"నా నోట నీకు పాట వినాలనుంటే రేపు మీ అమ్మగారి ఎదుట పాడతాను. నా నోట నీకు కథ వినాలనుంటే రేపు మా అక్క కొడుక్కి చెప్పినప్పుడు వినొచ్చు...." అన్నదామె.
"మరేం చేద్దాం...." అన్నాడతను.
"మన ఏకాంతవాసం కవులు కథలుగా, కావ్యాలుగా వర్ణిస్తే....దాన్ని గాయకులూ గొంతెత్తి పాడాలి" అన్నదామె.
"అంటే?"
ఆమె అదే పనిగా నవ్వసాగింది.
"నవ్వుతావేం?"
"ఇంత వరకూ జరిగింది నీ స్నేహితులెవరికయినా చెప్పు. వాళ్ళూ నాలాగే నవ్వుతారు" అంటూ యువతి మళ్ళీ నవ్వసాగింది.
అక్కడ వరకూ కథ చెప్పి కోమలి నవ్వసాగింది.
ఆమె విసురు నాకు అర్ధమయింది. అప్పుడు నాకు కోమలి మీద జాలి కూడా కలిగింది.
కోమలి తెలివయినది కావచ్చు కానీ ఆమె వయసు పదహారేళ్ళు మాత్రం ఆ వయసు ఆమెను తొందర పెడుతూంటే చిన్న తప్పటడుగు వేస్తోంది. అధి తప్పటడుగు అని ఆమెకు తెలియదు. దాన్ని ఆమె ప్రేమ అనుకుంటోంది.
"సారీ....కథ సగంలో ఆపేశాను...." అన్నదామె.
"కథ ఇంకా చెప్పొద్దులే" అన్నాను.
"మరి..."
"నేను చెప్పేది విను" అన్నాను.
"ముందే నీకు చెప్పాను. ఈ రోజు ఎంత కష్టమయిన పని చెప్పినా చేస్తానని" అన్నది కోమలి నేను చెప్పేది వినడం చాలా కష్టమయిన పనిగా....ఓ విసురు మళ్ళీ విసిరింది.
"అవకాశం వచ్చింది కదా అని ఉపయోగించుకునేరకం కాదు నేను. చిన్నతనం నుంచీ నా తనువు నీతి నియమాలతో పెరిగింది. తప్పొప్పుల గురించీ, సంప్రదాయాల గురించీ నాకు కొన్ని అభిప్రాయాలేర్పడి ఉన్నాయి. అవన్నీ కలిసి నీవిప్పుడు తప్పటడుగు వేస్తున్నావనీ. నిన్ను హెచ్చరించమనీ ప్రోత్సహిస్తున్నాయి. నా చిన్ననాటి స్నేహితురాలిగా నిన్ను హెచ్చరిస్తున్నాను మన ఆలోచనలు తప్పుదారులు తొక్కకూడదు. మనం తప్పు చేయకూడదు..." అన్నాను.
కోమలి ముఖంలో కోపం తొంగి చూసింది.
"ఒక కన్నెపిల్ల నీ ముందు తన హృదయాన్ని పరిచినిన్నే ప్రేమించానంది. తనను తాను నీకు ఆత్మార్పణ చేసుకునేందుకు సిద్దంగా ఉన్నానంది! దానికి నీవు తప్పటడుగు అన్న పేరు పెట్టి వ్యవహారాన్ని రసాభాస చేశావు. నా మనసు పాడు చేశావు వెళ్ళిపో ఇక్కడి నుంచి..."
ఆమె అన్నదే చాలన్నట్లు నేను మంచం దిగాను.
"నిజంగా వెళ్ళిపోతున్నావా?" అన్నదామె!
నాకు జాలి వేసింది. "నువ్వు వెళ్ళిపొమ్మన్నావని మాత్రం కాదు" అన్నది.
"నేను అందంగా లేనా?" అన్నది కోమలి.
"నా తల్లిదండ్రులు నాకు శ్రీరామచంద్రమూర్తి అన్న పేరుపెట్టారు. ఆ పేరు నిలుపుకోవాలన్నది నా కోరిక" అన్నాను.
కోమలి నా వంక అదోలా చూసి "అయితే పెళ్ళయ్యాక భార్యను అడవులపాలు చేస్తావా?" అన్నది.
"నేను ఆయన తప్పుల్ని అనుకరించను. ఒప్పులనే ఆదర్శంగా తీసుకుంటాను" అన్నాను.
కోమలి మళ్ళీ కిసుక్కున నవ్వింది "శ్రీరామచంద్రుడు తను చేసిన తప్పుల్ని సవరించుకోవడం కోసం కృష్ణావతారం ఎత్తాడు. ఆ సంగతి నీకు తెలుసా?"
ఏమనాలో తెలియదు. ముందడుగు వేశాను.
"ఈరాత్రంతా బాగా ఆలోచించు శ్రీరామచంద్రుడు మరో అవతారం వరకూ సవరించుకోలేకపోయిన తప్పును రేపే నీవు సవరించుకొనవచ్చును" అన్నది కోమలి.
"అంటే?"
"రేపు మూడు గంటలకు నేను మళ్ళీ ఎదురు చూస్తుంటాను. అమ్మ రేపుకూడా భజనకు వెడుతుంది."
O O O O
"విన్నారుటండీ-రమణమ్మ కూతురు లేచిపొయిందిట" అమ్మ నాన్నగారితో.
పక్క గదిలోనే ఉన్న నాకు ఆ సంభాషణ స్పష్టంగా వినిపిస్తున్నది.
"ఎవరూ-ఆ అమ్మాయి జానకా?" అన్నారు నాన్న.
"అవునండీ-ఎంత సంగనాచిలా ఉండేది. పిల్లని చూడగానే అలాంటి బుద్దిమంతురాలు లేదనిపించేది. అసలు రంగు ఈ రోజు బయటపడింది."
"అసలేం జరిగింది?"
"వాళ్ళ కాలేజీలో ఓ కుర్రాడున్నాడట. ఇద్దరూ కలిసి ఓ చీటీ పెట్టి వెళ్ళిపోయారట. ఇద్దరికీ వయసు తక్కువే. పెళ్ళి చేసుకుని ఏం చేస్తారో ఏమో-ఆ కుర్రాడింకా చదువు పూర్తి కాలేదు. ఉద్యోగం మాత్రం ఎవరిస్తారు?"
"అంత అనాలోచితంగా ఈ పని ఎలా చేశారబ్బా?"
"కండ కావరం" అంది అమ్మ కసిగా.
"అలాగనకు" అన్నారు నాన్న, "ఇందులో పెద్దల తప్పు కూడా వున్నదని నా అనుమానం ఇప్పుడు మనం చూసే సినిమాలెలా వుంటున్నాయి? చదివే పుస్తకాలెలా వుంటున్నాయి! ఎక్కడ చూసినా ప్రేమ...ఆ ప్రేమకథల్లో యువతీ యువకులు అమాయకులు వాళ్ళ తల్లిదండ్రులు విలన్సు. ఇలాంటివి చూసి కుర్రాళ్ళు ఆవేశపడి రెచ్చిపోతున్నారు. మనం వాళ్ళను సినిమాలు యధేచ్చగా చూడనిస్తున్నాం. పుస్తకాలు యధేచ్చగా చదవనిస్తున్నాం కానీవాటి ప్రభావం గురించి ఆలోచించడంలేదు. కలుషితమైన వారి మనసుల్ని సరైన దారికి మళ్ళించదానికి ప్రయత్నించడం లేదు...."
"బాగుంది మీరు చెప్పేది మన బంగారం మంచిది కావాలి కానీ సినిమాలుచూసీ, నవల్లు చదివీ పిల్లలు చెడిపోతారా? మన పక్కింటి కోమలిని చూడండి. ఆ అమ్మాయి చూడని సినిమా లేదు. చదవని పుస్తకం లేదు. ఏదో సమయంలో అత్తయ్యగారూ అంటూ నా దగ్గరకువచ్చి తను చదివినవీ, చూసినవీ అన్నీ కధలుగా చెబుతుంది. ఎంతో చలాకీ అయినపిల్ల. ఆ పిల్ల ముఖం చూస్తే పసిపాపలు గుర్తుకొస్తారు" అన్నది అమ్మ.