Previous Page Next Page 
దశావతారాలు పేజి 7


                             ఎంతపని జరిగింది !


    ఇది జరిగింది పూర్వకాలంలో కాదు -
    ఇప్పుడు...ఈనాటి అణుయుగంలో ...
    అది పల్లెటూరు కాదు.
    పేరు పొందిన పట్టణం.
    ఆ స్థలం రచ్చబండకాదు - ఆధునిక నాగరికత అడుగడుగునా తొణికిసలాడే క్లబ్.
    అక్కడ చేరినవాళ్ళు మోతుబరి రైతులు కారు.
    దేశ విదేశాల్లో పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న విద్యాధికులు -
    అందరూ ఒక్కసారి గుండె బాదుకున్నారు ...
    ఒక్క కంఠంతో పలికారు !
    "ఎంతపని జరిగింది !"
    ఎంతపని జరిగింది !
    ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు...ఒక్కక్కరి ముఖంలో ఒక్కొక్క రకమయిన భావం...
    కొందరి ముఖాల్లో కుతూహలం ... మరికోమ్సరి ముఖాల్లో ఏదో భయం...కొన్ని ముఖాల్లో ఆశాభంగం... మొత్తంమీద అందరి ముఖాల్లోనూ అద్దంలోలాగ కనిపిస్తున్నది కసి...
    "ఛీ ! ఛీ ! పాడురోజులు ! మరీ బరితెగించిపోయారు ! పెళ్ళికి విలువే లేకుండాపోయింది_" అంటూ వాపోయాడు పరమేశ్వరశాస్త్రి...
    "ఒక భార్య ఉండగా మళ్ళీ ఆవిడెలా పెళ్ళి చేసుకుందయ్యా !" అని ఆశ్చర్యపోయాడు రాజారావు.
    "చూస్తూ ఉండు ! ఈ వన్నెల విసనకర్ర నాలుగు రోజుల్లో మూటాముల్లె సర్దుకుని వెళ్ళిపోకపోతే నా పేరు కాశీపతికాదు_" జోస్యం చెప్పాడు కాశీపతి.
    "మొగవాడి దౌర్జన్యం ! అగ్నిసాక్షిగా పెళ్ళిచేసుకున్న భార్యను వదిలి మరోదాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆవిడ గతి ఏం కావాలి?" పురుషజాతి మీద కోపంతో పళ్ళు నూరింది వనజాక్షి...
    "ఇదే ఆడదయితే, ఇన్ని కాదు, మరిన్ని కష్టాలొచ్చినా ఇలా చెయ్యగలదా ?" ఉసూరుమనిపోయింది, మిసెస్ సోమశేఖరం.
    మిత్ర బృందంలో ఇంతటి ఆందోళనను లేవదీసిన కథానాయకుడు...క్లబ్ లో 'జగన్'గా ఇంటి దగ్గిర 'జగ్గు'గా ఆఫీస్ లో జగన్నాధంగా వ్యవహరింపబడే వ్యక్తి చిరునవ్వుతో వచ్చి కూచున్నాడు ...
    ఆ చిరునవ్వు చూస్తే వాళ్ళందరికీ వొళ్ళు మండిపోయింది. ఇంతచేసి అతిమామూలుగా ఎలా నవ్వుతున్నాడో చూడు !
    "ఏమిటోయ్ సంగతులు !" కదిలించాడు శాస్త్రి.
    "మీరే చెప్పాలి !"
    "మాకేముంటాయోయ్ ! అడ్వంచర్స్ మాచేత కాదు." దెప్పాననుకున్నాడు రాజారావు ...
    "నేను చేసినపని మీకు 'అడ్వంచర్' లా తోస్తోందా ! ఇంత సామాన్యమైన విషయం..." నిజంగా ఆశ్చర్యపోయాడు జగన్ ...
    "చాల్లే ! సామాన్యమైన విషయంట ! ఎలా ఉంది కొత్తకాపురం ?" కుతూహలం పట్టలేక అడిగేసాడు కాశీపతి, తన జోస్యం ఎన్నాళ్ళలో నిజమవుతుందో తేల్చుకోవాలని...
    "పాత కాపురంలాగానే ఉంది..."
    మామూలుగా అన్నాడు-జగన్ సమాధానం కోసం వొళ్ళంతా చెవులుచేసుకొని కూర్చున్న మిసెస్ సోమశేఖరానికి చాలా ఆశాభంగం కలిగింది.
    "ఆమాత్రం దానికి మళ్ళీ ఎందుకు పెళ్ళి చేసుకోవటం ?"
    జగన్ చిరునవ్వుతో "కొత్త అనుభవాల కోసం కాదు ?" అన్నాడు.
    వొళ్ళు మండింది మిసెస్ సోమశేఖరానికి !
    "అయితే పాత కాపురంలోనే ఉండచ్చుగా !"
    "కాపురంలా ఉన్నన్నాళ్ళూ అలాగే ఉన్నాంగా ! కాపురం కాపురంలా ఉండదని తేల్చుకున్నాకే విడిపోయాం!"
    "విడిపోయాం,-అనకండి-వదిలేసానని అనండి ..." అక్కసుగా అంది మిస్ వనజాక్షి ...
    "సారీ ! అలాగే అనాలి కాబోలు ! రాధ కూడా అలాగే అనమంది...."
    "రాధ అంటే నీ మొదటి భార్యనా ?"
    తెలిసిన విషయాన్నే మరోసారి అడిగాడు రాజారావు.
    "ఒకప్పటి భార్య !"
    సరిదిడ్డాడు జగన్...
    "ఆహా ! ఎలాంటి మాటలు వింటున్నాను !" తల కొట్టుకుంటున్నాడు పరమేశ్వరశాస్త్రి...
    "ఇంతకూ నువ్వు రాధతో ఈ విషయం మాట్లాడావన్న మాట !" కాశీపతి కుతూహలంగా అడిగాడు...
    "ఆవిడతో మాట్లాడకుండా ఇలాంటి విషయం ఎలా పరిష్కరించుకోగలను !" ఆశ్చర్యంగా అన్నాడు జగన్.
    "పాపం, ఆవిడ ఎంత ఏడుస్తోందో ?" జాలిపడింది మిస్. వనజాక్షి.
    "ఇప్పుడు ఏడవటం లేదు. కానీ, మీలాంటివాళ్ళు ఎవరైనా పరామర్శకి వెళితే తప్పకుండా ఏడుస్తుందిట ! అలా ఏడవకపోతే బాగుండదుట !" కొంటెగా అన్నాడు జగన్.
    ఎర్రగా చూసింది వనజాక్షి...
    "ఇంతకూ మీరెందుకు విడిపోయారయ్యా ! ఆవిడను అనుమానించావా ?" కాశీపతి ప్రశ్న.
    "పనిలేకపోతే సరి !"
    "పోనీ, ఆవిడ నిన్ను అనుమానించిందా ?"
    "ఆవిడకి ఇలాంటివేవీ పట్టవు !"

 Previous Page Next Page