Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 7

    "నామీద నీకు కొండంత భక్తి ఏర్పడింది కదా!"

    "అవును సామి! మీరు మాకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు."

    "అయితే ఈ దేవుడి మాట వింటావుకదా?"

    "వింటాను సామీ!"

    "ఉదయం చూసిన సంగతి ఎవరితోను చెప్పకు. నేనో అద్భుతమైన మనిషినని, ప్రజలునన్ను చూడ్డానికి విరగబడతారు. నా దీక్ష సాగదు. మధ్యలోనే నా దీక్ష విరమించుకుని వెళ్ళిపోవలసి వస్తుంది."

    "నిజమే సామీ! నేనంతదూరం ఆలోచించలేదు. మట్టిబుర్రోణ్ని. ప్రొద్దున ఈడి నుండి ఇంటికెళ్ళంగానే బా భార్య చెవిలో ఏస్తి, ఎట్లా సామీ?"

    "ఇప్పుడు మళ్ళీ ఇంటికి  వెళ్ళగానే, పొద్దున చెప్పింది వట్టిదేనని చెప్పు."


                        *    *    *    *


    ఆ రోజు తెల్లవారు ఝామున కృష్ణలో స్నానం చేసి, మెట్లెక్కి వస్తున్నాడు సూర్య.

    స్వామీ గుడికీ, కృష్ణలో స్నాన ఘట్టానికి మధ్యన మెట్లదారిలో శివాలయం వుంది. కృష్ణలో స్నానం చేసిన భక్తులు శివపూజ చేసి తరువాత ఆంజనేయస్వామిని దర్శిస్తారు.

    సూర్య స్నానంచేసి, రాగిచెంబులో తెచ్చిన నీళ్ళు శివలింగంమీద పొయ్యడానికి గుడిలోకి వెడుతుంటే, ఎవరో అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లుగా అనిపించింది.

    ఎవరో కామాంధుల చేతిలో నలిగిపోతున్న ఆడపిల్ల ఏడుస్తున్నట్లుగా బాధతో మూలుగుతున్నట్లుగా....

    శివలింగంమీద నీళ్ళు సగమే పోసి బయటకి పరిగెత్తుకుని వచ్చి ఆత్రంగా చూసాడు.

    శివాలయం ప్రక్కన మెట్లమీద తెల్లచీర కట్టుకున్న ఒక అమ్మాయి కూర్చుని మోకాళ్ళలో తల దించుకుని ఏడుస్తోంది.

    ఇంకా తెల్ల వారలేదు. కానీ కృష్ణపక్షపు ద్వాదశి చంద్రుడి వెన్నెల పడుతోంది. ఆమె స్పష్టాస్పష్టంగా కనిపిస్తోంది."

    "ఎవరమ్మా నువ్వు?"

    ఆమె తలెత్తింది. ఎదమీద తొలగిన పైట, రేగిపోయిన జుట్టు, ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన కళ్ళు.

    "హరిచందనా?" అతడు విభ్రాంతిగా అన్నాడు "నువ్విక్కడ....ఆమ్మమ్మ వాళ్ళొచ్చారా?"

    ఆమె ఏడుపు రెట్టింపయింది.

    ఆమెను అనునయించి, విషయం తెలుసుకోవాలన్న ఆరాటంతో ఆమె భుజంమీద చెయ్యి వెయ్యబోయాడు. ఇంకా అతడి చెయ్యి ఆమెను తాకలేదు. అంతదూరంలో వుండగానే, షాక్ కొట్టినట్లులేచి గుడి వెనక్కి పరుగుతీసింది. ఆ పరుగులో మెరుపు వేగం.

    సూర్య కూడా వేగంగా అనుసరించాడు.

    ఆశ్చర్యం! అక్కడెవరూ కనిపించలేదు.

    హరిచందనలా కనిపించిన అమ్మాయి మనిషి కాదని, అప్పుడు స్పురించిందతనికి.

    కలలో కనిపించి, బాధించే చంద్రని ఈరోజు ప్రత్యక్షంగా చూసాడు.

    ఆమె ఏడుస్తోంది.
   
    తనని నాశనం చేసినవాడి మీద పగ తీర్చుకోలేనందుకు ఏడుస్తోంది.

    ఆమెకు ఇప్పుడు ఏం కావాలి?

    ఏం చేస్తే ఆమె ఆత్మకు శాంతి లభిస్తుంది.

    ఏం చేస్తే ఆమెకీ పిశాచిరూపం వదులుతుంది?


                        *    *    *    *


    సూర్య దీక్ష ఆ రోజుతో ముగుస్తుంది. గురువుగారు ఆదేశించిన కోటి జపం పూర్తి చేయడానికి ఇంకా కొన్ని గంటలు పడతాయనగా ఆ సంఘటన జరిగింది.

    అప్పటికి రాత్రి పన్నెండు గంటలవుతోంది.

    సూర్య నిశ్చల సమాధిలో వున్నాడు. అతడి మనసు మంత్ర జపం మీద లగ్నమైంది. అతడికి ధ్యానభంగం చేయడం ఇష్టంలేక, పరిసరాలు కూడా నిశ్శబ్దంగా వున్నాయి.

    ఆ దారిన ఇద్దరు ఆగంతకులు నడిచి వస్తున్నారు.

    గుడీ పూజారిని బెదిరించి, గుడి తలుపులు తెరిపించి, గుడిలో పూజాపాత్రలు, స్వామి నామాలు, మీసాలు, హుండీలో భక్తులు వేసిన డబ్బు దొంగిలించాలని వస్తున్నారు.

    సూర్య కలిమిచెట్టు  వద్ద  పద్మాసనం వేసుకుని ధ్యాననిమగ్నమై కనిపించాడు.

    దొంగలు దొంగతనానికి బయలుదేరినప్పుడు, ఎవరికంటా పడకూడదనుకుంటారు. ఆ చెట్టుకింద కూర్చున్నవాడు కళ్ళు మూసుకున్నాడా? తెదుచుకున్నాడా?

    మూసుకున్నట్టు నటిస్తూ, తమని గమనిస్తున్నాడా?

    దొంగస్వాములు, దొంగ ధ్యానాలు. మధ్య రాత్రి మద్దెలదరువన్నట్లు వీడు అర్దరాత్రి వేళ చెట్టుకింద కూర్చుని తపస్సు చేయడం ఏమిటి?

    అందులో ఒకడికి బాగా కోపం వచ్చేసింది.

    కాలి  ముందు కనిపించిన రాయిని తంతూ నడవడం కొందరికి ఆనందం. ఆ కోవకు చెందినవాడు వాడు. బొడ్లో వున్న కత్తిని బయటకి తీసాడు. 
  
    "ఈ కత్తితో పొడిస్తే, వాడి దొంగజపం బయటపడుతుంది. అమ్మో! అయ్యో, చస్తి" అంటూ అరవడం మొదలుపెడతాడు. ఆ సీను చూడ్డానికి చాలా బాగుంటుంది.

    చాకు పట్టుకుని సూర్యం కేసి నడవబోయాడు.

    "నీకిప్పుడు వాడితో ఏం పని? మన దారిన మనం చప్పుడు చేయకుండా వెళ్ళి, మన పని పూర్తి చేసుకుంటే పోలా?" రెండోవాడు వాడి చేయి పట్టుకుని ఆపబోయాడు.

    "ఈ కొడుకు మన వెనకాలే బయలుదేరితే? వీడి సంగతేదో తేల్చుకునే పోదాం."

    "వాడు జపమో, తపమో చేసుకుంటున్నాడు. అనవసరంగా వాడి జోలికి ఎందుకు వెడతావు?
గాలికిపోయే కంపను చుట్టుకోవడం ఇదే."

    "ధ్యానమా? మన్నా! కొంగజపం. అసలు వీడు ఎవరికో శాతబడి చేస్తున్నట్లుంది. లేకపోతే మధ్యరాత్రి ఇక్కడ కూర్చుని జపమెందుకు చేస్తాడు? ఎవడి కొంపకో నిప్పుపెట్టే బాపతులా వున్నట్టున్నాడు. వీడిపని నేను పడతాను." దగ్గరికివెళ్ళి అతడి వీపులో కత్తి కసుక్కున దింపుదామనుకున్నాడు. ఏ శక్తో అడ్డుకున్నట్టుగా అతడికి రెండడుగుల దూరంలో ఆగిపోయాడు. కత్తి పట్టుకున్న అతడి చెయ్యి మాత్రం లేచింది. కత్తిని విసరడంలో మంచి నైపుణ్యం వున్నట్లుగా విసిరాడు. ఆ విసరడంలో ఏనుగు బలం. ఆ కత్తి మెరుపువేగంతో వెళ్ళి సూర్య కుడిభుజంలో సగందాకా దిగబడింది.

    సూర్యలో చలనం లేదు.

    కత్తి విసిరినవాడు మాత్రం కరెంట్ షాక్ తిన్నట్లుగా కింద విరుచుకుపడ్డాడు. వాడికి స్పృహ తప్పిందో, ప్రాణమో పోయిందో తెలియదు. రెండోవాడు కాలికి బుద్ధి చెప్పబోయాడు. కాళ్ళు భూమిలో పాతుకుపోయినట్టయ్యాయి.

    లబలబమని అరవబోయాడు.

    నోరు పెగల్లేదు.

    మంచంమీద రైతు ఇదంతా చూస్తున్నాడు.
   
    "అరెరె....రక్తం వరదలా కారిపోతుంటే కూడా కదలడం లేదే ఈసామి?" అనుకుంటూ లాంతరు పట్టుకువెళ్ళి భుజంనుండి కత్తి లాగేసాడు!

    ప్రక్కన చెట్ల పొదల్లోకి వెళ్ళి ఆకులు కోసి తెచ్చి గాయంమీద పసరు పిండాడు.

    రక్తం స్రవించడం ఆగిపోయింది.

    రొంటి నుండి గడ్డ తీసి గాయాన్ని మూస్తూ భుజంమీద నుండి చంక క్రిందికి వచ్చేలా కట్టుకట్టాడు.

    తన పని అయిపోయినట్లుగా అక్కడినుండి కదిలి వెళ్ళిపోయాడు రైతు.

    ఇదంతా కట్రాటలా నిలబడి చూస్తున్నాడు నిలబడ్డ దొంగ.

     అంత దగ్గిరగా వున్న తమని అసలు కన్నెత్తి  చూడలేదు. పన్నెత్తి పలకరించలేదు.

    తెల్లవారింది!

    మంచెమీద రైతు మేలుకుని కలిమిచెట్టుకేసి చూసాడు.

     సూర్య బుద్దభగవానుడిలా  ఆ చెట్టుక్రింద రాత్రి ఎలా కూర్చుని వున్నాడో అలానే వున్నాడు. దగ్గరే ఒక మనిషి బోర్లా పడ్డాడు. ఒకడు స్తంభంలా నిలబడ్డాడు.

     ఎవరు వాళ్ళు?

    ఏమిటి సంగతి కనుక్కుందామని  గబగబా మంచె దిగివచ్చాడు రైతు. 

    దగ్గరికి వెళ్లి చూసేసరికి ఇద్దరూ తెలిసినవాళ్లే.  తమ వూరి ఎరికల వాళ్లు.

     ఒకడు ఎంకడు, ఒకడు పోచిగాడు.

     "ఏందిరా ఈడున్నారు? ఏమయింది వీడికి ఇట్ల పడ్డడు బోర్ల?" అడిగాడు రైతు.

     "చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు కదన్నా?రాత్రి గుళ్లో దొంగతనం చేద్దామని వస్తున్నాం.  వీడికేమయిందో , వీడు వున్నట్లుండి ఆయన మీదికి కత్తి విసిరిండు. విసరసం విసరడంతోనే  వీడిట్ల సొమ్మవాయువు సచ్చినోడివలె పడిండు మన్నుల. నా కాళ్లు కదలకుండా నేలకు  పాతుకుపోయినయి. "
   
    "సామికేమైంది?పొడిచి సంపేసిన్రా? అంటూ దగ్గరికి పరుగున వెళ్లి సూర్యని పట్టుకు కదిపాడు.

     "సామీ! సామీ!"

    కళ్ళు తెలిచాడు సూర్య.

    అతడి కళ్లల్లో ఏదో అశాంతి.
 
    ఈరోజు స్వామి సాక్షాత్కరించేదాకా కళ్లు తెరవకూడదనుకున్నాడే! ప్చ్! ఈ రైతు తన ధ్యానభంగం చేసాడే!

    "ఏమైంది శాయన్నా?"   

 Previous Page Next Page