సరిగ్గా ఇదే సమయంలో...
కంట్రోల్ రూంకి ఓ మూల చీకటిలోవున్న శృతి కారుని భుజానికి జోలి వేలాడుతున్న ఓ ఆకారం సమీపించింది. తననెవరూ గమనించడం లేదన్న నిర్ధారణకు రాగానే విండ్ గ్లాస్ లోనుంచి వెనుక సీటుపై పాము నుంచుంది.
సుమారు నాలుగు అడుగుల పొడవుగల కట్లపాము శరీరంపై గల నల్లటి అడ్డేచారలు మృత్యువువేసే ముడుల్లా భయానకంగా కదులుతున్నాయి.
* * * *
"చెప్పండి. వాట్ హెల్ప్ కెన్ ఐ డూ ఫర్యూ" ఛాంబర్ లో తనకభిముఖంగా కూర్చున్న శృతి నడిగాడు డి.సి.పి. ప్రసన్న... మొదటి పరిచయంలోనే ఆమెపై ఓ సదభిప్రాయం ఏర్పడిపోయింది. అది ఆమె స్వచ్చందంగా ముందుకొచ్చి పోలీసులకి ప్రజలకి సహకరిస్తానన్నప్పుడు రెట్టింపయింది.
"జయేంద్రని," సంకోచిస్తూనే అంది "విడిచిపెట్టేసారా?"
లేదన్నట్టుగా తల పంకించాడు. "నిజానికి నేను కస్టడీలోకి తీసుకున్నది ఓ అనుమానంతోనే అయినా సంతృప్తికరమైన జవాబు ఒక్కటీ రాబట్టలేకపోయాను...అదీగాక అతడి మాట తీరు, ప్రవర్తనా చాలా సెక్యూలియర్ గా వున్నాయి."
అదే. ఆ ప్రవర్తనే శృతిని సైతం ఆకట్టుకున్నది. నిన్న రాత్రి నుంచి తనకు తెలియకుండానే అతడి గురించి ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టింది.
అతడి కోపంలోగాని, మాటల్లోగాని తన చుట్టూవున్న మనుషులపై నిక్షిప్తమైన అయిష్టతే ధ్వనించింది తప్ప అతనో సినిక్ లా అనిపించలేదు. ఆ స్థితిలో కూడా మరీ మరీ చూడాలనిపించే గ్రేస్ అతడి కళ్ళల్లో...
బహుశా అతడ్ని చూసిన ఏ అమ్మాయీ అతని గురించి ఆలోచించకుండా వుండలేదేమో.
"ఆయన వివరాలేమన్నా తెలుసుకోగలిగారా?"
"అఫ్ కోర్స్...సేకరించాం..." టేబుల్ రేక్ లోని ఓ ఫైలు తీసి వెరిఫై చేస్తూ అన్నాడు. "పుట్టింది, పెరిగింది అనకాపల్లి దగ్గరున్న తుంపాలలో. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాడు. తర్వాత కాలేజి ఎడ్యుకేషన్ పూర్తిచేసి రెండేళ్ళుగా స్నేక్ షోస్ ఇస్తున్నాడు. ఒక గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి ఇలాంటి ప్రదర్శనలివ్వడం విచిత్రమైనా బహుశా నిరుద్యోగం అనే కాటుని తప్పించుకునే ప్రయత్నంలో పాముల మధ్య బ్రతుకుతున్నట్టనిపిస్తోంది. ఇంతకు మించి వివరాలేం దొరకలేదు."
"అలాంటప్పుడు అతడ్ని విడిచిపెట్టెయొచ్చుగా" టక్కున అనేసి వెంటనే సంబాళించుకుంది. "మరేంలేదు... చూస్తుంటే నాకూ అనిపించడంలేదు అతడో అనుమానించ దగ్గ మనిషని..."
"ఐ డోంట్ మైండ్" ఓ క్షణం సాలోచనగా చూస్తూ అన్నాడు. "కాని ఒక్క విషయం...అతని విషయంలో చాలా ముఖ్యమైన సమాచారమేదో సేకరించలేకపోయాం అనిపిస్తోంది అతడి ప్రవర్తన చూస్తుంటే...ఎనీహౌ...ఏమన్నా దాచినా తెలుసుకోవడం అన్నది మాకు పెద్ద విషయం కాదు కాబట్టి ప్రస్తుతానికి విడిచిపెట్టడం సమస్య కాదు." వెంటనే జయేంద్రని అతడున్న పోలీస్ స్టేషన్ నుంచి రప్పించాడు.
ఛాంబర్ లో అడుగు పెట్టగానే శృతినిచూసిన జయేంద్ర కళ్ళలో అస్పష్టమయిన భావమేదో మెదిలింది తప్ప అంతకుమించి అతడి ముఖ కవళికల్లో పెద్ద మార్పులేదు.
"వెల్ మిస్టర్ జయేంద్రా" బయటికినడుస్తూ అన్నాడు ప్రసన్న. "ఇప్పుడు నిన్ని విడిచిపెడుతున్నాం. యు మస్ట్ బి గ్రేట్ షుల్ టు డాక్టర్ శృతి. యు కెన్ గో నౌ బట్ నో మొర స్నేక్ షోస్."
జయేంద్ర నిశ్శబ్దంగా చీకటిలోకి వెళ్ళిపోయాడు తప్ప కనీసం కృతజ్ఞత కూడా ఎక్స్ ప్రెస్ చేయలేదు ఎవరికీ.
ప్రసన్న తన జీప్ లో బయలుదేరిన ఓ నిముషానికి తన కారుని సమీపించింది జయేంద్ర ప్రవర్తనకి నిర్విణ్ణురాలవుతూనే...
"ఇదికూడా మీరు చేసిన మంచిలో ఓ భాగమేనా?"
జయేంద్ర వెళ్ళిపోయాడనుకుంది. కానీ అతడు చీకటిలో నిలబడి వున్నాడు...ముందు అర్ధంకాలేదు అతడంటున్నదేమిటో...
"ఎందుకు నా వెంట పడుతున్నారు? అవును శృతీ...నా ప్రపంచంలో నా అనుమతి లేకుండా మరోసారి ప్రవేశించారు."
మ్రాన్పడిపోయింది శృతి. "మిస్టర్ జయేంద్రా...మిమ్మల్ని నేనెలా అర్ధం చేసుకోవాలో నాకు తెలీడంలేదుగాని ఇప్పుడు నేను చేసింది కూడా సాటిమనిషిగా మేలు తప్ప కీడు కాదు. వై డోంట్యూ అండర్ స్టాండ్ దట్..." ఓ క్షణంపాటు ఇలాంటివాడి కోసం తను ఇనీషియేటివ్ తీసుకోవడం తప్పుగా అనిపించిందేమో కూడా. "బహుశా మీకు పాములతో పరిచయం ఎక్కువై మనుషుల మీద పూర్తిగా నమ్మకం పోయిందనుకుంటాను."
"అఫ్ కోర్స్...ఇంతవరకూ కరెక్ట్ గానే ఆలోచించారు."
"అలాగా" వ్యంగ్యంగా పలికిందామె కంఠం. "అది నిరూపించడానికే పాములతో అంతలా చెలిమి చేయడం మొదలుపెట్టారా...మనిషికన్నా పాము మిన్న అనే థియరీని ప్రపంచానికి చాటి చెప్పడానికి మాంసం తినేవాడు మెడలో ఎముకలు వేసుకు తిరిగినట్టుగా ఇలాంటి షో ఏర్పాటు చేయాల్సిన పనిలేదే."
"మిస్ శృతీ" జయేంద్ర ముఖం కొద్దిగా వివర్ణమైంది. "మీరు చూసిన ప్రపంచంలో అంతా మంచే మీకు తారసపడి వుంటే మీ నిర్వచనంతో మీరు సంతృప్తి పడండి. అంతేకాని నా చర్యని అవహేళన చేయకండి" ఆ నీరవ నిశీధిలో అతడి గొంతు శృతిచేసిన రసధునిలా వినిపిస్తూంది.
"ఇది నిరాశావాదమే."
"నో" కటువుగా అన్నాడు.
"కాకపోతే పిరికితనం...అలా కోపంగా చూడకండి జయేంద్రా కలుషితమైన గాలి మరప్పుడప్పుడూ పీల్చాల్సి రావచ్చు. ఆ కాలుష్యాన్ని దాటి వెళ్ళిపోండి. అంతేగాని ఉన్నచోటనే నిలబడి కాలుష్యాన్ని పీల్చకూడదంటే పూర్తిగా శ్వాస ఆపుక్కూచుంటే ప్రాణాలే పోతాయని చెప్పడానికి పెద్ద తర్కం అక్కరలేదనుకుంటాను."
"ఈ మనుషుల మీద మీకెంత నమ్మకం!"
"యస్...మనుషులమీద మాత్రమేకాదు. నామీదా నాకూ చాలా ప్రేమ..." అతడిలోని అస్పష్టమైన అంతర్మధనం క్రమంగా బయటికి వస్తుంటే అవకాశం తీసుకుంటూంది కావాలనే. "మిస్టర్ జయేంద్రా నేను నా జీవితాన్ని ప్రేమిస్తాను... అందుకేనేమో ప్రపంచాన్నీ ప్రేమించడం అలవాటు చేసుకున్నాను. ఏ మనిషినైనా కుంచింపచేసే సెల్ఫ్ సిటీ. అక్కడనుంచే అతడి తిరోగమనం మొదలయ్యేది. ఒక్కసారి మిమ్మల్ని మభ్యపెట్టుకోకుండా ఈ ప్రపంచంవేపు ప్రేమగా చూడండి. అక్కడ ఆనందం మిమ్మల్ని ఆనందపరుస్తుంది. మీ చుట్టూ వున్న వ్యక్తుల కన్నీళ్లూ మిమ్మల్ని స్పందింపచేస్తాయి. మీరెందుకు అలా బ్రతుకుతున్నారూ అని నేను నిలదీయడంలేదు. మరోలా బ్రతకడం అలవాటు చేసుకోరేం అని ఓ మనిషిగా మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చెబుతున్నది సైన్సు కాదు జయేంద్రా...ఈ సైన్సుకన్నా ప్రాచీనమైన మనిషి సైన్సు గురించి. ఆకలిమీద వున్నవాడికి చిటికెడు పంచదార నోట్లో వేసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి మనిషి ఆనందానికి ముఖ్య హేతువు పంచదార అని స్టేట్ మెంటివ్వకండి. మొదటిది సత్యం. రెండోది భ్రాంతి... అదే నేను పలాయనవాడమనేది...ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే జీవితంకన్న గొప్పది లక్ష్యం. ఆ లక్ష్యం పదిమందికి మార్గదర్శకమూ ఉపయోగమూ అయితే అది చరిత్ర. ఏదన్నా చేయగలవాడు హాయిగా బ్రతుకుతాడు...ఏంచేయాలో తెలీనివాడు ఏదో చేసి నలుగురిలోనో లేకపోతే గిన్నీస్ బుక్కాఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనో తన పేరొచ్చేట్టు వందగంటలో వెయ్యిగంటలో పాములమధ్య కూర్చుంటాడు మీలా..."
ఓ క్షణం నిశ్శబ్దంగా ఆమెను చూసిన జయేంద్ర కారుని ఆనుకుని వుండిపోయాడు రెండు నిముషాలదాకా...
"మీ వయసెంత?" టక్కున అడిగాడు. ఆ ప్రశ్నలో చిలిపితనం లేదు. శృతికూడా గ్రహించిందా విషయం.
"శారీరకంగా మీకన్నా తక్కువేగాని మానసికంగా బహుశా మీకన్నా ఎక్కువనుకుంటున్నాను."
చీకటిలో నిలబడ్డ జయేంద్ర కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నట్టనిపించింది ఓ లిప్తపాటు...ఇంతసేపూ చాలా నిర్మానుష్యంగా వున్న ప్రదేశంలో పైగా కూడనివేళలో మరో మగాడితో అదీ అంతగా పరిచయంలేని వాడితో మాట్లాడానని అప్పటికి స్పురించడంతో టక్కున కారు డోర్ తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది.
"ఏ సంస్కర్త పుస్తకాలో చదివి ఓ మనిషి తన ఉనికితోచుట్టూ వున్న వాళ్ళని ప్రభావితం చేయాలని ఒక అందమైన సందేశాన్ని పెదవుల్ని అందంగా కదిలిస్తూ ఇవ్వగలిగిన డాక్టర్ శృతీ...శృతిమించి రాగాన పడుతుంది అని మీరనుకోకపోతే ఒక్క ప్రశ్న..." క్రింది పెదవి పైపంటితో కొరుక్కుంటూ చూశాడు. "అందరి గురించీ మీరిలాగే శ్రద్ధ తీసుకుంటారా?"
"అందరి గురించీ అయితే ఇలాంటి అర్ధరాత్రివేళ రావాల్సిన అవసరం..." టక్కున ఆగిపోయింది తనకు తెలియకుండానే అవసరానికి మించి తను నోరు జారాననిపించడంతో...
ఇప్పుడామె యింకా వెయిట్ చేయలేదు...కారుని వేగంగా ముందుకి పోనిచ్చింది.
వెళుతున్న కారుని చూస్తూ నడుస్తున్న జయేంద్రని చీకటిలో నుంచి ఓ ఆకారం వెంటాడుతూంది. ఆ వ్యక్తి భుజానికి ఓ జోలిలాంటిది వేలాడుతూంది. "జయేంద్రా" ఆ పిలుపుతో టక్కున ఆగేడు జయేంద్ర.
* * * *