సుధీర్ కుమార్ బైనాక్యులర్స్ తో కిటికీలోనుంచి బయటకు చూశాడు మరోసారి.దూరంగా రోడ్డుకి అవతలివైపున్న కొన్ని గుడిశెలు, ఆ గుడిశెల చుట్టూ వున్న మేకలు, కోళ్ళు, కుక్కలు, పిల్లలు, వాటి మధ్య చాలా బిజీగా ఇంటిపనులు చేసుకుంటున్న జనం అతనికి కనిపించి కనువిందు చేస్తున్నాయి.
"ఆహా!" అనుకున్నాడతను ఆనందంగా. "ఎంత అద్భుతమైన జీవితం వారిది" అని కూడా అనుకున్నాడు.
సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. అతనికి ఫోన్ మీద కోపం వచ్చింది. మనిషి సుఖాన్ని గాయపరిచే అనేక ఆధునిక ఆయుధాల్లో ఫోన్ ఒకటని అతని ప్రగాఢ నమ్మకం.
"హలో!" అన్నాడు కోపంగా.
"హలో సార్! గుడ్ మార్నింగ్" అందో గొంతు.
"ఎవరది?" కోపంగా అరిచాడతను "ముందు నువ్వెవరో చెప్పి అప్పుడు నీ గుడ్ మార్నింగ్ అఘోరించడం నేర్చుకో."
"నేను సార్ శ్యామల్రావ్ ని!"
అతని కోపం మరింత పెరిగింది.
"శ్యామల్రావా? శ్యాలల్రావెవరు? నాకలాంటి పేరుగల వాళ్ళెవరూ తెలీదు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు" అనేసి ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడతను.
కానీ రెండు నిముషాల్లో మళ్ళీ ఫోన్ మోగింది.
"హలో!" మరింత కసిగా అన్నాడతను.
"హలో సర్! నేను సార్ శ్యామల్రావ్ ని"
"వుచ్ శ్యామల్రావ్?"
"కెకె. శ్యామల్రావ్ ని సార్!"
"ఇదిగో చూడు శ్యామల్రావ్! ఇంకోసారిలా నన్ను డిస్టర్బ్ చేశావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త. ఇంతకూ ఏం కావాలి నీకు?"
"ఇదిగో, నీకేమయినా బుద్ధుందా!"
"ఎందుకు సార్?"
"ఎందుకేమిటయ్యా! నువ్వెవరో నాకు తెలీదని మొత్తుకుంటూంటే నన్ను కలుసుకుంటానంటావేమిటి? అడ్డమైన వాళ్ళనూ కలుసుకోవడానికి నాకేం పనీ పాటా లేదనుకున్నావా? ఇంకోసారి ఫోన్ చేశావంటే మర్యాదగా వుండదు జాగ్రత్త" ఫోన్ డిస్కనెక్ట్ చేశాడతను.
ఈసారి తలుపు తెరుచుకుని లోపలికొచ్చేశాడు శ్యామల్రావ్. "బయటినుంచి ఫోన్ చేసింది నేనే సార్!" వినయంగా అన్నాడు.
"నువ్వా! మన సెక్రటరీనని చెప్పవేం?"
"శ్యామల్రావ్ అంటే గుర్తుపడతారనుకున్నాను సార్"
"ఏమిటోనోయ్ శ్యామల్రావ్! ఎందుకో నీ పేరెప్పుడూ గుర్తుండదు నాకు. అయినా అంత అబ్సర్డ్ పేరు ఎందుకు పెట్టుకున్నావోయ్ నువ్వు? దయచేసి వెంటనే నీ పేరు మార్చేసుకో."
"అలాగే సర్!"
"అయినా అసలా పేరెవరు పెట్టారోయ్ నీకు?"
"మా ఫాదరూ, మదరూ అండీ"
"చాలా తెలివితక్కువ పని చేశారు వాళ్ళు. నా మాట విని ఆ పేరు వెంటనే మార్చేసుకో. అలాంటి పేరు గుర్తుంచుకోవడం నావల్ల కాదు."
"కాని బారసాల ఎప్పుడో అయిపోయింది కదండీ!"
"అయితే ఇంకో బారసాల చేసుకో! రెండు బారసాలలు చేసుకోకూడదని రూలేం లేదు."
"ఎస్సర్!"
"ఆల్ రైట్! ఇంతకూ ఏం పనిమీద వచ్చావు?"
"మన జెజె ఇండస్ట్రీస్ తాలూకు యూనియన్ వాళ్ళు స్ట్రయిక్ నోటీస్ యిచ్చారు సార్!"
"ఆ!" ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు సుధీర్ కుమార్.
"మన వర్కర్లు స్ట్రయిక్ నోటీసు ఇచ్చారా?"
"అవున్సార్!"
"నిజంగానా? ఆహా! ఎంత చల్లని కబురు చెప్పావోయ్. ఈ వెధవ ఇండస్ట్రీస్ లాభాలు తెగ పెరిగిపోతుంటే వాటినెలా అరికట్టాలా అని తల పగలగొట్టుకుని ఛస్తున్నాను. బాబ్బాబు! వాళ్ళను తప్పకుండా సమ్మె చేయమని చెప్పు! మళ్ళీ మనసు మార్చుకోవద్దని చెప్పు."
శ్యామల్రావ్ ఆశ్చర్యపోయాడు. "అదేమిటి సార్! వాళ్ళు సమ్మె చేస్తే మనకు తెగ నష్టాలు వచ్చేస్తాయి" అన్నాడు గాభరాగా.
"అదేనోయ్ నాక్కావలసింది. బాగా నష్టాలు వచ్చి కంపెనీ మూతపడిపోయి వ్యాపారమంతా మట్టికొట్టుకుపోయి, ఆస్తంతా హరించుకుపోతే, అప్పుడు నేను ఓ గుడిశెలో హాయిగా వెన్నెట్లో నులకమంచంమీద పడుకుని 'ఓ చందమామ' అని పాడుకుంటూంటే ఆహా! అదోయ్ జీవితమంటే, అదోయ్ లైఫంటే" తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడతను.
"శ్యామల్రావ్ అతని ధోరణికి హడలిపోయాడు. "సార్!"
"ఏమిటి శ్యామల్రావ్?"
"మీకు ఒంట్లో బావుందా సార్?"
సుధీర్ కుమార్ కి ఆ ప్రశ్న ఒళ్ళు మండిపోయింది "షటప్! డోంటాక్ నాన్సెన్స్! వెళ్ళు. ఆ యూనియన్ వాళ్ళతో వాళ్ళ కోరికలు తీర్చలేనని చెప్పు. జీవితాంతం స్ట్రైక్ చేసుకోమని చెప్పు"
"అలాగే సార్!"
"అయితే ఇంకొక్క క్షణం ఇక్కడ నిలబడకు. వెళ్ళిపో! అన్నట్లు నీ పేరు వెంకట్రావ్ కదూ! ఏ మాత్రం బావుండలేదా పేరు. మార్చేసుకో! నలుగురికీ గుర్తుండే పేరు పెట్టుకో. అసలు ఎవరు పెట్టారా పేరు నీకు?"
"నా పేరు వెంకట్రావ్ కాదండీ! శ్యామల్రావ్"
"మరి వెంకట్రావ్ అని ఎందుకు చెప్పావు? ఇంకెప్పుడూ అలా అబద్ధాలు చెప్పకు. వెరీ బాడ్ హ్యాబిట్! అయినా శ్యామల్రావ్ పేరు కూడా బావుండలేదు. అది కూడా మార్చేసుకో. సరేనా?"