతలో అడుగుల చప్పుడు. "హాయ్ చంద్రం" అమ్మాయి కంఠం. అమ్మయ్య వచ్చేసింది.
'హాయ్' చంద్రం మైకుకి దగ్గరగా మైకు కదుపుతున్న చప్పుడు బ్రుబ బ్రుబ్.
"ఏమిటి వ్రాస్తున్నారు?" అమ్మాయి.
"ఒక క్షణం."
"నన్ను రమ్మన్నది ఇలా వ్రాస్తూ కూర్చోవటానికా?"
"ఒకే సెంటెన్సు, తరువాత గంటసేపు హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు."
ఏం చెబుతావురా ఇడియట్ గంటసేపు కబుర్లు? చెప్పు చెప్పు.
అయిపోయింది.
చంద్రం కదిలిన చప్పుడు. మైకులు చాలా బాగా పనిచేస్తున్నాయి. చిన్న శబ్దం కూడా స్పష్టంగా రికార్డు చేస్తున్నాయి.
"ట్లిక్."
"ఇప్పుడా రేడియో ఎందుకు?"
"ఓహో' అనుకున్నాడు శంభు.
రేడియో మైకు పక్కనే వుంది.
మ్యుమ్. మ్యుమ్. మ్యుమ్. వ్యుక్.....ష్యు ష్యు.
శంభు జుట్టు పీక్కున్నాడు కసిగా.
"....శవాణి" రేడియో.
"ఇలా కూర్చో" చంద్రం.
'మీరు కోరిన- ఊఁ చెప్పు' రేడియో, చంద్రం.
"....పాటలు. మొదట. ఏమిటి కబుర్లు. గా మహదేవన్ ఏం చెప్పను. సంగీత సారధ్యంలో. ఇదేమిటి నీకూ మా శంభు అలవాటొచ్చింది. చిత్రం అడవిరాముడు. నువ్వు చెప్పు. టింగ్ టింగ్ టింగ్ టింగ్ టింగ్ - ఆరేసుకోబోయి, రూం బావుంది. పారేసుకున్నాను. మరి మా శంభు టేస్టంటే హరి అలా కోకెత్తుగే వుంటుంది. కెళ్ళింది కొండగాలి.... అందుకే ఇక నిన్ను ఆపైన ఇక్కడికి నీ చూపు తీ లే చసులీకొ చలీ చలీ" సుశీల గొంతూ, చంద్రం గొంతూ అక్షరంకి అక్షరం కలసిపోయి డ్యూయెట్ పాడుతున్నాయి. వింటూ జుట్టు పీక్కోసాగాడు మిత్ర.
తరువాత 'టప్' మన్న చప్పుడు.
శంభు ఉలిక్కిపడ్డాడు.
కరెంటు పోయిందా?
టేప్ తిరుగుతూనే వుంది.
రేడియో చప్పుడు కూడా వినిపించటం లేదు. మళ్లీ టప్ మన్న చప్పుడు.
"వెళ్ళొస్తాను" అమ్మాయి కంఠం.
"థాంక్స్"
"ఆ మాట నేను చెప్పాలి."
"ఎందుకు?" చంద్రం కంఠంలో ఆశ్చర్యం.
"జీవితంలో మర్చిపోలేని అనుభవం- గంటలో పొందుపరచి ఇచ్చినందుకు. ఈ గంటలో నువ్వు చూపించిన ఆత్మీయతా, ప్రేమా, ముఖ్యంగా మాటలు...."
ఓర్నీ. గంటా అయిపోయిందా. మరి మరి ఈ రికార్డరు?
"నిన్ను రిక్షా ఎక్కించి వస్తాను. ఒక్క నిమిషం."
"ఆ కాగితం ఏమిటి?"
"ఇదిగో ఈ వాక్యం చదివేసి వస్తాను."
"చదవటం ఏమిటి?"
"చెప్తాగా."
"దుకా దిఇం ర్గమా కినిటావకోల్సుతె దినేఅ రుటాంకు డుట్లామా యిబ్బాఅ యిమ్మాఅ"
"ఏమిటి లాటీనా? గ్రీకా?" అమ్మాయి నవ్వుతూంది.
"తెలుగే"
"నాకర్ధం కాలేదు."
"అర్ధం అయ్యేవాళ్ళకు అర్ధం అవుతుందిలే."
నిశ్శబ్దం.
శంభు కుర్చీకి అలానే చాలాసేపు కూర్చుండిపోయాడు. అర్ధంకావటంలేదు.
'దుకా దిఇం ర్గమా' అంటే....
అయిదు నిమిషాలు ఆలోచించాక ఏదో తట్టినట్టు అయింది. కాగితం తీసుకుని, ఆ వాక్యం వింటూ, పెన్సిల్ తో వ్రాశాడు. ఒకసారి దానివైపు చూసి, వెనుకనుంచి చదివాడు.
అతడి మొహం తెల్లగా పాలిపోయింది.
వెన్నెల పిండారబోసినట్టు వుంది.
మేడమీద ఒంటరిగా నిలబడ్డాడు అతడు. పట్టణం చీకటి ఒడిలో విశ్రాంతి తీసుకుంటుంది. రోడ్డు మత్తుగా నిద్రపోతూ వుంది.
అతనలాగే నిశ్చలంగా అచేతనంగా నిలబడి వున్నాడు.
ఒక మబ్బు తునక ఓరకంట అతణ్ణి చూసి పక్కనున్న పిల్ల తెమ్మెరతో అన్నదీ ఎవడు వీడు? ఇంత ముగ్ధంగా వున్నాడు? ముగ్ధత్వం మనోహరంగా ఇమిడినవాడు?'
పిల్లతెమ్మెర పయ్యెదని ఓరగా కదిల్చి అన్నది- 'అతనో కుర్రవాడు. కుర్రతనం నుంచి బయటకు రావాలనుకున్నవాడు.'
నక్షత్రాలు జాలిగా అతణ్ణే చూస్తున్నాయి. గాలి సానుభూతిగా పరికిస్తూంది. వీధి దీపం మినుక్కుమినుక్కుమని వెలుగుతూంది.
శంభు తల విదిలించి- "ఇదేమిటి సాయంత్రం వరకూ బాగానే వున్నాను కదా. ఉన్నటుండి ఇలా మెలాంఖలీలోకి దిగిపోయానేమిటి?' అనుకున్నాడు.
6
ఎయిర్ పోర్టులోకి కారు దూసుకుంటూ పోయింది. స్టాండ్ లో ఆపి వడివడిగా లోపలికి నడిచాడు. అప్పటికే ప్లేన్ లాండ్ అయి అయిదు నిమిషాలయింది.
ఒక మూల జీన్స్ లో ఒక అమ్మాయి నిలబడి వుంది.
"స్పందన!"
"యస్."
"నా పేరు మిత్ర. శంభుమిత్ర."
పరస్పరం పరిచయం చేసుకున్నారు.
"నాన్నగారు రాలేదా?"
"లేదు. అర్జెంటు పనేదో తగిలింది. సాయంత్రం వస్తారు. అప్పటివరకు నన్ను గెస్ట్ హౌస్ లో వుండమన్నారు. మీరు రాకపోతే ఇబ్బంది పడేదాన్ని."
"సారీ. కారు కొద్దిగా ట్రబులిచ్చింది."
"ఇట్సాల్ రైట్. పోదామా?"
ఇద్దరూ బయటకొచ్చారు.
స్పందన నాజూగ్గా వుంది. కొంచెం పెద్దబొట్టు-కాటుక లేని ఎప్పుడూ సన్నగా హమ్ చేస్తూ వుండే పెదవులూ, పలచటి చెక్కిళ్ళూ.
ఇద్దరూ కార్లో కూర్చున్నారు.
ఇగ్నీషన్ ఆన్ చేసి ఆక్సిలేటర్ నొక్కాడు.
స్టార్టు కాలేదు.
మళ్లీ ఆఫ్ చేసి.... ఆన్ చేసి-
ఉహుఁ
దాదాపు అయిదు నిముషాలు ప్రయత్నం చేశాడు. మొహంలో భావమూ లేకుండా స్పందన చూస్తోంది.
శంభు నుదుటిమీద చెమట పట్టింది.
నిస్సహాయంగా చుట్టూ చూశాడు. ఒక్క టాక్సీ కూడా లేదు. మళ్లీ ప్రయత్నం చేశాడు. లాభం లేకపోయింది.
"కారు ఏ మోడల్ ది?" అడిగింది.
శంభు ముఖం మ్లానమయింది. "పందొమ్మిది వందల డెబ్భైనాలుగు" అన్నాడు.
అంతలో వెనుకనుంచి మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. దగ్గిరగా వచ్చి ఆగింది. "హాయ్ శంభు."
తలతిప్పి చూశాడు.
ఆరెస్బా.
"ట్రబులిస్తూందా?"
బలహీనమైన కంఠంతో "అవును" అని ఇద్దర్నీ ఒకరి కొకర్ని పరిచయం చేశాడు.
"మిమ్మల్నెక్కడో చూశాను" అతనన్నమాట.
స్పందన ఆశ్చర్యంగా "ఎక్కడా" అంది.
తల విదిలిస్తూ "ఉహూ. జ్ఞాపకం రావటం లేదు" అని - "ఇప్పుడేం చేస్తారు. ఈ కారుక్కూడా మా శంభులాగే స్టార్టింగ్ ట్రబుల్" అన్నాడు.
స్పందన నవ్వింది.
"ఎక్కడికెళ్ళాలి."
చెప్పాడు.
"నేనటే వెళ్ళాలి. రండి డ్రాప్ చేస్తాను."
"మరి నేను" అనబోయాడు. ఈ లోపులో స్పందన డోర్ తెరుచుకొని దిగింది. ఫాస్టు గర్ల్.
మోటారుసైకిల్ స్టార్టు అయింది. "ఏదైనా కారు చూసుకొని వచ్చెయ్యి గురూ!" ఆరెస్బా కంఠం గాలిలో కలిసిపోయింది. వెనక సీట్లోంచి స్పందన చెయ్యి వూపింది.
పిడికిలి బిగించి ఇగ్నీషన్ మీద ఫాట్ మని కోపంగా కొట్టాడు. చిన్న చప్పుడుతో కారు స్టార్టు అయ్యింది. అదిరిపోయాడు. మరుక్షణం కన్ ఫ్యూజన్ లోంచి తేరుకొని గేర్లు మార్చి ముందుకు నడిపాడు.
అతడు గెస్ట్ హౌస్ కి చేరుకునేటప్పటికి ఇద్దరూ ఎంతోకాలం నుంచీ స్నేహితులైనట్లు మాట్లాడుకుంటున్నారు. స్పందన విరగబడి నవ్వుతోంది. ఇద్దరి ముందూ థమ్స్ అప్ బాటిల్స్ వున్నాయి.
"కారు బాగయిందా" ఆరెస్బా అడిగేడు.
అయిందన్నాడు.
ఆమె మిత్రవైపు తిరిగి- "మీ స్నేహితుడు భలే మాట్లాడుతాడు సుమా" అంది నవ్వుతూ. "అంతేకాదు, ఈ రెండ్రోజులూ నా ప్రోగ్రాం కూడా ఈ ఊళ్ళో ఫిక్స్ చేసేశాడు."
"ఏమిటి-?"
"చార్లెస్ బ్రాన్ సన్ పిక్చర్ కి రెండు టిక్కెట్లు బుక్ చేశాను. అది మాట్నీ! మాండ్రిన్ లో రెండు చైర్సున్న టేబిల్ రిజర్వు చేసేనిప్పుడే ఫోన్ చేసి-" ఆరెస్బా చెప్పుకుపోతున్నాడు.