అక్షరజ్యోతి అహ్హహ్హా
"కేరళ నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిందట" న్యూస్ పేపర్ పట్టుకుని మా ఇంటికొస్తూ అన్నాడు రంగారెడ్డి.
అప్పటికే మా ఇంటి దగ్గర శాయిరామ్, జనార్ధన్, యాదగిరి, గోపాల్రావ్, పార్వతీదేవి అంతా పోగయి ఉన్నారు.
రంగారెడ్డి డైలాగ్ వింటూనే నేను పగలబడి నవ్వేను.
నేను నవ్వటం చూసి మిగతావాళ్ళు కూడా నవ్వసాగారు.
"ఏమిటి ఎందుకు నవ్వుతున్నారు?" అడిగాడు రంగారెడ్డి.
"నవ్వు రాకుండా ఎలా వుంటుంది గురూ? నూటికి నూరు శాతం అక్షరాస్యత- ఓహ్హెహ్హోహో"
అంటూ మళ్ళీ నవ్వేయసాగాడు గోపాల్రావ్.
"జబర్దస్త్ జోక్ అన్నా" అన్నాడు యాదగిరి కూడా నవ్వలేక కిందపడి డొల్లుతూ-
"అరె! పేపర్ లో క్లియర్ గా దాని వివరాలిచ్చారయ్యా! జర్నలిస్ట్ లేం అల్లాటప్పావాళ్ళు కాదు ఇష్టమొచ్చినట్లు రాసేయడానికి. మంచిగ నిజాయితీతో రాస్తారు-" అన్నాడు రంగారెడ్డి.
ఆ మాట వినగానే గోపాల్రావ్ తో సహా మేమంతా పగలబడి నవ్వేయసాగాం మళ్ళీ.
"నీ యవ్వ ఇది ఇంకా జబర్ధస్త్ జోక్ గా ఉన్నది భాయ్. జర్నలిస్ట్ లంతా నిజాయితీతోటి రాస్తారంట."
అందరం ఐదు నిమిషాలు నవ్వుకుంటూ కళ్ళవెంబడి జారుతున్న కన్నీటిని తుడుచుకున్నాం. సరిగ్గా వారం గడిచేసరికి శాయిరామ్ హడావుడిగా, ఓ న్యూస్ పేపర్ తీసుకుని తెగ ఎగ్జయిట్ అయిపోతూ వచ్చాడు. మేమందరం వేదిక దగ్గర వెన్నెల్లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూండగా.
"గురూ! అద్భుతమైన వార్త! మన ఆంధ్రప్రదేశ్ కూడా అక్షరజ్యోతి స్కీమ్ ప్రారంభించిందట" అన్నాడతను.
మాకతని మాటలేం అర్థం కాలేదు.
"అక్షరజ్యోతా? అంటే ఏమిటి?"
"అంటే మన రాష్ట్రం కూడా కేరళ రాష్ట్రంలాగానే నూరుపాళ్ళు అక్షరాస్యత సాధించేస్తుందన్నమాట!"
ఆ మాట వింటూనే మళ్ళీ అందరూ పగలబడి నవ్వారు.
"ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్- నీయవ్వ- భలే దిల్దార్ జోకులేస్తుందన్నా! ఇంకేరాష్ట్రానికీ గింత సెన్సాఫ్ హ్యూమర్ లేదు." అన్నాడు జనార్ధన్.
"అలా నవ్వకూడదు భాయ్! చాలా తప్పు పని చేస్తున్రు" అన్నాడు యాదగిరి.
"ఎందుకని నవ్వకూడదు?"
"ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ని మీరు తక్కువ అంచనా వేస్తున్రు. మన తెలుగు ప్రజల సంగతి మీకెరుకలేదు. తిక్క లేచిందంటే ఒక్క రోజుల పబ్లికంతా అక్షరాస్యులయి పోతారు- అంత కెపాసిటీ ఉందాళ్ళకు" అతనిని శాయిరామ్ సపోర్ట్ చేశాడు.
శాయిరామ్ కీ మధ్య తెలుగు ప్రజల మీద అభిమానం ఎక్కువైందన్న విషయం మాకు తెలుసు. అందుకని అతన్ని నిరుత్సాహ పరచటం ఇష్టంలేక వూరుకున్నాం.
"మనం కూడా ప్రభుత్వంతో సహకరిస్తే నూరుశాతం అక్షరాస్యత క్షణాల్లో సాధించవచ్చు" అన్నాడు గోపాల్రావ్ అతికష్టం మీద నవ్వాపుకుంటూ.
"మన కాలనీ వాళ్ళందరం కూడా ఈ స్కీమ్ లో చేరి నిరక్షరాస్యతను ఎదుర్కొందాం" అన్నాడు రంగారెడ్డి మరింత వుత్సాహంతో.
"మనమా!" ఉక్కిరి బిక్కిరౌతూ అడిగాడు జనార్ధన్.
"అవును! మన రాష్ట్రానికి మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?" అంది పార్వతీదేవి. ఆమెకీమధ్య దేశభక్తి ఎక్కువయిపోయింది. ఉండుండి 'రామ్ ఔర్ రోటీ' అంటోంది.
"మంచి పద్ధతి ఏమిటంటే అదివరకు లాగానే మన కాలనీ వాళ్ళందరం కలసి ఆదిమానవులు అనే అడవిజాతిని నాగరీకులుగా చేసే కార్యక్రమం విజయవంతంగా అమలుపరచాం కదా!" అన్నాడు చంద్రకాంత్ ఛటోపాధ్యాయ్.
ఆ ఆలోచన నిజంగానే అందరికీ ఉత్సాహం కలిగించింది.
ఎందుకంటే ఎదుటివాడికి తెలియని విషయాలు చెప్పటం మా అందరికి భలే సరదా!
అందులో చదువురాని వాళ్ళకు చదువు చెప్పటానికి మా కాలనీలో ఆడామగా అందరూ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఎటొచ్చీ నేర్చుకునే వారెవరూ దొరకకపోవటంవల్ల అందరి కోరికలూ అలానే అణగారి ఉండిపోయినయ్. చాలామంది తమ పిల్లల మీదనే ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నారు గానీ ఈ రోజుల్లో సిలబస్ కి ఆ రోజుల్లో మేము నేర్చుకున్న సిలబస్ కి చాలా తేడా వుండడంతో మా కోరిక నెరవేరలేదు.
మా ప్రపోజల్ వినడంతోనే మా కాలనీ వాళ్ళంతా కూడా మేము చదువు చెప్తాం అంటే మేము చెప్తాం అంటూ పోటీలుపడి రంగారెడ్డి దగ్గర పేర్లు నమోదు చేయించుకో సాగారు.
సాయంత్రం అయ్యేసరికి లిస్టు లో పేర్లు మూడొందల అరవై అయిదుకి చేరినయ్.
"ఇప్పుడేం చేయాలి మనం!" అడిగాడు గోపాల్రావ్.
"ఏం లేదు. ఇదిగో అక్షరజ్యోతి ఫోన్ నెంబర్! సిటీబస్ వెనక రాసి ఉంటే నోట్ చేసుకున్నాను. మనం ఈ నెంబర్ కి ఫోన్ చేసి కనుక్కుంటే మనం ఈ కార్యక్రమం ఎలా అమలు జరపాలి. అదే విషయం వారు చెపుతారు" అన్నాడు శాయిరామ్.
"అయితే పదండి ఫోన్ చేద్దాం"
అందరం బయలుదేరబోతుంటే పార్వతీదేవి మంచి రోజు చూసి ఆ పని ప్రారంభించాలని గొడవ పెట్టిందిగానీ ఎదుటివాడికి చదువు చెప్పాలనే మా 'కసి' ముందు ఆమె తీర్మానం నెగ్గలేదు.
అందరం మా కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన టెలిఫోన్ కౌంటర్ దగ్గరకు నడిచాం.
"నెంబరెంత?" అడిగాడు రంగారెడ్డి.
"236951" చెప్పాడు శాయిరామ్.
ఆ నెంబర్ రింగ్ చేసి వెంటనే కంగారుగా రిసీవర్ పెట్టేశాడతను.
"ఏమిటి? రాంగ్ నెంబరా?" అడిగాడు గోపాల్రావ్.
"కాదు! 'అక్షరజ్యోతి' అనే అన్నాడు అవతలతను.