3
శ్మశానపు నడిబొడ్డులో గురువైన విషాచి, దార్కాకి అరత్యుంగ విద్య నేర్పుతున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మంత్రగాళ్ళ చీకటి ప్రపంచంలో నిక్షిప్తమైపోయిన కాష్మోరా ప్రయోగం -అరత్యుంగ లాంటి విద్యలు తెలిసిన ఒకే ఒక మాంత్రికుడు ఆ విద్యల్ని శిష్యుడికి నేర్పుతాడు.
దశకషాయ మూలమైన నల్ల వుప్పి, కోలాకువున్న, చేదుపొల్లి వరగోకి, నేల ఉసిరిక మొదలైన మాతృకల కషాయాన్ని దార్కా చేత తాగించేడు. తెల్లగురివింద వేళ్ళను మారేడాకులు రసంలో నూరి కంటి రెప్పలకు పట్టించేడు.
(ఈ మూలికలు సంపాదించటం కోసం మంత్రగాళ్ళు చెట్లను నేలనుంచి పీకబోయే ముందు ఈ మంత్రం చదువుతారు.
ఓం భేతాలాశ్చ పిశాచశ్చ రాక్షసాశ్చ సరీసృపాః
అపసర్పంతు తే సర్వే వృక్షా దస్మాచ్ఛివాజ్ఞయా
అంటే - భేతాళ పిశాచ రాక్షస సర్పములు శివుని ఆజ్ఞచే ఈ చెట్టుకు దూరంగా వుండమని అర్ధం. క్షుద్రదేవతోపాసకులు కూడా శివుని ఆరాధించం ఇక్కడ విశేషం.)
దార్కా శ్మశానపు నడిబొడ్డున నగ్నంగా పడుకొని వున్నాడు. అతడు చెప్పసాగేడు.
"మంత్రగాళ్ళ చరిత్రలో అత్యంత విశిష్టమైన స్థానాన్ని పొందబోతున్న ఓ దార్కా - నీకు నేను చెప్పబోతున్న ఈ విద్య చాలాకాలం క్రితమే నిరోధించబడింది. ప్రేతగణాలకు మూలాధిపతి అయిన శివుడు అనేవాడికి ఫాలనేత్రం వుండేది అనీ -దాన్ని తెరిచిన మరుక్షణం ఎదురుగా ఉండే వస్తువైనా భస్మీపటలం అయిపోయేదని పూర్వులు చెప్పేవారు. ప్రేతాత్మలకు గురువైన ఆ శివుడితో సమానంగా స్థానం పొందటానికి ఏ మంత్రగాడూ ఇష్టపడకపోవటంతో ఈ విద్య మాలాటి వృద్ధుల చేతుల్తోనే సమాప్తం కావాల్సింది.
కానీ దార్కా -ఈ రోజు నేను నీ కిది చెబుతున్నాను. కేవలం నీవన్న "దగ్ద" అన్నమాట నిలబెట్టడానికే -నా స్వార్ధంతో నీ కిది చెబుతున్నాను. జాగ్రత్తగా విను ఈ ప్రయోగం ఇంతవరకూ ఎవరిమీదా ప్రయోగింపబడలేదు. దశరగాళాన్ని కలిపితే వచ్చే ఈ మిశ్రమం అత్యంత ప్రతిభావంతమైనదని పూర్వులు చెప్పేవారు. ఈ విషాలన్నీ ఒక్కొక్కటీ ఒక్కొక్కలా ప్రమాదకరమైనవి. పాములనుంచీ, తేలునుంచీ, వృక్షాలనుంచీ, తీగెలనుంచి సేకరించిన ఏ ఒక్కటైనా చాలు మనిషిని సమూలంగా కూలగొట్టడానికి. కానీ ఈ పది కలిపితే అది ఔషదం అవుతుందని అనటం చాలా ఆశ్చర్యకరం. ఇది ఇంకా ఘోరమైన విషంగా కూడా మారవచ్చు. అప్పుడు నీ కన్నులు పోయే ప్రమాదం ఉంది. ఈ మిశ్రమం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో నిజంగా నాకు తెలియదు. దార్కా కేవలం గ్రంధాల్లో చదివి దాన్ని ప్రయోగించి నిన్ను గ్రుడ్డివాణ్ని చెయ్యటం నా కిష్టం లేదు. అందువల్ల నీ ఒక్క కన్ను మీద మాత్రమే ఈ ప్రయోగం చేస్తాను"
దార్కా వింటున్నాడు.
"ఈ మిశ్రమం కంట్లో పడిన మరుక్షణం నీ కన్నుపోతే -అందుకు నన్నుద్వేషించవుగా దార్కా."
"ద్వేషించను విషాచీ నా ప్రాణం పోయినా సరే."
"ఈ విద్య నీకు అలవడిన క్షణంనుంచీ నువ్వు తళతళలాడే నీటివంక ఎప్పుపడూ తదేకంగా చూడకు. నీ కంటిని ఎప్పుడూ చేతితో రుద్దకు. అలా రుద్దిన మరుక్షణం అందులోంచి మంట బయల్దేరుతుంది. నేను చెప్పినవి మర్చిపోకు దార్కా, ఇప్పుడు నీ కన్ను తెరువు - ఎడమ కన్ను. నేనీ మిశ్రమాన్ని నీ నేత్రాంతగర్భంలో పోయబోతున్నాను."
తెల్లవారబోతున్నది. రాత్రంతా వేటసాగించిన గుడ్లగూబ కూడా నిద్రకుపక్రమించినట్లుంది. కేవలం ఆకాశమూ, నక్షత్రమూ, పృధ్వీ చెట్లూ చేమలూ మాత్రమే ఆ తంతు గమనిస్తున్నాయి.
దార్కా కళ్ళు తెరుచుకుని చూస్తున్నాడు. అతడు వెల్లకిలా పడుకొని వున్నాడు. ఎదురుగా వినీలాకాశం కనిపిస్తూంది. అంతలో విషాచి చెయ్యి తన ఎడమ కన్ను మీదకు చేరడం కనిపించింది. అరచేతుల మధ్య చిన్న దొప్పలోని దశవిధ మిశ్రమం నెమ్మదిగా వంగుతూంది. అతడు కన్నార్పకుండా చూస్తున్నాడు. వంగిన దొప్పలోంచి ఒక్క చుక్క కిందికి జారి అతడి తెల్లటి కనుగుడ్డు మధ్యలో నల్లటి కనుపాపమీద "టప్" మని పడింది.
అప్పుడు దార్కా పెట్టిన కేక ఆ శ్మశానం దాటి బిస్తా గ్రామాన్ని ప్రవేశించింది. బాధతో అతడు అరిచే అరుపులకి బిస్తా గ్రామపు తల్లులు పిల్లల్ని దగ్గిరకు తీసుకుపడుకున్నారు. పెద్దలు బైటకి రాబోయి, ఆ కేక దార్కాదని గ్రహించి, శ్మశానం నుంచి వస్తుందని విని- రావడం మానేశారు. దార్కా శ్మశానంలో నేల మీద పొర్లుతున్నాడు అతడి నగ్నమైన శరీరం నిండా ముళ్ళు గ్రుచ్చుకుని మరింత బాధ పెడుతున్నాయి. అయినా కను బాధతో పోల్చుకుంటే అదో లెక్కలోనిది కాదు. వేళ్ళు కన్నులోకి దోపి గుడ్డు పెరికి బైట పారెయ్యాలన్నంత బాధ -పెద్ద యంత్రం భగభగ మండే మంటల్ని ఎగదోసినట్లు.
అయిదు నిముషాలకి అతడి బాధ ఉపశమించి, మిగిలిన ఒక కన్ను తెరిచి చూస్తే -
విషాచి మోకాళ్లమీద తలవంచుకుని ఉన్నాడు. మొట్టమొదటిసారి అతడి జీవితంలో విషాదం కనిపించింది.
"క్షమించు దార్కా" అన్నాడు కంపిస్తున్న కంఠంతో.
"ఇందులో క్షమించడానికేముంది విషాచీ " అన్నాడు దార్కా, "నువ్వు ముందే చెప్పావుగా కన్ను పోయినా పోవచ్చని."
విషాచి మాట్లాడలేదు.
అతడి మౌనాన్ని ఇంకోలా అర్ధం చేసుకున్నాడు దార్కా వాళ్ళ ముగ్గుర్ని చంపడానికి నా ఈ ఒక్క కన్ను చాలు దాని గురించి అనుమానపడకు" అన్నాడు.