Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 7


    ఫస్ట్ తారీఖు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటి కొస్తూనే జేబులో నుంచి కొన్ని నోట్లు తీసి సీత చేతిలో ఉంచాడు మాధవరావు.
    "ఏమిటిది?" ఆశ్చర్యంగా అడిగింది సీత.
    "జీతం ......" చిరునవ్వుతో అన్నాడు మాధవరావు.
    "అది సరే...... నాకెందుకిది!"
    "నా పనల్లా నెలయ్యేసరికి జీతం తెచ్చి నీ చేతి కివ్వడం అంతే! ఆ తరువాత దాన్నెలా సరి పెట్టుకోవాలి అనేది నీ విషయం. నాకేం సంబంధం లేదు' నవ్వుతూ అన్నాడతను.
    "బావుంది ......నాకేం తెలుస్తుంది?" ఆలోచిస్తూ అందామె. నిజానికి అతనలా జీతమంతా తెచ్చి తనకివ్వడం తనకే ఖర్చు చేసే అధికారం ఇవ్వడం ఆమెకు చాలా ఆనందాన్ని కలిగించింది. తను ఎలాగోలా ఎంతో కొంత కూడబెట్టి తనలో అణగారి పోతున్న కోరికలకి ప్రాణం పోసేందుకు ప్రయత్నించాలి.
    "రెండు నెలలు ఖర్చు పెడితే- అదే తెలుస్తుంది !"
    "ఇంతకూ మొత్తం ఎంత ఇది?"
    "మూడొందల తొంభయ్......"
    ఆ డబ్బు తీసికెళ్ళి అల్మారాలో ఉంచిందామే. వంటింట్లోకి నడిచి స్టౌ మీద కాఫీ చేసి తీసుకొచ్చి అతని కందించింది.
    "సీతా! నా జీవితంలో ఇంతవరకూ ప్రతి నెలా మామయ్య వాళ్ళకు రెండు వందల చొప్పున పంపుతూ వచ్చాను. ఆఫ్ కోర్స్ ఇక నుంచీ అంత పెద్ద మొత్తం పంపటం కుదరధనుకో! అయినా ప్రతి నెల ఎంతో కొంత పంపితే బావుంటుంది. నీకు చెప్పాను కదా మామయ్యకు నేనెంతో ఋణపడి ఉన్నానని! ఈ విధంగానయినా మామయ్య ఋణం తీర్చేసుకుంటే ఆనందంగా ఉంటుంది.
    "మీ ఇష్టం! మీరెలా చెప్తే అలా........" చిరునవ్వుతో అందామె. పైకయితే అలా అనేసింది గాని లోలోపల ఆలోచనలు చెలరేగుతున్నాయామేకి. ఇంటి అద్దె అరవై రూపాయలు, కరెంట్ కి , నీళ్ళకూ పదిహేను, ఇది కాక అయన మామయ్య గారింటికి కొంత -- ఇవన్నీ పొతే ఇంక తమకు మిగిలేదేముంటుంది? ఉన్న మొత్తం నెలంతా రేషన్ కీ, మిగతా సరుకులకూ సరిపోతుంది. అంతే! తన చీరలకూ, సినిమాలకూ, సరదాలకూ ---- ఇంతే సంగతులు చెప్పేయాలి. నిజానికి మాధవరావు మేనమామ ఇక నుంచీ తనకేమీ డబ్బు పంపవలసిన అవసరం లేదని మాధవరావుతో చెప్పటం తను వింది. అయినా గాని ఇక్కడేదో ధనరాసులున్నట్లు ఈ మనిషి ఇంకా ఎంతో కొంత పంపాలి అని పట్టు బట్టటం అవివేకం తప్పితే మరేమీ కాదు.
    ఆ రాత్రంతా ఈ విషయమే ఆలోచిస్తూ గడిపిందామే. ఉదయానికి ఆమె ఆలోచనలు ఓ కొలిక్కి రాలేదు.
    "నేనోమాట చెప్తాను వింటారా?" మాధవరావు కాఫీ తాగుతోంటే అందామె.
    "ఎన్ని మాటలయినా సరే వింటాను."
    "ప్రతి నెలా ఏ పాతికో పరకో మీ మామయ్యగారికి పంపుతుంటే -- మనకేమీ ఇబ్బందీ -- ఆయనేకేమో ఎటూ దేనికీ చాలని మొత్తం దీని బదులు ఎప్పుడయినా ఓసారి కొంచెం పెద్ద మొత్తమే పంపితే ఆయనకూ ఉపయోగపడుతుంది. మనకూ సంతృప్తి ఉంటుంది. ఏమంటారు?" భయం భయంగానే అంది.
    మాధవరావు కొద్ది క్షణాలు ఆలోచించాడు. సీత మాటలో అనౌచిత్యం ఏమీ కనిపించ లేదతనికి. ఈ పద్దతి అద్భుతం అనిపించింది. గత కొద్ది రోజులుగా తనూ ఆలోచిస్తున్నాడు గానీ ఆ మాత్రం ఉపాయం తనకు తట్టనే లేదు. 'సీత తన కంటే తెలివయినది" అనుకొన్నాడతను. నిజంగా ఆ విషయం అతనికి అనందం కలిగించింది. తన భార్య తనకంటే తెలివి గలదయితే లాభం తనకేగా! అన్ని విషయాలకూ తనే తల పగలకొట్టు కోవాల్సిన అవసరం ఉండదు.
    'చాలా బాగుంది సీతా ఈ ఆలోచన! అలాగే చేద్దాం కాని ప్రతి నెలా ఎంతో కొంత దాయల్సిన బాధ్యత మాత్రం నీదే......"
    "అదంతా నేను చూసుకుంటానుగా......." తన మాట నెగ్గినందుకు సంతోషంతో పొంగిపోతూ అందామె.
    ఆ సాయంత్రం అతనొచ్చేలోగా ఓ తెల్ల కాగితం తీసుకొని లెక్కలు రాసి కనీసం యాభై రూపాయలు మిగిలే విధంగా బడ్జెట్ తయారు చేసింది. ఆ యాభై రూపాయలు దేనికి వినియోగించాలా అని ఆలోచిస్తూ కూర్చుంది గాని ఎటూ పాలు పోవడం లేదు. ఇంట్లో లేని వస్తువులు అవసరమయినవి. చాలా ఉన్నాయి. కాకపొతే ఏది ముందు కొనాలో ఏది తరువాతో తేల్చుకోలేక పోతోంది.
    డేకోలం మంచాలు, డ్రెస్సింగ్ టేబిల్, డైనింగ్ టేబిల్, స్టీల్ అల్మారా, సోఫా సెట్, గార్డెన్ చైర్స్ రేడియో , గోడ గడియారం, గాస్ స్టవ్ , స్కూటర్, రిఫ్రిజిరేటర్, రికార్డ్ ప్లేయర్ , ఇవన్నీ ముఖ్యంగా తనక్కావలి. వీటిల్లో ఏది ముందో ఏది వెనకో తనకేం తెలుస్తుంది?
    సాయంత్రం ఇద్దరూ షాపింగ్ కి బయల్దేరారు. మార్కెట్ లో ఓ పెద్ద షాపు ముందున్న బోర్డు మీద "ఏ వస్తువుయినా సులభ వాయిదాల పద్దతి మీద మీ స్వంతం చేసుకోండి " అన్న అక్షరాలు కనిపించాయి.
    "ఏమండీ ! అది చూశారా?" బోర్డు వంక ఉత్సాహంగా చూస్తూ అందామె.
    మాధవరావు తక్షణం బోర్డు వంక చూసి "ఎందుకు!" అన్నాడు ఆశ్చర్యంగా.
    "పదండి! వాయిదాల పద్దతి అంటున్నాడుగా! చూద్దాం అసలు" ఆమె ఉత్సాహాన్ని భంగ పరచడం ఇష్టం లేక ఆమెతో ఆ షాపులోకి నడిచాడతను.
    లోపల సీత కలలు కంటున్న వస్తువులన్నీ కన్నుల పండువుగా కనిపిస్తున్నాయి. అన్నిటి ధరలూ అడుగుతూ పోతుంటే వివరంగా ఓపిగ్గా చెప్తున్నాడు షాపు యజమాని.

 Previous Page Next Page