Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 8


    రోడ్లపై పోలీసు జీపులు తిరుగుతున్నాయి నెమ్మదిగా...ప్రమాదాన్ని పసికట్టిన ప్రభుత్వం ఎంతటి జాగ్రత్త తీసుకుందీ అంటే నగరమంతా పోలీసులు బృందాలుగా తిరుగుతున్నారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటననైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా జీపుల్లో పోలీసులతోబాటు ఏంటీ వీనమ్ ఇంజక్షన్ తో సిద్ధంగా ఉన్న డాక్టర్లనీ పంపించడం జరిగింది.

    ఆ ఉదయమే ఏంటీ వీనమ్ సీరమ్ తయారు చేసే హాఫ్ కిన్స్ ఇన్ స్టిట్యూట్ బాంబే, సెంట్రల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ పంజాబ్ సంస్థలకి ఎక్కువ మొత్తంలో మందు సరఫరా చేసేట్టు ఆర్డర్స్ కూడా ప్లేన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

    శలవుల్లో వున్న పోలీస్ మెడికల్ సిబ్బంది వెంటనే శలవు రద్దు చేసుకుని విధుల్లో చేరాల్సిందిగా ప్రత్యేకమయిన ఆదేశాల్ని జారీ చేయడం జరిగింది.

    సరిగ్గా అదే సమయంలో...

    "అమ్మా...దానం చేయి తల్లీ" బషీర్ బాగ్ లోని ఓ యింటిముందు బిక్షగాడిలా నిలబడ్డ ఓ వ్యక్తి నెమ్మదిగా అరుస్తున్నాడు. అతడి గొంతులో బిక్షం కోసం వచ్చిన ముష్టివాడి కంఠంలో వినిపించే ఆర్ద్రత లేదు.

    "అమ్మా!" మరోసారి పిలిచాడు.

    అప్పటికీ అలికిడి లేకపోవటంతో నెమ్మదిగా ఇంటిద్వారాన్ని సమీపించాడు. అతడికళ్ళిప్పుడు పరిసరాలను ఏకాగ్రతగా గమనిస్తున్నాయి.

    "అమ్మా...బిక్షం తల్లీ" ఈ సారి అతడి గొంతు సాధ్యమైనంత తగ్గు స్వరంలో పలికింది...

    క్షణంపాటు అటూ ఇటూ చూసాడు. రోడ్డునిర్మానుష్యంగా వుంది. భుజానికున్న జోలికి తీసి నేలపై వుంచాడు. అంతసేపూ జోలిలో ఉక్కిరి బిక్కిరౌతున్న మిన్నాగు స్వేచ్చ దొరికినట్టు మెరుపువేగంతో బయటికి వచ్చింది. సుమారు రెండున్నర అడుగుల పొడవుగల గోధుమరంగు సాస్కిల్డ్ వైపర్ తన శరీరపు పొలుసుతో నేలపై చిత్రమైన శబ్దంచేస్తూ వేగంగా ప్రాకుతూంది.

    మరో అరక్షణం గడిస్తే అదృశ్యమయ్యేదే...కాని అప్పటికే చేతికి ఓ బట్టని చుట్టుకున్న ఆ వ్యక్తి ఒడుపుగా దాని తలనిపట్టుకున్నాడు. తననెవరూ చూడటం లేదన్న నిర్ధారణకు వచ్చాక గోడకి అనుకున్న కిటికీ దగ్గరకి నడిచి హడావుడిగా లోనికి విసిరాడు.

    వచ్చిన పనైనట్టు ఆ వ్యక్తి ఇప్పుడు చకచకా రోడ్డుపై నడుస్తుంటే అదే సమయంలో మూడడుగుల ఎత్తునుంచి నేలపైపడ్డ మిన్నాగు రోషంతో ముందుకు ప్రాకి నేలపైవున్న ఓ బొంతని చేరుకుంది.

    ఆ బొంతపై ఓ పదేళ్ళ పాప పడుకుని వుంది.

    జ్వరంతో వణికిపోతూ అక్కడ లేని అమ్మకోసం ఆర్తిగా కలవరిస్తూంది. నిజానికి ఆ పాప ఈ రోజూ ఎప్పటిలా స్కూలుకి వెళ్ళేదే కాని, రాత్రి పాముల గురించి అమ్మా నాన్నలు చెప్పుకుంటున్న మాటలు వింది. అంతకుమించి సిటీలో ఓ పసిపిల్లడు పాముకాటుకి బలై ఎంతదారుణంగా ప్రాణాలు వదిలిందీ అన్న విషయాన్నీ తెలుసుకుంది. భయంతోనే జ్వరం పెట్టుకుంది.

    మగతగా కళ్ళు మూసుకున్న పాప పాములగురించి కలవర పడుతూందే తప్ప మృత్యువు తనకీ చాలా సమీపంగా వచ్చి పొంచి చూస్తుందని వూహించలేకపోయింది.

    బొంతపైకి వచ్చిన ఎభాస్ కెరినేటా (మిన్నాగు) ఉక్రోషంగా నోరు తెరిచి పాప చెంపల్నే చూస్తూంది.

    ఇక్కడొక సర్పం తన కడుపుకోతకి కారణం కాబోతూందని పాపకి బ్రెడ్ కోసం బయటికి వెళ్ళిన పాపతల్లికీ తెలీదు.

    వృత్తంలా చుట్టుకుంటున్న మిన్నాగు బుస పాపచెంపని తాకింది. సరిగ్గా అప్పుడే ఒక చిరుగాలి అలకి కదిలే లేమా విచిగురు టాకులా పాప ఒత్తిగిల్లింది.

    అసంకల్పితంగా పాపచేయి మిన్నాగుపై పడింది.


                         *    *    *    *


    ఆ ఇంటికి సుమారు వందగజాల దూరంలో వున్న ప్రెస్ క్లబ్ అదే సమయాన ప్రముఖ దినపత్రికల విలేఖర్లతోనూ దూరదర్శన్ సిబ్బందితోనూ హడావుడిగా వుంది.

    విశాలమైన హాల్లో ఆసీనులైవున్న ప్రెస్ రిపోర్టర్స్ సైతం ఆందోళనగా వున్నారు. వచ్చింది ఒకందుకైనా వాళ్ళు ఉండేదీ జంట నగరాల పొలిమేరల్లోనే కావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీని సందిగ్ధత వారికీ వుంది.

    నేలకి రెండడుగుల ఎత్తువున్న డయాస్ పై డి.సి.పి. ప్రసన్నతో బాటు డాక్టర్ శృతి కూర్చునే వుంది కాని ఆమె మనసూ అశాంతితో నలిగిపోతూంది. తనకేదో జరుగుతుందని కాదు...జంటనగరాలను సర్పాలను అస్త్రాలుగా వాడుతూ సాగిస్తున్న నరమేధానికి తుది ఎక్కడో ఆమె వూహకందక...

    అదికూడా కాదు... ఇప్పుడు ఈ క్షణాన ఏ అరణ్యగీతమో మరే రోదనో మనసుని మెలిపెడుతున్నట్టు అలజడి చెందుతూంది.

    ఎందుకిలా అనిపిస్తూంది.

    "డాక్టర్ శృతీ" వీడియో కెమెరా ఆన్ చేయబడిన మరుక్షణం ముందు ఉదయం విలేఖరి అడిగాడు. "చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఇక్కడ సమావేశమయ్యాం...ఎటు చూసినా తల్లుల ఆక్రందన_ తండ్రుల ఆర్తనాదం... పిల్లల గావుకేకలు... ఒక్కమాటలో చెప్పాలంటే జంటనగరాలలోని ప్రజలంతా శాపగ్రస్తులై పోయారు... గుండెలుగ్గపట్టుకుని బ్రతుకుతున్నారు..." తేరుకోవడానికి అతడికీ అయిదు సెకండ్ల వ్యవధి అవసరమైంది. "సంఘమిత్ర వంటి ప్రాచుర్యంగల టాక్సికాలజీ ప్రొఫెసర్ అసిస్ట్ చేస్తున్న మీనుంచి సర్పజాతుల గురించి వాటి విషాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం."

    ఆ గదిలో హఠాత్తుగా నిశ్శబ్దం చోటుచేసుకుంది. పూడుకుపోతున్న గొంతుని సవరించుకుంది శృతి... "ఈ సర్పాలన్నీ స్క్వామేటా క్రమంలో ఒఫీడియాజాతికి చెందిన రిప్టయిల్స్ ప్రపంచంలో సుమారు 2500 సర్పాలుంటే మన దేశంలో కనిపించేవి 236 రకాలు మాత్రమే. ముఖ్యంగా ఉష్ణమండలాలలో సంచరించే యీ పాములు న్యూజిలాండ్ ఐర్లాండు అజుర్లా బెర్మూడా హవాయి దీవుల్లోలేవని సర్ప శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలద్వారా తెలుసుకున్న విషయం. విషం ఎక్కువున్న పాములు ఆస్ట్రేలియాలో వున్నాయి. ఇక మనదేశంలోని ప్రమాదకరమైన విషసర్పాలు కోబ్రా (నాగు) క్రైట్ (కట్లపాము) రస్సిల్ వైపర్ (పొడపాము లేక రక్తపింజర) సాస్కీల్డ్ వైపర్ (మిన్నాగు)...మనదేశంలో పొడవైన విషసర్పం కింగ్ కోబ్రా సుమారు పద్దెనిమిది అడుగులు దాకా వుంటుంది. 

    "పాముల బిహేవియర్ గురించి తెలియచేస్తారా?" ఈనాడు విలేఖరి అడిగాడు...

    "పాములన్నీ సహజంగా ప్రాణభీతితో మనిషికి దూరంగా జరిగిపోయేవే... కాని కోబ్రాస్ అలాకావు...ఎవరూ రెచ్చగొట్టకపోయినా తమంతట తామే మనిషిపై కలియబడతాయి."

    "ప్రపంచం మొత్తంలో అన్నిటికన్నా ఎక్కువ విషమున్న సర్పం..."

    "బ్లాక్ మాంబా.......వేగం, రోషం, విషం, అన్నీ వున్న ఈ సర్పం ఆఫ్రికాదేశానికి చెందినది. ఇంతవరకూ ఏంటి వీనమ్ సీరమ్ పనిచేయనంత ప్రమాదాన్ని కలిగిస్తున్నది ఇదే... ఇక మనదేశం విషయానికివస్తే ఎక్కువ విషపూరితమైనది బుంగరస్ జాతికి చెందిన కట్లపాము. నాగు పాముకన్నా ఏడు నుంచి పధ్నాలుగు రెట్లక్కువ. విష ప్రభావంగలది."

    ప్రజల్ని ఎడ్యుకేషన్ చేసే ఆ విషయాల్ని అందరూ సీరియస్ గా నోట్ చేసుకుంటుండగా ఆంధ్రప్రభ విలేఖరి అడిగాడు. "మేడమ్... పాముల మంత్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటి?"

    "ట్రేష్" టక్కున జవాబిచ్చింది. "అనాదిగా మనిషిలో పాతుకుపోయిన మూఢనమ్మకాల్ని క్యాష్ చేసుకునే కొందరు వ్యక్తులు అమాయకులైన ప్రజల ప్రాణాలతో సాగిస్తున్న ప్రయోగాలివి. నేను చెప్పిన నాలుగు జాతులకి చెందిన విషసర్పాలు కాటేసినప్పుడు కేవలం మంత్రాలతో అయితే బ్రతకరు... అలా బ్రతికినట్టు ఏమన్నా దాఖలాలుంటే తక్కిన సర్పాలకి చెందిన కాటుమూలంగానే అయ్యుండాలి..." ఉద్విగ్నంగా చెప్పుకుపోతూంది.

    "శాస్త్రీయంగా ఇంత అభివృద్ధి చెందిన ప్రస్తుత సమాజంలో ఇంకా అలాంటి మూఢత్వంలో మిగిలిపోవడం మనిషి చేసుకున్న దురదృష్టం. నిజానికి అందరూ అనుకునేట్టు పాములు పగబట్టవు. అందరూ చెప్పేట్టు పాముకి చెవులూ లేవు."

    "మరి శబ్దాల్ని ఎలా వింటుంది."

    "భూమిలోని ప్రకంపనాల్ని శబ్దతరంగాల్ని శరవేగంతోనే పసికడుతుంది... రుచి స్పర్శ వాసన నాలుకతోనే తెలుసుకుంటుంది."

    "అలాంటప్పుడు నాగస్వరం వింటూ నాట్యం చేస్తుందన్న మాటకి అర్ధమేమిటి?"

    "సర్పాలు అలా పడగనూపేది భయంతోనే తప్ప నిజానికి అది నాట్యం కాదు."

    "చాలా ఆసక్తికరమైన విషయాలు తెలియచేసారు. మేడమ్... చివరగా ఓ ప్రశ్న" ఆంధ్రభూమి విలేఖరి అడిగాడోసారి. "పాముకాటుకు గురైన వ్యక్తి ముందు తీసుకోవాల్సిన చికిత్స గురించి వివరిస్తారా?"

    చర్చలో అతి ముఖ్యమైన ప్రశ్నిది...కొన్ని మూఢనమ్మకాల మధ్య కలిగే వ్యక్తులకుగాని ప్రాణభీతితో కర్తవ్యాన్ని విస్మరించి ప్రాణాలపైకి తెచ్చుకునే వాళ్ళని నిజంగా ఎడ్యూకేట్ చేయాలన్నాగాని ఇదే కూలంకషంగా తెలియచేయాలి."

 Previous Page Next Page