Previous Page Next Page 
8 డౌన్ పేజి 8

    వీల్స్ తిరగకుండా ముందుకుతోసుకుపోవడంతో పట్టాలరాపిడికి నిప్పురవ్వలు పైకి ఎగజిమ్ముతున్నాయి.    
    "సార్ - ఇవాళ ఇద్దరికీ ఉద్యోగం ఊడిపోతుంది" భయంగా అన్నాడు అసిస్టెంట్.    
    గురుమూర్తి పాలిపోయిన మొఖంతో స్టార్ట్ సిగ్నల్ వేపే చూస్తున్నాడు.    
    ఇంకో అయిదు గజాల దూరం మాత్రమే మిగిలివుంది.    
    ఈ లోపల బండి ఆగుతుందా?        
    ఇంక చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని భగవంతుడిని ప్రార్ధించుకున్నాడతను. కీచుమంటున్న శబ్దాలతో, సరిగ్గా స్టార్టర్ సిగ్నల్ పోస్ట్ దగ్గర ఆగింది బండి.    
    గురుమూర్తికి పోయిన ప్రాణంతిరిగివచ్చినట్లయింది.    
                                                               * * *    
    డాక్టర్ ఫణి టైం చూసుకున్నాడు.    
    రెండు దాటిందప్పుడే ఎ.సి. చల్లదనం మరీ ఎక్కువగా వుంది. ఆ ఎ.సి. టూ టయిర్ కోచ్ లో మిగతా పాసింజర్స్ అందరూ రైల్వే సప్లయ్ చేసిన రగ్గులు కప్పుకుని పడుకున్నారు. ఎదుటి బెర్త్ మీద పడుకున్న జమదగ్ని లేచి ఫణివేపు చూశాడు. అతని ముఖంలో ఆందోళన కనబడుతోంది.    
    "రెండయిపోయింది" అన్నాడు ఫణి రహస్యంగా.    
    "అవును, మనవాళ్ళు వెయిట్ చేస్తూండివుంటారు-" అన్నాడతను తనలో తను గొణుక్కుంటున్నట్లు.    
    వీళ్ళ మాటలు విని పైబెర్తు మీదనుంచి చంద్రిక కిందకి తొంగిచూసింది.    
    "బహుశా ఇవాల్టిప్లాన్ ఫెయిలయిపోతుందేమో" అందామె ఆందోళనగా. ఫణి కళ్ళు ఎర్రబడ్డాయి.    
    "ఊహూ, ఆరు నూరయినాసరే ఫెయిలవటానికి వీల్లేదు" అన్నాడు గంభీరంగా.    
    కొద్ది క్షణాలు ఎవరూ ఏమీ మాట్లాడలేదు.    
    "మన మాటలు ఆ పై బెర్త్ మీద తనకి వినబడవు కదా?" అనుమానంగా అడిగాడు జమదగ్ని.    
    "అతను చిన్నపిల్లాడేలే. పర్లేదు"    
    "చంద్రికా" పిలిచాడు జమదగ్ని.    
    "ఊ"    
    "కిందకు దిగు"    
    ఆమె బెర్తు దిగి జమదగ్ని పక్కన కూర్చుంది.    
    ఒక్కసారి వెళ్ళి హోమ్ మినిస్టర్ చుట్టూ సెక్యూరిటీ ఏర్పాట్లెలా వున్నాయో చూసిరా"    
    చంద్రిక లేచి కర్టెన్ తొలగించుకుని నెమ్మదిగా బాత్ రూమ్ వేపు నడవసాగింది. తమకు అవతల రెండో కంపార్ట్ మెంట్ లోనే వున్నాడు హోమ్ మినిస్టర్. ఆ కంపార్ట్ మెంట్ లోని నాలుగు బెర్తుల్లో మూడు అతనికీ అతని సిబ్బందికీ చెందినవే. ఎదురుగ్గా వున్న రెండు బెర్తుల్లోనూ ముగ్గురు సెక్యూరిటీవాళ్ళున్నారు. ఒక ఉన్నతపోలీసాధికారి, మిగతా ఇద్దరూ ఆటోమేటిక్ గన్స్ తో కూర్చుని వున్న పోలీసులు.    
    నిద్ర కళ్ళతో నడుస్తున్నట్లు నడుస్తూనే మరోసారి అంతా వివరంగా గమనించింది. చాలా తేలికగా ఆ సెక్యూరిటీ గార్డులను కాల్చి చంపేయవచ్చు పోలీస్ అధికారి పై బెర్తు మీద పడుకున్నాడు కింద గన్స్ పట్టుక్కూర్చున్న ఇద్దరిలోనూ ఒకడు కునికిపాట్లు పడుతున్నాడు.    
    "ఎలా వుంది పొజిషన్?" అడిగాడు ఫణి ఆమె తిరిగి రాగానే.    
    "ఇద్దరే సెక్యూరిటీ గార్డులు ఆటోమేటిక్ రైఫిల్స్ తో వున్నారు. ఇన్ స్పెక్టర్ దగ్గర రివాల్వర్ వుంది అతను నిద్రపోతున్నాడు "రహస్యంగా చెప్పిందామె.   
    "వెరీగుడ్! గంగినేని స్టేషన్ సుమారుగా ఎప్పుడు పాసవుతుంది మన ట్రైన్?" అడిగాడు ఫణి.    
    "రెండు గంటలకు కాజీపేటవచ్చిందంటే ఉదయం అయిదు, ఆరుకీ మధ్య పాస్ అవాలి" చెప్పాడు జమదగ్ని.    
    "అంటే ఇంచుమించుగా తెల్లారిపోతుందన్నమాట"    
    "అవును, అందుకే నాకు సెకండ్ థాట్స్ వస్తున్నాయ్ రైల్లో జనమంతా చూస్తూండగా కిడ్నాప్ చేసుకువెళ్ళటం అసాధ్యమవుతుందా అని".        
    ఫణి నవ్వాడు.    
    "ఊళ్ళో అందరూ చూస్తూండగానే డిప్యూటీ కలెక్టర్ ని ఎత్తుకు పోయాం కదా. అప్పుడులేని రెసిస్టెన్స్ ఇప్పుడెక్కడి నుంచి వస్తుంది? రైల్లో వున్నది ఒకరికొకరు సంబంధంలేని ప్రయాణీకులు. అదీ కాక గవర్నమెంట్ ని ఎడ్యుకేటెడ్ ప్రజలెప్పుడూ సపోర్ట్ చేయరు. రాజకీయనాయకులన్నా, దేశాన్ని దోచుకుతింటున్న ప్రజా ప్రతినిధులూ, మంత్రులన్నా ఎవరికీ సింపతీ వుండదు. వారి మీద గానీ, పోలీస్ వ్యవస్థ మీద గానీ ప్రజలకు సానుభూతి వుంటే మనకు ఇంత సపోర్ట్ ఎందుకు దొరుకుతుంది?"    
    "అవును" అంది చంద్రిక ఆ కంపార్టుమెంట్ కి కర్టెన్ అడ్డం లాగి మూసివేస్తూ.    
    "చంద్రికా, కాగితం మీద హోమ్ మినిస్టర్, సెక్యూరిటీ గార్డ్స్ పొజిషన్స్ గీసి చూపించు" అడిగాడు జమదగ్ని.    
    చంద్రిక న్యూస్ పేపర్ తీసి అంచు మీదున్న ఖాళీలో ప్లాన్ గీసి చూపించింది.    
    "అంటే సెక్యూరిటీ గార్డ్స్ ని నువ్వొక్కర్తి వేడీల్ చేయగలవనుకుంటాను" చంద్రికతో అన్నాడతను. చంద్రిక తలూపింది.    
    "అవును, ఇద్దరిలో ఒకడు నిద్రమత్తులో వున్నాడు. నేను ఆ వేపు వెళుతూ వెళుతూ వాడిచేతిలోని గన్ లాక్కుని పక్కవైడ్కి గురిపెట్టానంటే చాలు - ఇద్దరూ అవుట్".     
    ఫణి సంతృప్తిగా నవ్వాడు.    
    "నువ్ చేయగలవన్న నమ్మకం నాకుంది".            
    "మన కార్యక్రమం ఏమిటప్పుడు?" అడిగాడు జమదగ్ని.    
    "నేను ఏ.కె-47 తో తిన్నగా హోమ్ మినిష్టర్ కాబిన్ లోకెళ్ళి అతనిని నిద్ర లేపుతాను. ఎలాంటి ప్రతిఘటనా లేకుండా కోచ్ దిగుతే ప్రాణాలు నీకు దక్కుతాయ్ అని చెప్తాను. అతను నాతోపాటు కోచ్ బయటకొస్తాడు. అప్పటికే నువ్వు బయటి డోర్ తెరచిపెట్టుకుని సిద్దంగా వుంటావు. నేను అతనితో పాటు కిందకు దిగిపోతాను. ఈలోగా చంద్రిక ఆ సెక్యూరిటీ వాళ్ళదగ్గర వున్న గన్స్ అన్నీ తీసుకుని బయటనిలబడ్డ నీకు అందిస్తుంది. ఆమె కూడా కోచ్ దిగాక నువ్వు డోర్ క్లోజ్ చేసి కిందకు దిగుతావ్. 'ఎవరయినా వెంబడించారంటే ఛస్తారు జాగ్రత్త!' అని చెప్పి నన్ను కలుసుకుంటావు. అప్పటికే ఆ ప్రాంతంలో సిద్దంగా వున్న మన జీప్ రైలు ఆగిన చోటుకువస్తుంది. అందరం అందులో మాయమయిపోతాం. ఎవరయినా కోచ్ దిగి వెంబడించడానికి ప్రయత్నిస్తే    
    నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేయటమే! అందులో ఎలాంటి అనుమానం లేదు" వివరించాడు ఫణి.    
    "ఓ,కే" అన్నాడు జమదగ్ని.    
    ముగ్గురూ నిశ్శబ్దంగా వెనక్కుజారగిలబడి కూర్చున్నారు.    
    నీలంరంగు నైట్ బల్బ్ కాంతిని చూస్తూండిపోయాడు జమదగ్ని. అంతవరకూ ఆగిపోయి వున్న 8 డౌన్ మళ్ళీ కదిలింది. టైమ్ చూసుకున్నాడతను. రెండున్నరయింది.    
    "ఈ లెక్కలో మనంగంగినేని స్టేషన్ చేరుకునేసరికి అరవుతుంది" అన్నాడతను.   
    ఎవ్వరూ మాట్లాడలేదు.    
    జమదగ్నికి ఆనందంగా వుంది.    
    ఇంతకాలానికి ఇప్పుడు తన భార్యను, పిల్లలను రక్షించుకోబోతున్నాడు. తనను పట్టుకోడానికి పోలీసులు పన్నినదుర్మార్గపు ఎత్తుకి తను వేసిన పై ఎత్తు ఇది. ఈ ఎత్తుతో పోలీసుల ఆటకట్టు - ఇప్పుడు తన ఊళ్ళోని భూపతీ, పోలీస్ ఇన్ స్పెక్టర్- ఇద్దరూ ఊరు వదిలిపరుగెత్తాలి.    
    సంవత్సరం క్రితం వరకూ తను నగ్జలైట్స్ గురించి పట్టించుకోలేదు. వాళ్ళు ప్రజా కోర్టులు నిర్వహిస్తున్నారనీ, ఆ కోర్టుల వల్ల ప్రజలకు చాలామేలు కలుగుతోందనీ విన్నాడు తను. వరంగల్ కు సమీపంలో వున్న చాలా ఊళ్ళల్లో అన్నలు ఎన్నో ప్రజోపయోగకరమయిన పనులు చేస్తున్నారనికూడా తెలిసింది. తను ఆ చిన్న ఊళ్ళోని స్కూల్లో డ్రిల్ టీచర్ గా వచ్చి చాలా కొద్దిరోజులయింది. సాధారణంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితులెలా వుంటాయో తన అయిదేళ్ళ సర్వీస్ లోనే తనకు తెలిసింది.    
    టీచర్ పోస్ట్ లు చాలా ఖాళీగా వుంటాయ్. పిల్లలు సరిగ్గా స్కూల్ కి రారు. తల్లిదండ్రులు పట్టించుకోరు. పరీక్షలలో మాస్ కాపీయింగ్ చాలా మామూలు విషయం. కొన్ని క్లాసుల్లో టీచర్స్ లేనప్పుడు, విద్యార్ధులంతా రోడ్ల మీద తిరుగుతుంటారు. తను ఏ స్కూల్లో పనిచేసినా తన డ్రిల్ గురించి కాకుండా స్కూలు డిసిప్లిన్ గురించి కూడా ఎక్కువ శ్రద్దతీసుకుంటూ వచ్చాడు.    
    అది స్టూడెంట్స్ కీ, వాళ్ళతల్లిదండ్రులకూకూడా అయిష్టం కలిగించింది. అయినా తను చాలావరకూ డిసిప్లిన్ అమలుచేయగలిగాడు.    
    మొదటిరోజే ఆ స్కూల్లో తనకు సమస్యలు ఎదురయినాయ్. టెన్త్ క్లాస్ విద్యార్ధులెవరూ డ్రిల్ క్లాసుకి రాలేదు. కొద్ది నిముషాలు గ్రౌండ్ లో వెయిట్ చేసిన తర్వాత తనే వాళ్ళ క్లాస్ కెళ్ళాడు. క్లాసులో కూడా ఎవరూ కనిపించలేదు.    
    కొంతమంది స్కూలు బయట వున్న సినిమాహాలు ముందు నిలబడి కనిపించారు.    
    "ఏమిటిక్కడ నిలబడ్డారు?" అడిగాడు తను వారిదగ్గరకు నడిచి.    
    "చిరంజీవి సినిమా సార్! ఇవాళే మొదలు! మీరు కూడా వస్తారా సార్?" చాలా అమాయకత్వం నటిస్తూ అడిగాడొకడు.    
    ఆ గుంపులో చాలామందిటెన్త్ క్లాసు నాలుగయిదు ఏళ్ళనుంచీ చదువుతున్నారని హెడ్ మాస్టార్ తనకు చెప్పాడు.    
    "ఇప్పుడు డ్రిల్ క్లాస్ వుందన్న సంగతి మీకు తెలుసా?"        
    "డ్రిల్ దేముంది సార్? అందరికీ మంచిగా వచ్చు. టికెట్ తీసుకోవాల్నా సార్ మీక్కూడా?"
    "నాకవసరం లేదు మీరు కూడా ఇప్పుడు సినిమాచూడ్డానికి వీల్లేదు. కావాలంటే స్కూలువదిలాక వెళ్ళండి".

 Previous Page Next Page