Previous Page Next Page 
8 డౌన్ పేజి 7

     కొద్ది రోజుల్లోనే వాళ్ళు చూపే అభిమానంతనలోని బిడియాన్ని చెరిపివేసింది. తననుకూడా ఆ కుటుంబ సభ్యునిగా చూసుకోసాగారు. మొదట్లో తను సంద్యని సరిగ్గా గమనించలేదు. ఒకటి రెండుసార్లు ఆమెతో మాట్లాడాక అప్పుడు ఆమె అద్భుత మయిన అందాన్ని చూసి విస్తుపోయాడు. ఆమె కార్లో కాలేజీకి వెళ్ళి వస్తుండేది. ఆమె కోసం మేడమీద ప్రత్యేకంగా ఓ గది ఉండేది. ఆమె అన్నలిద్దరికీ కలిపిమరోగది.       
    సాధారణంగా రాత్రుళ్ళు టి.వి.లో ఇంగ్లీష్ న్యూస్ చూసేప్పుడు అందరూ హాల్లోకలుసుకునేవారు. ఆ సమయంలో తను టి.వి. చూసేవాడుకాదు. ఆ కొద్దిసేపూ తదేకంగా ఆమె అందాన్నే చూస్తుండేవాడు.    
    ఒకటికి రెండుసార్లు ఆమెతనవేపు చూసినప్పుడు మాత్రం తనుదొరకిపోయాడు. ఆమెకు తనమీద చెడు అభిప్రాయం కలుగుతుందేమోనన్నభయం - కొద్దిరోజులు కదిలించి వేసింది. ఆమెతో మాట్లాడాలనీ, పరిచయం పెంచుకోవాలనీఎన్నో విధాలుగా ఆలోచిస్తూండేవాడు కానీ తీరా అవకాశం దొరికేసరికి నోట్లోనుంచి మాట పెగిలేది కాదు.    
    చివరకు ఒకరోజు మంచిఅవకాశం వచ్చింది.    
    ఇంట్లో ఎవరూ లేరారోజు.    
    తనూ, సంధ్యా అంతే!    
    ఇద్దరికీ భోజనంవడ్డించి ఆహ్వానించిందామె.        
    భోజనం చేస్తుండగా ఆమెతో మాట్లాడాలని ఆశపడ్డాడు తను కానీ ఆమె తల వంచుకుని భోజనం చేస్తూండిపోవడంతో తనకు ధైర్యం చాలలేదు. తనేమయినా పొరపాటు మాట్లాడితే ఆమె ఆ విషయాన్ని ఎలా తీసుకుంటుందోనన్న సంశయం!    
    మధ్యాహ్నం హాల్లో ఇద్దరూ కూర్చుని టి.వి. ప్రోగ్రాం చూడసాగారు. మధ్యలో ఒకటి రెండుసార్లు ఇద్దరిచూపులూ కలుసుకున్నాయ్. ఆమె పెదాల మీద చిరునవ్వు విపరీతమయిన ప్రోత్సాహం కలిగిస్తోంది.    
    "సంధ్యా! మీరు చాలా అందంగా వున్నారు" అని చెప్పాలని ప్రయత్నం.    
    కానీ ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందది? ఆమె తల్లిదండ్రులకు చెప్తే తనను ఎంత చెడుగా ఊహిస్తారు?    
    ఆ అవకాశం దూరమయిపోయింది. ఆ తరువాత కొద్దిరోజులకే తనకు ఎ గ్రేడ్ అప్రంటీస్ వుద్యోగం దొరికింది. డీజిల్ అసిస్టెంట్ గా ట్రైనింగ్ ప్రారంభమయింది. గూడ్స్ రైళ్ళల్లో లెర్నింగ్ కి బయల్దేరాడు. ఇంజన్ నడవడం, రూల్స్ ప్రకారం పని చేయటం, సిగ్నల్స్ గురించి తెలుసుకోవటం, ప్యూజీలు ఎలా కాల్చాలీ-    
    అప్పుడే కాజీపేట పోస్టింగ్ వచ్చింది.    
    సంధ్యను వదిలివెళ్ళటానికి మనసొప్పలేదు.    
    రోజూ ఆమెను ఓసారయినా చూడందే వుండడం అసంభవమన్న ఫీలింగ్ కనీసం వెళ్ళేలోపల ఆమెకు తను మనసు విప్పి చెప్పాలనీ, ఆమె మనసు తెలుసుకోవాలనీ కోరిక.     
    ఆ అవకాశం ఆఖరిరోజున దొరికింది.    
    ఇంట్లో ఎవరూలేని సంధ్యా సమయంలో కరెంట్ పోవటంతో ఆమె తన గదిలోకొచ్చి కాండిల్ టేబుల్ మీదుంచింది.    
    ఎలాగయినా ఆ క్షణంలోనే ఆమెతో మాట్లాడాలన్న ప్రయత్నంతో సంభాషణ ప్రారంభించాడు.    
    "ఇవాళే ఈ గదిలో ఆఖరిరోజు" అన్నాడు తనలో తను మాట్లాడుకుంటున్నట్లు.   
    ఆమె వెళ్ళిపోతూ గది గడప దగ్గర ఆగింది.    
    "అవును! రేపు కాజీపేట వెళ్ళిపోతున్నారటకదా?"    
    "వెళ్ళక తప్పదు నిజానికి వెళ్ళాలనిపించటంలేదు."    
    ఆమె నవ్వింది.    
    "ఎందుకని?"    
    తన గుండెలువేగంగా కొట్టుకున్నాయ్. అసలు విషయం చెప్పాల్సినసమయం ఆసన్నమయింది.    
    కానీ భయం - తడబాటు-    
    చెప్పవచ్చా? చెప్పకూడదా?    
    చెప్తే ఆమె ఏమనుకుంటుందో? తన మీద అసలు ఆ అభిప్రాయం వుందో, లేదో? లేకపోతే తనమీద చెడుఅభిప్రాయం ఏర్పరచుకుంటుందేమో! అంత గాఢంగా ప్రేమించిన అమ్మాయి తననుచులకనగా చూడటం, తనను కాదనటం- తను సహించగలడా?    
    తలెత్తి ఆమెవంకచూశాడు.    
    ఆమె గడపమీద నిలబడివేళ్ళకు ఓణీని చుడుతూ కిందకు చూస్తోంది.    
    "సంధ్యా!" రహస్యంగా పిలుస్తున్నట్లుంది.    
    ఆమెకు వినిపించిందో లేదోకూడా సందేహమే.    
    ఆమె తలెత్తి తనవేపు చూసింది. తను ఎంత ప్రయత్నించినా నోరు పెగలటం లేదు. తనకు తెలుస్తూనే వుంది. ఆమెకు ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేడు. ఆమె ప్రేమను ఈ క్షణంలో పొందకపోతే ఇంకెప్పుడూ పొందలేడు.    
    "సంధ్యా" మళ్ళీ పిలవడానికి ప్రయత్నించాడు.    
    ఈసారి పిలుపు గట్టిగా వినిపించింది. కానీ అది తన గొంతుకాదు. బయటినుంచి ఆమె స్నేహితురాళ్ళెవరో పిలుస్తున్నారు. సంధ్య మరోసారి తనవేపుచూసింది. ఆమె కళ్ళల్లో ఎన్నో భావాలు కదలాడుతూకనిపించినయ్. ఆమె వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది పరుగుతో.    
    అంతే! ఒక్కసారిగా తననుదిగులు అవహించేసింది.    
    ఆ మర్నాడు ఆ ఇల్లు శాశ్వతంగా వదిలేసమయంలో ఆమె ఇంట్లోలేదు. కాలేజీ కెళ్ళింది.    
    రైలు కాజీపేట వెళ్తోంటే విపరీతమయిన సంఘర్షణ. వెనక్కుతిరిగి వచ్చేయాలనీ, ఆ వుద్యోగం వదిలేయాలనీ- కానీ కుటుంబ బాధ్యత ఆ ఆలోచనలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా అణగద్రొక్కేసింది.    
    కాజీపేటలో కొద్దిరోజులపాటు పిచ్చోడిలాగా గడిపాడు.   
    భోజనం చేయకుండా- గదిలోనుంచి బయటకుకదలకుండా-    
    తనకు సంబంధాలు చూస్తున్నట్లు తల్లిదండ్రులు ఉత్తరం రాశాక మళ్ళీ సంఘర్షణ ప్రారంభమయింది.    
    ఆఖరి అవకాశం ఇది. తనకు ఏదొక సంబంధం సెటిలవకముందే ఆమె మనసు తెలుసుకోగలిగితే-    
    హైద్రాబాద్ చేరుకున్నాడు.    
    ఇంటికి చేరుకునేసరికి ఆమె బయటే నిలబడితల దువ్వుకుంటోంది. సాయంత్రం నీరెండ వింతకాంతి ఆమె మీదపడుతుంటే ఆమె అందం ద్విగుణీకృతమయి తన మనస్సుని కాల్చివేస్తోంది.    
    ఈ దేవతనెలా వదులుకోవటం? ఎలా సొంతం చేసుకోవటం-తనని చూడగానే ఆమె కళ్ళల్లో కనిపించినమెరుపు- నిజమా, తనభ్రమా? ఆమె సంకేతమా? సందిగ్ధమా?    
    పెదాలమీద చిరునవ్వు-    
    "అమ్మా, గురుమూర్తిగారొచ్చారు- "అంటూ లోపలకు నడిచింది.    
    ఆమె తల్లీ తండ్రీ ఇద్దరూ హాల్లోకొచ్చారు.    
    "మంచి సమయానికి వచ్చారు. ఇవాళే వెడ్డింగ్ కార్డు పోస్టు చేద్దామనుకుంటున్నాము" అన్నారాయన.    
    తనకు కొద్దిక్షణాలు ఆ మాటలు అర్ధం కాలేదు. టేబుల్ మీద వెడ్డింగ్ కార్డ్స్ లో నుంచి ఒక కార్డు తీసి తన చేతికిచ్చారు. కార్డ్ మీద తన పేరు, అడ్రసూ వుంది. కొంచెం కొంచెంగా తెలుస్తోంది. వణుకుతున్న చేతుల్తో కార్డుతీసి చూశాడు.    
    సంధ్య వెడ్స్ శేఖర్-    
    ఇంక అక్షరాలు కనిపించలేదు.    
    గుండెల్లో విపరీతమయిన బాధ - పది నిముషాల్లో బయటకు వచ్చేశాడు. ఆ తరువాత కొద్ది రోజులకే తన వివాహం నిర్ణయమైంది. కానీ ఎందుకో మనసు క్రమేపీ ఎదురు తిరగసాగింది. వివాహం చేసుకున్నా తను ఆ అమ్మాయితో కాపురం చేయగలడా? ఆమెను ప్రేమించగలడా?    
    ఏమో? తనకే మాత్రం నమ్మకం చాలటంలేదు. వివాహం రద్దు అయింది.    
    తనే రాశాడు ఇప్పట్లో పెళ్ళి వద్దని-    
    "డిస్టెంట్ కాషన్" అరిచాడు అసిస్టెంట్.    
    గురుమూర్తి తృళ్ళిపడి ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. ట్రైన్ కాజీపేట్ లోకి వస్తోంది.    
    "హోమ్ కాషన్స్"
    గురుమూర్తి వ్యాక్యూమ్ అప్లయ్ చేశాడు. బ్రేక్ వీల్స్ ని పట్టుకుంటున్నట్లు అనిపించలేదతనికి.    
    అదిరిపడి గేజ్ వేపు చూశాడు.    
    చాలా నెమ్మదిగా కిందకు దిగుతోంది ముల్లు.    
    గురుమూర్తికి చెమటలు పట్టేసినాయ్.
    ఈ స్పీడ్ లో 1 ఇన్ 8 1/2 టర్న్ అవుట్స్ తీసుకుంటే బండి డీరైల్ అయిపోవటం ఖాయం. నెమ్మదిగా ఎమర్జెన్సీ బ్రేక్ అప్లయ్ చేయసాగాడతను. ఎమర్జెన్సీ బ్రేక్ పూర్తిగా అప్లయ్ చేస్తే కేవలం ఇంజన్ చక్రాలనే బ్రేక్స్ కదలకుండా చేస్తాయ్. అలాచేస్తే వెనుకవున్న కోచ్ లన్నీ అమాంతం ఇంజన్ మీదకు ఎక్కేసే ప్రమాదం వుంది. ఫ్లాట్ ఫారం మీదకు వచ్చేస్తోంది బండి.    
    కానీ స్పీడ్ ఇంకా ఎక్కువగానే వుంది.
    గురుమూర్తికి చెమటలు పట్టేసినాయ్.    
    ఇంజన్ కటాఫ్ చేసేశాడు.    
    ఫ్లాట్ ఫారం చివర స్టార్టింగ్ సిగ్నల్ అతి వేగంగా దగ్గరయిపోతోంది. దానిలోపలే బండి ఆగాలి. లేకపోతే కొంపలు మునిగిపోతాయ్.
    ఏ సిగ్నల్ అయినా సరే 'స్టాప్' ఇండికేషన్ లు దాటివెళ్తే చాలా సీరియస్ విషయంగా తీసుకుంటారు అధికారులు. యాక్సిడెంట్ అవకపోయినా అయినట్లు భావించి డ్రైవర్ కి పనిష్మెంట్ యిస్తారు. ఎమర్జెన్సీ బ్రేక్ పూర్తిగా అప్లయ్ చేశాడు గురుమూర్తి. ఇంజన్ చక్రాలు ఇంచుమించుగా బిగుసుకుని కదలిక లేకుండా వుండిపోయినయ్ గానీ వెనుక వున్న 20 పెట్టెల ఫోర్స్ సునాయాసంగా తిరగని చక్రాలనేముందుకి తోసివేస్తోంది.

 Previous Page Next Page