7
అమెరికా నుంచి స్వామి మీనాక్షికి ఉత్తరాలు రాస్తూండే వాడు. వెళ్ళిన నెల రోజుల్లోనే అతను-"బ్రాందీ, వైను తాగడం తప్పదు. ఈ సమాజంలో ఉంటూ ఈ సంస్కృతిని పాటించడం తప్పనిసరి. అదీకాక ఇక్కడ విపరీతమైన చలి. ఈ చలిలో అవి లేకుండా బ్రతకలేము. మీ అనుమతి లభించే వరకూ ప్రాణం పోయినా సహిస్తాను కాని, అవి ముట్టను. మీ జవాబు కోసం ఎదురుచూస్తూంటాను. దయుంచి ఈ విషయం మీ నాన్నగారికి మాత్రం తెలియ నీయవద్దు" అని రాశాడు. మీనాక్షి బాగా ఆలోచించి తప్పనిసరి అయితే తాగుడు మొదలుపెట్టమనీ-కాని, మరీ ఎక్కువగా పుచ్చుకుని ఆరోగ్యం పాడుచేసుకోవద్దనీ రాసింది. ఇండియాకు వచ్చేక ఆ అలవాటు వదలిపెట్టాలని కూడా కోరింది.
స్వామి ఆమెకు అమెరికా విశేషాలు రాస్తూండేవాడు. తను చాలా శ్రద్ధగా పనిచేస్తున్నట్లూ అక్కడ అందరూ తన తెలివితేటల్నభినందిస్తున్నట్లూ రాసేవాడు. ప్రతి ఉత్తరంలోనూ__"కాబోయే భార్య వద్ద ఒక్క నిజం కూడా దాచడం నాకిష్టం లేదు. అన్నీ నేను రాసేస్తాను. మీరు మాత్రం సహృదయంతో అర్ధం చేసుకోవాలి" అని రాస్తూండేవాడు.
సుమారు సంవత్సరం గడిచేక- "మిమ్మల్ని తీసుకురాకపోవడం పెద్ద తప్పయిపోయింది. అమెరికా వెళ్ళేముందే పెళ్ళి చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేది కాదు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకురావడానికి సరిపడ డబ్బు నా దగ్గరుంది. కాని అలా పంపరుగదా మీ వాళ్ళు? ఇక్కడ ఆడ, మగలకు నీతి పట్టింపు లేకపోవడానికి కారణము చలి! ఈ చలిలో మగవాడికి ఆడదీ, ఆడదానికి మగవాడూ ఉండి శరీరాలకు వేడి పుట్టించుకోవాలి. ఇంకో మార్గం లేదు. ఇంకా ఇక్కడ రెండు సంవత్సరాలుండాలి. చలికి ఏ న్యుమోనియా అయినా వచ్చి చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. మార్గరెట్ అని ఓ గర్ల్ ఫ్రెండుంది నాకు. ఆమెకు నేనంటే బాగా యిష్టం. న్యుమోనియా బాధ లేకుండా రక్షిస్తానంటోంది. ఇలాంటి విషయాల్లో మన ఇండియన్సుకు చాలా పట్టింపు. మీ అభిప్రాయం వ్రాయండి. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీకు భర్తగా మసిలే అదృష్టం కోసమైనా నేను మార్గరెట్ తో తప్పు చేయాలేనేమోననిపిస్తోంది. కాని శాసించవలసింది మీరు. ప్రాణం పోయినా మీ మాట కాదనను. ఇందులో ఏ విషయాలూ మీ నాన్నగారికి మాత్రం తెలియనివ్వవద్దు" అంటూ రాశాడు స్వామి.
స్వామి ఈ ధోరణి మీనాక్షికి బెంగగా ఉండేది. క్రమంగా అతనక్కడి దురలవాట్లకు లోనైపోతూ దాన్ని సమర్ధించుకోవడం కోసం ఏవో కుంటిసాకులు చెబుతున్నాడని ఆమెకు తోచసాగింది. ఆ ఉత్తరానికి జవాబుగా ఆమె కాస్త తీవ్రంగానే రాసింది. న్యుమోనియా రాకుండా ఉండడానికి బ్రాందీ చలుననీ-మార్గరెట్ అవసరం లేదనీ! ఆమెకు నమ్మకముంది - తను అవునంటే కాని అతను దేనికీ పాల్పడడని!
తర్వాత రెండుమూడు ఉత్తరాలలో స్వామి ఆమెను అభ్యర్దిస్తూ రాశాడు. మార్గరెట్ విషయంలో తననభ్యంతర పెట్టవద్దని. అయినా మీనాక్షి చలించలేదు. అది జరిగిన ఆరు నెలలదాకా స్వామి దగ్గర్నుంచి ఉత్తరాలు లేవు. మీనాక్షి బాగా కంగారుపడి చాలా ఉత్తరాలు రాసింది కాని, ఒక్కదానికీ జవాబు రాలేదు.
ఆఖరికి ఆర్నెల్ల తర్వాత అతనివద్ద నుంచి క్లుప్తంగా ఓ ఉత్తరం వచ్చింది-"మీ దయవల్ల చచ్చిబ్రతికాను. ఓ గండం గడిచింది. రెండు నెలలు స్పృహ తెలియని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నాను. డాక్టరు నన్ను పరీక్ష చేసి- ఇంత వయసువచ్చి ఇంకా స్త్రీ సంపర్కంలేదు. దటీజ్ వెరీ బాడ్ - అన్నాడు. మళ్ళీ ఇలాంటి జబ్బువస్తే బ్రతకనేమోనని కూడా అన్నాడు. యూ ఇండియన్స్ అండ్ పెట్టీ మోరల్స్ అంటూ నా మాటల్ని తీసిపారేశాడు. అక్కడున్న అందరూ నన్ను వేళాకోళం చేశారు. ఇక్కడికి వచ్చిన ఇండియన్సెవరూ నాలాగా ఉండడం లేదు. పరిస్థితి అర్ధమయిందనుకుంటాను. మార్గరెట్ మంచిపిల్ల. తన ఆఫర్ ఇంకా ఉంచింది. ఈ త్యాగ బుద్ధి మన స్త్రీలకుండదు."
ఈ ఉత్తరం చదివి మీనాక్షి కంగారుపడింది. ఈ వివరాలన్నీ తనకెందుకు రాస్తున్నాడో ఆమెకు అర్ధంకాలేదు. ఈ తప్పులన్నీ తనకు చెప్పకుండా చేసి ఉంటే ఎంతో సంతోషించేది. కాబోయే భార్య దగ్గర నిజాలు దాచకూడదన్న విషయం బాగానే ఉంది కానీ- కాబోయే భార్యగా ఇలాంటి నిజాలను భరించడం తనకు కష్టంగా ఉంది.
మీనాక్షి స్వామికి జవాబు వ్రాస్తూ__మీరు మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి. ఆరోగ్యం పేరు చెప్పి నన్ను మభ్యపెట్టవద్దు. నిజంగా ఆరోగ్యం ఒక సమస్యే అయితే అది కాపాడుకుందుకు మీరేం చేసినా సరే. అయితే నాకు కొన్ని అభ్యంతరాలున్నాయని మీకు తెలుసు. హిందూ స్త్రీగా నేను భరించలేని కొన్ని నిజాలున్నాయని కూడా మీకు తెలుసు. నేను భరించలేని ఆ నిజాలను మీరు నాకు దూరంగా ఉంచండి. అందుకోసం ఇకమీదట మీరు నాకు వ్రాసే ఉత్తరాల్లో అలాంటి విశేషాలు మాత్రం వ్రాయకండి. నన్ను మభ్య పెట్టడానికైనా అబద్ధాలు వ్రాయండి. ఇంతకుమించి నేనేమీ వ్రాయలేను" అంటూ రాసింది.
ఆ తర్వాత స్వామి దగ్గర్నుంచి ఆమెకు మామూలుగా ఉత్తరాలు వస్తూండేవి. స్వామి ప్రవర్తనకు సంబంధించిన చాలా సందేహాలు మీనాక్షిని బాధిస్తూండేవి. ఆమె తండ్రి వద్ద విదేశాలలో ఉన్న ఇండియన్సు ప్రసక్తి తీసుకువచ్చి అక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా మారిపోనివారు వారిలో ఉన్నారా అంటూ ప్రశ్నిస్తూండేది. కూతురి బాధ రుద్రరాజు గ్రహించగలిగేవాడు.
"చూడమ్మా! స్వామి అందరిలాంటివాడూ కాదు. అసలు నిన్నిచ్చి వివాహం చేసి ఇద్దర్నీ కలిపి అమెరికా పంపిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అయితే స్వామికది ఇష్టం లేదు. అక్కడి ఆదాయం తెలుసుగాని ఖర్చుల విషయం తెలియదతనికి. స్కాలర్ షిప్ ఇచ్చినవారు మాత్రం ఆ డబ్బు ఒక్క వ్యక్తికి సరిపోతుందని రాశారు. అదీకాక స్వామికి చదువుపైన శ్రద్ధ ఉంది. పెళ్ళి చేసుకుంటే అనుకున్న వ్యవధిలో తను చదువు పూర్తిచేయలేనని అతడు భయపడ్డాడు. అతన్ని మరీ బలవంతపెట్టి ఉంటే పెళ్ళికీ ఒప్పుకునేవాడు. నిన్ను తీసుకునీ వెళ్లేవాడు. కాని అది తనను అనుమానించినట్లు అతనికి తోచవచ్చు. అందుకే నేను బలవంతపెట్టలేదు. అలాంటి ఉత్తముణ్ణి అనుమానించడం మనకు తగని పని. నిష్కళంకంగా అతను ఆ దేశం నుంచి స్వదేశం తిరిగి వస్తాడని నాకు నమ్మకముంది. ఆ విషయాన్ని నేను ఋజువు చేయగలను కూడా."
"ఎలా?"
"మన కుక్క ఉందిగా!"
"ఉంటే?"
"అదేమిటమ్మా! మనకు లేని శక్తులు దానికి ఉన్నాయి. యజమానిననుసరించి ఉండే గుణం దానికుంది. తాగుబోతులన్నా, స్త్రీలోలురన్నా నాకు గిట్టదు. అందుకే అటువంటివారెవ్వరు మనింటికి వచ్చినా ఇది మొరుగుతుంది. నా కిష్టంలేని పనులు చేసేవారినీ, దొంగలనూ చూసినపుడు తప్ప__అపరిచితులను చూసినా ఇది మొరగదు. స్వామి నిష్కళంక స్వభావాన్ని బయట పెట్టడానికిదే మనకు ఆధారం" అన్నాడు రుద్రరాజు.
మీనాక్షికి అప్పుడు చాలా విశేషాలు గుర్తుకొచ్చాయి. తమ ఇంటికివచ్చే రఘురామయ్యగారినీ, పరమశివంగారినీ చూసినప్పుడల్లా ఇది మొరుగుతుంది. వాళ్ళిద్దరూ బాగా తాగుతారని అందరూ చెప్పుకుంటారు. కాని ఎప్పుడేనా ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చినా అది మొరగదు__పట్టించుకోదు.
ఈవిధంగా వాసన పసిగట్టే శక్తి దానికెలా వచ్చిందో కాని అది తనకిప్పుడు బాగా ఉపయోగపడవచ్చు.
ఈ విషయమై మీనాక్షి ఎక్కువగా ఆలోచించడానికి కారణముంది. స్వామి తనకు అంత ఖచ్చితంగా ఉత్తరాల్లో వ్రాసినప్పటికీ ఆమెకు అంతరాంతరాల్లో ఓ అనుమానం ఉంది. ఆ అనుమానాన్నే ఆశ అని కూడా అనవచ్చు. అతను సరదాకి, తననేడిపించడానికి ఈవిధంగా ఉత్తరాలు రాస్తున్నాడు కాని నిజంగా అతను అక్కడ నిష్కళంక జీవితం గడుపుతున్నాడు. ఇదీ ఆమె అనుమానం లేక ఆశ.
రెండున్నర సంవత్సరాలలో స్వామి అక్కడ థీసిస్ సబ్మిట్ చేశాడు. అక్కడ ఉద్యోగాలకు ఆఫర్లు కూడా వచ్చాయి. కాని రుద్రరాజుగారి సలహా పాటించి అతను స్వదేశం రావాలనుకున్నాడు. ఆ విధంగా అతనికి వాల్తేర్లో పూల్ ఆఫీసర్ ఉద్యోగం కూడా దొరికింది. థీసిస్ సబ్మిట్ చేసిన రెండు నెలలకి అతనికి డాక్టరేట్ వచ్చింది. మరో మూడు నెలలలో అతను స్వదేశానికి ప్రయాణమయ్యాడు. అతను సరాసరి రుద్రరాజుగారింటికే ముందు వస్తున్నాడు.
మీనాక్షి అతన్ని రిసీవ్ చేసుకునేందుకు స్టేషన్ కి వెళ్ళలేదు. రుద్రరాజు వెళ్ళాడు. వీధి గుమ్మంలో వారి రాకకోసం-ఎదురు చూస్తూ నిలబడిందామె. ఆమెప్రక్కనే కుక్క కూడా ఉంది.
ఆమె ఎదురు చూసిన కాస్సేప్పటికి టాక్సీ ఆగింది. అందులోంచి రుద్రరాజు, స్వామి దిగారు. ఇద్దరూ ముందడుగువేశారు. మీనాక్షి స్వామిని చూసింది-గుర్తు పట్టింది. అతడు మనిషి రంగు మారాడు. కొద్దిగా పుష్టి చేశాడు. హుందాగా, గొప్పగా ఉన్నాడు.
అతన్నామె ఎక్కువసేపు చూడలేకపోయింది. చటుక్కున తల వంచుకుని వెనక్కు తిరిగి పరుగెట్టింది. అంతలోనే ఆమె కాళ్ళకు బ్రేకు వేసినట్లు ఆగిపోయింది.
కుక్క మొరుగుతోంది!
చటుక్కున వెనక్కు తిరిగింది మీనాక్షి. అక్కడి దృశ్యం ఆమెకు మహా భయంకరంగా తోచింది. కుక్క స్వామి మీదపడి అదే పనిగా మొరుతోంది!
రఘురామయ్య, పరమశివం__ఆమె కళ్ళముందు మెదిలారు.
అయితే ఉత్తరాల్లో స్వామి అబద్ధం రాయలేదు. అతను తాగడమూ నిజమే! మార్గరెట్ విషయం కూడా?!
మీనాక్షికి ఆలోచనలింక ముందుకు వెళ్ళలేదు. కుక్క మొరుగు ఇంకా ఆమె చెవుల్లో వినబడుతూనే ఉంది.
చేతులు గిల్లి చూసుకున్నా, అది నిజమే అని తెలుస్తున్నా__అది కల అయితే బాగుండునని మీనాక్షి అనుకుంటోంది.
కుక్క ఇంకా ఆగకుండా మొరుగుతూనే ఉంది.
8
రుద్రరాజు కుక్క గొలుసు చేతిలోకి తీసుకుని లాగి పట్టుకున్నాడు. ఆయన కనులలో ఆనంద భాష్పాలున్నాయి. స్వామి కుక్కను వదిలించుకుని ఒకడుగు వెనక్కు వేసి__"ఒకసారి మీనాక్షిని పలకరించి వస్తాను" అన్నాడు. రుద్రరాజు అన్నమాటలు వినకుండానే అతను మీనాక్షి వెళ్ళిన వైపు వెళ్ళాడు.