"అస్సలు లేదు. నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్, జింజిర్ చికెన్ ఇష్టం"
"అలాగే చెయ్యమని చెప్తాను. సరే రేపు వస్తారుగా. గుడ్ నైట్!"
"థాంక్యూ అండ్ గుడ్ నైట్" ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.
"ఎవరక్కా?" అడిగింది హిమజ.
"ఒక ఫ్రెండ్. గిరి అని పార్టీలో పరిచయం అయ్యాడులే"
మళ్ళీ ఫోన్ రింగయింది.
ఫోనెత్తి పద్మజ "హలో!" అంది. ఈసారి ఫోన్ చేసింది సోమశేఖరం. భోజనం గురించి కాదు. అతడికి అంతధైర్యం లేదు. అతడు మాట్లాడుతూంది మరో ముఖ్యవిషయం.
చంద్రుడు కనబడలేదని ఏడిస్తే కళ్ళనిండా నీళ్ళునిండి నక్షత్రాలు కూడా కనబడవు.
3
"అయితే మన అనుమానం నిజమే అయిందన్న మాట" అంది.
"అవును. రేపు పొద్దుటే ఏడుగంటలకు మీటింగు పెట్టుకున్నాం. మీరు ఆరున్నరకల్లా వచ్చేయండి. రిపోర్ట్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టాను. ఒకసారి చూద్దురుగాని" అన్నాడు సోమశేఖరం.
"అంటే__మీరింకా యింటికి వెళ్ళలేదా? ఇప్పటివరకూ ఆఫీసులో...."
"లేదు పద్మజా! సాయంత్రం బయలుదేరుతుండగా వార్త తెలిసింది మిమ్మల్ని పార్టీలో డిస్టర్బ్ చేయటం ఇష్టం లేకపోయింది. అంతగా అవసరం అయితే ప్రకాశరావుగారి ఇంటికే వద్దామనుకున్నాను. అవసరం రాలేదు."
"థాంక్యూ!" ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. "పొద్దుటే వస్తాను. గుడ్ నైట్"
"గుడ్ నైట్" ఫోన్ పెట్టేశాడు.
మరుసటిరోజు ప్రొద్దున్న....
దాదాపు పదిహేనుమంది సభ్యులున్నారా సమావేశంలో.
"మిస్ పద్మజా! మీరు మొదలు పెడతారా?" అడిగాడు డిఫెన్స్ సెక్రటరీ.
చిన్నగా గొంతు సవరించుకుంది పద్మజ.
"కొద్దిరోజుల క్రితం కొన్ని యుద్ద పరికరాలను, ఆయుధాలను ఫ్రాన్స్ నించి తెప్పించుకోవల్సిన అవసరం మన దేశానికి కలిగింది. ఆ సమయంలోనే ఫ్రాన్స్ నుంచి మన దేశానికి వస్తున్న నౌక 'భారత్' కొన్ని ఇంజనీరింగ్ పార్ట్స్ తీసుకు వస్తోందని తెలియగానే ప్రభుత్వం అనుమతి తీసుకుని మన ఆయుధాల్ని కూడా రహస్యంగా నౌకలో తెప్పించుకోవడానికి పర్మిషన్ తెప్పించాం. ఆ విషయం నౌక కెప్టెన్ కీ, షిప్పింగ్ కంపెనీ ఓనరుకీ మాత్రం తెలుసు. ఇంకెవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ నౌకా యింకా నాలుగు రోజులలో భారతదేశం చేరుతుందనగా వున్నట్లుంది మాయమై పోయిందనే వార్త వచ్చింది. డేంజర్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా జాడ తెలియలేదు. పరిశోధనల వల్ల తేలిందేమంటే అంతకు రెండురోజుల క్రితం బాయిలర్ ఫీడ్ పైప్ పగిలి కొంత ట్రబుల్ ఇచ్చిందని దాన్ని టెంపరరీగా రిపేరు చేయడం జరిగిందనీ, బహుశా ఒక్కసారిగా బాయిలర్ బరస్ట్ అయి వుండడానికి ఆవకాశం వుంది కాబట్టి నౌక పగిలిపోయి వుంటుందని అనుమానించాం. అయినా పూర్తిగా నిర్ధారణ చేయడానికి దర్యాప్తు చేస్తున్నాం.
నిన్న మధ్యాహ్నం పంజాబ్ లోని ఫరీద్ కోటలో స్కూటర్ మీద వెళుతున్న ఒక వ్యక్తిని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారన్న వార్త మీరూ వినే వుంటారు. మేము ఆ వార్తకు అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. మొదట్లో. కాని ఆ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారనీ, వారి దగ్గర స్వాధీనం చేసుకున్న ఆయుధాలమీద ఫ్రాన్స్ దేశం మార్కింగ్స్ ఉన్నాయని తెలియగానే డిపార్టుమెంటునుంచి మిస్టర్ సోమశేఖరం వెంటనే ఎంక్వయిరీ చేశారు. అవి 'భారత్' లో రావాల్సిన ఆయుధాలు అని నిర్ధారణగా తెలిసింది. జంటిల్మన్ ఇది మొత్తం ఆయుధాల లిస్టు"__లిస్టు అందించింది. "ఈ లిస్టులో వున్న వస్తువులన్నీ అక్రమంగా మన దేశంలోకే ప్రవేశించాయన్న మాట. ఇప్పుడు మన ముందున్న సమస్య కేవలం ఆయుధాలు ఎవరిచేతుల్లో పడ్డాయోనన్న విషయం ఒక్కటే కాదు, ఎంతో సీక్రెట్ గా వుంచిన ఈ విషయం బయటికెలా వచ్చిందీ, ఏ విధంగా ఆయుధాలు రవాణా కాబడ్డాయి అన్నది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే హోమ్ శాఖ ప్రతినిధులనూ, సి. బి.ఐ, రా అధికారులనూ కూడా పిలిపించటం జరిగింది." పద్మజ ముగించింది.
గదిలో కాస్సేపు అంతా నిశ్శబ్దం.
"బహుశా అవి పొరుగుదేశంలోకి దారి మళ్ళింపబడి సరిహద్దునించి రోడ్డుద్వారా మనదేశంలోకి చేరుతుండవచ్చు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని దర్యాప్తు చేయడం సులభమనుకుంటాను" అన్నాడు ఒక అధికారి.
"అంతకంటే ముఖ్యం ఎవరి ద్వారా ఈ విషయాలు బయటపడుతున్నాయన్న విషయం, ఇది మా డిఫెన్సు సెక్రటేరియట్ లోనూ, ప్రైమ్ మినిస్టర్స్ సెక్రటేరియట్ లోనూ తప్ప బయటవాళ్ళకు తెలిసే ఆవకాశం లేదు. ఇప్పుడందర్నీ అనుమానించవలసి వస్తోంది. సీజర్స్ నైఫ్ లా ఎబోవ్ సస్పిషన్ అని ఎవరినీ వదలకుండా అందర్నీ చెక్ చేయటం అవసరమని నా ఉద్దేశం" సోమశేఖరం అన్నాడు.
"అదీ నిజమే" ఒకరిద్దరు వెంటనే ఒప్పుకున్నారు.
"కాని ఇది చాలా రహస్యంగా జరగాలి. ఈ విషయము ఏమాత్రం బయటకు వచ్చినా ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయి" మరో అధికారి అన్నాడు.