Previous Page Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 10


    "మిస్ శిల్పా....." ఆవేశంగా అతని పెదవులు వణికాయి.

    "నేను కావాలనుకుంటే మీకంటే అందగత్తెలు, గొప్పింటి అమ్మాయిలు చాలామంది వస్తారు......"

    "వచ్చినా ఇలాంటి పరిస్థితుల్లో మీచేత కొనబడే అవకాశం లేదు. జీవితాంతం మీదగ్గర అణిగి మణిగి ఉండే అవకాశం రాదు. అదేగదా మీ ఆలోచన."

    "నో...."

    "యస్ మిస్టర్ కిరీటీ! సరిగ్గా మీ ఆలోచన అదే అందుకే అందర్నీ వదిలి నన్ను బలిపశువుగా ఎన్నుకున్నారు."

    పెదవుల్ని బిగించి క్రోధంగా నవ్వాడు.

    "ఎందుకా నవ్వు......"

    "మీ తెలివి తక్కువ తనానికి..... అర్థంలేని అహంకారానికి ఇంకా పగలబడి నవ్వాలనిపిస్తోంది."

    "నవ్వండి. అవసరం మాది, అవకాశం మీది."

    "రాజానరేంద్రన్ మనుమరాలైన శిల్పాదేవి హఠాత్తుగా ఇంత బేలగా మారటం నన్నెంతో బాధిస్తోంది."

    "నాకెవరి సానుభూతి అఖ్కర్లేదు."

    "అఖ్కర్లేకపోతే అయిదు లక్షలు ఎలా వస్తాయి. పరువు ప్రతిష్టలెలా నిలుస్తాయి."

    ఎగతాళిగా మాట్లాడేసరికి శిల్ప నేత్రాల్లో నీళ్ళు చిప్పిల్లాయి.

    "డోంట్ వర్రీ మిస్ శిల్పా! మిమ్మల్ని నేను తప్పకుండా ఆదుకుంటాను."

    "అయాచితంగా మీరంత సర్దుబాటు చేయనక్కర్లేదు మిస్టర్ కిరీటి! మీరిచ్చే డబ్బుకు బదులుగా నేను మీ కోర్కెను మన్నిస్తాను."

    ఆమె కంఠంలోనూ అవహేళన ధ్వనించింది.

    "వెల్...... ఇక మీరు మాట్లాడేదేమీ లేదనుకుంటాను" భుజాలు కుదుపుతూ అన్నాడు కిరీటి

    "బోలెడంత జీవితం ముందుంది. తొందరెందుకులెండి."

    దురుసుగా కారెక్కి కూర్చుంది.

    "బెటర్ టు హావ్ ఎ సెకండ్ థాట్."

    కారు నడుపుతూ సీరియస్ గా అడిగాడు.

    "తీసుకున్న నిర్ణయాలనుండి ప్రక్కకు జరగటం ఈ శిల్పకు అలవాటులేదు."

    "అంటే మనం త్వరలోనే భార్యాభర్తలం కాబోతున్నామన్నమాట" వ్యంగ్యంగా అడిగాడు.

    "మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది."

    క్రీగంట చూస్తూ భుజాలనిండా పైట కప్పుకుంది.

    "బైదిబై..... మన పెళ్ళి ఎలా జరగాలనుకుంటున్నారు."

    "అంటే...."

    కారు తుంపాల గ్రామంలోకి ప్రవేశించింది.

    "అంటే...... ఆకాశమంత పందిరి భూదేవంత....."

    ఆర్ధోక్తిలో ఆగిపోయాడు ఆమె వాడి చూపుల్ని చూడగానే.

    "ఇంతగొప్ప పెళ్లికి అంత పబ్లిసిటీ అనవసరములెండి."

    "అహఁ! అదికాదు..... మీరు అసలే రాజానరేంద్రదేవ్ మనవరాలు కదా. పురజనులంతా వేడుక చూసి తరించిపోతే బాగుంటుందని."

    "అక్కర్లేదు..... సింపుల్ గా రిజిస్టర్ మేరేజ్ అయితే బాగుంటుంది."

    "పూలదండలు మార్చుకునే గాంధర్వ వివాహమైనా ఫర్వాలేదు."

    కారు లోగిలిలోకి ప్రవేశిస్తుండగా వారిమధ్య సంభాషణ ఆగిపోయింది.

                                                                    5
    పెద్ద ఆర్భాటం లేకుండా మరో మూడు రోజులలో కిరీటి శిల్పల వివాహం జరిగిపోయింది.

    ఉన్న ఒక్కగానొక్క కూతురి పెళ్ళి జమీందారీ స్థాయికి తగ్గట్టుగా జరగాలని రంగనాధంగారు ఎంత పట్టుపట్టినా కిరీటి అంగీకరించలేదు. శిల్పకూడా సింపుల్ గా జరగాలని పట్టుబట్టడంతో కశింకోట సత్యన్నారాయణస్వామి కొండపై ఆ శుభకార్యం కాస్తా ముగించేశారు.
 

 Previous Page Next Page