"చెప్పండి! ఏం చెయ్యగలం మీకోసం?"
ఆ కార్యాలయానికొచ్చిన యే స్త్రీనైనా అలాగే అడుగుతారు.
"కొన్ని ఆసుపత్రులలో శిశువు గర్భంలో వుండగానే ఆడదో, మగవాడో తెలుసుకునే అవకాశం వుందట. దయచేసి నా గర్భంలో వున్న శిశువు ఆడపిల్లో, మగపిల్లవాడో తెలుసుకునే యేర్పాటు చెయ్యగలరా? ఖర్చు నేభరించుకుంటాను."
షాక్ తిన్నట్లయింది మృదుల. గర్భంలో వున్న శిశువు ఆడపిల్లో, మగపిల్లవాడో తెలుసుకునే సదుపాయం వచ్చింది. దాని ఆధారంతో కొందరు తల్లులు, తమ గర్భంలో వున్నది ఆడపిల్ల అని తెలుసుకోగానే ఎబార్షన్ లకి పాల్పడుతున్నారు. ఈ విషయం మీద ఇంగ్లీషు వుమన్స్ మేగజైన్స్ అన్నింటిలోనూ వ్యాసాలు వచ్చాయి. జూలై వుమెన్స్ ఇరాలో "సైలెంట్ కై" అనే పేరుతో ఎబార్షన్స్ నిరసిస్తూ వ్యాసాలు రాసారు ఎవరో. ఇప్పుడు ఎమ్.ఏ. చదువుకున్నావిడ కూడా తన గర్భంలో వున్నది స్త్రీ శిశువైతే ఎబార్షన్ చేయించుకోడానికి వచ్చిందా? వీరేశలింగం నాటి నుంచి ఈనాటి వరకూ సాగుతున్న స్త్రీ స్వాతంత్రోద్యమానికి ఇదా ఫలితం. "తెలుసుకుని యేం చేస్తారు?" తీక్షణంగా అడిగింది. ఆ తీక్షణానికి బెదిరింది ఆ అమ్మాయి.
"మా అత్తగారికి, మా ఆయనకి మగపిల్లవాడు కావాలని వుంది. ఇంతకు ముందు ఇద్దరాడపిల్లలు పుట్టారు. ఇప్పటికే నన్ను చిన్నచూపు చూస్తున్నారు. ఈసారి కూడా ఆడపిల్ల పుడితే ఇహ నన్ను, నా పిల్లల్ని బ్రతకనివ్వరు వాళ్ళు. అంతకంటె ముందుగానే ఎబార్షన్ చేయించుకుంటే మరోసారి మగపిల్లవాడు పుట్టొచ్చు. "ఆ మాటల ధోరణి విని భరించలేక పోయింది మృదుల. "ఎందుకండీ? మీరూ మీ ఎమ్.ఏ, డిగ్రీలు? అసలు యిద్దరు పిల్లలకంటె యెక్కువ ఎందుకు మీకు? ఆడపిల్లలైతేనే మగపిల్లలైతేనేం? ఇద్దరు చాలరూ! అయినా యిప్పుడు లేనిపోని ట్రీట్ మెంట్స్ ప్రారంభిస్తే మీకూ, గర్భంలో వున్న శిశువుకి కూడా మంచిదికాదు. ఈ ఎలక్ట్రికల్ దేస్ అత్యవసర పరిస్థితులలో తప్ప శరీర భాగాల్లోంచి ప్రసరింప జేయటం అస్సలు మంచిదికాదు. జరిగిందేదో జరిగింది. ఈసారికి సుఖంగా పురుడు పోసుకుని ఇక్కడితో ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేసుకోండి."
"నా పరిస్థితి మీకర్ధంకాదు. ఊహించలేరుకూడా. మా అత్త నాకు విషం పెట్టదు. కిరసనాయిల్ పోసి అంటించదు. కాని అంతకంటె ఎక్కువగా సూటీపోటీ మాటలతో కాళ్ళకింద మంటలు పెట్టేస్తుంది. కళ్ళముందు నరకం చూపిస్తుంది. మా వారు అంత కంటె-ఈ ఇంట్లో నేనుండలేను అని వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఏ అర్దరాత్రికో వచ్చి అపుడు నామీద మళ్ళీ చికాకు పడ్తారు. ఈ బాధలన్నిటికంటె ఇప్పుడే యేదో ఒకటి తేల్చుకుని ఎబార్షన్ చేయించుకుంటేనే మంచిది."
మృదులకి ఆ యువతీ అత్త మీద భర్తమీద యేమాత్రం కోపం రాలేదు. ఆవిడ మీదే కోపం వచ్చింది. ఏమ్. ఏలు పాసైన ఈ యువతీ మణులంతా పరిస్థితి మార్చుకోవడానికి సిద్ధపడటంవల్లే సమాజం యీనాటికీ యిలా వుంది.
"మీ నిర్ణయం నాకు నచ్చలేదు. కడుపులో ఇంకా ఊపిరి పోసుకోని స్త్రీ శిశువుకి తల్లే శత్రువైతే ఇంకా లోకంలో ఆడదానికి దిక్కెవ్వరు? అంతేకాక సాధ్యమైనంత వరకు డాక్టర్లకి దూరంగా వుండటయే మానవ శరీరానికి మంచిది. ఈ పరీక్షల్లో ఆడో, మగో తేలటం. యెలా వున్నా గర్భంలో వున్నా శిశువుకుగాని, మీగ్గానీ, యేదైనా ప్రమాదం వస్తే యేం చేయగలరు?"
"హైద్రాబాద్ కి ఎవరో "లామ్ సా" టిబెట్ నుంచి వచ్చారట. ఆయనకి మూడో కన్ను వుందిట. అంటే జ్ఞాననేత్రం దాంతో అన్ని విషయాలు తెలుసుకోగలరట. ఆయన దగ్గిరకి వెళ్దామనుకుంటున్నాను. ఆయన ఎడ్రసు మీకేమైనా తెలుసా?" మతి పోతోంది మృదులకి. ఎమ్.ఏ. మాథమేటిక్స్ పాసైన అమ్మాయి నోటి నుంచి వస్తున్న మాటలేనా యివి.
"మూడో కళ్ళు, మంత్ర మంత్రాలు_ బూడిదలు_తాయెత్తులు ఇలాంటివేమీ మాకు తెలియవు. మేం నమ్మం. నమ్మకపోవటమే కాక నమ్మేవాళ్ళని నిరసిస్తాం. ఇలాంటి మాయల్లో రహస్యాలు బట్టబయలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఏమైనా మీ ధోరణి నాకేం నచ్చలేదు. మీ అత్తగారూ, భర్త అర్ధరహితంగా ప్రవర్తిస్తూంటే వాళ్ళకి నచ్చజెప్పండి. వినకపోతే యెదిరించండి. అంతేకాని వాళ్ళేదో అంటారని మీలో ఊపిరి పోసుకుంటున్న ప్రాణిని హత్య చేస్తారా?"
"మీరదృష్టవంతులు. నా పరిస్థితి మీ ఊహకి కూడా అందదు. ఎదిరించి ఆ యింట్లో బతకడం సాధ్యమనే అనుకుంటున్నారా?"
"అంతగా అసాధ్యమైతే సుఖంగా బయటికొచ్చేయండి. అన్ని యాతనలతో కూడిన సంసారాన్ని పట్టుకుని వెళ్ళాడకపోతేనేం?"
ఏదో వినరాని మాట వింటున్నట్లు విబ్రాంతితో చూసిందావిడ. "ఇద్దరు పిల్లల తల్లిని సంసారం వొదిలేసి వచ్చేయమంటారా? ఎంత తేలికగా అంటున్నారండి ఆ మాట. వచ్చి యేం చెయ్యాలిట? అత్తపోరు భర్త పోరూ బదులు ఇంట్లోవాళ్ళచేత, వీధిలో వాళ్ళచేత సూటీపోటీ మాటలు పడాలి. అంతేగా! రేప్పొద్దున్న నా పిల్లల మంచి చెడ్డలెవరు చూస్తారు? వాళ్ళకి పెళ్లి సంబంధాలు వస్తాయా?" అంది.
ఇంచుమించుగా ఆడవాళ్ళలందరికీ యిదే వంక దొరుకుతుంది. ధైర్యంగా వ్యవస్థ నిరసించకుండా తప్పించుకోవడానికి. ఆడపిల్ల భూమ్మీద పడీపడగానే పెళ్ళి తప్ప ఆ జీవితానికి మరో ధ్యేయం లేనట్లు మాట్లాడుతారు. ఆ పెళ్ళిని తరతరాలుగా మురిగిపోతున్న ఆచారాల సంప్రదాయాల దృక్పధంలోంచే చూస్తారు. ఆడపిల్ల అనగానే ఒకే ఆశయం! మంచి సంబంధం చూసి పెళ్ళిచేయాలి అని! ఒకే ఒక భయం పెళ్ళి కాదేమోనని. చదువుకున్న వాళ్ళు- చదువుకోనివాళ్ళు_ పల్లెటూళ్ళలోని వాళ్ళూ- పట్నాలలోని వాళ్ళూ అందరూ ఒకే ధోరణిలో ఆలోచిస్తున్నారు. ఏనాటికి గుర్తిస్తుంది యీ స్త్రీజాతి తమకీ ఒక వ్యక్తిత్వం వుందని. పెళ్ళనేది జీవితానికి ఒక అవసరమే కాని అదే పరమధ్యేయం కాదని ...."
"ఎబార్షన్ కోసం ప్రయత్నాలు చేయొద్దని- పరిస్థితులతో రాజీపడి తలవంచక - ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి మీ వ్యక్తిత్వాన్ని నిలుపుకుని చదువుని సార్ధక పరుచుకోమని సలహా. మీ విషయంలో ఇంతకంటె మేమేం చెయ్యలేం. ఒకవేల మీ అత్తగారు, భర్తగారు ఆడపిల్ల పుడితే నిన్ను బాధిస్తారనుకుంటే- వాళ్ళ నెదిరించి నువ్వు పురుడు పోసుకోవాలనుకుంటే- అందుకు తగిన యేర్పాట్లు చేస్తాం. నువ్వు స్వతంత్రంగా బ్రతకాలనుకుంటే యేదో ఒక ఉద్యోగం చూపించగలం."
ఆ అమ్మాయి మోహంలో ఆశాభంగం స్పష్టంగా కనిపించింది.
"వస్తాను" అని నమస్కారం చేసి వెళ్ళిపోయింది.
"ఫూల్స్" జాలిగా- చిరాగ్గా అనుకుంది మృదుల.
పాత ఇనప సామాను కొట్టులో తూకానికి అమ్మదగ్గ దశలో వున్నా సెకెండ్ హేండ్ హిందుస్థానీ కారులో హైదరాబాద్ సరస్వతీ ఎపార్ట్ మెంట్స్ ముందు దిగాడు డిటెక్టివ్ ఫల్గుణ్. అతను సోమనాథ్ ఏజన్సీస్ రిక్రూట్ చేసిన ప్రయివేట్ డిటెక్టివ్.
భాగవతార్ నోట్ చేసి ఇచ్చిన స్లిప్ వేపు ఒకసారి చూసుకున్నాడు. ఎపార్టుమెంట్ నంబర్ బి- సెవెన్. రెండతస్థులే. లిఫ్టుతో నిమిత్తం లేకుండా ఎక్కేయ్యచ్చు. అలా అయితే ఎవరికీ కనబడకుండా, అనుమానం రాకుండా తనపని చూసుకోవచ్చు. రెండో అంతస్థులోకెళ్ళి యేదో నంబర్ ఎపార్టుమెంట్ తలుపు తీసి వుండడం చూసి ఎదురుగా వున్నా కామన్ బాల్కనీలో కాస్సేపు అటూ ఇటూ తిరిగాడు. కొంతసేపటికి ఆ అపార్టుమెంటులోంచి హైహిల్డ్ ఘాస్ తో ఫ్రాక్ తో ఒక అందమైన అమ్మాయి తలుపుకి తాళం పెట్టి బయటికి వెళ్ళడం చూసాడు. ఆ అమ్మాయిని వెనకనించి మాత్రమే చూడగలిగాడు. అయినా భాగవతార్ చెప్పినదాన్నిబట్టి ఆ యింటిలో మృదుల తప్ప మరెవ్వరూ లేరు. కాబట్టి ఆవిడ మృదుల అయి వుంటుందని వూహించాడు. అప్పుడు యేదో నంబరు ఫ్లాట్ ముందు కెళ్ళి పరిసరాలు పరీక్షగా చూపాడు. ఎదురుగా వున్న మరో అపార్టుమెంటు కూడా తాళం వేసి వుంది. అతని దగ్గిర ఆటోమాటిక్ తాళాలు తెరిచే సాధనాలున్నాయి. తలుపు తెరుచుకుని బెడ్ రూమ్ లో కొచ్చి రూమ్ నాలుగు వైపులా చూసాడు. కలిగిన ఇంట్లో అందరి బెడ్ రూమ్స్ వున్నట్లుగానే వుంది. రోజ్ వుడ్ డబుల్ కాట్స్- యూ పోమ్ బెడ్స్ డ్రెస్సింగ్ టేబిల్, సైట్టేబిల్స్, ఒక సైడ్ టేబిల్ మీద ఫ్లవర్ వేజ్? వేజ్ లో రంగు రంగుల పూలు. ఆపూలు ప్లాస్టిక్ పూలు. అంచేత వాటిని రోజూ మార్చే అవకాశం లేదు. ఈలోగా తనొచ్చి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఫ్లవర్ వేజ్ లో వీడియో కెమేరా అమర్చి జాగ్రత్తగా తలుపులేసి వచ్చేసాడు. గ్రౌండ్ ప్లోర్ లో ఒక ఎపార్టుమెంటులో వీడియో పార్లర్ నడుపుతున్నారు. అక్కడ సైమల్ టేనియస్ గా అయిదారు టి.వి. స్కీన్స్ వున్నాయి. వాటి మధ్య పార్టిషన్ వుంది. వీడియో పార్లర్ లో మెంబర్ షిప్ తీసుకున్న వాళ్ళు కొంత అద్దె చెల్లించి గ్రూప్ గా గాని, వొంటరిగా గాని తమకి కావలసిన వీడియో కేసెట్స్ స్కీన్ చేయించుకొని రకరకాల సినిమాలు చూసుకోవచ్చు. ఫల్గుణ్ వీడియో పార్లర్ యజమానితో మాట్లాడి టి.వి. స్క్రీన్ తో సహా వున్న ఒక పార్టిషన్ విభాగాన్ని నెల రోజులకి అద్దెకు తీసేసుకున్నాడు. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ సహాయంతో ప్లవర్ వేజ్ లో ఫిక్స్ చేసిన వీడియో కెమెరా తీసే ఫిల్మ్ అంతా టి.వి. స్క్రీన్స్ మీద ప్రసారమయ్యే ఏర్పాటు చేసుకున్నాడు. స్క్రీన్ మీద నుంచి వీడియో కేసెటులో రికార్డు చేసుకోవడం తేలిక, ఆ వీడియో పార్లర్ లో ఒకరు చూసుకునే కేసెట్స్ వల్ల మరొకరికి డిస్టర్ బెన్స్ లేకుండా "ఇయర్ ఫోన్స్" కూడా సప్లయి చేస్తారు. అంచేత ఫల్గుణ్ కి మిగిలిన వాళ్ళవల్ల డిస్టర్ బెన్స్ వుంటుందన్న భయం కూడా లేకపోయింది. సోమనాథ్ ఏజన్సీస్ ఫల్గుణ్ కి వీడియో రికార్డింగ్ పని అప్పజెప్పి సహదేవుడికి మృదులని ఫాలో అయి ఆమె దినచర్య అంతా రిపోర్టుచేసేపని అప్పగించారు సహదేవ్ రిపోర్టు. ఫల్గుణ్ వీడియో కేసెట్ సోమనాథ్ ఏజన్సీ ప్రోప్రయిటర్ కి అప్పగించాలి.