అందరూ మొఖాలు చూసుకున్నారు
"మేమొస్తాం! మీరెళ్ళండి సార్" అన్నాడొకడు హేళనగా.
"రాకపోయరంటే మాత్రం వారం రోజులపాటు డిబార్ చేయించటమేకాకుండా నేనే మీ పేరెంట్స్ దగ్గరకొచ్చి రిపోర్టు చేయాల్సి వుంటుంది."
తన మాట పూర్తవకుండానే అందరూ ఘొల్లుమనినవ్వారు. "జోక్ మంచిగున్నది సార్! ఇంకా చాలా జోక్ లొచ్చాసార్ మీకు?" ఇంకొకడు ఎగతాళిగా అడిగాడు.
తను జవాబివ్వకుండా గ్రౌండ్ కి వచ్చేశాడు. ఆడపిల్లలంతా ఓ మూల చెట్లకింద కూర్చుని సినిమా మాగజైన్ లు చదువుతున్నారు.
"మీకిప్పుడు డ్రిల్ క్లాస్ వున్న విషయం తెలుసా?" అడిగాడు తను.
వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు.
"తెలుస్సార్"
"మరి గ్రౌండ్ కి ఎందుకురాలేదు?"
"మేమెందుకు సార్? డ్రిల్ క్లాస్ మగపిల్లలకే కదా?"
"అంటే మీరు డ్రిల్ చేసేందుకు పనికిరారా? మీరేమయినాకాలూ, చెయ్యీ లేని వికలాంగులా?"
ఎవ్వరూ జవాబివ్వలేదు.
"పదండి గ్రౌండ్ కి! కమాన్, క్విక్"
ఎవ్వరూ లేవలేదు.
"ఆడపిల్లలు డ్రిల్ చేయరు సార్"
"ఎవరు చెప్పారలా అని"
"ఇంతవరకూ వచ్చిన డ్రిల్ మాస్టర్లందరూ చెప్పిన్రు సార్"
"నేను నమ్మను మీరు డ్రిల్ క్లాస్ కి రాకపోయినా పట్టించుకోకపోవటంవల్ల మీరలా అనుకుని వుంటారు. మీరు ముందు డ్రిల్ క్లాస్ కి వస్తున్నారా లేదా?"
"మేము రాము సార్"
"రాకపోతే రేపు మిగతా క్లాసులకుకూడా రానీయకుండా చేస్తాను"
వాళ్ళ మొఖంలో ఆందోళన కనిపించింది.
"అయిదు నిముషాలు టైమిస్తున్నాను మీకు. ఈలోగా గ్రౌండ్ కి రాకపోతే ఇంక మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు మీ పేరెంట్స్ అందరికీ లెటర్స్ పంపిస్తాను" చెప్పి తను గ్రౌండ్ కి చేరుకున్నాడు.
సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత ఆడపిల్లలందరూ ఒక్కొక్కరుగా గ్రౌండ్ కి చేరుకున్నారు. అందరినీ కూర్చోబెట్టిమనిషికి ఫిజికల్ ఎక్సర్ సైజ్ ఎంత అవసరమో, ఫిజికల్ ఫిట్ నెస్ లేని జనాభా వల్ల దేశానికి ఎంత అరిష్టమో అన్నీ వివరించాడు.
స్కూల్ అయిపోయాక హెడ్ మాస్టర్ ని కలుసుకున్నాడు.
"టెన్త్ క్లాస్ వాళ్ళు డ్రిల్ క్లాస్ కి రాకుండా సినిమాకెళ్ళారు సార్. వాళ్ళందరినీ ఒక వారం పాటు డిబార్ చేస్తేబాగుంటుంది".
హెడ్ మాస్టర్ తనవేపు ఆశ్చర్యంగా చూశాడు "డ్రిల్ క్లాస్ కి రానందుకు డిబార్ చేయటమా?"
"అంటే డ్రిల్ క్లాస్ క్లాస్ కాదా సార్?"
"కాదని కాదు, మిగతా క్లాసులకురాకపోతేనే మనం ఏమీ అనలేకపోతున్నాం. ఇంక డ్రిల్ క్లాస్ కి..."
తనకు కోపం ఆగలేదు "ఎక్స్ క్యూజ్ మీ సర్, బహుశా డ్రిల్ క్లాస్ ప్రాముఖ్యత మీకూ అర్ధమయి వుండదు. ప్రభుత్వం డ్రిల్ మాస్టర్లను అపాయింట్ చేసి ఇంత డబ్బు ఖర్చు చేయడానికి తెలివి తక్కువతనంతో కాదు. స్పోర్ట్స్ లో, గేమ్స్ లో మన దేశం ప్రపంచం అంతటిలోకీ అట్టడుగున ఉండటానికి కారణం మీలాంటి హెడ్మాస్టర్లు, టీచర్లే".
హెడ్మాస్టర్ మొఖం ఎర్రబడిపోయింది.
"దట్సాల్ రైట్, నువ్ నాకు లెసన్స్ చెప్పనవసరంలేదు. డ్రిల్ క్లాస్ కి పిల్లలు రాకపోతే అది నీ హెడేక్. నాకేం సంబంధం లేదు. యూ కెన్ గో నౌ" కోపంగా అన్నాడు.
తను బయటకువచ్చేశాడు.
ఆ మర్నాడు కూడా విద్యార్ధులెవరూ డ్రిల్ క్లాస్ కి రాలేదు. ఆడపిల్లలే వచ్చారు. వారితో డ్రిల్ చేయిస్తూండగా ఒక్కొక్కరే టెన్త్ క్లాస్ వాళ్ళు వచ్చి దూరంగా నిలబడ్డారు.
"ఏరోవ్! మనందర్నీ వారం దినాలు డిబారు చేయిస్తానంటుండె గదా! ఆవాజ్ బంద్ అయిపోయినాదేం సంగతి?" అన్నాడొకడు గట్టిగా.
"అరె! పోనీరా, కొత్తోడు. జర్రఆగే, పీచే చూడటానికి టైమ్ పడతది-"
తనకి పట్టరాని ఆవేశం వస్తోంది. కానీ చేయగలిగిందేమీ కనిపించటం లేదు. హఠాత్తుగా వాళ్ళ ధోరణి మారిపోయింది. తన మీద కామెంట్స్ మానేసి డ్రిల్ చేస్తున్న విద్యార్ధినులమీద కామెంట్స్ ప్రారంభించారు.
"అరెయ్, రాజ్యలక్ష్మి ఎట్ల ఎగురుతున్నదో చూడు-"
"విజయలక్ష్మి తక్కువనా? ఏయ్ పోరీ! జాకెట్ చిరుగుతదిసంచాయించుకో"
ఆడపిల్లలంతా డ్రిల్ ఆపేసి నిశ్శబ్దంగా గ్రౌండ్ నుంచి క్లాస్ రూం వేపువెళ్ళిపోయారు.
ఆ కామెంట్స్ చేసినవారి దగ్గరికి కోపంగా నడిచాడు తను.
"నీ పేరేంటి?"
"ఏం సంగతి? బోర్డు రాయించిస్తావా సార్?"
అందరూ నవ్వారు.
"నీ పేరు చెప్తావా, చెప్పవా?"
"చెప్పరా! సార్ డయిరీలో రాసుకుంటాడు-"
"గట్లనా! అయితే రాస్కోసార్. గజపతి"
"నీ పేరేంటి?" రెండోవాడినడిగాడు.
"సురేందర్ రెడ్డి. మా నాయన పేరు గూడా కావాల్నా? మహేందర్ రెడ్డి - మా తాత పేరుగూడా కావాల్నా?"
"అక్కరలేదు- "అప్పుడు మొదలుపెట్టారు ఎటాక్ చేయటం. వాళ్ళు చేతులునొప్పి పుట్టేవరకూ కొట్టి వెళ్ళిపోయారు.
అతి కష్టం మీద లేచి హెడ్మాస్టర్ రూమ్ లో కెళ్ళాడు. తనపేర్లు రాసుకున్న నలుగురి లిస్ట్ అతని ముందుంచాడు.
"వీళ్ళు నలుగురూ డ్రిల్ చేస్తున్న అమ్మాయిల మీద అసభ్యకరమయిన కామెంట్స్ చేస్తున్నారు, నన్ను కొట్టారు. వాళ్ళమీద చర్య తీసుకోకపోతే మనందరి గౌరవానికికూడా భంగం కలుగుతుంది."
"అంటే?"
"అవమానం పడ్డ విద్యార్ధినుల్లో మీ అమ్మాయి విజయలక్ష్మి కూడా వుంది. మీ అమ్మాయిని ఏమేం మాటలన్నారో కూడా నన్ను చెప్పమంటారా లేక మీరే మీ అమ్మాయినడిగి కనుక్కుంటారా"
కొద్దిక్షణాలు అతను మాట్లాడలేకపోయాడు.
"ఎవరు? అల్లరి చేస్తున్నవాళ్ళు"
తను నాలుగుపేర్లూ చూపించాడు.
"వీళ్ళే అయుంటారని నేను ముందే అనుకున్నా! వీడు భూషణం కొడుకు! వీడు పోలీస్ ఇన్ స్పెక్టర్ కొడుకు! వీడు ఈ ఊరి దాదా కొడుకు - నాలుగోవాడు మన మెయిన్ రోడ్ మీదున్న హోటల్ ఓనర్ కొడుకు. వీళ్ళనేం చేయగలం మనం?"
"మీకు అంత ధైర్యం లేకపోతే నేను వీళ్ళ మీద పోలీస్ కంప్లయింట్ ఇస్తాను."
"అంటే ఇన్ స్పెక్టర్ కొడుకు మీదే ఇన్ స్పెక్టర్ కి కంప్లెయింట్ ఇస్తావా?"
"ఇవ్వకూడదని రూలేంలేదు."
"సరే, నీ ఇష్టం నన్నుమాత్రం ఇందులోకిలాగకు. నేనీ వూళ్ళోఇంకొన్ని సంవత్సరాలు గడపదల్చుకున్నాను"
తను మాట్లాడలేదు. కంప్లెయింట్ ఒకటి తయారుచేసుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. అది చూస్తూనే ఇన్ స్పెక్టర్ మొహం ఎర్రబడింది.
"ఈ రెండో పోరడు నాకొడుకని నీకు తెలుసా?"
"తెలుసు"
"తెల్సి కూడా నాకే కంప్లెయింటిస్తున్నావ్?"
"తండ్రి పోలీస్ ఇన్ స్పెక్టరయితే కొడుకుమీద కంప్లెయింట్ ఇవ్వకూడదనిగానీ, కొడుకు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చునని గానీ ఎక్కడా లేదు."
ఇన్ స్పెక్టర్ అతనిచ్చిన కాగితాన్ని చింపి ముక్కలు చేసి డస్ట్ బిన్ లో పడేశాడు "ఇంక ఫో నువ్వు" అరిచాడు కసిగా.
"వెళ్తాను, కానీ ఇది ఇక్కడితో ఆగిపోదు గుర్తుంచుకో" అనేసి బయటకు నడిచాడు. జరిగిందంతా వివరంగా రాసి జిల్లా కలెక్టర్ కీ, డి.జి.పి.కీ పోస్ట్ లో పంపించాడు. పదిహేను రోజుల తర్వాత పిలుపు వచ్చింది తనకు పోలీస్ స్టేషన్ నుంచి.
"డ్రిల్ మాస్టర్ వి నువ్వేనా?" అడిగాడు కానిస్టేబుల్.
"అవును"
"పోలీస్ స్టేషన్ కి నడు"
"ఎందుకు?"
"ఇన్ స్పెక్టర్ సాబ్ పిలుస్తుండు"
"నేను రానని చెప్పు"
"రమ్మన్నప్పుడు మర్యాదగా రావాలే. రాకుంటే ఏమవుతుందో ఎరుకలేదా?"
"తెలుసు, నువ్వెళ్ళిక"
గంట తర్వాత జీప్ తనింటి ముందాగింది.
"స్టేషన్ కి రమ్మంటే రానన్నావంట ఏం సంగతి?" ఇంట్లోకి అడుగుపెడుతూనే అరిచాడు.
"అది పోలీస్ స్టేషన్ కాదు గనుక"
"అంటే?"
"నీ సొంత ఇల్లు అక్కడ కానూన్ అనేది లేదు. నీ ఇష్టం వచ్చినట్లునడుస్తుంది. అలాంటిచోటుకు రావాల్సిన అవసరం నాకు లేదు."