Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 7


    "అవన్నీ మీకనవసరం. మీ విషయమేదో మీరు చూసుకోండి? అంతే! ఇక్కడికొచ్చే వాళ్ళందరి తరపునా మీరు వకాల్తా పుచ్చుకొంటున్నారా? కావాలంటే మీరూ పాతిక కట్టి ఎమర్జన్సీలో పేర్రాయించుకోండి! లేదంటే మీ దారిన మీరు వెళ్ళి రేపు రండి..."
    "నేను కదలను ఇక్కడినుంచి! ముందావిడ సంగతేదో చూడండి!"
    రామలింగానికేం చేయాలో తోచలేదు.
    "సరే! కదలకపోతే అలాగే కూర్చోండి...నాకేమీ నష్టంలేదు. నేనెవరి బెదిరింపులకు భయపడేవాడిని కూడా కాదు..." కోపంగా అనేసి సావిత్రి వైపు తిరిగాడతను.
    "ఆ! చూడమ్మా! ఇద్దరు కుర్రాళ్ళు నిన్నటి ఉదయం నుంచీ తిరుగుతూనే వున్నారు. ఇంతవరకూ ఇంకా ఏమీ దొరికినట్లు లేదు. మీరు రేపు సాయంత్రానికొస్తే ఏదొకటి దొరికిపోతుందని నాకు నమ్మకం వుంది..." అనునయంగా అన్నాడతను.
    సావిత్రి నిరుత్సాహపడిపోయింది.
    ఒకవేళ రామలింగం ఏదయినా ఇల్లు చూపితే ఆరోజే అందులోకి మారిపోవాలన్న ఆలోచనలో ఉందామె.
    "హ్హహ్హహ్హ! ఎమర్జన్సీ పాతిక భలే పన్జేసింది రామలింగంగారూ! మీరీమాట చెప్పటానికి ఓ పాతిక చాలు కదా! పాపం ఆడపిల్ల...అవసరంలో వుందని చెప్పి పాతిక రూపాయలు కొట్టేస్తారా...?" గట్టిగా నవ్వి అన్నాడా యువకుడు.
    "ఇదిగో అలా నోటికొచ్చినట్లు మాట్లాడడం మర్యాద కాదు. ఎవర్నయినా అడగండి__! నా పరువు మర్యాదలు తెలుస్తాయ్. చూడమ్మా! అతని మాటలు పట్టించుకోకండి! ఓ రోజు వెనుకా ముందూ అవడం సహజం__ఇలాంటి విషయాల్లో!"
    సావిత్రి మారు మాట్లాడకుండా లేచి బయటికొచ్చేసి బస్ స్టాప్ లో నిలబడింది.
    మరికొద్ది క్షణాల్లో అతను కూడా వచ్చి నుంచున్నాడక్కడ.
    "చూడండి! మీరు పాతిక రూపాయలు కట్టకుండా వుంటే బావుండేది. నాకు వాడిమీద నమ్మకం పోయిందివాళ" నిస్పృహతో అన్నాడతను.
    "పోనీండి! నేనున్న పరిస్థితిలో ఎవరో ఒకరిమీద ఆధారపడటం కంటే గత్యంతరం లేదు__" దిగులుగా అందామె.
    "ఓహో! మీది కూడా నా పరిస్థితిలాగే వుంది__ సరిగ్గా వచ్చే గురువారం మా స్నేహితుడి భార్య కాపరానికొచ్చేస్తుంది. అంటే నేను బుధవారం సాయంత్రంలోగా ఆ ఇల్లు ఖాళీ చేసెయ్యాలి."
    "మీకింకా కనీసం బుధవారం వరకయినా టైముంది. నేనున్న ఇంట్లో ఎప్పుడో సమయం మించిపోయింది. గత్యంతరం లేక అక్కడే వుంటున్నాను... ఆ పరిస్థితి వల్లే పాతిక రూపాయలు అతనడగగానే కట్టివేశాను."
    అతనామె పరిస్థితికి జాలిపడ్డాడు.
    "నిజమే...నేను మగాడిని కాబట్టి ఎక్కడున్నా__ ఒకవేళ ఇల్లు లేకపోయినా వీధులెంబడి తిరిగి గడిపేయగలను. కానీ మీ పరిస్థితి అలా కాదుగా..."
    అతని మాటలు ఎంతో ఉపశమనం కలిగించాయి సావిత్రికి.
    "మీరే ఆఫీసులో పని చేస్తున్నారు?" అడిగాడతను.
    "ఛీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్."
    "మీ పేరు?"
    "సావిత్రి."
    "నా పేరు శ్రీరామ్" నవ్వుతూ అన్నాడతను.
    "తెలుసు."
    "అరే! మీకెలా తెలుసు?"
    "నిన్న రామలింగానికి పది రూపాయలు కట్టి మీ వివరాలు చెప్తుంటే విన్నాను."
    "ఐసీ! అవునవును...నిన్నేగా మీరూ వచ్చారు."
    ఈలోగా బస్ రానే వచ్చింది.
    ఆ మర్నాడు మళ్ళీ రామలింగం దగ్గరకు వెళ్ళింది సావిత్రి.
    "ఇంతవరకూ ఏమీ దొరకలేదండీ! ఇద్దరు కుర్రాళ్ళు ఇంకా మీ పనిమీదే తిరుగుతున్నారు" తేలిగ్గా అన్నాడు రామలింగం.
    సావిత్రికి కోపం కూడా వచ్చింది.
    తను నిస్సహాయస్థితిలో వుందని తన దగ్గర ఎక్కువ డబ్బు తీసుకొని ఇప్పుడు ఏవేవో కుంటిసాకులు చెప్తున్నాడు.
    "రామలింగంగారూ! ఎమర్జన్సీ ఫీజని చెప్పి డబ్బు ఎక్కువ తీసుకొన్నాడు నా దగ్గర... శ్రీరామ్ గారన్నట్లు ఇదంతా కేవలం మోసమేమో అన్న అనుమానం నాక్కూడా కలుగుతోంది... నేను మీకు ముందే చెప్పాను. మీరడిగినంత డబ్బు యిస్తాను...కాని ఇల్లు మాత్రం అర్జంటుగా కావాలని__" ఉక్రోషంగా అందామె.
    "అమ్మమ్మమ్మ...ఎంత మాటనేశారు. ఇంతవరకూ కొన్ని వేలమందికి ఇళ్ళు చూపించాను... కాని ఎవ్వరూ అంత మాటనలేదు. పోనీ ఓ పని చేయండి... పేయింగ్ గెస్ట్ గా ఉంటారా ఓ ఇంట్లో?"
    "ఊహు! వద్దు! ఇప్పుడలాంటి పద్ధతిలోనుంచే బయటపడాలనుకుంటున్నాను..."
    "ఓహో! అదీ వీల్లేదన్నమాట. పోనీ షిఫ్ట్ సిస్టమ్ ఇంట్లో ఉంటారా?"
    "షిప్ట్ సిస్టమ్ ఇళ్ళేమిటి?" ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.

 Previous Page Next Page