"ఇంత ఖర్చుపెట్టి, ఇంత శ్రమపడి, ఇంత దూరం వచ్చాక...ఇప్పుడిక వెనక్కు తగ్గటానికి వీల్లేదు. గుహలోకి వెళ్దాం" సౌమ్యంగా అనటానికి ప్రయత్నించినా చాలా కరుగ్గా పలికింది అతని కంఠం.
గతుక్కుమని చూసింది అనిల. పైకి మామూలుగా అనిపించిన మాటలకు అతని ముఖ భంగిమలు అనేక అర్థాలు చెపుతున్నాయి. "నేను ఇప్పటివరకూ కొంత డబ్బు ఖర్చు పెట్టాను. అది వృధా కావటానికి వీల్లేదు. అంచేత ఏది ఏమైనా, ఎంత ప్రమాదమయినా పని జరిగి తీరవలసిందే" అంటున్నాయి అతని హావభావాలు.
రవి ఇదంతా పట్టించుకున్నట్లు లేదు. అతడి చూపులు గుహలో చీకట్లలో వెతుక్కోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఏది ఏమైనా ఆ గుహలో ఏముందో, "సూర్యనేత్రం" శిల్పం కింద ఏం రాసుందో, అన్నీ తెలుసుకోవాలనే పట్టుదల కనిపిస్తోంది అతని ముఖంలో.
"గుహలోకి వెళ్ళటానికి నేను రెడీ. నాతో ఎవరొస్తారో రండి" అన్నాడు.
అక్కడి అందరి ముఖాలలోనూ భయం దోబూచులాడుతుంటే, అతని ముఖంలో మాత్రం అంతులేని విజ్ఞాన తృష్ణ కనిపిస్తోంది. రవి మాటలకి ఎవరూ రెస్పాన్స్ ఇవ్వలేదు.
డ్రాఫ్ట్స్ మన్ ప్రకాశం, టెక్నీషియన్లూ "పిశాచాలయినా కాకపోయినా ఇక్కడ ఏదో ప్రమాదం ఉందని రూఢిగా అంటున్నారు. గుహలో వాయువుల్లో విష వాయువులు ఉండొచ్చు. పైగా ఆ గుహ లోపల ఎంత పొడుగు ఉందో మనకు తెలీదు.పూర్వ శాతవాహన కాలంనాటి గుహల్లో కొన్ని మైళ్ళ కొద్దీ పొడవున్నవి ఉన్నాయని ఆర్కియాలజిస్ట్స్ అంటున్నారు. అంచేత మనం ఇలా కొద్దిమందిని సాహసం చెయ్యటం మంచిది కాదు" అన్నారు. ఆ మాటలోనే "మేము రాము" అన్న సమాధానం ఖచ్చితంగా వినిపిస్తోంది.
ఎప్పటిలా రవి, విష్ణువర్ధన్, అనిల, జెన్నిఫర్ మాత్రమే మిగిలారు. త్రిసికి ఉంది. ఎప్పటిలా మౌనంగా, భావరహితంగా.
"నువ్వెందుకూ? నువ్వు కూడా మిగిలిన కూలీలతో పాటు కిందికి పోరాదూ? నువ్విక్కడ చేసేది ఏముందీ?" అన్నాడు విష్ణువర్ధన్ త్రిసికి నుద్దేశించి...
అతడు త్రిసికితో మాట్లాడిన తీరు రవికి నచ్చలేదు. కానీ, అతడిని ఏమీ అనలేదు. ఈ సమాజంలో డబ్బు అన్నింటితోపాటు మేధస్సునీ, ఔచిత్యాన్నీ, మర్యాద్నీ కూడా కొనేస్తోంది. త్రిసికి ద్వారా దేవతలు మాట్లాడతారనే విషయంలో నమ్మకం లేకపోయినా, ఎందుకో ఆమె పట్ల సద్భావమే కలుగుతోంది రవిలో.
త్రిసికి విష్ణువర్ధన్ మాటలు వినిపించుకోలేదు. అతనికి సమాధానం చెప్పలేదు. అక్కడి నుంచి కదలలేదు.
విష్ణువర్ధన్ రవికి బాగా దగ్గిరగా వచ్చి గుసగుసగా అన్నాడు... "ఈ మనిషిని చూస్తే నాకేదో అనుమానంగా ఉందండీ. మీరు "ఓమెన్" లాంటి ఇంగ్లీషు నవలలు చదివారా? వాటిల్లో సైతాను ఏదో ఒక మనిషి రూపంలో ఉంటుంది. ఇక్కడ పిశాచాలు, లేదా దెయ్యాలు- ఏదో ఒకటి, ఈ త్రిసికి రూపంలో ఉన్నాయని నా అనుమానం? ఈమె నాటకం చూస్తోంటే..."
రవి విసుగ్గా రెండు చేతులూ జోడించి "అయ్యా భూతయ్యగారూ" అనగానే అనిలా, జెన్నిఫర్ లు నవ్వేశారు.
"ఈసారి ఏమిటి అనుమానం?" అడిగింది అనిల.
విష్ణువర్ధన్ గంభీరంగా అయిపోయాడు.
"జోక్స్ సరే మీరు వెంటనే త్రిసికి ఇక్కడ నుంచి పంపేయండి" అన్నాడు గట్టిగానే ఎంత వినిపించుకోనట్లుగా నటించినా త్రిసికి తన మాటలు వింటుందని అతడికి తెలుసు. అయినా భయపడలేదు. ఎంత దయ్యమయినా, తన డబ్బుకి భయపడకపోతుందా అని అతడి ధైర్యం కాబోలు.
"అది మాత్రం నావల్ల కాదు" నిస్సహాయుణ్ణి అన్నట్లు భుజాలెగరేసాడు రవి.
"ఎందుకని"
"ఈ రెండు గ్రామాల ప్రజలూ త్రిసికిని దేవతలా చూస్తారు. ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా ఆవిడ చేత ఎవరూ ఏపనీ చేయించలేరు. ఆవిడ మాట్లాడదు. కానీ అందరి మాటలూ వింటుంది. తనకేం చెయ్యాలనిపిస్తే అది చేస్తుంది. ఇప్పుడు ఆవిడని బలవంతాన మనం కిందకు పంపించినట్లు కాని, అవమానించినట్లు కాని, ఈ గ్రామీణులకి తెలిసిందా - గుహలో పిశాచాల మాట దేవుడెరుగు- వీళ్ళే పిశాచాలయి మనల్ని పీక్కు తినేస్తారు. కాబట్టి త్రిసికి జోలికి పోకండి"
"ఈ మనిషిని 'ఆవిడా' 'ఈవిడ' అని మన్నిస్తారేమిటి" చికాగ్గా అడిగాడు విష్ణువర్ధన్.
"నేను ఎవరినైనా అలాగే మన్నిస్తాను"
"సరే! ఏదో ఒకటి త్వరగా నిర్ణయించండి. ఏం చేద్దాం?"
"నిర్ణయించేందుకేముందీ? మనం నలుగురం గుహలోకి వెళ్దాం."
చటుక్కున వెనక్కి తగ్గాడు విష్ణువర్ధన్. ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు.
"అందరం గుహలోకి వెళ్తే ఏదయినా అవసరమయితే సహాయం పిలవటానికి ఎవరుంటారు? నాది భారీ శరీరం కనుక, చురుగ్గా ఎక్కి దిగలేను గనుక... నేను బయట ఉంటాను. మీరు ముగ్గురూ వెళ్ళండి"
"నాకు క్రీస్తు దేవునిలో నమ్మకమే ఉంది. సో సైతానంతే ఫియర్ లేదు. కానీ హిందూ డెవిల్స్ ని ఫియర్ చేస్తాను. అయ్ కాస్ట్ కమ్?' అంది జెన్నిఫర్.
"మీరూ ఒకటే ఉండండి నేను ఒక్కడినే వెళ్ళగలను" అనిలని ఉద్దేశించి అన్నాడు రవి.
"నేనూ వస్తాను."
మరొక్కసారి వారించాలని అనుకున్నాడు. కానీ అప్పటికే అనిల స్వభావం అతనికి అర్థమయిపోయింది. ఆ అమ్మాయి ఒక విషయం సంకల్పించుకున్నాక ఆ మనసుని మళ్ళించటం ఎవరి తరమూ కాదు.
గుహ ముఖద్వారం దగ్గిర ఇద్దరూ ఒక్క నిముషం ఆగారు. గుహలో ఎప్పటిలాగే ఉధృతమైన గాలులు, ఊలలతో ఎవరో ఏడుస్తున్నట్లు, విరగబడి నవ్వుతున్నట్లు భయంకరంగా అరుస్తున్నట్లు...
"ఆగిపోరాదూ"
చివరి ప్రయత్నం చేశాడు రవి. ఆ మాటలతో అతనికంటే ముందడుగు వేసింది అనిల.
ఆ అమ్మాయి ఒంటరిగా కూడా దిగిపోతుందేమోనని భయపడి త్వరగా ఆమెతో కలిసి గుహలోకి దిగాడు. మందు వేసవిలో గడగడలాడించే చలి లోపల. ఒక్కసారిగా అనిలని గట్టిగా పట్టుకున్నాడు రవి. వెంటనే గభాలున వదిలేశాడు. అలా వదిలెయ్యటంతో ముందుకు తూలి పడబోయింది. ఆమె కిందపడేలోగానే తనూ ముందుకు వంగి పట్టుకున్నాడు.
కానీ, గాలి విసురుకు ఒకరిమీద ఒకరు పడ్డారు. భయంతో ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. వెనుకటి అనుభవంతో గోడనానుకుని ఉండటం వల్ల నెమ్మదిగా లేవగలిగారు. రాతి గోడలు కావటం వల్ల నున్నగా లేవు. గరుకులుగా ఎగుడుదిగుడుగా ఉన్నాయి. అంచేత పట్టు దొరికింది.