"ఓ.కే!"
అ తరువాత అందరూ అవకాశం చూసుకుని జయరాం చుట్టూ చేరారు.
"ఏంటి మనవడా! కుమార్ బాబు నీకెన్ని సుట్టలు కొనిచ్చిండు! చారణాయా? ఆఠణాయా?" అని మొదలుపెట్టారు.
జయరాంకేమీ అర్ధం కాలేదు. తెల్లబోతూ "ఛీ-ఛీ! కుమార్ నాకు చుట్టాలు కొనియ్యటమేమిటి?" అన్నాడు.
జయరాం అజ్ఞానానికి మిత్రబృందం విరగబడి నవ్వారు.
"అయితే నీకేమీ తెలియదన్న మాట?"
"అయ్యయ్యో!"
"నీ మిత్రుడు ముష్టి మహరాజ్!"
"అతని మామ్మ అక్షరాలా అడుక్కునే ముసలమ్మ."
"చింపిరి జుట్టూ, కంపు కొట్టే వొళ్ళు, చిరిగిన చీర, చేతిలో కర్ర...."
"ఆ అవతారం 'మనవడా!' అంటూ వచ్చింది కుమార్ కోసం...."
"సుట్టల కోసం చారణా అడిగింది."
ఒకరి కొక రందించుకుంటూ జరిగిన కథ తమకు చేతనైనంత రసవత్తరంగా వినిపించారు విద్యార్ధులు. అక్కడితో జయరాంని వదిలిపెట్టలేదు. "చారణా__సుట్టలు__
చారణా__సుట్టలు__" అని జయరాంని ఏడిపించటం మొదలుపెట్టారు. ఈ గోల భరించలేక పోయాడు జయరాం. అతని ముఖం ఎర్రబడింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
కుమార్ బి. యస్ సి. లో చేరిన రోజునే జయరాంతో స్నేహమయింది. ఇద్దరూ బి. యస్ సి. లో సీట్ కి అప్లై చేయటానికి ఒక రోజునే వచ్చారు.
ఆ రోజు జయరాం తన సర్టిఫికెట్ల ట్రూ కాపీలు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకుండా తీసుకొచ్చాడు.
గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకుండా ట్రూ కాపీలు తీసుకోనని చెప్పాడు గుమస్తా.
"మళ్ళీ రేపు రావాలి!...." బిక్క మొహంతో అన్నాడు జయరాం.
"అక్కర్లేదు. నాకు తెలిసిన గెజిటెడ్ ఆఫీసర్ ఉన్నారు.... వెళ్ళి సంతకాలు చేయించుకొద్దాం!" అని జయరాంని తనతో పాటు సెక్రటేరియట్ కి తీసికెళ్ళి అక్కడ తనకు తెలిసిన ఆఫీసర్ చేత జయరాం సర్టిఫికెట్ల ట్రూ కాపీల పైన సంతకాలు చేయించాడు. అప్పటినుండే కాలేజిలో ఇద్దరూ కలిసి మెలిసి తిరుగుతున్నారు.... ఇద్దరికీ కూడా అల్లరి చిల్లరగా తిరగటం కంటె చదువుకోవటమే ఇష్టం. ఆ కారణం చేత ఆ స్నేహం మరింత బలపడింది. ఇద్దరూ మధ్యాహ్నం కలిసి లంచ్ తీసుకుంటారు. ఆ అలవాటు చొప్పున లంచ్ టైంలో జయరాం కోసం ఎదురు చూశాడు కుమార్. జయరాం కోసం వెతికాడు-కనపడలేదు. ఈలోగా లంచ్ టైం అయిపోయింది. లంచ్ తీసుకోకుండానే క్లాసు కొచ్చేశాడు. ఎప్పుడొచ్చాడో-అప్పటికే క్లాసులో కూచున్నాడు జయరాం.
క్లాస్ అయిపోయాక "ఇవాళ లంచ్ కి రాలేదేం? నీకోసం ఎదురుచూస్తూ నేను కూడా తినలేదు" అన్నాడు కుమార్.
జయరాం నొచ్చుకుంటూ "అలా ఎందుకు చేశావ్? తినెయ్యవలసింది" అన్నాడు.
ఆ సమాధానానికి తెల్లబోయాడు కుమార్.
"ఒక్క రోజు తినకపోతే ఫరవాలేదులే!....అసలింతకూ ఎక్కడి కెళ్ళావ్ నువ్వు?"
జయరాం సమాధానం చెప్పటానికి తడుముకుంటూ ఉండగానే నాలుగుపక్కలనుంచీ లయాన్వితమైన కవితాగానం వినిపించింది.
"చారణా__సుట్టలు__
చారణా....సుట్టలు...."
జయరాం ముఖం ఎర్రబడగా తలవంచుకుని వెళ్ళిపోయాడు. కుమార్ కి అప్పటికి విషయం అర్ధమయింది. విద్యార్ధి బృందం తనను ఎంత ఏడిపించినా అతనేం బాధపడలేదు కాని, జయరాం దూరమయినందుకు కొద్దిగా బాధపడ్డాడు. స్నేహంకోసం....అతని ముఖంలో ఆ బాధ చూసి చాలా సంతోషించింది విద్యార్ధి బృందం.
ఆ సాయంత్రం కాలేజి వదిలేశాక కుమార్ ని కలుసుకున్నాడు జయరాం.
"అయాం సారీ, కుమార్! నాకు నీమీద....అదే, ఏంలేదు- కానీ వాళ్ళు బ్రతకనివ్వరు. నేను పడలేను," అనేసి వెళ్ళిపోయాడు.
వాళ్ళు....ఎవరువాళ్ళు? జయరాంలాంటి వాళ్ళు 'వాళ్ళ'ని ఎందుకు ఎదిరించలేరు? అన్యాయమని తెలిసినా అందరూ ఎందుకు 'వాళ్ళ'కి లొంగిపోయి ప్రవర్తిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలకోసం ఎప్పటినుంచో అన్వేషిస్తున్నాడు కుమార్. అతనికేనాడూ సమాధానం దొరకలేదు.