Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 8


    పట్టరాని ఆనందంతో ఇంటికి తిరిగొచ్చాడు భాగవతార్. ఇంట్లో మృదుల లేదు. కోపం - ఆవేశం- నిగ్రహించుకోలేకపోయాడు. స్టయిల్ గా చేతిమీద వేసుకొచ్చిన చందన మాలలు టి.వి. మీదికి విసిరికొట్టాడు. పూలదండ చింపు పూరేకులన్నీ ఇంటినిండా చిమ్మాడు. ఆవేశం చల్లారలేదు. రగిలిపోతూ కూర్చున్నాడు ఆ రోజుతాడో - పేడో తేల్చుకోవాలన్న దృడ సంకల్పంతో టీ-పాయి మీద మడతపెట్టిన న్యూస్ పేపరులో ప్రింటైన స్త్రీ ఫోటో అతని చూపుల నాకర్షించింది. "మృదులలా వుంది"_ అనుకుంటూ ఫొటో చేతిలోకి తీసుకున్నాడు. ఫొటో మృదులదే. మృదుల ఫొటో పేపరులో ఎందుకు పడిందా అని అనుకుంటూ కింద మేటర్ చదివాడు.
    "శ్రీమతి మృదులా భాగవతార్ ఆధునిక యువతీ లోకానికి కరదీపిక అంటే అతిశయోక్తి లేదు. ఈమె ఆధ్వర్యంలో "కరదీపిక" అనే సంస్థ ప్రత్యేకించి మహిళల సమస్యలను పరిష్కరించడానికే నిర్వహింపబడుతోంది. "కరదీపిక" సంస్థకి హైదరాబాద్ లో ప్రధాన కార్యదర్శి శ్రీమతి మృదులా భాగవతార్. ఈమె స్వయంగా ఆంద్రప్రదేశ్ లో అన్ని ప్రదేశాలకి పర్యటించి స్త్రీల సమస్యలు విచారించి అవి పరిష్కరించడానికి పూనుకుంటారు. ఇంకా పాత వాసనలు వదలక ఆర్ధిక స్వాతంత్ర్యము లేక పూర్తిగా భర్త మీద, అత్తమామల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఈ నాటికి వారి అత్యాచారాలకి గురవుతూన్న అభాగినులకు ధైర్యం చెప్పి ఆత్మ విశ్వాసం కలిగించి చట్టబద్ధంగా రక్షణ కలిగిస్తారు. ఇటీవల రామచంద్రపురంలో ఒక యిల్లాలిని భర్త నిష్కారణంగా అనుమానించి చిత్రహింసల పాలు చేస్తోంటే ఆమెకు చట్టపరంగా రక్షణ కలిపించి ఆ భర్త బారి నుంచి విముక్తి కలిగించారు. ఈ సంఘంలో ఔత్సాహికులైన యువతులు చాలా మండి పని చేస్తున్నారని, మా విలేఖరి వ్రాస్తున్నాడు."
    వార్త చదివి చికాకు పడిపోయాడు భాగవతార్. మృదులకీ లేనిపోని గొడవలన్నీ దేనికి. తను బోలెడు సంపాదిస్తున్నాడు కదా! హాయిగా తిని ఇంట్లో కాలక్షేపం చేసుకోరాదు. ఈ పెంటంతా దేనికి? ఛ. ఛ. ఛ. డోర్ తెరుచుకుంది. లవండర్ పరిమళాలు వెదజల్లుథూ చిరునవ్వులతో ఆహ్లాదతరంగంలాగ లోపలికొచ్చింది మృదుల బిక్కమొహంతో సోఫాలో కూర్చున్న భాగవతార్ ని చూసి, "హాయి! వచ్చేసావా? నీక అంటే ముందే వద్దామనుకున్నాను. కుదరలేదు" అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి, "బాగా జరిగిందా పాట కచ్చేరీ, అరె! గదంతా యీ పూరేకులేమిటి? పిచ్చిబాబు పూలు పడకమీద జల్లుకుంటారు గాని నేలమీద కాదు. దేన్ని ఎలా వాడుకోవాలో కూడా తెలియదు ఈ మొద్దబ్బాయికి" అని గడ్డం పట్టుకుని మొహం పైకెత్తి కళ్ళలోకి చూసి నవ్వింది.
    ఎప్పటిలాగే తన్ని తనను మర్చిపోసాగాడు భాగవతార్. ప్రయత్నంమీద తనని తనను అదుపులోకి తెచ్చుకుని, "ఉండు! అలా కూర్చో. ఈ పేపరలో ఫొటో యేమిటి?" అన్నాడు సాధ్యమైనంత కోపంగా, పేపరువైపు సైగ చేస్తూ.
    "అదా!" నిర్లక్ష్యంగా నవ్వింది. "నాకిలాంటి పబ్లిసిటీ యిష్టముండదు. అయినా ప్రెస్ వాళ్ళు ఊరుకోరు. ఈ మధ్య పత్రికా లోకంలో కూడా ఆడవాళ్ళమీద సానుభూతి పెరిగినట్లుంది. ఇంటగాని, బయటగాని ఆడవాళ్ళమీద ఎలాంటి అత్యాచారాలు జరిగినా పత్రికల కెక్కించేస్తున్నారు. పోనీ ఇదీ ఒకందుకు మంచిదే. ఈ దేశంలో యింకా ఎక్కడైనా పాతకాలపు అమ్మమ్మలుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదేనా సాయం కావాలంటే మా దగ్గిరకొస్తారు" అంది.
    "నువ్వు యిలాంటి వాటిల్లో తిరగడం నాకిష్టం లేదు" చాలా సీరియస్ గా అన్నాడు భాగవతార్.
    పెంకెగా నవ్వింది.
    "నేను రోబట్ ని కాను, రిమోట్ కంట్రోల్ నీ చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ఆడించడానికి, ప్రాణం వున్న వ్యక్తికి. నా యిష్టా యిష్టాలు నాకున్నాయి. నా అభిప్రాయాలు మరొకరిమీద రుద్దను, మరొకరివి నామీద రుద్దుతే ఊరుకోను" స్పష్టంగా చెప్పింది.
    "పెళ్ళనేది స్త్రీ పరుషుల మధ్య పవిత్రమైన బంధం అని నువ్వు వొప్పుకున్నా వొప్పుకోకపోయినా ఒకరికొకరు లాయల్ గా వుంటామని వొప్పందం వుంది. అదేనా వొప్పుకుంటావా?"
    "ఒప్పుకుంటాను."
    "మరి భార్యాభర్తల్లో ఒకరు లాయల్ గా లేకపోతే రెండో వ్యక్తి సహించగలరా?"
    "సహించలేక పోవచ్చు."
    "మరి యిప్పుడు నువ్వు చేస్తున్న పనేమిటి?"
    "నేను నీకు లాయల్ గా లేనని ఎవరు చెప్పారు? లయన్ గానే వున్నాను. కేవలం నీ వూహలతో లేనిపోనిది ఆరోపించుకుని నువ్వు బాధపడుతూంటే జాలేస్తోంది."
    "అంటే నువ్వు బాధపడటం లేదా?"
    "అఫ్ కోర్స్ నీ బాధ చూడలేక కాస్త బాధ కలుగుతుంది"
    "స్టాపిట్! నువ్విలా మగవాళ్ళందరితూనూ మాట్లాడటం, యెక్కడికంటే అక్కడికి వెళ్ళడం_ నేను సహించను. నిజం చెప్పు. మొన్న వున్నట్టుండి నా పాట కచ్చేరీలోంచి నువ్వెక్కడి కెళ్ళావు? రాత్రి వరకు ఎక్కడున్నావు? నిజం చెప్పు" మరోసారి రెట్టించాడు.
    "నిజం చెప్పనా!" నవ్వుతున్నాయి మృదుల కళ్ళు కొంటెగా.
    "చెప్పు."
    "భరించలేవేమో? నా సమాధానం విన్నాక ఎందుకడిగానా? అని బాధపడతావేమో?"
    ఉత్కంఠ పెరిగిపోతోంది భాగవతార్ లో. ఎంత సాహసం, తన ప్రియుడి పేరు చెప్పేస్తుందన్న మాట. "చెప్పు", అన్నాడు పిడికిళ్ళు బిగించి.
    "దేవకి దగ్గరకి" కింది పెదవి పళ్ళ మధ్యకి లాక్కుని నవ్వు ఆపుకుంటూ ఛాలెంజ్ చేస్తున్నట్లు అతనివైపు చూపించి.
    ఒక్కసారిగా గాలి తీసేసిన రబ్బరు బెలూన్ లా అయిపోయాడు భాగవతార్. అతని మొఖం పాలిపోయింది. కనురెప్పలు రెపరెపలాడాయి.
    మృదుల రాజహంసలా అతడి దగ్గిరగా వచ్చి, "నిజం చెపితే భరించలేవు- అన్నానా? కాస్సేపు రెస్టు తీసుకో. నేను స్నానం చేసి బట్టలు మార్చుకుని వస్తాను."
    "యూ టాట్ మి హవ్ టు లవ్" సాంగ్ హమ్ చేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది.
    రక్తం సలసల మరుగుతోంది భాగవతార్ కి. దేవకి గురించి మృదులకెలా తెలిసింది? పెళ్ళికాక ముందే తెలుసా? పెళ్ళేయ్యాక తెలుసుకుందా? ఎంతవరకు తెలుసు? దేవకి ప్లాన్స్ యేమిటి? అవి మృదులకి తెలుసా? ఎన్ని రోజులు నైట్ మేర్స్ లో గడిపాడు దేవకి విషయంలో ఇప్పుడిప్పుడే మర్చిపోతూంటే....
    భాగవతార్ బుఱ్ఱలో ఆలోచనలు దేయ్యప్పిల్లాల్లా గోల చేస్తూంటే దేవకన్యలా తయారై వచ్చింది మృదుల. తియ్యగా నవ్వుతూ.
    "భోజనం చేసేసావా? నాతో చేస్తావా?" అంది.
    ఉక్రోషంతో ఉడికిపోయాడు. ఇలా లాభం లేదు. మృదుల తనకి దొరకదు. రెడ్ హేండ్ గా పట్టుకుని దోషిగా నిలబెడితే తప్ప యేం చేయలేడు. అందుకు ....
    ఒక ఉపాయం స్పురించింది.
                               *    *    *
    "నార్త్ అమెరికా తెలుగు సంఘంనించి అమెరికా రమ్మని నాకాహ్వానం వచ్చింది. రానుపోనూ ఖర్చులు భరించడమే కాక నా పాటకచ్చేరీకి బహుమానం డాలర్లలో యిస్తామని రాసారు. ఒక్కనెల రోజుల టూర్ ప్రోగ్రాం వుండొచ్చు" మృదులతో చెప్పాడు భాగవతార్. మృదుల సంతోషంతో చప్పట్లు చరిచింది.
    "కంగ్రాట్యులేషన్స్. ఐ యామ్ వెరీవెరీ హేపీ. భలే లక్కీ ఛాన్సు" అంది హుషారుగా.
    "లక్కీ ఛాన్సట.... లక్కీ ఛాన్సు. నెల రోజులు నేను లేకపోతే మాత్రం బెంగ బాధ వుండదు కాబోలు. అవునులే ఎందుకుంటుంది? నేను వెళ్ళగానే హాయిగా తన కార్యకలాపాలు మరింత_ జోరుగా సాధించుకోవచ్చని సంబరపడిపోతోంది_ తెలుస్తోంది" అనుకున్నాడు మనసులో. పైకి ఓ వెఱ్ఱి నవ్వునవ్వాడు నవ్వుతున్న మృదులను చూసి.
    "నువ్వు కూడా నాతో రాకూడదూ?" అడిగాడు కావాలని.
    "నిజంగా నాకూ రావాలనే వుంది. కాని మా కరదీపిక కార్యాలయానికి నలుగురు స్త్రీల సమస్యలొచ్చిపడ్డాయి, అవి పరిష్కరించాక కాని నేను కదలడానికి వీల్లేదు. ఫరవాలేదులే, నీకిలాంటి ఛాన్సులు బోల్డు బోల్డు వస్తాయి ముందు ముందు."   
    మళ్ళీ మళ్ళీ వుపయోగించుకుంటుందిట ఛాన్సు. ముందు ముందు కూడా యిలాగే వుంటుందని ఆశ కాబోలు .అమెరికానించి రాగానే.... మనసులో నవ్వుకోబోయి పైకే గట్టిగా నవ్వేసి తెల్లబోయి చూస్తున్న మృదులను చూసి తనూ తెల్లబోయాడు. అప్పుడు నవ్వింది మృదుల. భాగవతార్ అమెరికా ప్రయాణం దగ్గిరపడింది. మరునాడు అమెరికా వెళతాననగా తన పి.ఎ. ని మృదులకి పరిచయం చేసి "ఇతని పేరు నక్షత్ర, నేను లేనప్పుడు యేం కావాలన్నా ఇతడ్ని అడగొచ్చు. ప్రతిరోజూ" యేదో సమయంలో నిన్ను కలుసుకుంటాడు" అన్నాడు.
    ఎయిర్ పోర్టుకి మృదుల కూడ వెళ్ళింది. భాగవతార్ మృదుల ఒకరు చెక్కిలిమీద మరొకరు ముద్దులు పెట్టుకుని గుడ్ బై చెప్పుకున్నారు. ఫ్లాష్ కెమేరాలు క్లిక్ క్లిక్ మన్నాయి. చిరునవ్వుతో వెలిగిపోతూ చెయ్యి వూపింది మృదుల. మృదులకి సమాధానంగా చెయ్యి వూపుతూనే కొంతదూరంలో నిలబడి చిన్న డైరీలో యేదో నోట్ చేసుకుంటున్న వ్యక్తికి సైగ చేసి పర్సనల్ చెకింగ్ క్యూలోకి వెళ్ళిపోయాడు భాగవతార్.
                              *    *    *
    "కరదీపిక" కార్యాలయానికి ప్రత్యేకించి ఒక ఫ్లాట్ తీసుకుంది మృదుల. ఆ సంస్థలో బాగా డబ్బున్న గృహిణులు వుండటంవల్ల, మృదుల లాంటి చలాకీగా వుండే యువతులు చందాలు పోగు చేయడానికి ముందుకు రావడంవల్ల ఫండ్స్ కి పెద్దగా కొరత లేకుండా నడుస్తోంది ఆ సంస్థ. ఆ రోజు కార్యాలయానికి పాతికేళ్ళున్న అమ్మాయి వచ్చింది. బిడియస్తురాలు వొంటినిండా పైట కప్పుకొని సంకోచంగా దిక్కులు చూస్తూ "కరదీపిక కార్యాలయం ఇదేనాండీ" అంటూ లోపలికొచ్చిన ఆ అమ్మాయిని "రండి కూర్చోండి. బయట బోర్డు వుందిగా! చదువుకోలేదా? చదువు రాదా?" అంది మృదుల. ఆ అమ్మాయి కూర్చుని సిగ్గుపడుతూ నవ్వి, "ఏమ్. ఏ. మేథమెటిక్స్ పాసయ్యాను" అంది. మృదులకి ఆశ్చర్యంతో పాటు చికాకూ వచ్చింది. ఈ బి.ఏ.లు, ఎమ్.ఏ.లూ పాసైన అమ్మాయిలు తమ సమస్యలు పరిష్కరించుకొని చదువుకోని మిగిలిన ఆడపిల్లలకి మార్గదర్శకంగా వుండటానికి మారుగా వెళ్లే అప్పలమ్మలకంటే అధ్వాన్నంగా సమస్యలంటూ రావడం సహించలేకపోయింది. ఆ అమ్మాయి వయస్సు ముప్పైకంటె ఎక్కువుండవు కాని అప్పటికే జీవితంలో అశాంతి_ చికాకు_ బాధలు- ఎన్నెన్నో చవి చూసినట్లు ఆవిడ నుదుటిమీద ముడతలు- కళ్ళ కింద నల్లటి చారికలు చెపుతున్నాయి. 

 Previous Page Next Page