Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 8

   బస్సు నుంచి వచ్చి అలసటతో కాళ్లు కూడా కడుక్కోకుండా పడక కుర్చీలో కూలబడినబావగారిని బలవంతంగా కాళ్లు కడిగించింది మరదలు సరోజ. నాప్కిన్ అందుకుని కాఫీ కప్పు అందివబోగా మాధవ్ వద్దనటంతో ఆశ్చర్యపోయింది సరోజ.
    తేలిగ్గా నవ్వి అంది 'బెట్టు చేయకుండా తీసుకోండి బావా! అక్క కాఫీ తప్ప తీసుకోరా? మీరు?"
    మ్లానవదనంతో అన్నాడు "అలాంటి దేమి లేదు సరోజా! నేను కాఫీ మానేశాను. చాలా రోజులైంది. సుమారు అయిదారు మాసాలు దాటివుంటుంది"
    ఈ పర్యాయం నిజంగా ఆశ్చర్యపోయింది.
    "నిజమా బావా! మీరేమానుకున్నారా? అక్క మాన్పించిందా?"
    రాని నవ్వు నవ్వి అన్నాడు "ఎలాగైనా ఫలితం ఒకటే సరోజా- నేను కాఫీ మానటం మాత్రం నిజం."
    ఎక్కడో గొంతుకలో మాట్లాడినట్టుగా అంది " అయితే మాధవ్ అక్కయ్య ఎలాగైతేనేం చివరికి పంతం నెగ్గించుకుందన్నమాట! భేష్!"
    నివ్వెరపోయాడు మాధవ్" ఏమిటిది సరోజా! ఎమంటున్నావ్. పంతమా? మీ అక్కయ్యా! ఏమిటి?"
    అతని ప్రశ్నకి జవాబుయివకుండా అంది "అది సరే గానీ బావగారు! అయితే మీరు సిగరెట్స్ కూడా మనేశారన్న మాటే కదూ?"
    నవ్వి అన్నాడు "నిజమే సిగరెట్స్ కూడా మానేశాను గానీ ఇంతకీ యీ ఎంక్యయిరి ఏమిటి? అసలు కాదేమో చెప్పరాదూ?"
    "కొంచెం ఆగండి. కధే వుంది లెండి. పూర్తిగా వివరిస్తాను. ఈ కప్పుని యింట్లో యిచ్చేసి వచ్చాక చెపుతాను. మీ సతీమణి గుణగుణాలు తెలుసుకుందురు గానీ" కాఫీ తీసుకుని వెళ్ళిపోయింది సరోజ.
    ఓ అయిదు నిమిషాల సేపు సందిగ్ధంలో మునిగి పోయేడు మాధవ్. సస్పెన్స్ తో వేగిపోయాడు.
    కప్పుతో పాలు తీసుకుని వచ్చి బావగారికిచ్చి "తీసుకోండి బావా" అంది.
    పాలనందుకుని గబగబా తాగేసి అడిగాడు మాధవ్" అలా స్టూల్ మీద కూర్చుని ఆ కధేమిటో చెప్పు సరోజా!"
    స్టూల్ మీద కూర్చుంటు అంది "నిజంగా మాధవ్ అక్కయ్య చాలా మొండి ఘటం బావా!"
    అతనేమీ జవాబు యివలేదు.
    మళ్ళీ ఆమె అంది "మనుషుల వ్యక్తిత్వాల మీద యితరుల అధికారం లేదు బావా! భార్య భర్త గానీ, భర్తని భార్యగాని శాసించే అధికారం వుండకూడదు. అయినా యీనాడు భర్త భార్యలు ఎదురు తిరగటం, ఆనాడు యినాడు భర్తలు, భార్యల్ని శాసించటం పోలేదు. కానీ అన్నిటికి విరుద్దంగా మా అక్క మిమ్మల్ని శాసించి ఒప్పించి పాలించటమే చిత్రంగా వుంది."
    అతను జవాబేమి యివలేదు.
    సరాసరి పాతాళానికి కుంగిపోతున్నట్టుగా వుందతని పరిస్థితి.
    మళ్ళీ సరోజే అంది "చూడండి బావా! దీని వెనుక ఓ పెద్ద కధ వుంది. వింటారా? మాధవ్ అక్కయ్య ఏం చేసినా డానికి వెనక ఓ చరిత్ర తప్పకుండా వుంటుందనేది మీరు గ్రహించాలని నా ఉద్దేశం.


    "ఊ" అంతకంటే యింకేమి అనలేకపోయాడు.
    "ఎలా చెప్పాలో నాకు అర్ధంకావటం లేదు బావా. అయినా విషయాన్ని మాత్రం చక్కగా వ్యక్తం చేస్తాను."
    ఒక్క నిమిషం ఆగింది. ఏమి ఆలోచన సాగిందో కానీ మాధవ్ లో మాత్రం సంఘర్షణ మొదలైంది. ఏం చెపుతుందా? ఏం జరిగిందా? ఏం రహస్యం వుందా అనే కుతూహలం బాధ ఆరాటం అతనిలో ఎక్కువ అయ్యాయ్.
    "ఇదే వూళ్ళో మా అక్క చదివేటప్పుడు ఓ మేజిస్ట్రేట్ గారు వుండేవారు. ఆయన కూతురు వంజ అని మా అక్క క్లాస్ మేట్. యస్. యస్.యల్.సి మొదలుకొని యింటర్ మీడియట్ వరకూ చదివారు యిక్కడే యిద్దరూ.
    వాళ్ళింట్లో అదంతా ఓ తరహాగా వుండేది. అయన ఊళ్ళోనే న్యాయనిర్ణేత, కోర్టులోనే అధికారి న్యాయానికి. అదంతే, ఇంట్లో అంతా ఆవిడదే అధికారం. పెత్తనం చెలాయించటం మొదలు కొని అవసరమైన హోండిపార్ట్ మెంట్ తీర్పులు కూడా ఆవిడే చెప్పేది. ఆవిడ మాటని కాదనటానికి యింట్లో ఎవరికి అధికారం లేదు. కాదని ఎవరైనా ఎదిరించినా, వాదించినా నిష్టురమూ నిష్ప్రయోజనమే తప్ప ఫలితం కనిపించదు.
    నిజానికి అయన తప్పేమీలేదు పాపం. తప్పంతా అయన జన్మించినట్టి బీదరికానిది, దాని దోషాన్నిఎవరూ తప్పించుకోలేరు. ఆ పెద్దమ్మ హస్తం నెత్తిన పెట్టెక ఆవిడ దయతలచి స్వతహాగా తీసేస్తే తప్ప ఆ బరువు నుంచి తప్పించుకుని పారిపోలేరు.
    ఓ బీదీంట్లో పుట్టి ఎల్లాగో ఎవరి సహాయంతోనో లా చదివి గవర్నమెంట్ పోస్టు కోసం ఓ హైకోర్ట్ జడ్జిగారిని ఆశ్రయించవలసి వచ్చి, అవసరాన్ని బట్టి ఆయన కూతుర్ని పెళ్ళి చేసుకుని మేజిస్ట్రేట్ అయ్యాడు మెల్లిగా.
    పుట్టినరోజు నుంచి అహంభావం అధికారం ఐశ్వర్యాల్లో పెరిగిన ఆవిడకి ఈయన పైన అధికారం చెలాయించటం ఏమంత కష్టమనిపించలేదు. పైగా యియానా బెరుకుతనం, ధనాన్ని, దర్పాన్ని చూస్తే బెదిరిపోయేయియానా స్వభావాన్ని చూసి జాలిపడేది ఆవిడ. కానీ చేతికి చిక్కిన అధికారాన్ని వాడుకుని భర్తకి యీ సొసైటీలో తిరిగే పద్దతి నేర్పటం యిష్టం లేక అతనిని అదుపాజ్ఞల్లో పెట్టుకుంది. రెట్టింపు సంతోషంతో.
    అయన తన పెళ్ళయ్యాక స్వంతంగా ఒక సినిమా చూళ్ళేదు. ఓ సారయినా హోటల్ కి వెళ్ళలేదు. తన కిష్టమయిన బట్టకట్టలేదు. అంతా శ్రీమతి యిష్టం. ఆవిడ టెస్ట్ పెద్ద పెద్దవాళ్ళతో తిరుగుతూ బోర్నవిటా లాంటివి అలవాటై చివరికి కాఫీని, కాఫీ రుచిని కూడా మరచి పోయాడాయన.
    పెద్ద వారైనా మామగారి ఎదుట సిగరెట్ కాల్చుట దోషం ఇహ ఎదురుగా కాల్చేముందుకులేక పోయాక చాటున కాల్చుకోవటం మరీ అవమానకరం! మరి పెద్దవాళ్ళని మోసగించవచ్చా? అందుకని అది మానేశారు. ఒహటేమిటి.....అన్నీ మర్చిపోయారు. మారి పోయారు. చివరికి తనో మనిషి నన్న మాట తప్ప అన్నీ మరిచిపోయాడు. కోర్టు -లా- యిల్లు- యిది జీవితం, భార్యా విధేయుడంటే అతన్ని అవమానించినట్టవుతుంది, నిజానికి అతను ఆమె యిచ్చావర్తి!
    అలాంటి తల్లిదండ్రులకూతురు వనజ! ఆమెకి ప్రాణ స్నేహితురాలు మా అక్క!
    వాళ్ళకి చిన్నప్పటినుండి అన్నీ తన యిష్టాలే నెరవేర్చుకునే ఆ మేజిస్ట్రేట్ గారి భార్య దైవం.తను కోరింది కాళ్ళ వద్దకి తెప్పించుకోగల మహారాణి. గీచిన గీటు దాట నీవని సత్యభామ!
    వీళ్ళిద్దరికి ఆడదంటే ఆమె ఆడదనే అభిప్రాయం! ఆదర్శమయిన గృహిణి ఆమె! భర్త అంటే ఇక ఆ మేజిస్ట్రేట్ గారే భర్త! అలాంటి భర్తని భర్తగా పొంద గలిగిన స్రీ జీవితమే ధన్యం.
    అది జీవితం! అది ఆదర్శదాంపత్యం. అంటే అలాంటి భర్త వుండాలి. భార్య అంటే అన్నీ పొందాలి. ఒకవేళ భర్త ఏవైనా చెడు అలవాట్లున్నా తక్షణం మాన్పించెయ్యాలి. మానకపోతే విడాకులయినా తీసుకోవాల్సిందే తప్ప లొంగి పోకూడదు.

 Previous Page Next Page