Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 9


    "పాము తల పార్శ్వభాగంలో కళ్ళకి కొంచెం దిగువగా వుంటాయి విషగ్రంధులు... పాము కాటు వేసినప్పుడు 'మాండిబ్యులారిస్ కన్సిక్టార్స్' అనే దౌడకండరాలు నొక్కడం వలన విషం కోరలద్వారా మనిషి శరీరంలోకి పాకుతుంది. ఎండుగడ్డి రంగులో వుండే పాము విషాన్ని కార్డియోటాక్సిన్ హిమోటాక్సిన్ న్యూరోటాక్సిన్స్ గా విభజిస్తే మాటాక్సిన్స్ మెదడుపైనా శ్వాసకేంద్రాలపైనా పనిచేస్తాయి. శ్వాసక్రియ ఆగిపోవటం రక్తప్రసరణ సవ్యంగా జరక్క కళ్ళు, ముక్కు, నోరు లాంటి అవయవాలద్వారా రక్తస్రావంలో ప్రాణాలు పోవడం సంభవిస్తూ వుంటుంది."

    ఇక పోతే పాముకాటుకి ప్రధమ చికిత్సలా కాటుకిగురైన అవయవానికి పైన అంటే గుండెకి రక్తాన్ని తీసుకుపోయే 'టార్నిక్విట్' ని వెంటనే ఓ తాడుతో కట్టి బంధించాలి...పొటాషియమ్ పెర్మాంగనేట్ ద్రావణంలో గాయాన్ని కడిగి సుమారు రెండు సెంటీమీటర్లలోతు గాటుపెట్టి రక్తాన్ని పీల్చేయాలి... సామాన్యంగా నోటిని ఉపయోగించకూడదు...ఒకవేళ ఉపయోగించినా వెంటనే ఉమ్మేయాలి. పాముకాటు అన్న భావమే మనిషి ప్రాణాలు తీసే అవకాశం వుంది. కాబట్టి వీలైనంత ధైర్యాన్ని చెపుతూ వేడిపాలు, టీ లాంటివి తాగించాలి... శ్వాసక్రియ మందగిస్తే కృత్రిమశ్వాస అందించాలి. దీని తర్వాత ఏంటీ వీనమ్ సిరమ్ ఇంజక్షన్సు దొరికే హాస్పిటల్ కి తరలించాలి. ఏమాత్రం జాప్యం చేయకుండా." 

    సరిగ్గా ఈ వాక్యం చెబుతూండగా దూరంగా ఓ ఆర్తనాదం వినిపించింది ముందు... వెనువెంటనే ఓ కానిస్టేబుల్ ఆ గదిలోకి దూసుకొచ్చాడు.

    ఇక్కడ కాన్ ఫరెన్స్ జరుగుతున్న సమయంలోనే చాలా చేరువలో మరో అనర్ధం జరిగిందన్న విషయం తెలుసుకున్న శృతి ఆలస్యం చేయలేదు.

    పరుగులాంటి నడకతో డి.సి.పి. ప్రసన్నతో బాటు ఆ ఇంటిని చేరుకుంది.

    కానీ అప్పటికే ఆలస్యమైనట్టు పాప నోటినుంచి రక్తపుజీరలతో రక్తం ఉబికివస్తూంది.

    శృతి సమీపంలో చచ్చిపడివున్న మిన్నాగుని చూడలేదు...కాని అందరి మధ్యనుంచే ఉద్వేగంగా పాపని చేరుకుని కనురెప్పల్ని తెరిచి చూసింది.

    ఆ ఇంట పోరాడిన పసిపాప కనుపాపలు ఇక కదలలేవమ్మ అన్నట్టు స్థబ్ధగా వున్నాయి. అయిపోయింది. తనకి చాలా సమీపంలోనే మరో ఘోరం జరిగిపోయింది.

    కడుపున పిండంగానే మిగిలిపోతే పదికాలాలపాటు రక్షించుకునేదాన్ని అన్నట్టు పాపతల్లి గుండెలార్చేలా ఏడుస్తూంది. అది కాదు శృతిని కదిలించింది...పాము విషంతో కోల్పోయిన పాశాన్ని పదిలంగా తిరిగిమ్మని ప్రాధేయపడుతున్నట్టు శృతి పాదాల్ని చుట్టేసింది.

    "ఒక్కగానొక్క బిడ్డమ్మా...దాన్ని కాపాడు తల్లీ..." రుద్దమైన గొంతుతో వెక్కిపడుతూంది. "అమ్మా బ్రెడ్ తింటానే అంటే బయటికి వెళ్ళానుగానీ ఇక్కడ నా వరాలతల్లి అన్యాయమై పోతుందని గాని నా పేగు ఇలా కోసుకుపోతుందని కలగనలేకపోయాను తల్లీ" మరోమారు కూతురు చెంపల్ని స్పృశించింది... వెంటనే ఏదో మార్గం దొరికినట్టు శృతి కాళ్ళు పట్టుకుని "దాని ఒళ్ళింకా వేడిగానే వుందమ్మా అదింకా బ్రతికేవుంది...మరోసారి చూడుతల్లీ" కుదిపేస్తోంది దీనంగా దారుణంగా.

    అప్పుడు రాలిపడ్డాయి శృతి కళ్ళనుంచి రెండు నీటిబొట్లు. హృదయ విదారకమైన ఆ సన్నివేశంలో నిస్సహాయంగా నిలబడాల్సి వచ్చినందుకేమో గోడవారకి నడిచి శిలలా వుండిపోయింది.

    "డాక్టర్" ప్రసన్న కంఠం వినబడగానే అంతదాకా నిభాయించుకున్న శృతి ఆవేశంగా వెనక్కి తిరిగింది.

    "ఇట్స్ అనే బేరబుల్ బార్బేరియస్ ఏక్ట" రొప్పుతూందామె. "ఎవడు ప్రసన్నగారూ...చిన్న పెద్ద తేడా లేకుండా ఇంత విచ్చలవిడిగా ఇన్ని దారుణాలు చేస్తున్న ఆ కిరాతకుడెవరు...ఇంతమందినీ నిస్సహాయుల్ని చేసి ఆడుకొంటున్న ఆ బ్రూట్ ని ఇంకా పట్టుకోరేం?"

    అతడికీ జవాబు తెలీని ప్రశ్నే.

    ఆ క్షణంలోనే డాక్టర్ శృతి తనూ రంగంలోకి దిగింది...ఏదో చేయగలనని కాకపోయినా తన చుట్టూ వున్న మనుషులకి అణుమాత్రమైనా ఉపయోగపడాలని బలంగా సంకల్పించింది.

    ఇప్పుడు పోలీస్ పెట్రోలింగ్ వేన్ లో డాక్టర్ శృతి కూడా వుంది.

    ఆ రోజు అలా ఇళ్ళల్లో పాముల్ని విడిచిపెట్టింది ఇరవై రెండు చోట్లయితే ఆరుగురు చనిపోగా పదిహేను మంది హాస్పిటల్లో రక్షింపబడ్డారు.

    ఇంకా ఓ ముఖ్యమైన ఫలితం తెలియాల్సి వుంది.


                                                        *    *    *    *


    రాత్రి పది గంటలు దాటుతూంది.

    జూబిలీహిల్స్ లోని డి.సి.పి ప్రసన్న బంగళా చుట్టూ వ్యాపించిన చీకటి కొరివి పెట్టబోతున్న కళేబరంలా వుంది.

    ఉండుండీ చీకటిని చీల్చుకు వచ్చేగాలి అలలు నగరంలోకి ప్రవేశించి సర్పాల బుసల్ని గుర్తు చేస్తున్నాయి. ఇంటి ఆవరణలోని చెట్లపూలు మిణుగురుల వెలుగులో పాము కళ్ళని జ్ఞప్తికి తెస్తున్నాయి....

    ఆకాశంలో ఓ తీతువుగా భీతిగా రొద పెట్టింది.

    ఉలికిపడిన సబిత కారిడార్ లో నిలబడ్డ ఎనిమిదేళ్ళ కూతురు లల్లీని చేరుకొంది.

    "లోపలికి రా లల్లీ" చిన్న చప్పుడుకి సైతం ఆందోళన పడుతున్న సబిత అప్పటికే లల్లీని పై కెత్తుకుంది.

    "డాడీ రావాలిగా మమ్మీ. కొంచెం సేపుందాం." వస్తున్నానని ఫోన్ చేసిన తండ్రికోసం అలా వెయిట్ చేయడం రాగానే తండ్రి ఒడిలో వాలి అల్లరి ప్రశ్నలతో మారాం చేయడం లల్లీకి అలవాటైన దినచర్యగా ఆమెకు తెలిసినా ఇప్పుడు ఆ చీకటిలో నిలబడే సాహసం చేయలేకపోతుందామె.

    కదిలే ప్రతి ఆకూ పాముపడగని గుర్తు తెస్తూంది.

    తోటలోని ఏపుగా పెరిగిన ప్రతి మొక్కా పాము పుట్టలా అనిపిస్తూంది. సహజంగా ధైర్యవంతురాలే అయినా ఇప్పుడు భాయోద్విగ్నంగా కంగారు పడిపోతూంది.

    "వదలమంటూంటే" వదిలించుకోబోయిన లల్లీని లోపలికి తీసుకుపోయింది సబిత. "భయమేస్తూంది మమ్మీ."

    తత్తరపడిన సబిత "ఎందుకూ?" అంది తన భావాల్ని చదివేసిన లల్లీవేపు చూడకుండానే...

    "పాము లొస్తాయని..."

    "రావు" తల ఊపింది అసహనంగా. "వచ్చినా మనల్నేం చెయ్యలేవు!"

    "ఏం...చిన్నపిల్లల్ని కరవ్వా"

    "అదికాదు లల్లీ..." ఆ క్షణంలో నిజంగానే మనసు కీడుని శంకింస్తోంది. "మీ డాడీ దగ్గర రివాల్వర్ వుంటుందిగా..."

    "మరి పాములకి ఆ విషయం తెలీదుగా"

    "లల్లీ... నీకేమైందే? ఏమిటా వెధవ ప్రశ్నలు" మనసు శూన్యములో వేలాడే తెల్ల తామరపువ్వుగా ఒంటినరాలన్నీ గజిబిజిగా అల్లుకున్న పాముల పొదరిల్లులా జలదరింప చేస్తుంటే "పద భోంచేద్దువు గాని" అంది లోపలికి నడుస్తూ...

    "డాడీ రానియ్..."

    "వస్తారు లల్లీ...నా మాట వినవేం"

    "తొందరగా వస్తే బాగుణ్ణుగా మమ్మీ!"

    "చెప్పారుగా లల్లీ...తప్పకుండా వస్తారు!"

    "మరి ముందు పాముస్తేనో..."

    ఆ పసికందు మనసులో బలంగా ముద్రపడిన ఆలోచనల్ని చెరపలేని నిస్సహాయతో లేక తన ధైర్యమూ పూర్తిగా సడలిపోతూందనో తను మామూలుగానే వున్నట్లు నరిస్తూనే బెడ్ రూంలోకి నడిచింది సబిత...

    లల్లీ హాల్లోని టీ.వి. ఆన్ చేసింది.

    సరిగ్గా ఇదే సమయానికి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడ్డ సబిత వాలిపోయిన మొహాన్ని చూసుకుంటూ వుండిపోయింది తప్ప అక్కడ బీరువా మూల నక్కివున్న ఓ రక్త పింజర ఇప్పుడు నెమ్మదిగా ప్రాకడాన్ని గుర్తించలేకపోయింది.

    ఎప్పుడో సాయంకాలమనగా ఇంటి తోటలో విడిచి పెట్టబడిన నాలుగున్నర అడుగుల రస్సిల్ వైపర్ పదినిముషాల క్రితమే ఆ గదిలోకి ప్రవేశించింది. గోడ పైనుంచి జారి పడుతున్న వెలుగుపడి క్రూరంగా పరావర్తనం చెందుతూంది.

    సబిత ఇంకా నిలబడే వుంది. మరింత ముందుకొచ్చిన రక్తపింజర కసిగా బుస కొట్టింది. కానీ హాల్లోని టీ.వి. చప్పుడుతో సబితకది వినిపించలేదు.

    ఇప్పుడు సబిత పాదానికి రక్తపింజరకి మధ్యనున్న దూరం మూడు అంగుళాలు మాత్రమే.


                         *    *    *    *


    కంట్రోల్ రూం తన ఆఫీసుగదిలో కూర్చుని అంతసేపటిదాకా నైట్ పెట్రోలింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన డి.సి.పి. ప్రసన్న ఇక ఇంటికి బయలుదేరేవాడే...

    కానీ అప్పుడు ఎదురొచ్చింది డాక్టర్ శృతి.

    మగాళ్ళు సైతం తిరిగే సాహసం చేయలేకపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పైగా అటు రాత్రివేళ అక్కడకు రావడంతో ముందు ఆశ్చర్య చకితుడయ్యాడు. "వెల్ కమ్"

    ఆఫీసులో అతడికి అభిముఖంగా కూర్చున్న శృతి ఏదో అడగాలనుకుంటూనే అడగలేక తటపటాయిస్తుంది.

 Previous Page Next Page