టి.వి. స్క్రీన్ ముందు కూర్చున్న ఫల్గుణ్ ఆనందంతో పొంగిపోయాడు. టి.వి. స్క్రీన్ మీద అమ్మాయి, అబ్బాయి గదిలోకి వస్తున్న దృశ్యం వెనకనుంచి కనిపించింది. వాళ్ళ ముఖాలు కనపడటం లేదు. టి.వి. స్క్రీన్ మీద నుంచి కేసెట్ లోకి రికార్డ్ చెయ్యసాగాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వాళ్ళిద్దరూ ఏదో పాప్ మ్యూజిక్ రికార్డు పెట్టుకుని స్టెప్స్ వేస్తూ డాన్స్ చేసారు. తరువాత డబుల్ కాట్స్ మీదకి వాలిపోయారు. ఆ తరువాత కూడా చూడాలని, రికార్డు చెయ్యాలని ఫల్గుణ్ చాలా ఉబలాట పడ్డాడు కాని వాళ్ళు లైట్ ఆర్పేయడం వల్లనో, కెమేరాని ఫేస్ చెయ్యకపోవడం వల్లనో స్క్రీన్ మీద నల్లటి నీడలు తప్ప మరేమీ రాలేదు. సంతోషంగా ఆ కేసెట్ తీసుకుని సోమనాథ్ డిటెక్టివ్ ఏజన్సీస్ లో చీఫ్ డిటెక్టివ్ సోమనాథ్ కి అప్పగించాడు.
* * *
ఉదయం తొమ్మిది గంటలకల్లా చాలా డ్యూటిఫుల్ గా భాగవతార్ ప్లాట్ కి వచ్చి కూర్చుంటాడు అతని పి.ఎ. నక్షత్ర్. అతనికి యాభైయైదేళ్ళు. మనిషి పెద్ద అందగాడు కాదు కాని సాత్వీకంగా విద్వత్తు ఉట్టిపడుతుంటాడు. ఆ కారణం చేతనే భాగవతార్ నిర్భయంగా అతన్ని మృదులకేం కావాలో చూడమని చెప్పాడు. ప్రభాత సమయాన మంచు బిందువుల మధ్య స్నిగ్ధంగా మెరిసే విరిసిన గులాబిలా కళకళలాడుతూ కనిపించే మృదుల ఎంతో ముచ్చటగా వుంటుంది. అతనికీ యిద్దరాడపిల్లలున్నారు. పెద్దమ్మాయికి ఇద్దరు పిల్లలు. పైకి యేం మాట్లాడకుండా గుంభనంగా వుంటుంది కాని లోలోపల యెంతో విషాదాన్ని దాచుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఎందులోనూ ఉత్సాహం చూపించదు. పుట్టింటికి రమ్మంటే "ఇప్పుడు కుదరదులే నాన్నా! చాలా పనులున్నాయి" అంటుంది పెద్ద ఆరిందలా. అల్లుడు ముభావంగా ముక్తసరిగా మాట్లాడి, ఎక్కువ మాట్లాడితే తన గొప్పతనం ఎక్కడ తక్కువ అవుతుందోనన్నట్లు వ్యవహరిస్తాడు.
రెండో కూతురికి ఇంకా పిల్లలు లేరు. కానీ ఎప్పుడు చూసినా పగలడానికి సిద్ధంగా వున్న నీటికుండలా కనిపిస్తుంది. అత్తమామల మీద, భర్తమీద నేరాలు చెప్పడం తప్ప మరో మాటలు రావా అన్నట్లు ప్రవర్తిస్తుంది! అహర్నిశలు వాళ్ళమీద నిస్సహాయమైన కోపంతో లోలోపల రగిలిపోయి మానసికంగా దెబ్బ తీనదుకదా. అని భయం వేస్తుంది.
"ఈ వెధవ సంసారం నాకొద్దూ", అని రోజుకి పదిసార్లయినా అనుకుంటుంది. కాని ఆ సంసారం వొదిలి రాలేదు. రమ్మని చెప్పడానికి తనకీ, తన భార్యకీ కూడ నోరురాదు. చూస్తూ చూస్తూ సంసారం పాడుచేసుకోమని యెలా చెప్పగలరు ఆడపిల్లకి.
ఈ అమ్మాయి ఎంత హాయిగా నవ్వుతుంది. మనసులో యే కల్మషాలు లేనివాళ్ళు తప్ప అలా నవ్వలేరు. సృష్టిలో అందాలన్నీ తనవే- జీవితంలో ఆనందమంతా తనదే - అన్నట్లు నిశ్చింతగా నవ్వుతూ తుళ్ళుతూ వుంటుంది. అలాగని జీవితంపట్ల ఒక అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా సోమరిగా వుండదు. మృదుల తన గదిలో టి.వి. స్క్రీన్ మీద ప్రాజెక్టు చేసుకునే వీడియో కేసెట్స్ నక్షత్రం కూడా చూసాడు. అవి సినిమాలూ కావు, వినోద కార్యక్రమాలు కావు. పల్లెటూళ్ళల్లో ముఖ్యంగా శ్రామికులలో స్త్రీల శ్రమ జీవితాన్ని చిత్రించినవి. ఒకసారి అడిగాడు. "ఇవి మీకెందుకు పనికొస్తాయి? ఇలాంటి వీడియో కేసెట్స్ నేనెక్కడా చూడలేదు."
"ఇవి మా "కరదీపిక" కార్యాలయంలో మేమంతా చూస్తాము. వీళ్ళని ఎలా ఎడ్యుకేట్ చెయ్యాలా అని రకరకాల మార్గాలు ఆలోచిస్తున్నాము. ఇప్పటికే మాలో కొందరు కొన్ని రూరల్ ఏరియాస్ ఎడాప్ట్ చేసుకుని అక్కడి స్త్రీలకు విజ్ఞానం కలిగించడానికి పుస్తకాల ద్వారా- వీడియోల ద్వారా- రికార్డులద్వారా ప్రయత్నిస్తున్నారు. అయినా చదువుకున్నవాళ్ళు మాత్రం ఏమంత చైతన్యవంతంగా జీవితాలు ఎదుర్కొంటున్నారు గనక. వీళ్ళల్లో లేని సంస్కారం వాళ్ళకెలా వస్తుంది?"
నిట్టూర్పు వదిలాడు నక్షత్ర్ .తన కూతుళ్ళిద్దరూ బి.ఏ.లు పాసయిన వాళ్ళే. తమ సమస్యల నెదుర్కోవడానికి యేం చేస్తున్నారు వాళ్ళు.
నక్షత్ర్ లో కనిపించిన సంచలనం అర్ధం చేసుకుని మళ్ళీ అంది మృదుల, "ఇరవై అయిదు-పది- ఎనబై అయిదు హిందూస్తాన్ టైమ్స్ లో ఒక వార్త వచ్చింది. ఢిల్లీలోని కృపలానీ ఆసుపత్రిలో రోజుకు సగటున ఇద్దరు స్త్రీలు మాయమౌతూంటారట. ఆ ఆసుపత్రికి రాజధాని రెడ్ లైట్ ఏరియాకి సంబంధించిన స్త్రీలు కొందరు చికిత్సకోసం చేరారట. నిర్లక్ష్యమైన వైద్య విధానాలు భరించలేక చాలామంది స్త్రీలు పారిపోతుంటారట. అలా పారిపోయిన వారిని అధికారులు వైద్య సలహాలు తిరస్కరించి పారిపోయిన వారికింద జమకట్టి కేసు మూసేస్తారట. హాస్పిటల్ సిబ్బందితో జరిగిన సంభాషణలో ఇది చాలా మామూలు విషయంగా చెప్పారట.
మరోచోట ఇరవై రెండు సంవత్సరాల సాధనా దేశిలే అనే ఇల్లాలిని ఆడపిల్లని కన్నందుకు ఆమె భర్త. అత్తగారూ కాల్చి చంపేసారట. మనదేశంలో ఆడవాళ్ళు బుద్ధిగా కాలేజీల కెళ్ళి కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలు వాళ్ళకేవిధంగా వుపయోగిస్తున్నాయో చెప్పండి?"
కంఠంలో ఆవేశం వున్నా పెదవులమీది చిరునవ్వు చెరగలేదు. కళ్ళల్లో కాంతి తరగలేదు. ఆ చిరునవ్వులోని చైతన్యపు మెరుపుల్ని మనసులో మెచ్చుకుంటూ, "ఔనమ్మా! డిగ్రీలు సంపాదించుకున్న మన నాగరిక స్త్రీలు చదువుకోని అనాగరిక గ్రామీణులకంటె ఏ విధంగానూ మెరుగ్గా లేరు. అందుకే, "సరిసో విపరీత శ్చేత్ సరసత్వం నముంచతి. సాక్షరా విపరీతాశ్చేత్ రాక్షసా ఏకకేవలం" అన్నారు.
"అంటే?"
"సరసుడు విపరీతంగా మారిన సరస్వతం పోదు. కాని అక్షరాస్యుడు విపరీత పరిస్థితుల్లో రాక్షసుడై పోతాడు. ఈ శ్లోకంలో శబ్దాలకి సంబంధించిన శ్లేష కూడా వుంది. "సరసా" అనే అక్షరాలు తిరగేసినా "సరస", అనే వస్తుంది. "సాక్షిరా", అనే శబ్దం తిరగేస్తే, "రాక్షసా" ఔతుంది."
"చాలా బాగుంది. మీకింత పాండిత్యం వుందని నాకు తెలియదు. నిజంగా చదువుకున్నవాళ్లే ఆ తెలివిని వక్రమార్గంలో పెట్టి మరింత రాక్షసులవుతున్నారు" అంది.
ఫోన్ మోగింది. వెళ్ళి అందుకుంది మృదుల. అవతలివాళ్ళు చెప్పింది విని, "ఇప్పుడే వస్తున్నాను," అని పెట్టేసింది. నక్షత్ర్ దగ్గిరకొచ్చి, "ఇది విన్నారా అంకుల్! మన ఆంధ్రప్రాంతాలకి యేవో మూలికలు సేకరించడం కోసం ప్రభుత్వంవారి అనుమతి పొంది "మింగియార్" అనే టిబెటియన్ ఇక్కడ వుంటున్నాడు. అతడికి జ్ఞాననేత్రం వుందని దాని సహాయంతో డాక్టర్లకి అంతుపట్టని రోగాలను గ్రహించి సునాయాసంగా నయం చేస్తాడని వార్త ప్రచారమైందట. చాలామంది అతని సంఘంలో సభ్యులుగా చేరుతున్నారట. వెళ్ళి అదేదో చూస్తాను. ఏమీ అనుకోరుగా! మీరు ఎక్కడికెళ్ళాలో చెపితే అక్కడ డ్రాప్ చేసి వెళతాను" అంది.
ఏదో ఆప్యాయత పొంగి వచ్చింది నక్షత్ర్ లో. భాగవతార్ కి పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటినుంచి అతని దగ్గర పి.ఏ.గా పని చేస్తున్నారు. ఏనాడూ "అంకుల్" అని పిలవలేదు. కారులో లిఫ్ట్ యిస్తానని అస్సలనుకోలేదు. "నువ్వు చాలా తక్కువవాడివి సుమా!" అని హెచ్చరిస్తున్నట్లే ప్రవర్తించేవారు. భాగవతార్ వెళుతూ తనతో చెప్పిన మాటలు బాగా గుర్తున్నాయి నక్షత్ర్ కి. "మృదుల చిన్నపిల్ల, తనకేం కావాలంటే అది అమర్చి పెట్టండి. అలాగే యేం చేస్తూంటూందో కూడా కనిపెట్టి వుండండి."
ఈ మాటలు వింటున్నప్పుడు మనసులో, "నా మొగుడికి తగని అనుమానం నాన్నా! కూరగాయలకోసం బయటికెళ్ళినా, ఇంటికొచ్చిన స్నేహితురాలిని వీధి దాకా సాగినంపినా అనుమానమే. దానికితోడు ఇంట్లో పనిచేసేదాన్ని నా మీద కాపలాకి పెడతారు. ఎంత అవమానమో చూడు." ఏడుస్తూ అంటూన్న కూతురు గొంతు ప్రతిధ్వనించింది. ఉస్సూరని నిట్టూర్చి చెప్పినట్టు చెయ్యడానికి వొప్పుకున్నాడు. ఇప్పుడీ అమ్మాయిని చూస్తూంటే గౌరవం కలుగుతోంది. ప్రేమ పొంగుకొస్తోంది. ఆడపిల్లలంతా యిలా వుంటే యెంత బావుణ్ను అనిపిస్తోంది.
నక్షత్ర్ ని కార్లో తన పక్కన కూర్చోబెట్టుకుని అతను దింపమన్న చోట దింపేసి మింగియార్ బసచేస్తున్న యింటికి కారు డైరెక్షన్ మళ్ళించింది.
భాగవతార్ ఫ్లాట్ కి కొంత దూరంలో నిలబడి మృదుల రాకపోకలు గమనిస్తూన్న సహదేవ్ మృదుల నక్షత్ర్ తో బయలుదేరగానే మోటార్ సైకిల్ మీద అనుసరించాడు. నక్షత్ర్ దిగిపోగానే తనడైరీలో "నడివయసు పెద్ద మనిషితో బయల్దేరింది. దారిలో ఆ మనిషిని దింపేసి యెడమవైపుకు మళ్ళింది" అని రాసుకున్నాడు. తరువాత మింగియార్ ఇంటివరకు అనుసరించాడు. మింగియార్ ఇంట్లోకి వెళ్ళిన మృదుల యెంతకీ బయటికి రాకపోయేసరికి ఏం చేయాలో తోచక గేటుదగ్గర కాపలావాడ్ని "ఈ ఇల్లెవరిది?" అని అడిగాడు.
"అయ్యగారిది."
"అయ్యగారంటే ఎవరు?"
"స్వామివారు."
"ఈ ఇంట్లో యెవరెవరుంటారు?"