"అంటే రోజుకో బస్ స్టాప్ చొప్పున వెతికితే మూడేళ్ళు పడుతుందా?" అన్నాడు నిరాశగా.
"మూడేళ్ళు పెద్ద ఎక్కువేమీ కాదు! అదేదో నవల్లో హీరో తను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం ముప్ఫయ్ ఏళ్ళు తిరుగుతాడు. అప్పటికా అమ్మాయి బాగా ముసల్ది అయిపోయి కర్రసాయంతో నడుస్తూంటుంది. దాంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటాడు. కనుక" భోజనం ముగించి మళ్ళీ మంచంమీద వాలిపోయాడతను.
"విష్ యూ బెస్టాఫ్ లక్" అనేసి గుర్రుపెట్టేసి నిద్రపోసాగాడు.
భవానీశంకర్ బట్టలు మార్చుకుని నేలమీద దుప్పటి పరచుకుని నిద్రలోకి జారిపోయాడు. తిరిగి మెలకువ వచ్చేసరికి ఉదయం ఎనిమిది అయిపోయింది. మంచంమీద భరద్వాజ్ కనిపించలేదు. బాత్ రూంలోనూ లేడు.
లేచి టూత్ బ్రష్ కోసం సూట్ కేస్ దగ్గర కెళ్ళాడతను. కానీ సూట్ కేస్ కూడా ఎక్కడా కనిపించలేదు. ఆశ్చర్యపోయి గదంతా వెతికాడు. సూట్ కేస్ తో పాటు తను రాత్రి హాంగర్ కి తగిలించిన బట్టలు కూడా లేవు. టేబుల్ మీద గాజుగ్లాసు కింద ఓ కాగితం రెపరెపలాడుతోంది గాలికి. దానికింద తను భద్రంగా దాచుకున్న అమ్మాయి బొమ్మ_ఆ కాగితం చేతిలోకి తీసుకున్నాడు.
"మైడియర్ బ్రదర్!
బిజినెస్ కాపిటల్ కి డబ్బు చాలక నీ సూట్ కేస్ లో కాష్ పట్టుకెళ్తున్నాను. బట్టలు కూడా నాకు చాలా తక్కువగా ఉండటం వల్ల నీ బట్టలన్నీ తీసుకెళుతున్నాను. ఇందువల్ల నీకేమీ ట్రబులుండదని నాకు తెలుసు. ఎందుకంటే మీ బంగారయ్య మావయ్య ఓ బంగారు పిచ్చుక కదా! ఓ టెలిగ్రాం పట్టుకుని ఆయన్ని బాదితే_అరడజను మనీయార్డర్లు రాల్తాయ్! నీ రుణం వీలయినంత త్వరలో తీర్చుకుంటాను. అంతవరకూ శెలవ్_నీ ప్రాణమిత్రుడు భరద్వాజ్.
షరా : నీ ప్రియురాలి ఫోటోవున్న ఆ పత్రిక పేజీ మాత్రం నీకే వదలివెడుతున్నాను. ఆ పిల్లను వెతుక్కోడానికి అది నీకు చాలా అవసరం కదా! విష్ యూ గుడ్ లక్!
భవానీశంకర్ భయంగా తన వంటిమీద బట్టలు చూచుకున్నాడు. బనీనూ_చారల పైజమా అవే మిగిలాయి కొద్దిసేపు ఏమి చేయటానికీ తోచలేదు. ముందు హోటల్ ఖాళీ చేసేసి ఎక్కడయినా రూమ్ తీసుకోవాలి. ఓ జతయినా రెడీమేడ్ డ్రస్ తీసుకోవాలి. ఈ రెండింటికి కనీసం నాలుగయిదువందలయినా కావాలి. మావయ్యకు టెలిగ్రామిచ్చినా, అరచి గీపెట్టినా_ఒక పైసకూడా పంపడు. ఇప్పుడేమిటి చేయటం? ఎవరున్నారిక్కడ తనకు సహాయం చేయడానికి? హఠాత్తుగా దీపక్ గుర్తుకొచ్చాడతనికి. వాడు ఇక్కడే మారిస్ బిస్కెట్ ఫాక్టరీలో పనిచేస్తున్నాడట! తనూ వాడూ క్లాస్ మేట్సే కాదు. ఆఖరి బెంచ్ మేట్స్ కూడా! వాడొక్కడే తనకు ప్రస్తుతం దిక్కు. హోటల్ లో మేనేజర్ దగ్గరకు నడిచాడతను.
"రూమ్ ఖాళీ చేస్తున్నాను."
అతను భవానీశంకర్ డ్రస్ వేపు విచిత్రంగా చూసి_లెక్కచూసి ముప్పయ్ రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. భవానీశంకర్ రోడ్డుమీద కెళ్తోంటే "సార్ మీ డ్రస్సూ, లగేజి..." అంటూ ఏదో చెప్పబోయాడతను.
భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు.
"ఇదే లేటెస్ట్ ఫాషన్ బ్రదర్ బనీనూ_పైజమా"
మేనేజర్ తనలోతను నవ్వుకున్నాడు "ఇది మెంటల్ కేస్" అనుకున్నాడు.
* * * *
దీపక్ కి అప్పుడే రాత్రి పట్టించిన మందు ప్రభావం తగ్గటం మొదలుపెట్టింది. అది పూర్తిగా తగ్గుతేనేకానీ అతనికి జ్ఞాపకశక్తి పూర్తిగా చేకూరదు. రాత్రుళ్ళు మందు ఎక్కువగా కొట్టేస్తే మర్నాడు ఆఫీస్ విషయం కూడా మర్చిపోయి ఎక్కడెక్కడో ఇంటికి చేరుకున్న రోజులున్నాయ్.
త్వరగా రడీ అయి ఫాక్టరీకి చేరుకున్నాడతను. ఫాక్టరీ బిల్డింగ్ గేటు దగ్గర వాచ్ మెన్ అన్నీ ఎక్కడో, ఎప్పుడో చూసినట్లు గుర్తుకొస్తున్నాయ్. తన రూమ్ కెళ్ళి కూర్చున్నాడతను. బెల్ కొట్టి బాయ్ ని పిలిచాడు.
"యస్సార్" పరుగుతో వచ్చాడు బాయ్.
"నేను కూర్చుంది నా రూమ్ లోనేనా?" అడిగాడు దీపక్ అనుమానంగా.
"అవున్సార్!"
"అయితే ఓ.కె. నువ్వు వెంటనే ఓ అనాసిన్ టాబ్ లెట్, ఓ కాఫీ తీసుకురా"
"రడీగానే ఉన్నాయి సార్"
"రడీగా ఉన్నాయా?"
"అవున్సార్!"
"అవి నాక్కావాలని నీకెలా తెలుసు?"
"రాగానే ఆ రెండూ మీకివ్వాలని మీరే రోజూ చెప్తుంటారు సార్__"
"ఐసీ_ఓ కే_ ఓ కే_" అంటూ అనాసిన్ నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగబోతూ గోడవంక చూసి ఉలిక్కిపడ్డాడు.
"బాయ్"
"యస్సార్?"
"అదేమిటక్కడ? ఏదో చిలుక లోపలికొచ్చి వాలినట్లుంది"
"చిలుక బొమ్మ సార్! అలంకారం కోసం అలా పెట్టారు"
"ఎప్పుడు?"
"అయిదారు నెలలయిందండి అలాంటివి అన్ని గదుల్లోనూ పెట్టి_"
"మరి నాకెప్పుడూ కనిపించలేదేం?"
"మీరు రోజూ అడుగుతూనే ఉన్నారండి దాన్ని గురించి"
దీపక్ కాఫీ తాగేశాడు. నెమ్మది నెమ్మదిగా స్పృహలో కొచ్చేస్తున్నట్లనిపిస్తోందతనికి.
అప్పుడే ఫోన్ మోగింది.
"హలో! దీపక్ హియర్!"
"మీకోసం భవానీశంకర్ అనే అతను వచ్చాడండి"
"భవానీశంకరా?"
"యస్సార్"
"భవానీశంకర్_భవానీశంకర్" అని అరడజను సార్లనుకున్నాడతను. ఆ పేరు ఎక్కడో విన్నట్లే వుంది.
"ఆల్ రైట్ రమ్మను"
మరికొద్ది క్షణాల్లో గదిలోకి భవానీశంకర్ అడుగుపెట్టాడు.
"హలో__హలో__దీపక్! హౌ ఆర్ యూ ఫ్రెండ్! చాలా రోజుల తరువాత కలుసుకున్నాం" అతనితో చేతులు కలిపాడు భవానీశంకర్.
దీపక్ అతని డ్రస్ వంక తేరిపారచూశాడు తరువాత భవానీశంకర్ మొఖంవంక గుచ్చిచూశాడు. క్రమేపీ గుర్తుకొచ్చేసింది. వాడు తన క్లాస్ మేట్!
"హలో భవానీ! నువ్వా?"
"యస్ ఫ్రెండ్! నేనే!"
"ఇంకెవరో అనుకుంటున్నాను"
"కాదు గురూ! నేనే! ఓల్డు క్లాస్ మేట్ అండ్ బెంచ్ మేట్"
"లాస్ట్ బెంచ్ మేట్స్" మరిన్ని వివరాలు గుర్తుకొచ్చేస్తున్నాయ్ నిషా పూర్తిగా దిగిపోతున్నకొద్ది.
"ప్రతి శుక్రవారం ఫిజిక్స్ ప్రాక్టికల్ క్లాస్ ఎగ్గొట్టి ఇంగ్లీష్ పిక్చర్ కెళ్తూండేవాళ్ళం"
"కరెక్ట్! కరెక్ట్! ఎప్పుడొచ్చావ్ హైద్రాబాద్ కి?"
"నిన్నే! దేవతా పబ్లికేషన్స్ లో ఉద్యోగం వచ్చింది."
"గుడ్! బావుంది!" అంటూ మరోసారి భవానీశంకర్ వేసుకున్న బనీనూ చారల పైజమావేపు చూశాడు. "బైదిబై నీకు భరద్వాజ్ కలిశాడా?"
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు. "నీకెలా తెలుసు"
"నీ పైజమా బనీను చూసి!"
"అంటే వాడి సంగతి నీకూ తెలుసా?"
"ఓసారి నేనూ పైజమా బనీనుతో తిరిగాక తెలిసింది"
"అంటే నీ బట్టలూ, డబ్బూ కూడా"
"కొట్టేశాడు"