Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 10

    "జానకి గురించీ ఇలాగే అనేదానివి నువ్వు. ఓరోజున కొమలినీ నువ్వు నిందిస్తావేమో, ఏం చెప్పగలం? ఈరోజుల్లో పిల్లలు ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తారో తల్లిదంద్రులే చెప్పలేకపోతున్నారు."
   
    ఆ సంభాషణ నేనింక వినలేదు.
   
    నా ఆలోచనలు కోమలిచుట్టూ తిరుగుతున్నాయి.
   
    అమ్మ కోమలి బుద్దిమంతురాలని అనుకుంటున్నది. కానీ కోమలి అసలురంగు నాకు తెలుసు.
   
    జానకి గురించి కూడా అమ్మ అలాగే అనుకునేది. ఈ రోజు జానకి లేచిపోవడానికి కారణాలనూహించిన తండ్రితో ఆ కారణాలు కోమలిమీద ప్రభావం చూపించలేదంది.
   
    కోమలికూడా జానకివలె ప్రవర్తిస్తున్నది. అందుకు కారణం ఆమె చదువుతున్న ప్రేమకథలూ, చూస్తున్న సినిమాలు అయుండాలి.
   
    నేనాట్టే సినిమాలు చూడను. ఎక్కువగా పుస్తకాలు చదవను. అందువల్లనే బుద్దిగా ఉండగలుగుతున్నాను.
   
    కోమలి బుద్ది పెడదారులు తొక్కుతున్నది. ఆమె మనసు కలుషితమైపోయింది. కానీ అది నాకు మంచి అవకాశం. ఎంతోమంది యువకులు కోరుకునే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఒక మంచి స్నేహితుడిగా నేనీ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొనకూడదు.
   
    చిన్నతనం నుంచీ రామాయణం నా జీవితంపై తన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. శ్రీరామచంద్రుడు నాకు ఆదర్శం. నేనూ అటువంటి వాడిననిపించుకోవాలన్నది నా కోరిక.
   
    ఒక్క రాముడేకాదు. పురాణ పురుషులు చాలామంది నాపై తమ ప్రభావాన్ని చూపేవారు. హరిశ్చంద్రుడి కధ విన్నాను. శత్రువునికూడా ద్వేషించకూడదనిపించింది.
   
    ఆపైన చరిత్రలో బుద్దుడు....ఇటీవల చరిత్రలో గాంధీ!
   
    అహింసను, సత్యాన్ని నమ్ముకుని ఒక మహా సామ్రాజ్యాన్ని గడ గడ లాడించిన వ్యక్తి గాంధీ!
   
    యవ్వనం నాలో ప్రవేశిస్తున్నకొద్దీ నా బుద్ది ఏకపత్నీ వ్రతం మీద ఏకాగ్రత చూపమని హెచ్చరించసాగింది. ప్రస్తుతం కష్ట సాధ్యమయిన విషయమదేననిపిస్తున్నది.
   
    ఏకపత్నీ వ్రతంలో అంతర్లీనమై పవిత్రత ఉన్నది. ప్రతి పురుషుడూ త్రికరణశుద్దిగా ఒకే స్త్రీకి కట్టుబడి వుండాలి.
   
    మరిప్పుడు నేను కోమలి ఆకర్షణకు తట్టుకొని నిలబడగలనా? తట్టుకొనక తప్పటడుగువేస్తే నేనూ సహకరిస్తే__నేనామెను వివాహం చేసుకుతీరాలి. అయితే...
   
    నాకు చదువుబాగా వస్తోంది. నాకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశమున్నది. నాకు కనీసం పాతికవేలైనా కట్నం వస్తోందని నాన్న అనుకుంటున్నారు. పిత్రువాక్య పరిపాలన శ్రీరామచంద్రుడి కర్తవ్యం.
   
    కోమలి తల్లిదండ్రులు కట్నం ఇచ్చి పెళ్ళిచేయలేరు. ఆమెను చదివించి ఉద్యోగం చేయించి ఆ డబ్బుతో ఆమె వివాహం చేయాలని వారనుకుంటున్నారు.
   
    అమ్మకు కులాంతర వివాహం ఇష్టముండదు. కోమలిది మా కులంకాదు. అందువలన ఆమెను వివాహం చేసుకుంటే అమ్మ మనసు కష్టపెట్టవలసి ఉంటుంది శ్రీరామచంద్రుడు తన సుఖంకోసం తల్లిమనసు కష్టపెట్టడు.
   
    పదహారేళ్ళ కోమలి నా హృదయాన్ని పరచి ఆహ్వానిస్తున్నాను రమ్మంటే నేనిదంతా ఆలోచిస్తున్నాను.
   
    వయసుమాత్రం నన్ను వెక్కిరిస్తూనే ఉంది. ఈ ఆలోచనలన్నింటినీ ఆ క్షణంలో వీగిపోయేలా చేయగల శక్తి నాకున్నది అని అంటున్నదది.
   
                                          O    O    O    O   
   
    వయసు ప్రభావానికి తట్టుకొనడం చాలా కష్టం.
   
    ఈ పర్యాయం కోమలి నన్నెంతలా రెచ్చగొట్టిన దంటే వయసు నా మనసును కమ్మేసింది.
   
    నా పవిత్రత పోయింది.
   
    నేను ఏడుస్తున్నాను.
   
    కోమలి ఆప్యాయంగా నా జుత్తునిమురుతూ "ఎందుకు ఏడుస్తావ్?" అన్నది.
   
    నేను మాట్లాడలేదు.
   
    "తప్పు నీది కాదు. నాదే కదా!" అంది కోమలి.
   
    "ఈ తప్పులో నాకూ భాగముంది"
   
    "అసలిది తప్పని ఎవరన్నారు?"
   
    ఒకరు అనకపోయినంత మాత్రాన అది తప్పుకాకుండా పోదు. తప్పుకాని పక్షంలో మేమిద్దరమూ ఇలా రహస్యంగా ఎందుకు కల్సుకుంటాం.
   
    ఆ రోజునుంచీ నేను కోమలిని తప్పించుకొని తిరుగుతున్నాను.
   
    నెలలు గడుస్తున్నాయి.
   
    ఓరోజున తెలిసింది....కోమలికి నెలతప్పిందట.
   
    అమ్మ నాన్నకు చెప్పింది. ఆయన సినిమాలు, పుస్తకాలు పిల్లల్ని ఎలా పాడుచేస్తున్నాయో మరొకసారి చెప్పారు.
   
    "ఆ అమ్మాయి చాలా మంచిదండీ! ఏ వెధవో దాన్ని మాయమాటల్తో లోబర్చుకున్నాట్ట. ఎంత అడిగినా ఆ అమ్మాయి వాడిపేరు చెప్పటం లేదుట..."
   
    వెధవ అన్నమాట సూటిగా తగిలింది నాకు. ఇంట్లో ఇంతవరకూ అంతా నన్ను మెచ్చుకొనే వారే తప్ప వెధవ అనలేదు. నన్నని తెలియకపోయినా అమ్మ నన్నిప్పుడు వెధవ అని తిట్టింది.
   
    కోమలి ఎంత మంచిది? ఆమె నా పేరు చెప్పడం లేదు...

 Previous Page Next Page