Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 7

                                 


                                    

    పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరు వేపు నడవసాగాడు. అప్పుడు బాక్స్ లోని సెన్సార్ ఇలా అంది.
    "రాజా! నీ అవస్థ చూస్తుంటే నాకు తెగ జాలి పుడుతోంది. ఈ బరువు మర్చి పోయేందుకు ఓ సెక్సీ హీరోయిన్ ని పెళ్ళి చేసుకుని నానా అవస్థలు పడ్డ ఓ నిర్మాత కధ చెప్తాను విను!
    అనకాపల్లి అనే ఊళ్ళో అప్పలమ్మ అనే రికార్డ్ డాన్సర్ ఉండేది. ఆ పిల్లకి డబ్బు లేదు. కానీ డబ్బు చేసుకోగల శరీర సౌష్టవం ఉంది. అంచేత మద్రాస్ చేరుకొని ఓ సినిమాలో సెక్స్ డాన్స్ చేసింది అంతే! కేవలం ఆ డాన్స్ చూడ్డం కోసం జనం రాగా ఆ సినిమా శతదినోత్సవం చేసుకుంది. దాంతో అప్పలమ్మకు డిమాండ్ పెరిగిపోయింది. ఆమె పేరు ప్రేమ మాలిని గా మారిపోయింది. అంతవరకూ సెక్స్ డాన్స్ లు చేస్తున్న మరో పిల్ల డిమాండ్ పూర్తిగా పడిపోయింది. ఇది చూసి ప్రేమమాలిని భయపడింది. తను ఆ పిల్ల కన్నా బింకంగా ఉండడం వల్ల ఆ పిల్ల కొచ్చే అవకాశాలన్నీ పోయాయ్. రేపు తన కన్నా మాంచి ఊపులో ఉన్న పిల్ల ఇంకెవరన్నా ఫీల్డులో కొస్తే తన గతీ అంతే అవుతుంది. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ శరీరంలో ఇంపులూ. సొంపులూ ఉన్నప్పుడే ఓ కోటీశ్వరుడిని వలవేసి పట్టుకుని పెళ్ళి చేసుకుంటే ఇంక జీవితానికి డోకా ఉండదు. ఈ ఆలోచన వచ్చాక ఓసారి ఓ పార్టీకి వెళ్ళిందామె.
    అక్కడ కొత్తగా ఫీల్డులో కొచ్చిన నిర్మాతను కలుసుకుని కాసేపు మాట్లాడిందామే. ఆ నిర్మాత ఆమె హొయలు చూసి ప్రేమలో పడిపోయాడు.
    నన్ను పెళ్ళి చేసుకుంటావా ?" అనడిగాడు దీనంగా.
    "నీకెన్ని కొట్లున్నాయ్?" అనడిగింది ప్రేమమాలిని.
    "ఎనిమిది' అన్నాడు నిర్మాత.
    "అయితే సరే!" అందామె.
    ఇద్దరికీ ఝూమ్మని పెళ్ళయిపోయింది. పెళ్ళయిన రెండో రోజునే నిర్మాత ఆమెని తనింటికి తీసుకెళ్ళాడు. ఏ పెద్ద భవనంలోకో అడుగుపెట్టాలని ఆమె కన్న కలలు ఆ ఇల్లు చూసేసరికి నీళ్ళు కారిపోయినయ్.
    'ఏమిటిది! ఈపాడు కొంపలోనా నేనుండడం ..... వీల్లేదు' అందామె కారు దిగకుండానే.
    'ఇదిగో ఇలా గొడవ చేయకూడదు. నా పరిస్థితి కి ఇంతకంటే మంచి ఇల్లు దొరకదు' అన్నాడతను బ్రతిమాలుతూ.
    'అదేమిటి! నీ దగ్గర బోలెడు డబ్బుంది కదా ఓ పెద్ద మేడ కొను" అందామె.
    'నా దగ్గర అంత డబ్బెక్కడుంది ?" ఆశ్చర్యంగా అన్నాడు నిర్మాత.
    'అదేమిటి నీ దగ్గర ఎనిమిది కోట్లు ఉందన్నావుగా'
    'కోట్లు ఉన్నాయ్! కోట్లంటే నా ఉద్దేశ్యం మనం తొడుక్కునే కోట్లనుకున్నాను' అన్నాడు నిర్మాత గాబరాగా.
    ప్రేమమాలినికి ఒళ్ళు మండిపోయింది. లాగి నిర్మాత చెంప మీద కొట్టి ఏడుస్తూ కూర్చుంది .
    కొద్ది రోజులు గడిచిపోయాయ్.
    రాన్రాను ఆ నిర్మాత అసలు పరిస్థితి అర్ధమయిందామెకి. అతని దగ్గరున్నది అతి స్వల్పమయిన మొత్తం..... అంతా కలిపి పాతికవేలు. అది కూడా ఓ సినిమాలో పెట్టుబడిగా పెట్టేశాడు.
    'ఇలాంటి మొగుడు ఉండిననేమి ఊడిన నేమి' అని అలోచించి మరో బాగా డబ్బున్న ఆసామికి వల విసిరింది ప్రేమమాలిని. ఆ ఆసామీ వలలో పడి 'సరే, మనం పెళ్ళి చేసుకుందాం. ముందు విడాకులు తీసుకో" అన్నాడు వలలో నుంచే.
    ప్రేమమాలిని కోర్టు కెక్కింది విడాకుల కోసం.
    'నీకెందుకు విడాకులు? నీ భర్త నిన్ను హింసిస్తున్నాడా?" అనాదిగాడు లాయరు.
    ఆవునందామనుకుంది గానీ భర్త చేతికి బాండేజ్ లు చూశారంటే ఆ విషయం ఎవరూ నమ్మరని 'లేదు' అందామె.
    'ఎక్కువ తాగుతున్నాడా?"
    'ఊహూ!"
    "పేకాటలు?"
    'ఊహు!"
    'మరెందుకు విడాకులు?' ఆశ్చర్యంగా అడిగాడతను.
    ప్రేమమాలినికేం చెప్పాలో తెలీలేదు.
    'ఒకవేళ ఇంకే అమ్మాయితో నయినా ప్రేమకలాపాలు జరుపుతున్నాడా?" కావాలనే 'క్లూ' అందిస్తూ అడిగాడు లాయరు.
    'ఆ! అవునవును!' ఆనందంగా అబద్దమాడేసిందామే.
    'అందుకేమయినా రుజువులున్నాయా?'
    'ఎందుకులేవు? ఇదిగో - మా పాపను చూడండి! ఆర్నెల్ల కిందట కన్నాను. ఈ పాపకి అయన పోలికే లేదు. ఇంకేవరివో పోలికలోచ్చాయ్' అంది ప్రేమమాలిని.
    కోర్టులో జడ్జీతో సహా అందరూ ఘోల్లున నవ్వారు.
    ఇంతవరకూ చెప్పి సెన్సార్ ఇలా అడిగింది.
    "రాజా! ఆమె మాటలకు అందరూ ఎందుకు నవ్వారు? జడ్జి ఆమెకు విడాకులు మంజూరు చేస్తాడా? ఈ ప్రశ్నలకు.....
    "చాల్లెల్లె ! సమాధానం చెప్పకపోతే ఏమవుతుందో నాకు తెలుసు! ఆమె మాటలకు అందరూ ఎందుకు నవ్వారంటే ఆమె తెలివితక్కువతనం చూసి ! జడ్జీ తప్పకుండా ఆమెకు విడాకులు మంజూరు చేస్తాడు. ఎందుకంటె ఆమె ఎలాగూ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకొందని తెలిసిపోయింది కనుక...."
    ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వేపు ఎగిరిపోయింది.

                                      ***
                                

 Previous Page Next Page