Previous Page Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 9

    కిరీటి డ్రైవింగ్ సీటులో కూర్చుని సైడ్ డోర్ తెరవగానే నిస్సంకోచంగా అతడి ప్రక్కనే కూర్చుంది.

    మరికొన్ని నిముషాలలో కారు తుంపాల వీధులగుండా పరుగుతీసింది.

    ఆ రోడ్లన్నీ బాగా పరిచయమున్నట్టుగా అతడు కారు నడుపుతుంటే ఆమె విస్తుపోతోంది.

    "కారు కాస్త కంజస్టడ్ గా ఉందనుకుంటాను."

    అతడు టొయాటోని ఉద్ధేశించి అన్నాడు.

    "ఫర్వాలేదు..... ఇద్దరికి సరిపోతుంది."

    మాటలాడటం తప్పనిసరి అన్నట్టు ముక్తసరిగా జవాబిచ్చింది.

    "అప్ కోర్స్...... ప్రస్తుతానికి ఇద్దరమే కాబట్టి ఫర్వాలేదనుకోండి."

    అతడి మాటల్లోని గూఢార్ధాన్ని గ్రహించిన శిల్ప తీక్షణంగా అతనివేపు చూసింది.

    తన వ్యక్తిత్వానికి సరిపడని పరిహాసం ఆమె హర్షించదు. అందుకే ఆవేశంగా నాలుగు దులిపేయాలనిపించిన ఆలోచనను బలవంతంగా అదుపులోకి తెచ్చుకుంది.

    కారు మరో మలుపు తిరుగుతుంటే "ఇటెక్కడికి" అంది అనాలోచితంగా.

    "బొజ్జన్న కొండ దగ్గరికి."

    "అంటే ఈ ప్రాంతం మీకు బాగా పరిచయమన్నమాట."
   
                                                              4)

    జవాబుగా ఓ చిరునవ్వు నవ్వాడు.

    "మీకు సింప్లిసిటీ అంటే ఇష్టమనుకుంటాను."

    అతడు దేన్ని ఉద్దేశించి ఆ మాటన్నాడో ఆమెకు అర్థం కాలేదు.

    "ఐటూ లైక్ సింప్లిసిటీ.... కాబట్టే ఈ చీరలో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు."

    అందంగా అలంకరించుకుని అతని ముందుకు రావటం ఇష్టంలేక ఓ సాదాచీర కట్టుకుంటే తన ఆలోచనకి మరో కొత్తభాష్యం చెబుతున్న అతడి మాటలు విని తన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైందనుకుంది.

    కారు బొజ్జన్నకొండ ముందు ఆగింది.

    "నేను మిమ్మల్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చానో ఇప్పటికైనా గ్రహించారనుకుంటాను."

    ఆమె ముఖంలో ఎటువంటి భావమూ కనిపించకుండా జాగ్రత్తపడింది.

    "శాంతి సందేశాలతో సర్వమానవాళిని జాగృతం చేసిన యీ బుద్దుడి ఆరామప్రాంగణంలో అయితే మీరు జీవహింసకు పాల్పడరని....." అంటూ మెట్లపై కూర్చున్నాడు.

    "జీవహింసా!"

    అర్థం కానట్టుగా అతడివైపు చూసింది.

    "అవును.... నన్ను అదే ఈ జీవుడ్ని మాటలతో హింసించడం జీవహింసేగా."

    'అహంకారి, అందగాడే కాదు..... మాటకారి కూడా' అనుకుంది.

    మౌనంగా ముందుకు నడిచి ఓ చెట్టునీడన చేరి నిలబడింది.

    "మీరు నాకు చాలా దూరంగా వెళ్ళిపోయారు" మృదువుగా అంటూ మెట్లపై నుండి పైకి లేచాడు.

    'ముందు ముందు మరింత దూరంగా ఉంటాను' మనసులోనే అనుకుంది స్వాతిశయంతో.

    "మిస్ శిల్పా.... నిజానికి నేను మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది...."

    "నాకు బాగా తెలుసు మిస్టర్ కిరీటి!"

    ఆమె కంఠంలోని తీవ్రతకు అప్రతిభుడయ్యాడు.

    "యస్ మిస్టర్ కిరీటి! మీరు నన్నిక్కడకు తీసుకువచ్చింది మీరెంత పెట్టుబడిలో నన్ను కొనుక్కుంటున్నారో చెప్పి మీ ఔదార్యాన్ని చాటుకోవడానికి..... మీ చేతుల్ని అందమైన మీ మాటలతో సమర్థించుకోడానికీ అని నేనూహించగలను."

    "యూ ఆర్ మిస్టేకెన్ మిస్ శిల్పా..."

    "నో..... నాటెటాల్ మిస్టర్ కిరీట్! ఐనో ది పాన్ బిహైండ్ దిస్. మీకో అందమైన భార్య కావాలి.... గొప్పింటి అమ్మాయి కావాలి. అదృష్టవశాత్తూ మీకు అవకాశం కలిసి వచ్చింది. కాబట్టే నా యిష్టాయిష్టాలతో పనిలేకుండానే బేరం సెటిల్ చేసేసుకున్నారు. నాకూ ఒక మనసుంటుందని ఆ మనసుకు కొన్ని అభిరుచులుంటాయన్న విషయాన్ని మరిచి మీ బిజినెస్ బ్రెయిన్ తో మా నాన్నగార్ని బుట్టలో వేసుకున్నారు."
 

 Previous Page Next Page