3. యాగ సంరక్షణము
"మునీంద్రా లేక లేక కలిగిన నా సంతానములో రాముడు జ్యేష్ఠుడు, ధనుర్విద్యలో ప్రావీణ్యమింకనూ చేకూరని పిన్నవయస్కుడు. యాగరక్షణమునకు మీవెంట నేను వచ్చెదను, అంగీకరించుడు" అని ప్రార్ధించినాడు.
బ్రహ్మర్షి విశ్వామిత్రుడు లోక కల్యాణము నిమిత్తము యాగమును ప్రారంభించినాడు. 'మారీచుడూ', 'సుబహువూ' అను ఇద్దరు రాక్షసులు ఆ యజ్ఞమునకు నిఘ్నము కలిగించ పూనినారు. ఆకసమున నిలిచి కుండలతో రక్తమునూ చేటలతో మాంస ఖండములనూ హొమగుండము నందునూ వేదికపైననూ ద్రిమ్మరించి అపవిత్రము చేయుచుండిరి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తన తపోబలము వల్లనో తనకు వశమైయున్న అస్త్ర శస్త్రముల చేతనో ఆ రక్కసులను చంపివేయగలడు. కాని యజ్ఞదీక్షను వహించినపుడు సంహారము తగదు. కనుక యాగ రక్షణమునకు సమర్ధుడైన శూరుని అన్వేషించి తీసికొని రావలెను... బ్రహ్మర్షి కన్నులు మూసికొని ధ్యానానిమగ్నుడైనాడు. అప్పుడాయన మనోవీధిని శ్రీమహావిష్ణువు గోచరించెను. మరుక్షనమును ఆ దేవుడు అదృశ్యుడై ఆయన స్దానమున దశరథ పుత్రుడు రాముడు కనబడినాడు. రాముడు శ్రీమహావిష్ణువు అవతారము' అన్న సత్యము బ్రహ్మర్షికి అవగతమైనది. రాముడు రావణాది దుష్ట దానవులను అంతమొందించుటకు అవతరించినాడు. తన యాగమును రక్షించుటకు అతడే సమర్ధుడు.
రాముని తీసికొని వచ్చుటకు విశ్వామిత్రుడు అయోధ్యకు పోయినాడు. దశరథుడు ఆ బ్రహ్మర్షికి స్వాగతము పలికి, అర్ఘ్య పాద్యాది సత్కారములోనరించి, "మహాత్మా, తమకు నావలన కాతగిన కార్యమేదియో తెలుపుడు, తప్పక నెరవేర్చెదను" అన్నాడు.
విశ్వామిత్రుడు విషయమును వివరించి, రాజా, యాగ రక్షణమునకు నీ పుత్రుడు రాముని నావెంట పంపుము" అని కోరినాడు.
దశరథుడు సందేహించినాడు. అతడు విశ్వామిత్రునితో "మునీంద్రా లేక లేక కలిగిన నా సంతానములో రాముడు జ్యేష్ఠుడు, ధనుర్విద్యలో ప్రావీణ్యమింకనూ చేకూరని పిన్నవయస్కుడు. యాగరక్షణమునకు మీవెంట నేను వచ్చెదను, అంగీకరించుడు" అని ప్రార్ధించినాడు.
విశ్వామిత్రుడు తటాలున లేచినాడు. " నా అభీష్టమును నెరవేర్చేదనన్నావు. ఆడి తప్పని ఇక్ష్వాకు వంశమున జనించినావు! నీ సాహాయ్యము నాకక్కరలేదు; నేను పోవుచున్నాను" అని చెరచెర అడుగుల వేసినాడు.
అచ్చటనే ఉన్న వసిష్ఠు విశ్వామిత్రుని శాంతింపచేసి వెనుకకు తీసికొని వచ్చినాడు! పిమ్మట దశరథునితో "రాజా, రాముని ఈ మహిమాన్వితుని వెంటపంపుము. అతనికెట్టి కీడునూ కలుగకుండుటయే కాక మేలోనగూడును. సందేహించకుము" అనెను.
దశరథుడు రాముని రప్పించి విశ్వామిత్రుని చూపుచూ "కుమారా ఈ బ్రహ్మర్షి వెంట వెళ్లుము. ఈయన ఆజ్ఞానుసారము చేయుము" అనెను.
ఆదిశేషుని అవతారమగు లక్ష్మణుడు "తండ్రీ" నేనునూ అగ్రజుని అనుసరించి పోయెదను. అనుజ్ఞనిండు" అని కోరెను. దశరథుడు అంగీకరించినాడు. బ్రహ్మర్షి వెంట పోవుచున్న ఆ కాంతిమంతులిర్వురూ బ్రహ్మదేవుని అనుసరించి నడచిన అశ్వనీ దేవతలవలె భాసిల్లినారు.
వారు మువ్వురునూ ఒకటిన్నర యోజనములు నడచిపోయి సరయూనది దక్షిణ తీరమును చేరుకొన్నారు. బ్రహ్మర్షి "రామా, నదిని ప్రవేశించి ఆచమనము చేసి రమ్ము. నీకు 'బల' 'అతిబల' అను రెండు మంత్రములను ఉపదేశించెదను" అనెను... ఉపదేశము ముగిసిన పిదప ఆయన ఇట్లు వచించెను.
"రామా, బ్రహ్మ దేవుడు నా తపస్సునకు మెచ్చి నాకీ మంత్రద్వయ మును అనుగ్రహించినాడు. ఇవి నీకెంతయో మేలు చేయును. వీని ప్రభావము వలననిన్నింక అలసట కాని ఆకలిగాని దప్పిగాని బాధించవు; సామర్ధ్యములో, బుద్ది కుశలతలో, కార్యాకార్య నిశ్చయజ్ఞాన ములో, వాద ప్రతివాద ములలో నీతో తులతూగ గలవారుండరు, వీటి సాహాయ్యమున నీవు రాక్షసులను నిర్జించి యశస్వి అయ్యెదవు"
మంత్రోపదేశమైన పిమ్మట రాముడు సహస్రకిరణములతో భాసిల్లు భానుని వలె ప్రకాశించి నాడు.
ఆ రాత్రి వారానది యొడ్డుననే నిద్రించినారు. మరునాటి ఉదయమే నడక సాగించి, సరయూ గంగానదుల సంగమము వద్ద గంగానదిని నావలో దాటి, దక్షిణపుటోడ్డున చేరుకున్నారు.
విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను: "పూర్వము ఈ ప్రదేశమంతయూ ఇంద్రుని నందన వనము వలె నయనానందకరముగా నుండెడిది. ఇప్పుడిది కారడవిగా నిర్మానుష్యముగా నుండుటకు కారణము "తాటక" అను రాక్షసి. ఆ రక్కసి వెయ్యి యేనుగుల బలము కలది. ఆ మనుజాశని వచ్చి ఈ ప్రాంతమును ఆక్రమించుటతోనే ఇచ్చటి జనులందరు భయకంపితులై తమ యిండ్లను వదలి పారిపోయినారు! అది ఈ దారిని వచ్చిపోవు పాంధులను పట్టుకొని భక్షించివేయుచున్నది. నా యాగమును భగ్నము చేయుటకు వచ్చెడి మారీచ సుబాహువులిరువురునూ తాటక తనయులే. మనమిటు వచ్చుచున్నామని తెలియుటతోనే అది వచ్చి మనపై పడబోవును. రామా దానిని నీవు సంహరించవలెను".
రాముడు: మహాత్మా స్త్రీని చంపవచ్చునా?
విశ్వామిత్రుడు: దుష్టశిక్షణమున స్త్రీ, పురుష భేదములును పాటించరాదు. లోక కంటకి యగు తాటకను వధించి శిష్టజనమును రక్షించుము.
రాముడు: (తనలో) మా తండ్రి ' ఈ బ్రహ్మర్షి ఆజ్ఞానుసారము చేయుము' అని ఆదేశించినారు కదా? అట్లే చేసెదను.
అతడు శంకను విడిచి రాక్షసికై నిరీక్షించెను. సూర్యడస్తమించు సమయమున తాటక తన భయంకరాకారముతో ప్రత్యక్షమయ్యెను. దుమ్మును ఎగజిమ్ముచూ, రాళ్ల వర్షమును కురిపించుచూ అత్యంత రయమున సమీపించుచున్న రక్కసిని విశ్వామిత్రుడు హుంకరించి ఆపివేసినాడు. "రామ చీకటి పడినచో దీని బలము హెచ్చును. ఆలసించక దీనిని యమసదనమునకు పంపుము" అని హెచ్చరించినాడు. రాముని బాణము రివ్వున పోయి రక్కసి రొమ్మును చీల్చివేసినది; తాటక పర్వత శిఖరము వలె నేలను కూలి ప్రాణములను విడిచినది.
మరునాటి ఉదయము విశ్వామిత్రుడు "రామా నిన్న నీవు చూపిన సామర్ధ్యము నాకు ఆనందమును కలిగించినది, నేను మున్ను నా తపముచే శివుని మెప్పించి ఆర్జించిన అస్త్ర శస్త్రములనన్నింటినీ ఇప్పుడు నీ వశము చేసెదను. స్నానము చేసి శుచివి ఐ రమ్ము" అనెను. రాముడు నది నుండి తిరిగి వచ్చిన పిమ్మట బ్రహ్మర్షి తన అస్త్ర శస్త్రములను అతని యధీనము చేసెను. ఆయా మంత్రములను ఉపదేశించెను. దశరథ నందనా ఈ అస్త్ర సంపదను దుష్ట సంహారమునకును సాధు సంరక్షణమునకును వినియోగించుము" అనెను.
రాముడు బ్రహ్మర్షికి ధన్యవాదములు తెలిపి, అనంతరము ఆయన అనుమతితో లక్ష్యణునకా అస్త్రవిద్యను నేర్పెను... పిమ్మట వారు మువ్వురునూ శీఘ్రగతిని పోయి బ్రహ్మర్షి వాసము సిద్దాశ్రమమును చేరుకొన్నారు.
ఆ మరునాడే విశ్వామిత్రుడు మరల దీక్షను పూని యాగమును ప్రారంభించినాడు. ముని యేకాగ్రతతో నిశ్చింతగా సవనమును సాగించుచుండగా రామలక్ష్మణులు విల్లమ్ములను ధరించి అప్రమత్తులై విఘ్నకారులగు మారీచ సుబాహువుల కొరకు ఐదు అహొ రాత్రములు నిరీక్షించినారు. ఆరవ రోజున మారీచుడు రక్తముతో నింపిన కుంభముతోనూ సుబాహువు మాంసఖండములు గల శూర్పము (చేట) తోనూ ఆకాశమున ప్రత్యక్షమైనారు. రామలక్ష్మణులు తమ బాణములను పుంఖాను పుంఖముగ ఆకసము వైపు పంపి వాటితో రక్కసులకునూ హొమ గుండమునకునూ నడుమ నింగిని విశాలమగు పందిరిని నిర్మించినారు. రాక్షసులు వర్షించిన రక్త మాంసములకు రామలక్ష్మణుల శరముల పందిరి అడ్డుగా నిల్చుటచే వారి ప్రయత్నము విఫలమైనది. మారీచ సుబహువులు ఉగ్రులై అవరోధమును తొలగించవలెనని సమీపించుచుండగా రాముడు అలసించక మారీచునిపై వాయువ్యాస్త్ర మునూ సుబాహువుపై ఆగ్నేయాస్త్రమునూ సంధించినాడు. వాయువ్యాస్త్రము మారీచుని మహావేగమున నూరుయోజనముల దూరము కొనిపోయి సముద్రమున పడవైచినది. ఆగ్నేయాస్త్రము సుబాహువును భస్మము చేసినది. విశ్వామిత్రుని యజ్ఞము నిర్వఘ్నముగ ముగిసినది.