Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 8

    ఆడది మగవాడ్ని కోరి ఆహ్వానించి రెచ్చగొట్టి-తీరా అతడు లొంగకపోవడమో, తను బయటపడడమో జరిగేసరికి పెద్ద రభసచేసి తప్పంతా మగాడిమీదకే నెట్టేస్తుంది కోమలి కూడా అలా చేస్తే...
   
    "నేను చెప్పాల్సింది చెప్పాను. ఆపైన నీయిష్టం. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదనిమాత్రం గుర్తుంచుకో" అన్నది కోమలి.
   
    ఇద్దరం అక్కణ్నుంచి లేచాం.
   
                                                O    O    O    O
   
    అది మా స్వంత ఇల్లు. ఇల్లు పురాతనకాలంది. పెంకుటిల్లు చాలా చాలా పెద్దది ఇంటికంటే పెద్దది దొడ్డి. అది ఒక పెద్ద అరణ్యంలా వుంటుంది దానిగుండా ఎన్నో వృక్షఫలాలు, పూలమొక్కలు, కూరల పొదలు వున్నాయి. ఏదో ఒక క్రమపద్దతిలో ఉండదు. మా యింటి దొడ్డిగోడ ననుకునే కోమలి ఇల్లు వున్నది. రెండిళ్ళనూ కలపడానికి ఒక గుమ్మం వున్నది.
   
    ఆ దొడ్డిగోడ గుమ్మం రెండు చెట్లతో పూర్తిగా కప్పబడి వున్నది. ఆ దొడ్డిలో ఎవరయినా వున్నదీ ఆ గుమ్మాన్ని వుపయోగిస్తున్నదీ తెలుసుకోవడం చాలా కష్టం. కోమలికి ఈ గుమ్మం ఈ విధంగా వుపయోగించుకోవాలని ఎలా స్ఫురించిందో... లేక అదేమి అలవాటో...
   
    అలవాటయితే?
   
    నా మనసు పరిపరి విధాల పోయింది. కోమలి పిలుపు   కోసమేకదా? ఆమె బుద్ది మంచిదికాదా?
   
    కోమలి మీద నాకు చాలా అనుమానాలు వచ్చాయి వాటితో నా మనసును బాధించదల్చుకోలేదు. నిర్భయంగా ఆమెనే అడిగి తెలుసుకోవాలనుకున్నాను.
   
    ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలు....
   
    నా మనసుకు ఏదో థ్రిల్ అనిపిస్తున్నది.
   
    నేను ధైర్యంచేసి పెరట్లోకి వచ్చాను. ఆ సమయంలో ఎవ్వరూ లేరు. నేను చెట్లవెనుక తలుపు దగ్గరకు రావటానికి ఇటువైపు గొళ్ళెం, అటువైపు గడియ చాలాకాలంగా వాడబడటం లేదనడానికి సూచనగా కాస్త తుప్పు పట్టి వుంది. తియ్యడానికి నాకు ఇబ్బదయింది.
   
    తీయగానే తలుపులు తెరుచుకున్నాయి.
   
    నేను ఆశ్చర్యపడ్డాను. తలుపు తీయగానే ఎదురుగా కోమలి కనబడింది.
   
    లేత గులాబీరంగు పరికిణి-దానికి నల్లటి అంచు జాకెట్, అదేరంగు వోణి-
   
    అన్నిరంగులూ చక్కగా అమరిన సీతాకోకచిలుకలా వుందామె. చూడగానే అలా చూస్తూ నిలబడిపోవాలనిపించింది.
   
    ఆమె లోపలకు రమ్మన్నట్లు సైగ చేసింది. నేను వెళ్ళి తలుపు గడియ వేశాను.
   
    "అయిదు నిముషాలు లేటయ్యావు..."
   
    "సారీ__"
   
    "క్షణం యుగంలా గడిచింది నాకు"
   
    ఎందుకు?"
   
    "ప్రేమ...." అని నవ్వి-"పద లోపలకు" అన్నది   
   
    ఇద్దరం లోపలికి వెళ్ళాం.
   
    ఆమె నన్ను తిన్నగా పడక గదిలోనికి తీసుకుని వెళ్ళింది.
   
    అక్కడ ఒక మంచం, దాని మీద శుభ్రంగా వేయబడిన పక్క...
   
    కోమలి మంచం మీద తను కూర్చుని...."నువ్వూ కూర్చో అన్నది.
   
    నా శరీరంలో వణుకు ప్రారంభమయింది. మనసులో వికారం పుట్టింది. ఎందుకో మాత్రం నేను చెప్పలేను.
   
    "ఈ రోజు నిన్నిక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా?" అన్నదామె.
   
    తల అడ్డంగా ఊపాను నోట మాట రాక.
   
    "నీపై నాకు ఎంత ప్రేమ ఉన్నదో చెప్పుకుందామని" అన్నది కోమలి. ఆమె కళ్ళు అదోలా వున్నాయి. ముఖం కాస్త ఎర్రబడింది. పరీక్షగా చూస్తే ఆమె కూడా వణుకుతున్నట్లు నాకు అనిపించింది.
   
    "ఏమయిందామెకు?" అనుకున్నాను...కానీ అడగలేదు.
   
    "ఇప్పుడు నీవు ఏం చేయమంటే అది చేస్తాను. అడిగి చూడు" అంది కోమలి.
   
    "అయితే ఓ పాట పాడు" అన్నాను.
   
    "తప్పకుండా పాడతాను. కానీ గొంతెత్తి పాడితేనే పాటకు అందం. ఈ సమయంలో గొంతెత్తి పాడితే ఎవరైనా వచ్చి తలుపు తట్టవచ్చు. మరి నీ ఇష్టం" అని కోమలి రాగాలాపన ప్రారంభించింది.
   
    "వద్దు..." అన్నాను కంగారుగా.
   
    "మరింకేమయినా అడుగు..." అన్నది కోమలి.
   
    "కథ చెప్పు" అన్నాను ఏమనాలో తెలియక.
   
    కోమలి కథ ప్రారంభించింది. అది ఇద్దరు యువతీ యువకుల కథ. ఇద్దరికీ అనుకోకుండా ఏకాంతం లభించింది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.
   
    యువకుడు యువతిని పాట పాడమన్నాడు.
   
    ఆమె నవ్వింది.
   
    యువకుడు యువతిని కథ చెప్పమన్నాడు.
   
    ఆమె మళ్ళీ నవ్వింది.
   
    "నవ్వుతావేం?" అన్నాడు యువకుడు కోపంగా.

 Previous Page Next Page