"సరే ఈ కిరికిరంతా ఎందుగ్గానీ నీకు ఇంట్లో క్కావలసిన రేషన్ యాభై రూపాయలకు ఉద్దర్ ఇమ్మని మా సూపర్ బజార్ వానికి లెటర్ రాసిస్తా? అది తీసుకుని నీకు కావలసిన రేషన్ తీసుకుపో! కాష్ మాత్రం ఇవ్వ! సమజయినాది?"
"థాంక్యూ సార్...అదే పదివేలు" స్వామి ఓ కాగితం మీద రెండు లైన్లు రాసి చిరంజీవికిచ్చాడు.
"ఇకపో నువ్వు. డోంట్ వేస్ట్ మై టైమ్."
"అలాగే సార్."
చిరంజీవి బయటకు నడిచాడు ఆ కాగితం తీసుకుని.
చిరంజీవి బయటకు వెళ్ళగానే శ్రీరామ్ హడావుడిగా లోపలికొచ్చాడు.
అతనిని చూస్తూనే కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు స్వామి.
"గుడ్ మార్నింగ్ సార్! వెల్ కమ్! కూర్చోండి."
"నేను కూర్చోటానికి రాలేదు, నాకు రేపు ఉదయమే రెండు మారుతి దౌజెండ్ సిసి కార్లు కావాలి."
"అదేం సార్! టయోటా కావాలంటిరి కదా?"
"మా బాస్ గారమ్మాయ్ సంగతి నీకు తెలీదు. ఎప్పటికప్పుడు ఇష్టాలు మారిపోతుంటాయ్."
"సరే సార్ తప్పేదేముందీ? అట్లాగే ఎరేంజ్ చేస్తా!"
"ఇంకో విషయం విను. నిన్న మీరు పంపించిన డ్రైవరు ఎవరోగాని డ్రయివింగ్ ఏమాత్రం బావుండలేదట. మళ్ళీ వాడి మొఖం కనిపించడానికి వీల్లేదని ఆమె చెప్పారు."
స్వామి గతుక్కుమన్నాడు.
"ఎవరు సార్? ఏ డ్రయివర్?"
"అదే ఆ గెడ్డం అతను."
"వాడు చాలా మంచి డ్రైవరు సార్...ఏం చేశాడు?"
"డ్రైవింగ్ లో జర్క్ లు ఎక్కువ వస్తున్నాయట."
"వాడు మంచి డ్రయివరే మరి. నా దగ్గరున్న వాండ్లలో బెస్ట్. అందుకే పంపించినా!"
"నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంతకన్నా మంచి డ్రయివర్ కావాలి. రెండు మారుతీ దౌజెండ్ సిసీలే కావాలి. రేపు మార్నింగ్ ఆరు గంటలకల్లా రెండు కార్లూ ఇంట్లో ఉండాలి! ఓకే?"
"ఓకే సార్."
"డ్రయివర్ విషయంలో మాత్రం జాగ్రత్త! మంచివాడిని ఇవ్వకపోతే నీ టాక్సీ బర్లు కూడా రాదు. ఆమె మొండితనం, కోపం గురించి నీకింకా తెలీదనుకుంటాను."
"భలేవారే సార్, తెలీక పోవటమేమిటి? కిందటేడు మా డ్రయివర్ ఒకడిని కార్లో నుంచి బనాయించి తనే కారు డ్రయివ్ చేసుకువెళ్ళిపోయినామె కద్సార్."
"అవునవును. అది గుర్తుంది కదా?"
"ఉంది సార్!"
"నేను వెళ్తాను."
శ్రీరామ్ బయటకు నడిచాడు. స్వామి భారంగా కుర్చీలో కూలబడ్డాడు.
అతని మెదడంతా వేడెక్కిపోయింది. ఆ గెడ్డం డ్రైవర్ ని ఆమె వద్దని చెప్పటం తనకో సమస్య అయిపోయింది. తన దగ్గర అంతకంటే మంచి డ్రైవర్ లేడు. ఉన్న పదిహేను మందిలో బెస్ట్ డ్రైవర్ చిరంజీవే. మిగతావారంతా అతని తర్వాతే. చిరంజీవిని మానిపించాక తనకు నిజంగానే హ్యాండీ కాప్ గా ఉంది. మారుతీ సుజుకీ థౌజండ్ సి.సి. అసలు ఎవరికీ ఇవ్వటానికి మనసొప్పటం లేదు. దానిమీద ఇన్వెస్ట్ మెంట్ చాలా హ్యూజ్ గా చేయాల్సి వచ్చింది.
క్షేమంగా ఆ డబ్బు తిరిగి సంపాదించాలంటే దానిని చిరంజీవి లాంటి డ్రైవరే హ్యాండిల్ చేయాలి. కానీ చిరంజీవితో తను రిస్క్ తీసుకోలేడు. అసలే ఓ పొగరుమోతు ధనికురాలితో వ్యవహారం. చిరంజీవి తాగి వచ్చాడంటే అంతా రసాభాస అయిపోతుంది.
స్వామి బయటకు నడిచాడు. ఇంక ఉన్నవాళ్ళల్లో మిగిలిన బెస్ట్ డ్రైవర్ వెంకటేశ్వర్లు. కానీ వెంకటేశ్వర్లు మినీ వాన్ తీసుకుని శ్రీశైలం వెళ్ళాడు. అతను రాత్రికి తిరిగిరావాలి లెక్కప్రకారం. కానీ సాధారణంగా టూరిస్ట్ వ్యాన్లు అనుకున్న ప్రకారం తిరిగిరావు. చాలా ఆలస్యంగా వస్తాయ్. బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ డ్రైవర్లు నలుగురూ అతనిని చూసి వినయంగా లేచి నిలబడ్డారు.
"గిరాకీ ఏమైనా వచ్చిందా సార్?"
"అవును."
"నేను వెళ్తాను సార్!" రహీమ్ ముందుకొచ్చాడు.
"నువ్ లాభం లేదు. చాలా పెద్ద పార్టీ అది. శంకరనే వద్దని వాపస్ పంపిన్రు."
వాళ్ళంతా ఆశ్చర్యపోయారు.
"శంకర్ డ్రైవింగ్ నచ్చలేదా వాళ్ళకి? పాగల్ గాళ్ళు సార్ వాళ్ళు. శంకర్ బెస్ట్ డ్రైవింగ్ చేస్తాడు."
ఆ సంగతి అనుకోవలసింది నువ్వూ, నేనూ కాదు. కస్టమర్స్."
"అవున్సార్! ఆ మాట నిజమే."
స్వామి పచార్లు చేయసాగాడు అటూ ఇటూ. డ్రైవర్ విషయం తను ఇప్పుడే తేల్చాల్సి వుంది. ఎందుకంటే కొత్త మారుతీ కారు కొంచెం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. తను ఇంతవరకూ దాన్ని ఎక్కడకూ పంపలేదు.
"సార్! మీరు కోప్పడనంటే చెప్తాను. చిరంజీవి బెస్ట్ సార్!" రహీమ్ అన్నాడు.
స్వామి రహీమ్ వేపు చూశాడు.
"ఆ సంగతి నాకూ తెలుసునయ్యా. కానీ గసంటి తాగుబోతుని నమ్మటం మరీ రిస్క్ తెలుసా?"
"చిరంజీవి ఇంక పగటిపూట తాగడు సార్! ఇందాక చెప్పాడు కదా!"
"కానీ అది తాగుబోతు మాట కదా!"
అందరూ నవ్వారు.
కొద్దిసేపు అక్కడే తచ్చాట్లాడాడు స్వామి.
"ఆల్ రైట్ రహీమ్! నువ్వెళ్ళి చిరంజీవిని తోలుకురా."
రహీమ్ కారులో వెళ్ళిపోయాడు.
* * * *
శ్రీరంజని కారు దిగి లింపన్ క్లబ్ భవనంలోకి నడిచింది. లింపన్ క్లబ్ బంజారాహిల్స్ లో వుంది. ఆ క్లబ్ మెంబర్స్ అంతా శ్రీమంతులే. తమాషా ఏమిటంటే ఆ క్లబ్ లో మెంబర్స్ కి తప్ప యింకెవరికీ ప్రవేశం లేదు. ఆ క్లబ్ లో జరిగే యాక్టివిటీస్ గురించి చాలా కథలు ప్రచారంలో వున్నాయ్. ఆ క్లబ్ లో 'న్యూడ్ హెవెన్' అనే మినీ క్లబ్ ఉందనీ, అక్కడ మెంబర్లందరూ నగ్నంగా సంచరిస్తుంటారనీ, ఆ క్లబ్ లో పనిచేస్తున్న అరవైమంది యువతులూ మగ మెంబర్లకు ప్రణయ దేవతలుగా వ్యవహరిస్తున్నారనీ ఇలా ఎన్నో.
శ్రీరంజనిని చూడగానే ఎంట్రెన్స్ దగ్గర స్టెన్ గన్ తో నిలబడ్డ గార్డ్ సేక్యూట్ చేసి డోర్ తెరిచాడు. శ్రీరంజని లోపలకు నడిచింది. లోపల ఎలాంటి కోలాహలం లేదు. అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. గార్డెన్ లో అక్కడక్కడ చెట్ల గుబుర్లలో టేబుల్స్ దగ్గర కొంతమంది కూర్చుని మద్యం తాగుతున్నారు. కొంతమంది స్త్రీలు ఓ విశాలమయిన టేబుల్ ముందు కూర్చుని పేకాట ఆడుతున్నారు. టేబుల్ మీద నోట్ల కట్టలు పడివున్నాయ్. వాళ్ళంతా శ్రీరంజనిని చూస్తూనే విష్ చేశారు. చిరునవ్వుతో తనూ విష్ చేసి దూరంగా వున్న మరో భవనం వేపు వడివడిగా నడిచిందామె.
భవనంలో అందమయిన రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ లోపల్నుంచీ అండర్ గ్రౌండ్ లోకి మెట్లు వున్నాయి. ఆ మెట్లన్నీ దిగి మరో అందమయిన హాల్లోకి ప్రవేశించిందామె.
అక్కడ కూడా డైనింగ్ టేబుల్స్ కొన్ని వున్నాయ్ గానీ హాల్లో ఒక్కరు కూడా లేరు.
ఓ మూల కౌంటర్ దగ్గర కూర్చుని ఓ మాగజైన్ చదువుకుంటుందో యువతి.