"మరి ప్రకాశరావుగారెలా పరిచయం?"
అతను మాట్టాడలేదు.
"ఏం మాట్లాడడం మానేశారు. జవాబు చెప్పకూడదా?" అడిగింది.
"అబ్బే ఏం లేదు. అక్కయ్య ఉత్తరం వ్రాసింది. వారింటికి వెళ్ళమనీ, వాళ్ళమ్మాయిని చూడమనీ"
"ఓహో అర్థమయిందన్నట్లుగా తల వూపింది. ఆమెకు తెలియకుండానే గుండెల్లో ఏదో వుచ్చుకున్న అనుభూతి.
"అయితే రాధ మరీ చిన్నపిల్లలా అనిపించింది. అక్కయ్యకు వ్రాస్తున్నాను ఆ విషయమే. అయినా ఏమిటో నా ఇష్టం గురించే మాట్లాడుతున్నారుగాని ఆ అమ్మాయికి నేనంటే ఒళ్ళు మండిపోతూ వుందిప్పుడు" నవ్వేశాడు.
ఫోన్ రింగయింది.
"ఎక్స్ క్యూజ్ మీ."
"పద్మజా హియర్" అంది.
అవతలివైపు నించి "నేనమ్మా ప్రకాశరావుని" అన్నారాయన.
నమస్తే అంకుల్"
"ఏదో వార్త విన్నానమ్మా, అనుమానం వచ్చి ఫోన్ చేశాను"
"తర్వాత చెప్తాను అంకుల్. సాయంత్రం ఇంటికి వద్దామనుకుంటున్నాను."
"ఎవరయినా వున్నారా పక్కన?"
"ఆ...."
"సరే, రాధ మాట్లాడుతుందిట."
"అక్కా!" రాధ గొంతు వినిపించింది.
"చెప్పు రాధా"
"నిన్నటి పజిల్ రావడంలేదక్కా, చెప్పవూ?"
"అది ఫోన్ లో చెప్పేది కాదు. సాయంత్రం ఇంటికి వస్తానుగా, చెప్తాను"
"ఆ పెద్దమనిషికీ రాలేదనుకుంటాను మళ్ళీ మాట్లాడలేదు" అంది రాధ అక్కసుగా "నీకేమైనా చెప్పాడా?"
ఒక్కక్షణం తటపటాయించింది పద్మజ. అతడు ఇక్కడే వున్నాడని చెప్పటం ఇష్టం లేకపోయింది.
"ఏమీ తెలియదు" అంది.
"సరే సాయంత్రం వస్తావుగా? బై" ఫోను పెట్టేసింది రాధ.
సీరియస్ గా కూర్చున్నాడు గిరి.
"ఏమిటి తిట్టుకుంటున్నారా?" అడిగింది చిరునవ్వుతో.
"అవును" అన్నాడు మరింత సీరియస్ గా, "మిమ్మల్ని కాదు, అలెగ్జాండర్ గ్రాహంబెల్ ని తిట్టుకుంటున్నాను. పనీ పాటా లేకపోతే ఏ సేఫ్టీ పిన్నో కనిపెట్టి ఉండవచ్చుగా టెలిఫోన్ ఎందుకు కనిపెట్టడం?" అతని మొహం చూస్తే నవ్వొచ్చింది పద్మజకు.
"అన్నట్లు రాధ ఫోన్ చేసింది. పజిల్ కి సమాధానం రాలేదుట."
"రాదని నాకు తెలుసులెండి. నేనేమో ఐ.ఏ.ఎస్ పాసయ్యాను. తను అదీ పాసవ్వలేదు"
"సరే, ఇంకేమిటి విశేషాలు చెప్పండి" సోఫాలో కూర్చుంటూ అంది.
"అంటే ఇక వెళ్ళి రమ్మని అర్ధం అన్నమాట. వెళ్ళొస్తాను. అన్నట్లు మళ్ళీ రావచ్చుగదూ?"
"తప్పకుండా. మీరడిగిన భోజనం పెట్టాలి గదా."
"అన్ని రోజులు నేనాగలేను."
"ఎన్ని రోజులు?"
"మీ ఇంట్లో కోడి పుట్టాలి. పెరిగి పెద్దదవాలి. అప్పటిదాకానా?"
"అంత అవసరం లేదులెండి. త్వరలోనే కలుద్దాం"
"అయితే మీకెప్పుడు వీలో చెప్పండి. నేను మీ కిష్టమైన భోజనం మీ కిష్టమైన హోటల్లో ఇస్తాను"
"రేపెప్పుడైనా ఫోన్ చేయండి - చెప్తాను"
"అలాగే అలెగ్జాండర్ గ్రహంబెల్ ఎంత మంచివాడో - టెలిఫోన్ కనిపెట్టాడు కదండీ" అమాయకంగా అన్నాడు.
ఆవకాశం ఒకేసారి తలుపు కొడుతుంది అంటారు. దురదృష్టం మాత్రం తెరుచుకునే వరకూ కొడుతూనే వుంటుంది.
4
చిన్నతోట అనబడే ఇంటి వెనుక వున్న ఆ పచ్చటి ప్రదేశంలో అణువు అణువులో తొణికిసలాడుతున్నది శ్రమైక జీవన సౌందర్యం. నిర్లక్ష్యంగా పెరిగి అల్లుకున్నా ఒక క్రమం కనిపిస్తోంది. ఒక మూలగా జాజిపందిరి, పందిరి క్రింద పచ్చటిగడ్డి. అక్కడ కుర్చీ వేసుకుని కూర్చోవడం ఇష్టం ఉండదు సోమశేఖరానికి. ఒక దిండు వేసుకుని తలవాల్చి పడుకుని మౌతార్గన్ మీద 'సుహానా సఫర్' పాట ట్యూన్ చేసుకుంటున్నాడు. పక్షులు వలయాకారంలో క్రమశిక్షణతో నడిచే సైనికుల్లా ఆకాశంలో బారులుగా ఎగురుతున్నాయి. సూరీడు తన బాధ్యతను చంద్రునికి అప్పజెప్పి క్రమంగా దిగుతున్నాడు. సతమతమయ్యే ఆఫీస్ పనుల్లో ఈ పందిరి - ఈ వాయిద్యం అతనికి మనసు డైవర్ట్ చేసే సాధనాలు లేకపోతే తనతో సమానంగా ఆలోచించగలిగే తల్లి సాహసచర్యం....మోతార్గన్ మీద రాగం సరిగా కుదరడంలేదు అలవాటు తప్పి. ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు.
"రాగమాలాపించి వాగులా ప్రవహించి
సుడిచుట్టు గీతలా మరిగిపోనీయకే
పాడకే నా రాణీ పాడకే పాట
పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే"
సోమశేఖరం ఒక క్షణం ఆఫీసు, జాజిపందిరి, తన వాయిద్యం అన్నీ మర్చిపోయేడు. వాటి స్థానంలో పూర్తిగా పద్మజ నిండుకుంది. ఒకసారి హిందీ సాహిత్యం గురించి మాట్లాడుతూంటే ఈ పాట గురించి చెప్పింది.