Previous Page Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 8


                                                                           4
    శిల్ప అంగీకారంతో ఇటు తన ఆస్తిని కాపాడుకోవటము, అటు అర్హుడైన వ్యక్తితో ఆమె పెళ్ళి కూడా జరగటం లాంటి రెండు సమస్యలకు పరిష్కారం దొరికినట్టయింది రంగనాధంగారికి.

    అందుకే ఆ రాత్రే ఫోనుద్వారా వైజాగ్ తెలియపరిచారు.

    మరుసటిరోజు ఉదయమే త్వరగా నిద్రలేచి ఏ సమయంలోనైనా కిరీటి అక్కడకు రావచ్చని, కాస్త అందంగా అలంకరించుకోమని శిల్పకు చెప్పగానే నిర్లక్ష్యంగా ఆమె చూసిన చూపు ఆయనలో భయాన్ని రేపింది-చేజేతులా ఆ సంబంధాన్ని ఎక్కడ చెడగొడుతుందోనని.

    కిరీటి వచ్చేవరకు ఆయన మనసు మనసులో లేదు. బితుకు బితుకుమంటూనే మధ్యాహ్నం వరకూ గడిపారు. మధ్యలో ఒకటి రెండుసార్లు కూతురి గదిలోకి వెళ్ళి చూశారు ఆమె అలంకరణలో ఏ మార్పు లేకపోయేసరికి మరోమారు చెప్పటానికి ధైర్యం లేకపోయింది.

    ఒంటిగంట ప్రాంతంలో టొయాటోలో లోగిలికి వచ్చిన కిరీటి ఘనంగా రిసీవ్ చేసుకున్నారు రంగనాధంగారు.

    ఒంటరిగా వచ్చిన కిరీటి హాలునంతా కలియచూస్తూ ఓ సోపాలో కూర్చున్నాడు.

    భోజనం చేసే వచ్చానని కిరీటి చెప్పడంతో మరో మారు రెట్టించలేకపోయారు రంగనాధంగారు.

    కిరీటి ఎందుకు వచ్చిందీ ఆయనకు తెలుసు కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకుని కూతురి గదిలోకి వెళ్ళారు.

    అతి సామాన్యమైన నైలెక్స్ చీరలో పెద్దగా అలంకరించుకోకుండా కనిపించిన శిల్పపై చెప్పలేనంత కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నారు.

    "ఆయనక్కావలసింది నేనుకాని నా అలంకరణ కాదు నాన్నా!" అంటూ అతి సునాయాసంగా తండ్రి మనోభావాల్ని చదివి నిర్లిప్తంగా బయటకు నడిచింది.

    కిరీటి కూర్చున్న హాలులోకి నడిచిన శిల్ప అతని ఉనికిని గుర్తించనతం నిర్లక్ష్యంతో అతనికెదురుగా సోఫాలో ఆసీనురాలైంది.

    నవ్వుతున్న అతని పెదవుల్ని సమ్మోహనంగా విచ్చుకున్న అతని నేత్రాల్ని చూసి తత్తరపాటుతో తల వంచుకుంది.

    ఎవరీ కిరీటి.... ఎక్కడో చూసినట్టుందే..... ఆ చూపులు ఆ చిలిపి నవ్వు..... ఎక్కడ,..... ఎక్కడ చూసింది తను.

    ఎంత ప్రయత్నించినా గుర్తు రాలేదు.

    ఎవరైనా కానీ అతను తన శత్రువు.

    తన ఇష్టాయిష్టాలతో పనిలేకుండా తనకు ఖరీదు కట్టి కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్న అహంకారి. తమదుస్థితిపై స్వారీ చేయాలని సంకల్పించిన ఓ అవకాశవాది.

    మనసు అగ్నిగోళంలా మండుతుంటే నెమ్మదిగా తల పైకెత్తి చూసింది. "
   
    క్రీం కలర్ సూట్ లో కాలుమీద కాలువేసుక్కూర్చున్న కిరీటిలో ప్రపంచంలో దేన్నైనా కొనేశక్తి గలవాడినన్న అతిశయం కనిపించిందామెకు.

    మిస్టర్ కిరీటి..... మానాభిమానాలున్న ఏ ఆడపిల్ల క్షమించమని రీతిలో నన్ను కైవసం చేసుకోవాలని వలపన్నావు. ఈ క్షణానికి గెలుపు నీది కావచ్చేమోకాని నీకో గొప్ప గుణపాఠం చెప్పాలని, రేపటి నీబ్రతుకు నవ్వులపాలు చేయాలని సంకల్పించిన నన్ను నీ దారిలోకి మళ్లించుకోగలవా....

    రాజానరేంద్రదేవ్ మనవరాలినైన నన్ను ఇంత తక్కువగా అంచనా వేసిన నువ్వు ప్రతిక్షణం పశ్చాత్తాపపడేట్టు చేయనివాడు....

    "మిస్ శిల్పా! మీతో పర్సనల్ గా మాట్లాడాలనుంది. అలా బయటకు వెళదాం వస్తారా?"

    కిరీటి అడగటంతో ఆలోచనల్ని ప్రక్కకునెట్టి సూటిగా అతనివేపే చూసింది.

    ఏదో నిర్ణయించుకున్నదానిలా 'సరే' అన్నట్టుగా లేచింది.

 Previous Page Next Page