"అసలు ఈ విషయం బయటపడితే పార్లమెంటులో ప్రతిపక్షాల బాధ భరించలేం. దాంతో గొడవ మరింత ఎక్కువవుతుంది" హోంశాఖ అధికారి అన్నాడు.
ఏదో అనబోయిన పద్మజను పక్క నుంచి వారించాడు సోమశేఖరం.
బయటకొచ్చాక 'వీళ్ళ భయం అంతా ప్రతిపక్షాల వాళ్ళ మాట పడాల్సి వస్తుందనీ. అంతేగాని అమాయక ప్రజల ప్రాణాల గురించి కాదు. బ్లడీ పాలిటిక్స్" కోపంగా అంది పద్మజ.
"నిజమే పద్మజా, కానీ మీరు ఆమాట అక్కడా అని ప్రయోజనం లేదు. వాళ్ళకు శత్రువులవటం తప్ప. పేరుకి డెమోక్రసీగాని అసలు సిసలైన ఫాసిస్టు సొసైటీ మంచిది."
"శేఖరం మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మీరు పరిశోధన సాగించండి. అనుమానం ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ సహకారం కూడా వుందని. ఆ విషయం పూర్తిగా కన్ ఫర్మ్ చేసుకుంటే మంచిది. మీరొకసారి కొచ్చిన్ వెళ్ళి రావల్సి వుంటుంది."
"అలాగే త్వరలోనే వెళతాను" అన్నాడు సోమశేఖరం.
అతనికి పొద్దుట జరిగిన విషయం గుర్తుకొచ్చింది. కేవలం తమ డిపార్టుమెంటు కోసం ఏర్పాటు చేయబడిన మీటింగు అది. కానీ పద్మజ మీటింగ్ కి రాగానే అభ్యంతరం తెలిపింది. ఆమె అన్నమాట సబబే, ఇప్పుడీ సమస్య ఒక డిఫెన్స్ సంబంధించిందే కాదు. ఎప్పుడయితే ఆయుధాలు ప్రజల చేతుల్లో అడ్డాయో అప్పుడే హోంశాఖ కూడా రంగంలోకి రావాలి. ఇక కేసు సి.బి.ఐ. అధికారులకు కూడా తెలియజెయ్యాలి అంది. వెంటనే ఏర్పాట్లు చేశారు. మీటింగు అనుకొన్నదానికంటే మూడు గంటలపాటు ఆలస్యంగా మొదలైంది.
సోమశేఖరానికి పద్మజ ధైర్యం చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది. కావటానికి తామిద్దరూ ఒకే కేడర్ వాళ్ళు. కానీ డబ్బుకోసం ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేనందువల్లనో, మొదట్నించీ అలాంటి వాతావరణంలో పెరగడంవల్లనో పద్మజ నిర్భయంగా మాట్లాడగలుగుతుంది. తనేమో ఒక ఇంట్రావర్ట్. ఏ మాట మాట్లాడాలన్నా పదిసార్లు ఆలోచిస్తాడు.
"నేను ఇంటికి వెళ్తున్నాను" పద్మజ మాటలకు ఆలోచనల్లోంచి బయటపడ్డాడతడు.
ఇంటిముందు ఆగి వున్న ఫియట్ కారునిచూసి ఆశ్చర్యపడింది పద్మజ.
'ఎవరబ్బా! హిమజతో ఎవరయినా వచ్చారా' అనుకుంటూ లోపలకు అడుగుపెట్టింది.
"సుప్రభాతం" అన్నాడు గిరి సోఫాలోంచి.
"అరె" నాలుక కరుచుకుంది పద్మజ. టైం రెండున్నర దాటింది. అతన్ని భోజనానికి పిలిచినా విషయమే మర్చిపోయింది తను.
"సారీ, మిస్టర్ గిరీ, ఆఫీసులో పని ఎక్కువగా వుండి ఆలస్యమై పోయింది."
"మరేం ఫర్వాలేదులెండి. సారీలతో సమయం వృధా చేయకుండా రండి. భోంచేద్దాం" అన్నాడు గిరి.
డైనింగ్ టేబిల్ మీద వస్తువులు చూస్తుంటే గుర్తు వచ్చింది పద్మజకు, అతను చెప్పిన వంటలు చెయ్యమని చెప్పడం మర్చిపోయానని.
"సారీ! మీరడిగిన భోజనం పెట్టలేకపోతున్నాను!"
"ఇప్పుడదేగా తింటున్నది?" ఎగ్ కర్రీ చూపిస్తూ అన్నాడు.
"అదికాదుగా మీరడిగింది?"
"మీరు పొరబడుతున్నారు. ఇది కోడి కూరే. కాకపోతే కోడి ఇంకా పుట్టలేదు అంతే."
ఫక్కున నవ్వింది పద్మజ.
"హమ్మయ్య. అలా నవ్వండి. మీ ఆఫీసు పనేమిటో నాకు అనవసరంగానీ మీకు జీతాలకు బదులు తలా కొంచెం సీరియస్ నెస్ ఇచ్చి పంపిస్తున్నారేమో ననుకున్నాను" నవ్వినా ఇంకా వదలని ఆఫీసు జ్ఞాపకాలతో, టెన్షన్ లో అలసిన ఆమె ముఖం చూస్తూ చిరునవ్వుతో అన్నాడు గిరి.
"ఉహూ"కుర్చీ వెనక్కి వాలి అతన్నే చూస్తూ "అయితే మీ కంపెనీకి చాలా లాభాలు వస్తూండాలే" అంది.
"ఏం?"
"మీరు జీతాలకు బదులు నవ్వుల్ని పంచుతుంటారు గదా!"
"అందుకే అన్నాను మీరూ నేనూ ఐ.ఎ.ఎస్సే-కానీ తేడా వుంది" నవ్వుతూ అన్నాడు గిరి.
"అన్నట్లు పజిల్ సాల్వ్ చేస్తారా?" అడిగింది.
"ఆ! మీరు ఆజ్ఞాపించాక తప్పుతుందా? పూర్తిచేసే పడుకున్నాను."
"నాకు బహుమతి కావాలి"
"ఏం బహుమతి కావాలి"
"హమయ్య-ఇప్పటికి పూర్తిగా రిలాక్స్ అయ్యారు. నాకు సీరియస్ గా వుండేవాళ్ళంటే భయం, ఆ బహుమతి చాలు."
"ఇంతకీ మీ గురించీ ఏమీ చెప్పలేదు. అమ్మా నాన్నా ఎక్కడ వుంటారు?"
"చెప్పుకోవటానికి పెద్ద కథేం లేదు. నాకు ఏడాది నిండగానే నా పనులన్నీ నేనే స్వయంగా చేసుకోవడం మొదలు పెట్టానట. ఇక నా అవసరం లేదుకదా అని అమ్మ వెళ్ళిపోయింది. నాన్నను అడిగితే అమ్మ స్వర్గానికెళ్ళింది అనేవాడు. కొంచెం జ్ఞాపకం వచ్చాక, "నాన్నా, నేనూ అమ్మ దగ్గరకు స్వర్గానికి వెళతాను" అని అడగటం మొదలు పెట్టానట. "నువ్వేమిటిరా ముందు నన్ను వెళ్ళనీ" అని ఆయనా వెళ్ళిపోయారు. చిన్నతనం చాలా వరకు హాస్టల్లో గడిచింది. ఉన్న ఒక్క అక్కయ్యా ప్రస్తుతం అమెరికాలో వుంది. ఇకపోతే డబుల్ గ్రాడ్యుయేట్ ని."
"డబుల్ గ్రాడ్యుయేటా?" ఆశ్చర్యంగా అడిగింది.
"ఆ, బి.కాం. పాసయ్యాక ఒక గ్రాడ్యుయేటుని అయ్యాను. పెళ్ళి చేసుకోలేదు కాబట్టి మరో గ్రాడ్యుయేటుని"