"థాంక్యూ వదినా" అంటూ ఉషారుగా ఈలవేసుకుంటూ బయటికెళ్ళిపోయాడు.
3
మధ్యాహ్నం మూడయి వుంటుంది. విజయ్ ఆఫీసుకెళ్ళాడు. వినోద్ ఇన్ స్టిట్యూట్ కి, మాధురి కాలేజీకి వెళ్ళారు. సుశీలమ్మగారూ, ప్రసాదరావు లోపల గదిలో నిద్రపోతున్నారు.
సుజాత తమ బెడ్ రూంలోనే ఓ ప్రక్కన వున్న కుట్టు మిషన్ ముందు కూర్చుని జాకెట్ కత్తిరించుకుంటూ, కుట్టుకునే ప్రయత్నాలు చేసుకుంటోంది.
ఇంతలో సుజాతగారూ! సుజాతగారూ" అని బయట్నుంచి ఓ ఆడకంఠం వినిపించింది.
ఇవతల కొచ్చింది.
గేటు అవతల ఓ స్త్రీ నిలబడి వుంది. సుజాత వెంటనే గుర్తుపట్టింది. తమ ప్రక్కభాగంలో అద్దెకుంటున్న వాళ్ళు.
వెళ్ళి గేటుతీసి "లోపలకు రండి" అన్నది.
ఆ స్త్రీ లోపలికొచ్చింది. ముప్ఫయి అయిదేళ్ళుంటాయి. అందగత్తెల కోవలోకే వస్తుంది. అందంతోబాటు, అలంకరణకు ప్రాధాన్యతనిచ్చే మనిషిలా కనబడుతోంది.
"కూచోండి" అంది సుజాత మర్యాదగా.
ఆమె ఫేము కుర్చీలో ఆశీనురాలవుతూ "నా పేరు రాధాప్రియ మీకు కుడివైపు ప్రక్క పోర్షన్ లో ఉంటాను. చూసే ఉంటారనుకోండి" అంది.
"చూశానండి" అంది సుజాత.
"మీరీ ఇంట్లోకొచ్చి పదిహేనురోజులయినా మనకిద్దరికీ పరిచయం కలగలేదు" అంది రాధాప్రియ.
సుజాత నవ్వి "ప్రక్క ప్రక్కన ఉంటూన్నప్పుడు ఒకరోజు అటు యిటుగా పరిచయం కాకుండా ఎలా ఉంటుంది లెండి" అన్నది.
రేపు మా యింట్లో పంక్తి వుంది. ఆహ్వానించటానికొచ్చాను అంది రాధాప్రియ.
"పంక్తి" అంటే అన్నట్లు చూసింది సుజాత.
"మా అమ్మాయి పెద్దమనిషయింది. అందుకని పేరంటం" అని విడమర్చి చెప్పింది రాధాప్రియ.
"ప్రకృతి స్వభావంగా, వయసొస్తున్నప్పుడూ సహజంగా జరిగే ఈ శరీర ధర్మానికి ఇంత ప్రాముఖ్యత, పబ్లిసిటీ అవసరమంటారా?" అనడిగింది సుజాత.
"అదేమిటండీ అలా అంటారు? మన పెద్దలు ఇవన్నీ వూరికినే పెట్టారంటారా?" అన్నది రాధాప్రియ శాస్త్రాలన్నీ కాచి వడబోసినట్లు.
"నేనెప్పుడూ శాస్త్రాలు చదువుకోలేదనుకోండి. పోనీ పాతరోజులు పోనివ్వండి. ఇప్పటి నాగరికత ప్రకారం, ధరలు ఆకాశనికంటుతూన్న ఈ రోజుల్లో...యిలాంటి వాటికి అంత ప్రాచుర్యమివ్వనవసరం లేదని నా ఉద్దేశ్యం."
"అలా అనకండి. ధరలు మండిపోతున్నాయని మనం తినటం మానేస్తున్నామా? శుభ్రమైన బట్టలు కట్టుకోవడం మానేస్తున్నామా? మొగాడికి పుట్టిన నక్షత్రం, ఆడదానికి రజస్వలయిన నక్షత్రం, ఆయా గ్రహబలాలు చాలా ముఖ్యం. మీరు పంచాంగాలు చూడలేదు, నక్షత్ర దోషం ఉంటే అనేక దోషాలు కలుగుతాయి. అందుకని శాంతులు జరిపి పేరంటాలు అవీ చేసి అమ్మలక్కల ఆశీర్వాదం ఉండాలి."
సుజాతకు అఖ్కర్లేని విషయాల్లో ఎవరితోనూ వాదన పెంచుకోవట మిష్టం లేదు.
"వస్తాలెండి"
ఇహ వెళ్ళిపోతుందేమోననుకుంది. బొట్టుపెట్టి మళ్ళీ బైటాయించింది. ఇప్పుడప్పుడే వదిలే సూచనలు కనబడటం లేదు.
"అవునూ. మీ ఇల్లంతా కామ్ గా వుందేమిటి?" అనడిగింది రాధాప్రియ.
"ఈ టైములో కామ్ గా ఎందుకుండదు. మొగవాళ్ళు ఆఫీసుల కెళతారు. పిల్లలు కాలేజీకి వెళతారు.
"ఇంట్లో మీ అత్తగారూ! మావగారూ వున్నట్లున్నారు?"
"వాళ్ళు నిద్రపోతూ రెస్టు తీసుకుంటున్నారు?"
"మీకు కోపం రాదంటే ఓ విషయం చెబుతాను."
"చెప్పండి."
"మీ అత్తగారు చాలా గడుసుదనుకుంటాను. తియ్య తియ్యగా మాట్లాడుతూ యింట్లో పనంతా మీతో చేయిస్తుంది."
సుజాతలో ఓ విశేషముంది. తనకు సుముఖత్వం లేని మాటలు యితరులు మాట్లాడుతున్నా ఎంతో అవసరమొస్తేనేగాని ఇరిటేట్ అవ్వదు. సాధ్యమైనంత నిగ్రహం ప్రదర్శిస్తూ క్లుప్తంగా జవాబులు చెబుతుంది.
"మా అత్తగారు గడుసుది కాదు. అత్తగారూ, మావగారూ మంచివాళ్ళే కాకుండా, అమాయకులు కూడా. ఆవిడ ఆరోగ్యం కూడా అంతమంచిది కాదు. ఇంటిలో తన పనులన్నీ స్వయంగా చూసుకోవటం యింటి కోడలుగా నా బాధ్యత"
"మీరు మరీ పాతకాలం మనుషుల్లా వున్నారు."
సుజాత నవ్వి వూరుకుంది.
"రాధాప్రియ ఆమెతో మాట్లాడుతూనే కళ్ళని అటూ యిటూ త్రిప్పుతూ యింట్లో ఏమేమి వస్తువులున్నాయో చురుగ్గా గమనిస్తోంది."
"అవునూ, అంట్లు తోమటానికి పనిమనిషి పెట్టుకున్నట్టుగా లేదే" అనడిగింది.
"మా యింట్లో ఎంతపని వుందని పనిమనిషి కావాలండి? ఇప్పటిరోజుల్లో పనిమనుషుల జీతాలు భారీగా అడుగుతారు కానీ, సరిగ్గా పనిచెయ్యరు."
"నిజమేననుకోండి. కాని అన్ని పనులూ మనం చేసుకోలేం కదా"
"అన్నిపనులూ కాకపోయినా చాలావరకూ చేసుకోవచ్చు. బట్టలు కూడా నేనే ఉతికి, చేతనైనంతవరకూ పనిచేస్తాను, అసలు యిప్పటిరోజుల్లో ఈ గ్యాస్ స్టవ్ లూ అవీ వచ్చాక మనకున్నపని ఎంతండి? ఈ పనులన్నీ నిదానంగా చేసుకుంటూ పోతే టైము గడిచిపోతుంది. తోచటం లేదన్న బాధా వుండదు."
రాధాప్రియ లోలోపల మండిపడుతోంది. "చాల్లే వెధవ గొప్పలూ నువ్వూనూ, అనుకుంటూ బయటకు మాత్రం చిరునవ్వు ప్రదర్శిస్తూ యాక్షన్ చేస్తోంది.
"మీ ఆడపడుచుకు కొంచెం అతిభయమనుకుంటా. మీకు ఇంటి పనుల్లో సాయపడకపోగా, ఎవ్వరితోనూ కలివిడిగా కూడా ఉండదు."