Previous Page Next Page 
ఆత్మబలి పేజి 7


    "డాక్టర్ గారికి చాలా సామెతలు తెలుసు." అంటూ శోభ నవ్వుతూ వెళ్ళిపోబోయింది.
    "అసలు విషయం. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు?"
    "రేపు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తాను."
    తల వంచుకొని చెప్పి వెళ్ళిపోయింది.
    ఆ తరువాత ఏ పేషంటునూ చూడలేకపోయాడు రావు. ఆకర్షణీయమైన శోభ కళ్ళూ, అందమైన ఆమె విగ్రహం, ఆమె పెంకిమాటలూ అతని మనసంతా ఆక్రమించేసుకున్నాయి. భద్రంగా తాళాలు వేసుకురమ్మని కాంపౌండరుకు తాళాలిచ్చి, ఇంటికి బయలుదేరాడు.
    బంగారం పోగుచెయ్యటం కోసం ఇంకా పరిచయస్థుల ఇళ్ళకు వెళ్ళాలనుకున్న శోభ ఇంకెక్కడికీ వెళ్ళలేకపోయింది. ఆఫీసుకు కూడా వెళ్ళలేకపోయింది. ఆమె మనసు ఏవేవో తియ్యని ఆలోచనలతో బరువుగా ఉంది. ఇంటికి పోయి కళ్ళు మూసుకుని పడుకుని మనసును యథేచ్చగా దానికి నచ్చిన లోకాలలో వదిలెయ్యాలని ఉంది. సెలవు చీటీ రాసి మాలినికిచ్చి, సెలవెందుకని అడిగిన మాలినికి ఏదో కుంటిసాకు చెప్పి ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఉమను చూసి ఆశ్చర్యపోయింది. "కాలేజీకి వెళ్ళలేదేం?" అంది.
    ఉమ సమాధానం చెప్పలేదు. పార్వతి సమాధానం చెప్పింది. "ఇవాళేం? వారం రోజుల్నించీ వెళ్ళటం లేదు."
    శోభ నిర్ఘాంతపోయింది. ఎలాంటి పరిస్థితులలోనూ కాలేజీ మానకుండా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకొనే ఉమ వారంరోజులు కాలేజిమానటం!
    "ఒంట్లో బాగుండలేదా ఉమా?" మృదువుగా అడిగింది. అప్పటికీ ఉమ దగ్గరనుండి ఏ సమాధానము రాలేదు. పరిశీలనగా ఉమ ముఖంలోకి చూసింది. ఉమ ముఖం బాగా వడలిపోయి ఉంది. కళ్ళు బరువుగా కదిలిస్తే వర్షించేలా ఉన్నాయి. ఏదో ఉందనుకుంది శోభ. ఉమ భుజంమీద చెయ్యేసి గదిలోకి తీసికెళ్ళింది. చాపమీద కూర్చోబెట్టి లాలనగా "దేన్ని గురించి బాధపడుతున్నావు ఉమా!" అంది.
    "లేదు! లేదు! నేను దేన్ని గురించీ బాధపడటంలేదు" వెక్కి వెక్కి ఏడ్చేసింది ఉమ.
    శోభ తెల్లబోయింది. ఉమ కన్నీళ్ళు తుడుస్తూ "సరేలే! నువ్వు బాధపడటం లేదు. కాని కాలేజి ఎందుకు మానేస్తున్నావు? ఇంక చదవవా?" అంది.
    "చదువుతాను. మనం బీదవాళ్ళం. ఇన్నాళ్ళు కట్టిన జీతం వృధా అవనీయను. కాని అక్కా, ఈ నెలంతా కాలేజికి వెళ్ళలేను. పాఠాలు పోతాయి. ఫర్వాలేదు. నేను అందుకోగలను."
    "కాని, ఎందుకిలా..."
    "నా మనసు ఎందుకో స్థిమితాన్ని కోల్పోయి అల్లకల్లోలంగా ఉంది అక్కయ్యా! తిరిగి స్థిమితపడాలి.. తప్పక స్థిమితపడుతుంది. ఎటొచ్చీ కొంత వ్యవధి కావాలి."
    "ఇంత కలవరం దేనికో! నాకు చెప్పకూడదా?"
    "చెప్పుకునేందుకేం లేదు."
    ఉమ అక్కడినుంచి లేచిపోయింది. ఆ చాపమీదే నడుం వాల్చి ఉమను గురించి ఆలోచించసాగింది. చిందరవందరగా ఉన్న ఆ ఆలోచనలలోకి ఆమెకు తెలియకుండానే రావు ప్రవేశించి, ఆమెను ఉమకూ, ఆ ఇంటికీ, ఆ లోకానికీ దూరంగా మరొక మధుర ప్రపంచంలోకి లాక్కుపోయాడు.


                                       6


    "ఇవాళ సాయంత్రం ఇంటికి తొందరగా రా శోభా!"
    ఆఫీసుకు బయలుదేరుతున్న శోభతో అంది పార్వతి.
    "ఏవిఁటి విశేషం వదినా?"
    "ఇవాళ నిన్ను చూడడానికి పెళ్ళివారు వస్తున్నారు."
    శోభ ముఖం రోషంతో ఎరుపెక్కింది. "ఎన్నో పెళ్ళిట?"
    "మొదటిదే!"
    "ఆశ్చర్యమేనే! సరే! చదువుసంధ్యలేవీ వంటబట్టలేదటనా?"
    శోభ మాటల్లో పరిహాసం అర్థమయి పార్వతికి రోషమొచ్చింది.
    "ఏమో తల్లీ! ఆ వివరాలన్నీ మీ అన్నయ్యనే అడుగు. అయినా నీమీద నీకు భలే నమ్మకమే!"
    "ఈ నమ్మకం నామీద నాకు కాదు వదినా! నాకు సంబంధాలు తెచ్చే అన్నయ్యమీద! పద, అన్నయ్యనే అడుగుతాను." శోభ నవ్వుతూనే అంది.
    పార్వతి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.
    "నాకు మళ్ళీ సంబంధం తెచ్చావా అన్నయ్యా!" ప్రభాకరం దగ్గరకొచ్చి అడిగింది శోభ. పార్వతికీ, శోభకూ జరిగిన సంభాషణ ప్రభాకరమూ విన్నాడు. అతనికి చాలా కోపంగా ఉంది.
    "నువ్వు పెళ్ళిచేసుకోవని స్పష్టంగా తెలిసేవరకూ ప్రయత్నాలు మానలేంగా శోభా!" అన్నాడు కసిగా.
    అన్న కోపానికి నిర్లక్ష్యంగా నవ్వింది శోభ. కుర్చీలో కూర్చుని 'సరే! చెప్పు' అంది.
    "ఏవిఁటి?"
    "వివరాలు."
    "మంచివాడే."
    శోభ ఫకాలున నవ్వింది.
    ప్రభాకరానికి తీవ్రంగా కోపం వచ్చింది. "ఏం చూసుకొని ఆ విరగబాటు?" అన్నాడు ఈసడింపుగా.
    "చెట్టంత అన్నగారివి నిన్ను చూసుకొని. అది కాదన్నయ్యా! మంచి చెడ్డలు అంత తేలిగ్గా తెలుస్తాయా? నీకు మంచి అనిపించింది నాకు మంచి అనిపించవద్దూ! సరేలే! అసలు విషయాలు చెప్పు." 'అసలు' దగ్గర నొక్కి అంది.
    'బి.ఏ. పాసయ్యాడు. సెక్రటేరియట్ లో సూపరింటెండెంట్ గా పని చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు లేవు."
    "వయసు?"
    "ముప్పై"
    కొంచెంసేపు సందేహించి "ఎలా ఉంటాడు?" అంది.
    "బాగానే ఉంటాడు."
    శోభ ఆశ్చర్యంగా అన్నగారివంక చూసింది.
    "కట్నం విషయం ప్రస్తావించలేదా?"

 Previous Page Next Page