Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 5

    "జస్ట్-ఏవో స్మృతులు"

    "సారీ ఫర్ డిస్టర్బింగ్ యువర్ థాట్స్" నొచ్చుకుంటూ అన్నదామె.

    "ప్రమీలా!" ట్రాన్స్ లో నుంచి మాట్లాడుతున్నట్లు పిలిచాడు.

    "ఎస్ సర్!"

    "ఐ వాన్ట్ టు సే సమ్ థింగ్"

    "వెల్ కమ్ సర్"

    "నన్ను పెళ్ళి చేసుకోవటం నీకిష్టమేనా?"

    ప్రమీల బుగ్గలు ఎరుపెక్కాయి.

    కళ్ళు భారంగా కిందకు వాలిపోయాయి.

    పెదాలమీద చిరునవ్వు వెలిగిపోయింది.

    తల వంచేసుకుంది.

    "మీరు పరిహాసాలాడటం లేదుకదా?"

    "నోనో! ఇంత ముఖ్యమైన విషయంలో పరిహాసాలాడతానా? నెవర్! మీకిష్టమేనా ప్రమీలా?" మళ్ళీ అడిగాడు.

    "ఊ!" అంది ప్రమీల సిగ్గుతో.

    "ఓ! థాంక్యూ! థాంక్యూ వెరీమచ్!" ఆనందంగా అన్నాడతను.

    అప్పుడే ఫోన్ మోగింది.

    "హలో"

    "సర్! కాల్ ఫ్రమ్ ఢిల్లీ"

    "ఓ.కె. కనెక్ట్ ఇట్"

    మరుక్షణం అతను ఫోన్ సంభాషణలో మునిగిపోయాడు.

    ప్రమీల కుర్చీలో వెనక్కి జారి రిలాక్సయి కూర్చుంది.

    ఆమెకి తెలుసు. తను ఇంచుమించు రెండు మూడు గంటలు అలా కూర్చోవాల్సిందే. తప్పదు.

    కానీ అలా వెయిట్ చేయటం కూడా తనకు ఆనందంగానే వుంటుంది.

    అలాంటి అందమయిన వ్యక్తిని చూడటం ఎవరికి సరదాగా వుండదు?

    అతను అందమైన వ్యక్తా?

    ఊహు! కాదు.

    అందం కాదు.

    ఓ విధమైన ఆకర్షణ.

    ముప్పయ్ ఏళ్ళ తనలాంటి స్త్రీలను ఆ వయసు వ్యక్తులే ఆకర్షిస్తారేమో! చివరకు తనకంటే చిన్న వయసున్న ఓ స్టూడెంట్ ఒకసారి తనకు లవ్ లెటర్ రాశాడు. పెళ్ళి చేసుకుంటానని తేల్చాడు.

    ఆ కుర్రాడు అందంగా, బలంగా వుంటాడు.

    అయినా తనకతనిమీద అలాంటి అభిప్రాయమే కలుగలేదసలు.

    ఆ ఉత్తరం చింపి అవతల పారేసింది.


                                                                          *    *    *    *    *

    కారు సికింద్రాబాద్ వేపు వెళుతోంది.

    రాజశేఖరం టైమ్ చూసుకున్నాడు.

    మూడున్నరవుతోంది.

    ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఓపెనింగ్ ఫంక్షన్ నాలుగున్నరకి.

    NRI ప్రాజెక్ట్ అది.

    తను అమెరికాలో వున్నప్పుడు వాళ్ళు తన ఫ్రెండ్స్.

    అందుకే తను ప్రారంభోత్సవానికి రావాలని పట్టుబట్టారు.

    వాళ్ళతో కాసేపు లీజర్ గా చిట్ చాట్ చేయాలనే వుద్దేశ్యంతోనే ఎర్లీగా బయల్దేరాడు.
 

 Previous Page Next Page