పరమేశ్వరమూర్తి రాజారావును సామర్లకోట స్టేషనులో కాకినాడ బండి నెక్కించి, తానుబోయి మరల మెయిలులో గూర్చుండినాడు. పరమేశ్వరమూర్తి పలుచని శరీరము, సొగసైన కన్నులు, పసిమిపచ్చరంగున గలియుటకు యత్నించు చామనచాయ, చీలిక గడ్డము, సమఫాలము, సన్నని పెదవులు, లెక్క పెట్టుటకు వీలున్న నల్లని మీసములు గలవాడు. చిన్న చెవులు, సన్నని పొడుగాటి కంఠము, విస్పారితము గాని భుజస్కంధము, గుండ్రని నున్నని కరములు, చిన్న చేతులు గల అతని కోమల శరీరమున నాడు దనముట్టిపడుచుండును. ఈతలో ప్రథమ బహుమానమంది పోటుమానిసి యనిపించుకొను టొక్కటియే యాతని స్త్రీత్వమునకు దీరనికొఱత తెచ్చి పెట్టినది.
సహజ పంచమాస్వనమున గంఠము తేనెలూర సంగీతము పాడుకొనును. నిత్య నవీనములై ఆర్ద్రములైన ప్రకృతి విలాసము లాతని ధ్యానసముద్రలో వికసించి మురిపించును.
ప్రకృతి యాతని యాలోచనాశక్తిని ప్రొవిసేయు పెంపుడుతల్లి. ప్రకృతిలోనే మార్పును జూచినను అతని హృదయము చలించిపోవును. సృష్టిలో ప్రతి పదార్ధమును పరమేశ్వరమూర్తికి మేరుపర్వత సమానమై గోచరించును. దృశ్యమానములగు ప్రకృతి వికారము లెల్ల, కాలనాతికారంగములుగా ప్రత్యక్షమై, యాతనిని వివిధ వికారములకు లోనుజేయును.
పరమేశ్వరమూర్తికి ప్రాపంచినమైన వ్యవహార పథము లపరిచితములు. అతని నావరించియున్న సహజ పాండిత్యమే యతనికి బరీక్షలలో జయము గొనితెచ్చి యతనికే యాశ్చర్యము గొల్పుచుండును.
ప్రాణస్నేహితుడగు నారాయణరావువలె పరమేశ్వరమూర్తి గూడ సౌందర్యోపాసకుడు. అపశ్రుతియన్న యాతని హృదయము తటతట కొట్టుకొని విహ్వలించును. ఒక నాడాతడు స్నేహితుని ఇంటికి బోయి, చక్కగా నలంకరించియున్న యాతని గదిని చూచెను. తెల్లనిగోడల పైన నచ్చటచ్చట ప్రఖ్యాత భారతీయ చిత్రకారుల ప్రసిద్ధ చిత్రాల ప్రతులు అలంకరింపబడియున్నవి. ద్వారములకు గవాక్షములకు ఖద్దరుపై మనోహరవర్ణములు చిత్రించిన మచిలీపట్టణపు, పంజాబ్ దేశపు కలంకారీ అద్దకపు దొరలు వ్రేలాడదీసియున్నవి. శోభాయమానమగు నా మందిరములో నొక యెడ దగిలించియుంచిన క్యాలెండరు బొమ్మను గాంచి, పరమేశ్వరుడు వణికిపోయినాడు. అతని కంటిలో రాక్షసి బొగ్గునలక పడినట్లయినది. పంటి క్రింద నిసుక రేణువులు నమలినట్లయినది.
పరమేశ్వరమూర్తికి జిన్నతనములో వివాహమైనది. అతడెంత రసగ్రహణ పారీణుడో యతని భార్య యంత నిష్కళా హృదయ. ఆమెకు సౌందర్యమన్ననేమో తెలియదు. అలంకరించుకొనుట యంతకుమున్నే యెరుగదు. ఆమె యచ్చపు గృహిణి. గృహకృత్యము లవలీలగ నెరవేర్చును. ఉదయమున లేచినది మొదలు రాత్రి భర్తను జేరువరకు నామె యొక క్షణమైనా తీరుబడి లేక మధుపము వలె బని చేయుచుండును. వంట ఇల్లుకి ముగ్గులు పెట్టును. కూరలు తరగును, బియ్యము కడిగిఇచ్చును. రాత్రి తానే మడికట్టుకొనును. ఆడబిడ్డలెవరైనా వచ్చినచో వారి పిల్లలకు నన్నియు నమర్చును.
రూప రేఖావిలాసముల కామె నోచుకొనకున్నను, ఆమెలో నొక వింత యందము తొలుకాడుచుండును. ఆమె కన్నులద్బుతములు. నిష్కపటమై శాంతి పూర్ణమగు నామె హృదయ మా కన్నులలో ప్రతిఫలించును. అవి వెడదలై నల్లనై, దీర్ఘపక్ష్మముల వితానము క్రింద బ్రేమమున నడయాడుచుండును.
ఆమె పతిప్రాణయయ్యు హావభావవిలాసములచే భర్త హృదయమును రంజింపజేయుటకై యత్నింపదు. పరమేశ్వరమూర్తి యామెను ప్రక్క పాపట తీసి కీలుజడ యల్లుకొనుమని కోరును. లేనిచో మధ్యపాపట తీసి బొంబాయి ముడి ముడుచుకొమ్మని కోరును. మోమున కంగరాగము లలదుకొమ్మనును. తెల్లచీరలు ధరింపుమనును. 'వంగపండుచాయ వస్త్రములు రాత్రివేళ దేహమును విచిత్రముగ శోభింపజేయును' అని భార్యతో వాదించును.
ఆ మాటలకు రుక్మిణి చిరునవ్వు నవ్వుకొనును. అంతమాత్రమే! అతని కోర్కెల పరిపాలించుట నాటక స్త్రీలకు జెల్లును గాని సంసారులకు గాదని యామె యూహ.
పరమేశ్వరమూర్తి పిఠాపురము జేరి యింటి కేగునప్పటికి రుక్మిణి మోము ప్రఫుల్లమయినది. ఆమె నయనముల దివ్యకాంతులు ప్రసరించినవి.
తనతోగూడ గదిలోనికి వచ్చిన భార్యను కౌగిలించుకొని ముద్దిడుకొన్నాడు. అచ్చట నెవ్వరు లేకపోయినను రుక్మిణి సిగ్గుపడి 'అబ్బా, మీకెప్పుడూ ఇలాంటి పనులేనండి' యన్నది.
'నా ప్రేమ నాపలేక అలా చేశాను. నేను రాసిన యెనిమిది ఉత్తరాలకూ నువ్వు రెండుత్తరాలు జవాబు రాస్తావు. నీది కటిక హృదయం రుక్మిణీ! మూడు నెలలు విరహ వేదన పడ్డానే! నీ బొమ్మే నాకు దిక్కా! ఎన్నాళ్లు నీకు ప్రణయ విలాసాన్ని నేర్పినా పూర్వకాలపు పునిస్త్రీవే కదా నువ్వు!'
'నేనేం చేయనండి! అత్తగారికి తెలుస్తుందేమోనన్న భయం. ఆ రెండుత్తరాలేనా పనిదాని చేత రహస్యంగా కవర్లు తెప్పించి రాశాను.'
'పైగా ఆ రాతేమిటి! ఎవరికి రాసిందో తెలీదు. ఏవో రెండుముక్కలు గిలికితే ఉత్తరం అవుతుందా!' ఆమె తెల్లబోయి భర్తవంక జూచినది.
'పోనీలే. ఇదేమిటి? ఈ గది ఇలా ఉంచావు? గదిని అలంకరించడం జన్మ నలంకరించుకోవడమే అని చెప్పలేదూ నేను! మరి ఈ సామాను కొట్టేమిటి?'
'మీరు దూరాన ఉంటే నాకెందుండీ! ఎల్లాగండీ గది అలంకరించుకొని కూర్చునేది?'
'పోనీలే' యని పరమేశ్వరుడు రుక్మిణిని మరల తన హృదయమునకు హత్తుకొని 'ఒక ముద్ది'మ్మనియెను. ఆమె లజ్జారుణవదనయై యిటు నటు చూచి నాథుని పెదవుల తన పెదవుల నొక్కి, 'వస్తా'నని ఇంటిలోనికి మాయమైనది.
పరమేశ్వరమూర్తి శ్రుత్యపశ్రుతులు వెలుగు నీడలవంటివని యెఱుగును. ఎంత విచిత్రమగు శ్రుతి నీ వాపాదించుకొనగలవో యంత యపశ్రుతి వెన్నంటి గోచరించుచునే యుండును. రూపెత్తిన తన యాశయమై, పులకరాలు గలుగజేయు బాలిక భార్యయైనదని సంతసింతమన్న నామె తన్ను ప్రేమింపకయైన పోవును. లేదా కర్కశహృదయయైన నగును. పరిపూర్ణత యెక్కడిదీ సృష్టిలో!
తల్లిదండ్రులతో ముచ్చటలాడి, పుట్టింటికి బిడ్డలతో వచ్చియున్న చెల్లెలితో మృదూక్తులాడి బిడ్డలనాడించి, పట్టణము నుంచికొని తెచ్చిన బహుమతులెవరివి వారికిచ్చి, భోజనమాచరించి, నిదురబోయి లేచి, పరమేశ్వరుడు గది నలంకరించుకొన మొదలిడినాడు.
వచ్చిన నాటి రెండవరోజున పరమేశ్వరునకు నారాయణకడనుండి కమ్మ వచ్చినది.
'ఓరి పరమం! నా హృదయానికి ఎంతో దగ్గిర ఉన్న కవిరాజూ! విను, ఆ బాలిక సౌందర్యం అసలు శారదకు లేదు. నన్నూ, నా హృదయాన్నీ, నా ఆత్మనీ తనలో పెనవేసుకుంది. తనలో ఐక్యం చేసుకుంది. మా చిత్రకార మండలిలో ఆమె బొమ్మ చిత్రించడానికి ఒక్కరికైనా కుంచె నడవదోయి. ఆమె శరీర సౌష్ఠవము విడివడబోయే మల్లెమొగ్గల పోగేరా! ఆమె కళ్ళల్లో కథలు నర్తించాయి. జమీందారుగారితో కూడా వచ్చాడే, ఆయన శ్రీనివాసరావు గారు ఆ ఊళ్ళోకల్లా మంచి ప్లీడరు. ఆయన ఇంటిదగ్గర నుంచి వెళ్ళాం జమీందారు గారి ఇంటికి. ఆయన 'పిల్ల నచ్చిందా' అని అడిగాడు. నచ్చిందని చెప్పటానికి నేను తగుదునురా పరమం! ఆ బంగారుపోత విగ్రహానికి, ఆ పువ్వుల ప్రోవుకు, ఆ దివ్య బాలికామణికి నేను తగుదునా పల్లెటూరి బండమనిషిని! నువ్వు రైలులోనే జమీందారు గారి ఉద్దేశం గ్రహించావుకదా! మన వాళ్ళందరూ అదే గ్రహించారు. నాకూ నిముషంలో అవగాహన అయింది. అప్పటినుండీ నాకు ఒకటే సిగ్గు. వారి అమ్మాయికి ఇంతవరకు పెళ్ళి చేయకుండా ఉంచింది నా యీ కర్కశ పురుషత్వానికి బలి ఇవ్వడానికేమో! 'తప్పక సంబంధం నిశ్చయం అవుతుంది. నువ్వు వివాహానికి నీ భార్యతో రావాలి. అమ్మగారినీ నాన్నగారినీ అన్నదమ్ములను బావగారిని చెల్లెలిని నువ్వు నాకోసం బలవంతపెట్టి తీసుకు రాగలిగితే నీకు నేనేమివ్వగలనురా? తలుపు దగ్గర పాట నిన్ను పాడనిస్తా.
'సర్వకాలాల ఆ బాలిక నాకు ప్రత్యక్షమవుతోంది. నన్ను ఒక విచిత్రానందం అలుముకుపోయినట్లుగా ఉన్నదోయీ!
'ఇలా ఉండగా ఒక భయము నన్ను ఆవేశించింది. మా వ్యాపారములు చాలా బాగానే ఉన్నాయి. మేమూ కొంచెం భాగ్యవంతులమనే చెప్పాలి కదా! అయినప్పటికీ బాలిక జమిందారీ కుటుంబంలో జన్మించింది. రాజభోగములో పెరిగింది. రాచ ఠీవి ఆమెలో పుంజీభవించి ఉంటుంది. ఉంటే యీ సామాన్య సంసారంతో ఆమె కలయిక మా జీవితానికి విషాదాంతం అవుతుందేమో!