Previous Page Next Page 
జయ - విజయ పేజి 7


    "నాకు తెలుసులే అక్కా! వూరికే అంటున్నాను! ఇంతకూ ఏమి రాశారాయన?"
    "ఏమీలేదు. తన గురించి కొన్ని వివరాలు రాశారు! ఇకనుంచి నేను ఎప్పుడు పడితే అప్పుడు ఆయనకు ఉత్తరాలు రాయవచ్చని పర్మిషన్ యిచ్చారు." ఆనందంగా అంది విజయ.
    ఆ రాత్రే ఆ ఉత్తరానికి జవాబు రాసిందామె.
    తమ కుటుంబం గురించీ, తను ఉద్యోగం చేస్తున్న విషయం అన్నీ వివరించిందందులో. ఆ తరువాత కాంతి పథం నవల గురించి తనకున్న కొన్ని సందేహాలను బయటపెట్టింది.
    ఆ ఉత్తరానికి జవాబు యిస్తాడని ఊహించలేదామె. అందుకే ఆ ఉత్తరం అమితమయిన ఆనందాన్ని కలిగించింది.
    అతని ఉత్తరం ఎన్నిసార్లు చదివినా తనివితీరడం లేదామెకి.
    "విజయగారూ,"
    మీ ఉత్తరం అందింది. అయితే మీరూ ఉద్యోగం చేస్తున్నారన్నమాట! నిజంగా మిమ్మల్ని అభినందించాలి. మీ ఫాదర్ పోయినా మీరు ధైర్యంగా ఉద్యోగం సంపాదించుకుని మీ కుటుంబాన్ని పోషిస్తున్నారంటే_ అది మీ మనోధైర్యాన్ని చాటుతోంది. అన్ని విషయాల్లో కూడా మీరు యిలాగే ధైర్యంగా మీ మనసుకి నచ్చిన విధంగా ప్రవర్తించగలరని ఆశిస్తాను.
    ఇకపోతే కాంతిపథం నవల గురించి మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో కొంతవరకు నేనూ ఏకీభవిస్తున్నాను. సృజన్ పాత్రకు నేను న్యాయం చేకూర్చలేదన్నారు. కానీ నాకు కావలసింది పాత్రకు న్యాయం చేకూర్చానా? లేదా? అనేది కాదు. ఆ పాత్ర నాచురల్ గా ఉందా లేదా అనేది! మొదట ఆ పాత్ర ఉదాత్తంగానూ, రాను రాను చీప్ గానూ ఉన్నమాట నిజమే! కానీ అలాంటి మనుషులు మన చుట్టూ ఉన్నారో లేదో గమనించండి. ఎక్కడా మీకలాంటి వ్యక్తులు తారసపడకపోతే అప్పుడు మీ మాట నిజమని ఒప్పుకుంటారు. ఇకపోతే మాధురి పాత్రలో మీరు చూపిన లోపాలు నిజంగా లోపాలే! అలాంటి పొరపాట్లు యికముందు రాకుండా జాగ్రత్తపడతాను. మీరు సహృదయంతో చేసిన విమర్శలకు కృతజ్ఞుడిని. ఇలాగే ఇకముందు కూడా మీ అమూల్యమైన విమర్శ కోసం ఎదురుచూస్తూంటాను.
    మీకు హాబీలేమయినా వున్నాయా?
    వాటి గురించి వ్రాయండి. నా హాబీలేమిటో తెలుసా? పుస్తకాలు పోగుజేయడం, చదవడం, అప్పుడప్పుడూ రచనలు చేయడం! విశేషాలతో వెంటనే జవాబు రాస్తారు కదూ?
                                                                మీ స్నేహితుడు
                                                                    చంద్రకాంత్
    అతని ఉత్తరంలో ఏదో ఆత్మీయత కనబడుతోంది. తామిద్దరికీ ఉత్తరాల ద్వారా పరిచయం అయ్యి మహా అయితే పదిహేనురోజుల్లోనూ యిది రెండో ఉత్తరం. ఈ రెండు ఉత్తరాల్లోనే యిద్దరి మధ్యా ఎంతో సన్నిహితం ఏర్పడినట్లనిపిస్తోంది.
    ఆ రాత్రికే అతనికి జవాబు రాసిందామె. అందులో అనుకోకుండానే తన గురించిన విషయాలెన్నో రాసేసింది. తీరా రాయడం ముగించాక ఓసారి చదువుకుంటే తనకే ఆశ్చర్యం వేసింది. అవన్నీ తను లోలోపల ఆలోచించేవే. ఇంతవరకూ ఆ ఆలోచనలు ఎవరి ముందూ ఉంచలేదు. ఆఖరికి రజనీకి కూడా చెప్పలేదు. మరిప్పుడతనికి ఎందుకు రాయాలనిపించిందో తెలీదు.
    ఉత్తరం మర్నాడు పోస్ట్ చేసి అతని జవాబు కోసం యెదురు చూడసాగిందామె.
    అలా ఎదురుచూడడంలో ఓ విధమయిన ఆనందం కలుగుతున్నట్లనిపిస్తోంది.
    "సాయంత్రం కొంచెం త్వరగా వచ్చేయగలవా ఆఫీసు నుంచి?" అడిగింది పార్వతి, ఆరోజు ఆమె ఆఫీస్ కెళ్ళబోతుంటే.
    "ఎందుకు?"
    "ఇవాళ సాయంత్రం వస్తారుట పెళ్ళివారు."
    విజయకు కోపం, నవ్వూ రెండూ వచ్చినాయ్.
    తనెన్ని చెప్పినా అంతే! ఆమె మాట ఆమెకే! ఆమె ప్రయత్నాలు ఆమెవే!
    "ఇప్పుడివన్నీ పెట్టుకోవద్దని చెప్పాగదమ్మా?" చిరాకుగా అంది విజయ.
    అలా అంటే ఎలాగమ్మా! మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి.
    కావాలనుకున్న తక్షణం సమకూర్చుకోగల కార్యాలు కావు కదా ఇవి? నచ్చజెప్తూ అందామె.
    విజయకు ఇక మాట్లాడాలనిపించలేదు.
    "సరేలే. నీ యిష్టమే నీది." అంది బయటకు నడుస్తూ.
    సాయంత్రం నాలుగు గంటలకల్లా పర్మిషన్ తీసుకుని ఇల్లు చేరుకుందామె. అప్పటికే ఆమె మామయ్య రాజారావు ఎదురుచూస్తూ కనిపించాడు.
    "హమ్మయ్య! వస్తావో, రావోనని హడలి పోతున్నాను." నవ్వుతూ అన్నాడాయన.
    "ఇదిగో మామయ్య. యిదే ఆఖరిసారిగా చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటి ఏర్పాట్లు చేయవద్దు. నాకసలు పెళ్ళీ వద్దు పెటాకులూ వద్దు! కావాలనిపించినప్పుడు నేనే చేసుకుంటాన్లే! మీరెవరూ ఏమీ శ్రమ పడనవసరం లేదు." కోపంగా అంది విజయ.
    "అదేమిటమ్మాయ్! అంత కోపగించుకుంటే ఎలా? నీ మేలు కోరేగా యిదంతా చేయడం? మీ అమ్మే ఉంటే మాకీ తాపత్రయం యెందుకు?" నొచ్చుకుంటూ అన్నాడు రాజారావ్.
    విజయ లోపలకు నడిచింది.
    "ఇంకో అరగంటలో వస్తున్నారు వాళ్ళు. ఈలోగా రడీ అవమ్మా!" ఆమె దగ్గరకొచ్చి చెప్పింది పార్వతి.
    "ఇదిగో చూడమ్మా! నీకు అదివరకే చెప్పాను. అందరిలాగా అలంకారాలు చేసుకుని వాళ్ళెదురుగా తలొంచుకు కూర్చోవడం నాకిష్టం లేదు. నేను మామూలుగానే వాళ్ళకు కనబడతాను..." విసుగ్గా అందామె.
    అప్పుడే అక్కడకొచ్చిన జయ ఆమె మాటలు విని గట్టిగా నవ్వేసింది.

 Previous Page Next Page