"ఇప్పుడు దాన్ని అర్దాంతరంగా చదువు మానిపించి ఏం చేస్తారండీ?"
"ఏదో గంతకు తగ్గ బొంతను చూసి పెళ్ళి చేసి పంపించేస్తాను. అప్పుడు గాని దాని రోగం కుదరదు. మనకీ మచ్చ మాసిపోదు."
ఆ వేడిలో కరుణను నాలుగు రోజుల పాటు గడప దాటనివ్వలేదు. హడావిడిగా సంబంధాల కోసం తిరిగారు. ఎంత పనికిమాలిన సంబంధానికైనా వేలకివేలు డిమాండ్ చేయడం చూసి ప్రస్తుతం పెళ్ళి ఆలోచన పెట్టుకొని లాభం లేదనుకున్నాడు శేషగిరిరావు. ఎందుకంటే ఆయనకి స్థిరచరాస్థులేమీ లేవు. నలుగురు సంతానం. అందులో ముగ్గురు ఆడపిల్లలే. వుండేది. అద్దెకొంప. చేసేది గుమాస్తా ఉద్యోగం. మంచాల్లో వున్న తల్లీ తండ్రీ. ఏడేళ్ళుగా తండ్రి పక్షవాతంతో కాలు చెయ్యి పడిపోయి మంచంలో వున్నాడు. ఆయనకి చేసీ చేసి తల్లి కూడా ఇటీవలే మంచాన పడింది.
* * *
క్లాసులు నడుస్తున్నంత సేపు ఊపిరి బిగబట్టుకొన్నట్లుగా వున్న కరుణ క్లాసులోంచి బయటికి రాగానే విశిష్టను వాటేసుకుని ఏడ్చింది. "నిజంగా నేను గ్రుడ్డిదాన్ని అయిపోయానే, విశిష్టా! వాడి తీపి తీపి కబుర్లు విని మోసపోయాను. నువ్వు చెబితే నేను నమ్మలేదు. పైగా నిన్ను తిట్టాను. వాడు........వాడు ఇంత మోసగాడనుకోలేదు. మా నాన్నగారు వెళ్ళి అడిగితే "మీ అమ్మాయిని ఒక స్టూడెంట్ గా తప్ప మరో దృష్టితో చూడలేదన్నాడట. వాడు.....నాకు కడుపు కూడా చేసి ఎంత నాటకమాడుతున్నాడో చూడు!"
"ఏడవడానికి సిగ్గులేదూ? బుద్దిలేదూ?" కాస్సేపు చడామడా తిట్టింది. తరువాత ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని తన స్నేహబడందంతో చర్చించింది విశిష్ట.
"ఈ నిప్పును నీలో నువ్వు గుట్టుగా దాచుకోవడంవల్ల ఈ నిప్పు నిన్నే దహించేస్తుంది. దీన్ని బహిర్గత పరిస్తేనే అతడి నిజ స్వరూపం బయట పెట్టినట్టవుతుంది. చెప్పు! అతడి వల్ల నువ్వెలా మోసపోయిందీ పదిమందిలో బహిర్గతం చేయగలవా? వాడిని అప్పుడైతే చెప్పుచ్చుకు కొట్టొచ్చు" అంది బిందు.
"అమ్మో! ఇప్పటికే పరువు పోయిందని గోల పెడుతున్నాడు మా వాళ్ళు. ఇప్పుడు నేను చాటింపు కాడా చేస్తేనా వాళ్ళు గుక్కెడు విషం మింగి చస్తారు. మేం తల్లీ తండ్రీ లేని దిక్కులేని వాళ్ళం అవుతాం. పది మందిలో చెప్పుకోవడంవల్ల న్యాయం. జరుగుతుందో లేదో దేవుడెరుగు. ముందు అనర్ధం జరిగిపోతుంది మా ఇంట్లో"
ఇంత వరకు వాడివల్ల మోసపోయిన ఆడపిల్లలంతా నీలాగే ఆలోచించి గప్ చిప్ గా ఊరుకోబట్టే వాడొక జెంటిల్ మన్ గా చెలామణి అవుతున్నాడు. ఒక్కసారి ఏ ఆడపిల్లయినా వాడి గుట్టురట్టు చేయగలిగిందా? ఇహ వాడి ఆటకట్టు జీవితంలో ఏ ఆడపిల్ల జోలికీ వెళ్ళకుండా బుద్ధి చెప్పొచ్చు" అంది విశిష్ట.