"గొప్ప సంబంధానికి పడాలని నేనుకూడా ఆశీర్వదిస్తాను. అలా జరగనినాడు ఏదో ఒక సంబంధంచూసి ఇవ్వకతప్పదుగా? ఒక మగాడు పదిమందిని కూర్చోబెట్టి పోషించే రోజులు పోయాయి. ఆడది కూడా సంపాదిస్తే తప్ప చాలా సంసారాలు. గడపడం కష్టమై పోయాయి. నా ఇంట్లోనే చూడరాదూ? మీ వదిన మిషన్ మీద బటలు కుట్టి పదో పాతికో సంపాదిస్తూండబట్టి ఇల్లు గుట్టుగా సాగుతోంది. అందుకోసం కాకపోయినా ఆడపిల్ల తన కాళ్ళమీద తను నిలబడడం ఎప్పటికైనా మంచిది. పెళ్లి చేసుకొన్నా, చేసుకోక పోయినా ప్రతి ఆడపిల్లా గమనించాల్సిన విషయం, ఆడది అనురాగంతో పురుషుణ్ని పెనవేసుకు పోవాల్సిందే కాని, అతడి మీదే ఆధారపడే మన స్తత్వం స్త్రీని అతడికి బానిసగా చేస్తుంది. కాబట్టి పారు చదువు మానేసి ఇప్పటినుండి పెళ్లికోసం నిరీక్షిస్తూ కూర్చోవడం నాకు నచ్చలేదు. ఓ ఆరునెలల్లో ఎస్.ఎస్.సి పరీక్షలు అయిపోతాయి. రెండేళ్ళు ఓపికపడితే ఇంటర్మీడియెట్. మార్కులు బాగావస్తే ఏ ట్రెయినింగ్ లోనైనా సీటు ఇట్టే వచ్చేస్తుంది. ట్రెయినింగ్ అయ్యాక ఉద్యోగం రావడం ఒక సమస్యకాదు."
ఇదంతా తండ్రికే నచ్చలేదు. కూతురికేం నచ్చుతుంది.
రంగనాధం ఉపన్యాసమంతా నిష్ప్రయోజనమైంది.
ఆయన నిస్పృహగా లేచి వచ్చేశాడు.
భార్య నాగలక్ష్మి అడిగింది. ఏదో సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తున్నారేమిటని!
"తన కూతురికి కోటీశ్వరుల సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాడట కృష్ణారావు!"
ఆ చెప్పడంలోని ఉక్రోషం! దూకుడూ చూచి నాగలక్ష్మి నవ్వింది. "మధ్యన మీదేం పోయింది!"
"నాది ఏదో పోయిందని కాదు. కాని, ఇన్నిరోజులు అతడికష్టం సుఖంపంచుకొన్న మనపట్ల అతడి విశ్వాసహీనతకు మాత్రం మండిపోతోంది. కూతురికి లక్షాధికార్ల సంబంధం చేస్తాడట!"
"అతడి కూతురికి గొప్ప సంబంధం చేసుకుంటానంటే మీ కెందుకు మంట?" ఆశ్చర్యపోయింది.
"ఎందుకు మండదూ? పారును నా కోడలిగా చేస్తే ఆ మాత్రం సుఖపెట్టలేనూ? ఎదురుగా ఉన్న పిల్లవాడు కనిపించలేదుగాని. కోటీశ్వరుల సంబంధం చేస్తాడట తన పిల్లకు జోలికట్టి బిచ్చమెత్తి ఆ డబ్బుతో కోటీశ్వరుడిని అల్లుడిగా కొంటాడట. చూడనా? చూస్తాను?"
అప్పటికి గాని భర్త బాధేమిటో అర్ధంకాలేదు నాగలక్ష్మికి.
కృష్ణారావును ఆ పల్లె విడిపించి తీసుకు వచ్చినప్పటి నుండి బంధువులమైనా స్నేహితులమైనా మేమే అన్నట్టు తిరిగారు అందమైన పారును తమ పెద్దబ్బాయి గిరిధర్ కు చేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకొన్నారు. ఆపిల్లకు పెళ్ళివయస్సు వచ్చాక కృష్ణారావు తప్పక తమ పెద్దబ్బాయికి చేసుకొమ్మని అడుగు తాడని ఎంత నమ్మకంగా ఉన్నారు! కృష్ణారావుకు అల్లుడు కావడానికి అంత అర్హత లేనివాడా గిరిధర్? స్కూల్ ఫైనల్ పాసవుతూనే రంగనాధం తన పలుకుబడితో ఓ ప్రవేట్ కంపెనీలో రెండు వందలు వచ్చే ఉద్యోగం ఇప్పించాడు. రెండు సంవత్సరాలవుతోంది అతడు ఉద్యోగం చేయబట్టి. రూపానికి మన్మధుడు కాకపోయినా చామన రంగుతో బాగానే ఉంటాడు.
పారిజాత కూడా స్కూల్ ఫైనల్ అయిపోతే, ఆ పిల్లకు ఏ ట్రెయినింగ్ అయినా ఇప్పించి ఉద్యోగంలో ప్రవేశపెట్టాలని భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే బాగుండునని ఎన్నెన్నో ఆలోచించారు భార్యాభర్తలు. అవన్నీ మట్టిలో కలిపాడు కృష్ణారావు తన కూతురి వివాహ ప్రసక్తి తెస్తూ.
కోమలమ్మ కాంపౌండ్ లో ఏ పోర్షన్ లో ఏ విశేషం జరిగినా అది కోమలమ్మ చెవిలో యెవరో వేస్తూనే ఉంటారు. పారిజాత బడి మానేసిందన్న సంగతి అప్పుడే తెలిసి పోయింది కోమలమ్మకు మనోహర్ కాలేజీనుండి వస్తూనే? "పారును యెవరో అల్లరి పెట్టారట బడి మానేసిందట" అని చెప్పింది.
మనోహర్ ఆశాభంగం పొందినవాడిలా ముకం పెట్టాడు. పారు ఎంతపని చేసింది! యెవడో వెధవ అల్లరిపెడితే ధైర్యంతో బుద్దిచెప్పాలిగాని, పిరికిదానిలా చదువు చెడగొట్టుకొని ఇంట్లో కూర్చోవడమేమిటి? తనుండగా పారు కేమిటి భయం చొచ్చొచ్చో! ఆ రౌడీకి తన ప్రతాపం చూపే అవకాశం లేకుండా చేసింది మొద్దు!
"బడి మానేసి ఏం చేస్తావంటే పెళ్ళిచేసుకొంటానందట" ముసిముసిగా నవ్వి అంది కోమలమ్మ "ఈ కాలం పిల్లలు యెంత సిగ్గువిడిచిపోయారో? మా కాలంలో ఇంత నిర్లజ్జత యెరుగము"
మనోహర్ ముఖం కడుక్కొని టీ తీసుకొంటూనే పారిజాత వాళ్ళింటికి బయల్దేరాడు. పారిజాత అప్పుడే లైట్ వేసి, ఏవోశ్లోకాలు చదువుకొని స్టవ్ మీద అన్నానికి పెట్టి, ఏదో కూనిరాగం తీస్తూ స్టవ్ మంట కేసి చూస్తూ కూర్చొంది.
"మాస్టారుగారున్నారా!"
పారిజాత ఉలికిపడి, "లేరు" కూరలకోసం బజారుకు వెళ్ళారు. అంది. "కూర్చో, మనూ!" కుర్చీ జరిపింది.