Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 7


    "సానుభూతా?"
    "కాదు! నీకున్న విజ్ఞానానికీ, క్వాలిఫికేషన్ కీ, తగిన ఉద్యోగం చూపించడంలో స్నేహితురాలిగా...." అని ఆగి "చేసే చిన్న సహాయం."
    సాగర్ మనసు తీవ్రంగా చలించింది.... ఈ మలుపు తాను కలలో కూడా ఊహించనిది.
    శృతి_ తన సర్వస్వమూ కావాలని తాను కాంక్షించిన తన శృతి_
    తాను తన అణువణువునా నింపుకొన్న తన శృతి__
    ఇలా ఇన్నాళ్ళకి తనకి హఠాత్తుగా కనబడి తన జీవితంలోని స్వర్గానికి తలుపు తెరుస్తుందని తను అనుకోకపోవడంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. అతనిలోని అణువణువు ఆమెను దగ్గరికి తీసుకుని తలను గుండెకు హత్తుకుని నుదురు చుంబించాలని తహతాహలాడింది.
    లంచ్ వచ్చింది. పూరీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుని నవులుతూ చెప్పింది శృతి.
    "ఇందాక షాక్ తిన్నాను సాగర్. నా క్లాస్ మేట్_ అందునా ఓ బ్రిలియంట్ స్టూడెంట్, అన్నింటినీ మించి నాకు చాలా కావలసిన వ్యక్తి...."
    నోట్లోని పదార్ధాన్ని మింగి మంచినీళ్ళో గుటక త్రాగి కొనసాగించింది,
    "ఆ రకంగా ఓ చిన్న హోటల్ లో బేరర్ గా.... ఇది నేను భరించగలనా? అందుకే చెప్తున్నాను వచ్చెయ్యి సాగర్."    
    సాగర్ మాట్లాడలేదు.
    "ఒక్కసారి మీ అమ్మగారి గురించి ఆలోచించు సాగర్....నీకోసం రెక్కలు ముక్కలు చేసుకొందావిడ. కనీసం ఇప్పటికైనా ఆవిణ్ణి పూర్తిగా సుఖపెట్టడం నీ బాధ్యత."
    గంభీరంగా మారాడు సాగర్.... "అమ్మ లేదు శృతీ.... పోయి సంవత్సరం అయింది...."
    "ఓ.... ఐయామ్ సారీ సాగర్."
    ఆ తరువాత ఇద్దరూ మౌనంగా భోజనం కానిచ్చారు. చేయి కడిగి వచ్చి కూర్చుని కర్చీఫ్ తీసి మూతి తుడుచుకుంటూ అడిగాడు సాగర్.
    "ఇదంతా కేవలం ఓ క్లాస్ మేట్ అనే ఉద్దేశంతోనే చేస్తున్నావా శృతీ?"
    అతనికేసి తదేకంగా ఓ నిమిషంపాటు చూసింది శృతి. ఆమె కళ్ళల్లో ఎన్నో భావాలు కన్పించాయి సాగర్ కి.
    "ఇందాక నీకు చాలా కావలసిన వ్యక్తినన్నావ్. అంటే ఏ రకంగా శృతీ?"
    వణుకుతున్న కంఠంతో చిన్నగా అడిగాడు.
    అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది శృతి. "మూడు సంవత్సరాల పరిచయంలో ఏ రకంగానో ఇంకా నీకు తెలియదా?"
    ఆ తరువాత వారం రోజులలోగా 'అక్షయ గ్రూప్'లోని ఇన్వెస్ట్ మెంట్స్ డివిజన్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేరిపోయాడు.
    జాయినింగ్ రిపోర్టిచ్చి ఇంటికొచ్చాడు.
    అంతకు ముందురోజే ఆ ఇల్లు చూసి పెట్టింది శృతి.
    సంతోష్ నగర్ కాలనీలో రోడ్డుకి ఓ మూలగా వున్న ఇల్లది. తలుపు తీసి లోపలికి అడుగుపెట్టాడు సాగర్.
    అతని మనసు ప్రశాంతంగా వుంది.
    శృతి చెప్పినట్టే చేశాడతను.
    ఎక్కడా శృతి మూలంగా తనకా వుద్యోగం దొరుకుతున్న విషయం ఎత్తలేదతను. అందరికీ జరిగినట్టుగానే అతనికీ ఇంటర్వ్యూ జరిగింది. అయితే శృతి రికమెండేషన్ గుప్తంగానే ఉండిపోయింది. ఆ రకంగా తన ఇంపార్టెన్స్ తగ్గించుకున్న శృతిపైన ఆ క్షణం నుండి గౌరవం పెరిగింది. స్నానంచేసి న్యూస్ పేపర్ తిరగేస్తూండగా వచ్చింది శృతి.
    "జాయిన్ అయ్యావా?"
    "ఈ రోజు ప్రొద్దున్నే...."
    "కంగ్రాట్స్.... స్వీట్సేవి?"
    "ఉండు...." లోపలికెళ్ళి తాను హోటల్లో కొన్న కోవాబిళ్ళలు తెచ్చాడు సాగర్.
    "అందరికీ ఇచ్చేవే నాక్కూడానేంటి?"
    అయోమయంగా చూశాడు.
    "అయ్యో....మొద్దూ.... అలా చూస్తావేం? నాకూ ఈ స్వీట్సే ఇవ్వాలనిపించిందా అనడుగుతున్నాను."
    "సరే.... అయితే పద. బయటకెళదాం. బ్రహ్మాండమైన డిన్నర్ ఇస్తా."
    "అంతేనా? జీవితంలో స్వీట్స్, డిన్నర్ తప్ప_ మగ ఆడ మధ్య ఇంకేమీ ఉండవా?"
    "అంటే?"
    "మన స్నేహం కేవలం డిన్నర్ స్నేహమేనా అని?"
    హఠాత్తుగా తనముందు హృదయాన్ని పరచి ఇన్నేళ్ళూ తనలో రగుల్కొంటున్న అగ్నిపై ఒక్కసారిగా ఆమె పన్నీరు చిలికించేసరికి అవాక్కై నిలబడ్డాడో క్షణం సాగర్.
    తరువాత సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు.
    ఆమె కొంటెగా చూసిందతనివైపు.
    క్షణాలు దొర్లిపోయాయలా.
    ఆమెను సమీపించాడు.
    "కాదు శృతీ.... మన స్నేహం డిన్నర్ స్నేహం మాత్రమేకాదు." గొణిగాడు.
    అనుకోకుండా అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది.
    ఆమె చేతినందుకున్నాడు.
    "శృతీ.... ఐ లవ్ యూ" ఆవేశంగా చెప్పాడు.
    "ఐ టూ...." అందామె.
    ఆమె కళ్ళల్లో ఏవో అపురూపమైన భావాల్ని చదివాడు.
    అప్రయత్నంగా అతని చెయ్యి ఆమె నడుంచుట్టూ బిగిసుకొంది.
    ఎంతో ఆవేశంగా ఆమెను చుంబించాడతను పెదాలపైన. అలా చాలాసేపు ఉండిపోయారిద్దరూ.
    క్రమంగా ఎంతో కాలంగా మనసులో అట్టడుగునా, శరీరంలోని అణువణువునా దాగి నిద్రిస్తున్న ఏదో తృష్ణబలం పుంజుకోసాగింది.
    బలహీనమైన శృతి వ్యతిరేకత బలమైన ఆమె కోరికకి తల ఒగ్గింది.
    మెత్తటి మంచం, నున్నటి వారి శరీరాల్ని తనలో దాచుకుంది.
    ఎంతో కాలంగా అణిగిపోయిన అగ్నిపర్వతం ప్రజ్వరిల్లినట్టు ఎగిసింది వారి తపన ప్రతి క్షణమూ ఒక ప్రత్యేక అనుభవంగా.
    ప్రతి అణువూ ఒక ప్రత్యేక ప్రణయ కావ్యంగా.
    శృంగార మైదానపు చివర్లు వెతికి, ప్రణయ పర్వత అంచునుండి తటాల్న దూకి నలిగి, కరిగి అలసి ఒకరిలో ఒకరు పూర్తిగా లీనమై ఒకటిగా నిండిపోయారు....
    ఆ అనుభవం సాగర్ ని పూర్తిగా మార్చివేసింది.
    సాగర్, సాగర్ కోసం కూడా కాక, కేవలం శృతికోసమే బ్రతకసాగాడా క్షణంనుండీ.
    దీర్ఘంగా ఓసారి నిట్టూర్చి లేచి బాత్రూంలోకి వెళ్ళాడు సాగర్. అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని ఒకసారి చూసుకున్నాడు.
    చామన ఛాయ....చిన్న కళ్ళు....కొద్దిగా లావుగా ఉండే ముక్కు విశాలంగా ఉండే నుదురు ఆ నుదుటి మీద పెద్ద పుట్టుమచ్చ....తనేమంత అందంగా వుండడు. అలాగని మరీ అంత అసహ్యంగా కూడా ఉండడు. అద్దంలో తన ప్రతిబింబం నుదుటిపైన సన్నగా లీలగా కనిపిస్తున్న మూడు నల్లటి చారలు గమనించాడు సాగర్. ప్రొద్దుటి నుండి తన బుర్ర ఎంత తీవ్రంగా ఆలోచించి ఉంటుందో గ్రహించాడు సాగర్. చేతి గడియారం వంక చూసుకున్నాడు. సరిగ్గా రెండుగంటలవుతోంది సమయం. అప్పుడు గమనించాడు తన లంచ్ టైం దాటిపోయి గంటైపోయిందనీ, కడుపులో ఆకలి దంచేస్తుందని.

 Previous Page Next Page